సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉధృతమైన సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నేతలను కలవరపరుస్తోంది. మనస్ఫూర్తిగా ఉద్యమంలో పాల్గొనలేక, అలా అని దూరంగా ఉండలేక ఈ పార్టీల నేతలు సతమతమవుతున్నారు. యూపీఏ ప్రభుత్వం తరఫున కాకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా విభజన ప్రకటన చేయడం ఆ పార్టీ నేతలను ఇరకాటంలో పడేసింది. కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అధినేత్రి సోనియాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనలేక, దూరంగా ఉండలేక ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారు. ఈ నిర్ణయం వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని పార్టీ ప్రజాప్రతినిధులు పలువురు రాజీనామాలు సమర్పించి ఉద్యమంలో పాల్గొంటుండగా, తిరుపతి ఎంపీ చింతా మోహన్ ఇది తనకు సంబంధించిన విషయమే కాదన్నట్టు దూరంగా ఉంటున్నారు.
సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేసినా, పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా చింతామోహన్ మాత్రం అన్నింటికీ దూరంగా తప్పించుకు తిరుగుతున్నారు. ఓటేసి గెలిపించిన ప్రజల కంటే కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులే తనకు ముఖ్యమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక మిగిలిన మంత్రులు రాజీనామా చేస్తే తాను చేస్తానని తన ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులకు హామీ ఇచ్చిన మంత్రి గల్లా అరుణకుమారి ఆ హామీని అప్పుడే మరచిపోయారు. తమ కంపెనీ (అమరరాజా) ఉద్యోగులతో ఒక రోజు ర్యాలీ జరిపించి తన పని ముగిసినట్లు ఆమె ఉద్యమానికి దూరంగా ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీల రాజీనామాలే లక్ష్యంగా ఎన్‌జీవోల భారీ ఉద్యమం ప్రారంభమైన తరువాత కూడా ఆమె రాజీనామా గురించి మాట్లాడడం లేదు.
విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వడమేగాక పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉండడం ఆ పార్టీ నేతలను అయోమయం లో పడేస్తోంది. చంద్రబాబు విభజనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్యాకేజీల గురించి మాట్లాడుతుండడంతో ఇక్కడి తెలుగు తమ్ముళ్లు ధైర్యంగా ఉద్యమంలో పాల్గొనలేకపోతున్నారు. జనాగ్రహానికి భయపడి కాస్త ఆల స్యంగా పదవులకు రాజీనామాలు సమర్పించిన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉద్యమంలో మాత్రం ఉత్సాహంగా పాల్గొనడం లేదు. చిత్తూ రు ఎంపీ శివప్రసాద్ పార్లమెంటులో సమైక్యగళాన్ని గట్టిగా వినిపిస్తున్న సమయంలో కూడా ఇక్కడి తెలుగుదేశం నేతలు మౌనంగానే ఉంటున్నారు. పలుచోట్ల సమైక్యవాదులు పార్టీ వైఖరి ని తప్పుపడుతుండడం, నేతలను నిలదీస్తుండడమే ఇందుకు కారణం. మంగళవారం సత్యవేడులో ఎమ్మెల్యే హేమలతను నిలదీసి, ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. కాంగ్రెస్, దేశం నేతలు నాటకాలాడితే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని ఎన్‌జీవో నేతలు హెచ్చరిస్తుం డడం వారిని కలవరపెడుతోంది.
ఉధృతమైన ఉద్యమం కాంగ్రెస్, టీడీపీల్లో కలవరం
Published Wed, Aug 14 2013 3:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement