52 ఎకరాలను రైల్వే శాఖకు అప్పగిస్తూ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రైల్వే డీఆర్‌ఎంకు జనవరి 2న రాసిన లేఖ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్‌కు సంబంధించిన కూత ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లోనూ వినిపించలేదు. పైగా దీనిపై కేంద్రం మరోసారి కిరికిరీ పెడుతోంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విలేకరుల సమా వేశంలో జోన్ అంశంపై నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసేందుకు యత్నించారు. రైల్వేజోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది.కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య
వైఖరిని కప్పిపుచ్చేందుకు సమాధానాన్ని దాటవేసే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ అసత్య ఆరోపణలు చేయడం విభ్రాంతి కల్గించింది. ఎందుకంటే.. కేంద్రమంత్రి చెప్పిన 52 ఎకరాలకు, రైల్వేజోన్ వ్యవ హారానికి అసలు ప్రత్యక్ష సంబంధమేలేదు. ఆయన చెబుతున్న 52 ఎకరాలను రైల్వేకు కేటాయించకుండా తాత్సారం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆ 52 ఎకరాలను రైల్వేకు అప్పగిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
గత నెల 2న జీవీఎంసీ కమిషనర్ రైల్వే అధికారులకు లేఖ రాశారు. వాస్తవాలిలా ఉంటే.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇందుకు విరుద్ధంగా రైల్వేజోన్‌పై అవాస్తవాలు వల్లెవేశారు. కేవలం ఒ డిశాలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ యన ఈ విధంగా మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ వ్యవహారాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా స్పష్ట మవుతోంది. అసలు ఈ రైల్వేజోన్ అంశంపై వాస్తవాలు ఏమిటంటే..
► విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో 950 ఎకరాలు అందుబాటులో ఉందని స్పష్టంగా పేర్కొంది.
► రాష్టప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి గతేడాది రూ.170 కోట్లు కూడా కేటాయించింది.
► రైల్వేజోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేజోన్‌లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పా టు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయా ల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసు కువచ్చి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ఆచర ణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్రం బడ్జెట్‌లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు.
► ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనందునే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన డం హాస్యాస్పదం. ఎందుకంటే.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమికి బదులుగా రైల్వేశాఖకు భూమి కేటాయించాలని ఆయన చెబుతున్నారు. కానీ, విశాఖలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013లో రైల్వే భూములను తీసుకుంది. అందుకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖకు 52 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య అంతకుముందే ఒప్పందం కుదిరింది. అంటే.. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు సంగతి అది.
► 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అంతకుముందటి రైల్వే భూమి తీసుకున్న దానికి సంబంధమేలేదు. ఆ అంశంతో ముడిపెట్టకుండా విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాలి. అందుకోసం 950 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని కూడా డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొంది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం.
► వాస్తవానికి రైల్వేకు కేటాయించాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాలపై వివాదం ఏర్పడింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రయత్నిస్తే అక్కడి గిరిజనులు అడ్డుకున్నారు. సమస్య సున్నితంగా మారడంతో రైల్వేశాఖ వెనక్కి తగ్గింది. దీనిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా మౌనంగా ఉండిపోయింది. అప్పట్లో కూడా రైల్వేశాఖ ఆ విషయంపై పట్టుబట్టలేదు.
► ఇక భూమి సమస్యతోనే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వేశాఖ ఇప్పటివరకు చెప్పనేలేదు. రైల్వేజోన్ అంశంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నోసార్లు సమావేశమయ్యారు. ఏ ఒక్క సమావేశంలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించనేలేదు.
రెల్వేకు 52 ఎకరాలు అప్పగింత..
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా అప్పగించలేదని చెబుతున్న 52 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వేకు అప్పగించేసింది. ఈ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ భూముల్లో ఉన్న ఆక్రమణలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలగించారు. వాటిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవ సర్వే నెంబర్లు 57, 58, 59, 61, 62, 63, 64, 65తో ఉన్న 52 ఎకరాలను రైల్వేశాఖకు అప్పగించారు.
ఈ మేరకు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ సీఎం శ్రీకాంత్ వర్మ ఈ ఏడాది జనవరి 2నే విశాఖలోని ఈస్ట్‌కోస్ట్ డీఆర్‌ఎంకు లేఖ ద్వారా తెలియజేశారు. వాస్తవం ఇలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదని రైల్వేమంత్రి వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ఢిల్లీలోని పచ్చమీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అడిగిన ప్రశ్నలకు ప్రభావితమైన ఆయన అవాస్తవాలు మాట్లాడడం కేంద్రమంత్రి స్థాయికి తగినట్లుగా లేదని పలువురు విమర్శిస్తున్నారు.
ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా?
ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దుచేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల తోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమ య్యాయి.
ఎందుకంటే.. విజయవాడ నుంచి విశాఖ 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటుచేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్‌లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివి జన్‌ను రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది.
తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment