విజయవాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు అనుకూలంగా ఏపీఎన్‌జీవోలు సోమవారం అర్థరాత్రి నుంచి చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో పాల్గొనడంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో సోమవారం ఉదయం నుంచి రైల్వేస్టేష్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఉదయం సమయంలో వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు పినాకినీ, రత్నాచల్, శాతవాహన రైళ్లలో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. దీంతో బుకింగ్ కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూ ఏర్పడింది. అదే విధంగా మధ్యాహ్న సమయంలో జన్మభూమి, కృష్ణా, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు రాత్రి సమయాల్లో వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు అమాంతం పెరిగి పోయింది. అంతేకాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురు ప్రయాణికులు ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయించారు.
ముఖ్యంగా గుంటూరు, తెనాలి, విజయవాడ మధ్య తిరిగే సర్క్యూలర్ రైళ్లలో సాధారణ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే దీనిపై అధికారులు స్పందిస్తూ ఇది సాధారణ రద్దీ మాత్రమేనని, బస్సులు నడవకపోవడంతో పెరిగిన రద్దీ కాదని అన్నారు. రానున్న రోజుల్లో పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రద్దీ పెరిగితే పలు రైళ్లకు అదనపు బోగీలు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంతో పాటు టికెట్ల కౌంటర్లను పెంచుతామని సీనియర్ డీసీఎం ఎన్‌వి.సత్యనారాయణ తెలిపారు.
డీఆర్‌ఎంతో సమావేశమైన రైల్వే ఎస్పీ
సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్‌జీవోలు చేపట్టిన సమ్మెలో భాగంగా కొంతమంది నాయకులు డివిజన్ స్థాయిలో గురువారం రైల్‌రోకోలు చేపట్టనున్నట్లు రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్.శ్యామ్‌ప్రసాద్‌కు సమాచారమందడంతో ఆయన డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ రమేష్‌చంద్రతో కలిసి చర్చించిన అనంతరం డీఆర్‌ఎం ప్రదీప్‌కుమార్‌తో సమావేశమయ్యారు. రైళ్లకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడటంతో పాటు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డీఆర్‌ఎం సూచించారు. ఉద్యమకారులు ఎవరైనా రైల్వే ఆస్తులకు కానీ, రైళ్లకు కానీ నష్టం కలిగించినట్లయితే కఠిన చర్యలు చేపట్టడంతో పాటు జైళ్లకు వెళ్లవలసి వస్తుందని సూచించాలని డీఆర్‌ఎం అధికారులకు సూచించారు. అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సాంబశివరావు, రైల్వే డీఎస్పీ ఎస్.రాజశేఖరరావు, సీఐలు ఎం.రామ్‌కుమార్, రాజగోపాలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కిటకిటలాడుతున్న రైల్వేస్టేషన్
Published Wed, Aug 14 2013 4:13 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement
Advertisement