కావలి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో ‘కావలి కాంగ్రెస్’లో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. ‘నాకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించి బంద్, ఆందోళన తేదీలు ఖరారు చేస్తావా’ అంటూ ఏఎంసీ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టిపై మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. శనివారం కావలి ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వచ్చిన విష్ణువర్ధన్‌రెడ్డి ఈ విషయంపై గ్రంధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంధి కూడా అదే స్థాయిలో విష్ణుపై రుసరుసలాడారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచనల మేరకు గ్రంధి సమైక్యాంధ్ర ఉద్యమ ప్రణాళిక రూపకల్పనపై శుక్రవారం పట్టణంలోని హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ కల్యాణ మండపంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం వీరి మధ్య చిచ్చు రగిల్చింది. సమావేశంలో ఈ నెల 13న బంద్‌ను, ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయం విష్ణువర్ధన్‌రెడ్డికి మింగుడు పడలేదు. శనివారం కావలికి వచ్చిన ఆయన తన అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో యానాదిశెట్టి అక్కడికి వచ్చారు.
నాకు తెలియకుండా బంద్, ఆందోళన తేదీని ఎలా ప్రకటిస్తావని విష్ణువర్ధన్‌రెడ్డి గ్రంధిపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరిగాయి. విష్ణు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో ఇష్టానుసారంగా ఎవరికి వారు నడుచుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో మంత్రి ఆనం పేరు ప్రస్తావించడమే ఈ రచ్చకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే 13వ తేదీ బంద్, నిరసనలు చేయాలని ప్రకటించామని, ఇప్పుడు లేదంటే ఎట్లా అంటూ విష్ణుతో గ్రంధి మొరపెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో కాస్త రాజీపడాలని గ్రంధి విష్ణుకి సూచించడంతో 12న నిరసన కార్యక్రమాలు, 13వ తేదీ బంద్ నిర్వహించేందుకు అంగీకారానికి వచ్చారు.
‘కావలి కాంగ్రెస్’లో సమైక్య విభేదాలు
Published Sun, Aug 11 2013 4:01 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement