Railway division
-
రాష్ట్రం భూమి ఇచ్చినా.. రైల్వేజోన్‌పై కేంద్రందే కిరికిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్‌కు సంబంధించిన కూత ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ వినిపించలేదు. పైగా దీనిపై కేంద్రం మరోసారి కిరికిరీ పెడుతోంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విలేకరుల సమా వేశంలో జోన్ అంశంపై నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసేందుకు యత్నించారు. రైల్వేజోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాల్సి ఉందని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉంది.కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చేందుకు సమాధానాన్ని దాటవేసే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ అసత్య ఆరోపణలు చేయడం విభ్రాంతి కల్గించింది. ఎందుకంటే.. కేంద్రమంత్రి చెప్పిన 52 ఎకరాలకు, రైల్వేజోన్ వ్యవ హారానికి అసలు ప్రత్యక్ష సంబంధమేలేదు. ఆయన చెబుతున్న 52 ఎకరాలను రైల్వేకు కేటాయించకుండా తాత్సారం చేసింది గత టీడీపీ ప్రభుత్వం. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆ 52 ఎకరాలను రైల్వేకు అప్పగిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గత నెల 2న జీవీఎంసీ కమిషనర్ రైల్వే అధికారులకు లేఖ రాశారు. వాస్తవాలిలా ఉంటే.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇందుకు విరుద్ధంగా రైల్వేజోన్‌పై అవాస్తవాలు వల్లెవేశారు. కేవలం ఒ డిశాలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ యన ఈ విధంగా మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ వ్యవహారాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా స్పష్ట మవుతోంది. అసలు ఈ రైల్వేజోన్ అంశంపై వాస్తవాలు ఏమిటంటే.. ► విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో 950 ఎకరాలు అందుబాటులో ఉందని స్పష్టంగా పేర్కొంది. ► రాష్టప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి గతేడాది రూ.170 కోట్లు కూడా కేటాయించింది. ► రైల్వేజోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేజోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పా టు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయా ల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసు కువచ్చి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ఆచర ణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్రం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ► ఇక రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనందునే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన డం హాస్యాస్పదం. ఎందుకంటే.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమికి బదులుగా రైల్వేశాఖకు భూమి కేటాయించాలని ఆయన చెబుతున్నారు. కానీ, విశాఖలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013లో రైల్వే భూములను తీసుకుంది. అందుకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖకు 52 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య అంతకుముందే ఒప్పందం కుదిరింది. అంటే.. రాష్ట్ర విభజనకు ఏడాది ముందు సంగతి అది. ► 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అంతకుముందటి రైల్వే భూమి తీసుకున్న దానికి సంబంధమేలేదు. ఆ అంశంతో ముడిపెట్టకుండా విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాలి. అందుకోసం 950 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని కూడా డీపీఆర్‌లో కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొంది. ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం. ► వాస్తవానికి రైల్వేకు కేటాయించాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాలపై వివాదం ఏర్పడింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైల్వేశాఖ అధికారులు ప్రయత్నిస్తే అక్కడి గిరిజనులు అడ్డుకున్నారు. సమస్య సున్నితంగా మారడంతో రైల్వేశాఖ వెనక్కి తగ్గింది. దీనిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా మౌనంగా ఉండిపోయింది. అప్పట్లో కూడా రైల్వేశాఖ ఆ విషయంపై పట్టుబట్టలేదు. ► ఇక భూమి సమస్యతోనే రైల్వేజోన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని రైల్వేశాఖ ఇప్పటివరకు చెప్పనేలేదు. రైల్వేజోన్ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నోసార్లు సమావేశమయ్యారు. ఏ ఒక్క సమావేశంలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించనేలేదు. రెల్వేకు 52 ఎకరాలు అప్పగింత.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఇంకా అప్పగించలేదని చెబుతున్న 52 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వేకు అప్పగించేసింది. ఈ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ భూముల్లో ఉన్న ఆక్రమణలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించారు. వాటిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవ సర్వే నెంబర్లు 57, 58, 59, 61, 62, 63, 64, 65తో ఉన్న 52 ఎకరాలను రైల్వేశాఖకు అప్పగించారు. ఈ మేరకు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ సీఎం శ్రీకాంత్ వర్మ ఈ ఏడాది జనవరి 2నే విశాఖలోని ఈస్ట్‌కోస్ట్ డీఆర్ఎంకు లేఖ ద్వారా తెలియజేశారు. వాస్తవం ఇలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించలేదని రైల్వేమంత్రి వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ఢిల్లీలోని పచ్చమీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అడిగిన ప్రశ్నలకు ప్రభావితమైన ఆయన అవాస్తవాలు మాట్లాడడం కేంద్రమంత్రి స్థాయికి తగినట్లుగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా? ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దుచేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల తోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్‌లో ప్రస్తావించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమ య్యాయి. ఎందుకంటే.. విజయవాడ నుంచి విశాఖ 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్‌గా ఏర్పాటుచేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూనే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివి జన్ను రద్దుచేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయన ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆర్థిక వృద్ధిలో ‘దూసుకుపోతున్న’ వాల్తేరు డివిజన్
సాక్షి, విశాఖపట్నం/ తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): కోవిడ్ మహమ్మారి వెంటాడుతున్న సమయంలోనూ వాల్తేరు రైల్వే డివిజన్ సాధించిన ఆర్థిక ప్రగతి అద్భుతమని రైల్వే బోర్డు మెంబర్ ఫైనాన్స్ (ఫైనాన్స్ కమిషనర్) నరేష్ సలేచా ప్రశంసించారు. విశాఖలోని డీఆర్ఎం కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. డివిజన్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు 2020–21లో కోవిడ్ సమయంలో వాల్తేర్ డివిజన్ ప్రగతి, ఆదాయ వనరులు, డివిజన్ పరిధిలో చేపట్టిన వినూత్న ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలు, భద్రతాపనులు, ఇతర అభివృద్ధి పనుల గురించి డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీ వాస్తవ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైల్వే స్థలాలు, స్టేషన్ పరిసరాల ద్వారా ఆదాయ వనరులను సమీకరించుకోవడంలో వాల్తేర్ డివిజన్ వినూత్న పద్ధతుల్ని అవలంభిస్తున్నదని నరేష్ సలేచా కొనియాడారు. అన్ని విభాగాల్లోనూ మిగిలిన త్రైమాసికాల్లో ఇదే తరహా వృద్ధి సాధించాలని సూచించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వయిజర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్.ఎస్.మిత్రా, వాల్తేర్ డివిజన్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్, ఏడీఆర్ఎం అక్షయ్ సక్సేనా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, విశాఖ డివిజన్‌ని కొనసాగిస్తూ.. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందించేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నించగా.. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. -
రూ.వెయ్యితో ఏం చేయాలి..?
నలుగురు ఉన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్తే కనీసం రూ.2 వేలు ఖర్చవుతుంది.ఇంట్లో చిన్న మరమ్మతు చేయాలన్నా వెయ్యికి పైగానే ఖర్చవుతుంది..చిన్న షాపులో మౌలిక వసతులు కల్పించాలంటే కనీసం 10 వేలు చేతిలో ఉండాల్సిందే..మరి.. ప్రపంచంలోని అతి పెద్ద వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకొంటున్న రైల్వేలో ఓ చిన్నపాటి ప్రాజెక్టు ప్రారంభించాలంటే..?కనీసం లక్షల నుంచి కోట్లలోనే అవసరమవుతాయి.. ఒక ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం చేయాలంటేనే లక్ష రూపాయల వరకు వెచ్చించాల్సిందే..అలాంటిది.. దాని కోసం రూ.వెయ్యి మాత్రమే ఇస్తే..?!వాటితో ఏం చేస్తారు.?ఏమో..? సదరు రైల్వే మంత్రిత్వ శాఖకే తెలియాలి!ఆ వెయ్యి రూపాయలు కేటాయించిందీ.. ఏవో మిసిలేనియస్(చిల్లర) ఖర్చులకు కాదండోయ్..రూ.లక్షలు.. కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టులకు.. పెళ్లికి చదివించినట్లు వెయ్యి రూపాయలు చొప్పున కేటాయించారు.2020–21 బడ్జెట్లో చేసిన కేటాయింపులు చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.ఆ ప్రాజెక్టులేంటో..? వెయ్యి రూపాయల విడ్డూరమేంటో.. ఓసారి చదివేద్దాం.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పార్లమెంటులో ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వాల్తేరు డివిజన్‌కు విదిల్చిన నిధుల వివరాలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. బడ్జెట్లో మాత్రం రూ.3 కోట్లు విదిల్చిన వైనం చూస్తే.. జోన్ ఏర్పాటుకు ఇప్పట్లో కేంద్రం సిద్ధంగా లేదన్న విషయం అర్థమైపోతుంది. ప్రస్తుతం తూర్పుకోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్‌కు చేసిన కేటాయింపులూ ఏమంత ఆశాజనకంగా లేవు. మొత్తంగా డివిజన్‌కు రూ.878 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 2, 3 లైన్ల నిర్మాణాలకు రూ.580.50 కోట్లు ఇవ్వగా.. ప్రాజెక్టులకు రూ.94.98 కోట్లు కేటాయించారు. అదేవిధంగా సిగ్నల్ వ్యవస్థ, వంతెనలు, సబ్వే నిర్మాణాలు, యార్డుల ఆధునికీకరణ, ట్రాక్ మరమ్మతులు సహా ఇతర పనులకు మొత్తం రూ.202.40 కోట్లు కేటాయించారు. ఇదంతా ఒకెత్తయితే.. కొన్ని ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. అబ్బో.. వెయ్యి రూపాయలా..?! బడ్జెట్‌కు సంబంధించి రైల్వే బోర్డు బుధవారం విడుదల చేసిన పింక్ బుక్‌లో వాల్తేరు డివిజన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ పేర్లు అనేక చోట్ల కనిపిస్తున్నాయి కానీ.. ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల అంకెలు మాత్రం అవాక్కయ్యేలా చేస్తున్నాయి. నిర్మాణాలకు కావల్సిన మెట్రిక్ టన్ను ఐరన్ కొనుగోలుకే కనీసం రూ.40వేలు అవసరం. అలాంటిది ఒక రైల్వే యార్డు రీ మోడలింగ్‌కు రూ.1000 ఇస్తే.. అది దేనికి పనికొస్తుంది? అదే విధంగా రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు వెయ్యి రూపాయిలిస్తే ఏం చేసుకుంటారు..?? కానీ చాలా కేటాయింపులు అలాగే ఉన్నాయి. పోనీ అవేమైనా.. వేలు, లక్ష రూపాయతో పూర్తయ్యే పనులా అంటే.. అదీ కాదు.. కనీసం అర కోటి అయినా కేటాయించకపోతే.. పనులు పట్టాలెక్కని పరిస్థితి. అలాంటిది కేవలం వెయ్యి రూపాయిలిచ్చి.. పని చేపట్టమంటే ఏం చేయాలని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు సైతం విస్తుపోతున్నారు. ఇంతకీ రూ.1000 అందుకున్న పనులు..వాటి వాస్తవ అంచనా వ్యయం చూద్దాం ♦ విజయనగరం–కొత్తవలస మధ్య 34.7 కిమీ మేర మూడోలైన్ అంచనా వ్యయం రూ. 288.37 కోట్లు.. గత రెండు బడ్జెట్లలో రూ.254 కోట్లు ఇచ్చినా.. ఈ బడ్జెట్లో వెయ్యి మాత్రమే ఇచ్చారు. ♦ ఉత్తర సింహాచలం–గోపాలపట్నం మధ్య 2.07 కిమీ బైపాస్ లైన్ డబ్లింగ్ పనుల అంచనా వ్యయం రూ.2.60 కోట్లు. దీనికి ఇప్పుడు వెయ్యి, గత బడ్జెట్ రూ.లక్ష కేటాయించారు. ♦ ఉత్తర సింహాచలం, గోపాలపట్నం యార్డు రీ మోడలింగ్ వ్యయ అంచనా రూ.11.27 కోట్లు ♦ డివిజన్ పరిధిలోని 36 ప్రాంతాల్లో ఇంటర్లాక్డ్ లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ సప్లై పనులు ♦ డివిజన్ పరిధిలోని మరో 10 మానవ రహిత లెవల్ క్రాసింగ్‌ల పనులు ♦ విశాఖ రైల్వే స్టేషన్ పరిధిలోని 15 లెవల్ క్రాసింగ్‌ల వద్ద పనులు ♦ 140 మానవ రహిత లెవల్ క్రాసింగ్ పనులు ♦ కొత్తవలస–పెందుర్తి మధ్య 484 మైలు రాయి వద్ద 2 లెవల్ క్రాస్ పనులు ♦ పలాస–విశాఖపట్నం మధ్య 20.28 కిమీ ట్రాక్ రెన్యువల్ పనులు ♦ పలాస– విశాఖపట్నం మధ్య 134 చోట్ల ట్రాక్ మరమ్మతులు ♦ కొత్తవలస– కిరండూల్ మధ్య 6 స్టేషన్లలో టెలికమ్యునికేషన్ పనులు ♦ పలాస–విశాఖపట్నం మధ్య 10 ఎలక్ట్రానిక్ ఇంటర్లాక్డ్ వ్యవస్థకు చెందిన గూమ్టీల వద్ద సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ పనులు ♦ విశాఖపట్నం సెంట్రల్ సిక్లైన్ అప్‌గ్రెడేషన్, ఓర్ ఎక్సే్ఛంజ్ సెంటర్ వ్యాగన్ డిపో పనులు ♦ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫారాల్లో షెల్టర్ల నిర్మాణం ♦ విశాఖ రైల్వే స్టేషన్లో 7, 8 ప్లాట్‌ఫారాల్లో మౌలిక సదుపాయాలు కల్పన ♦ విశాఖ రైల్వే స్టేషన్‌లోని 6, 7, 8 ప్లాట్‌ఫారాల దక్షిణ భాగంలో మెట్లు, ర్యాంపుల నిర్మాణ పనులు ♦ విశాఖ రైల్వే స్టేషన్లో సెంట్రల్ ఫుట్ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు ♦ ఎస్.కోట, అరకు రైల్వే స్టేషన్ల మధ్య పలు ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు ♦ విశాఖ రైల్వే స్టేషన్ పరిధిలో మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం కొసమెరుపు.. పెళ్లిళ్లకు, పేరంటాలకు చదివించినట్లు.. పైన పేర్కొన్న వెయ్యి రూపాయలు చొప్పున జరిపిన విదిలింపులపై రైల్వే ఉద్యోగులు సైతం ఇది మా శాఖ చదివింపుల కార్యక్రమం అంటూ సెటైర్లు వేస్తున్నారంటే.. కేటాయింపులు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో వేరే చెప్పక్కర్లేదు. -
ఈ బంధం ఇంతేనా?!
శతాబ్దానికిపైగా మహోజ్వల చరిత్ర.. ఆదాయంలో బంగారు బాతు.. ఎన్నో ప్రతిష్టాత్మక వ్యవస్థలు.. ఇవన్నీ వాల్తేర్ రైల్వే డివిజన్ సొంతం. ఇప్పుడవన్నీ చరిత్రలో కలిసిపోక తప్పదా?.. వాల్తేర్ డివిజన్ ఉనికి ఇక చరిత్రగానే మిగిలిపోనుందా??.. విశాఖతో డివిజన్ బంధం తెగిపోక తప్పదా???.. రైల్వే బోర్డు నుంచి వస్తున్న ఆదేశాలు.. ఈ ప్రశ్నలన్నింటికీ అవననే సంకేతాలనే ఇస్తున్నాయి. వాల్తేర్ డివిజన్ విభజన తథ్యమని చెబుతున్నాయి. ఆంధ్రుల చిరకాల డిమాండ్, రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీ అయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో.. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో మొట్టిన చందంగా.. వాల్తేర్ డివిజన్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ డివిజన్‌ను రెండుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్లో కలపడం.. మరో భాగంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం.. వంటి దురదృష్టకర నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆగస్టు 31లోగా రాయగడ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ దిశగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నాన్ని స్థానికులు, ప్రజాసంఘాలతోపాటు రైల్వే యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే జోన్ వచ్చిందన్న ఆనందం.. అదే ఉత్తర్వుల్లో కేంద్రం పెట్టిన మెలికతో నీరుగారిపోయింది. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను అడ్డంగా విడదీసి ఒక భాగాన్ని కొత్త జోన్ పరిధిలోకి వచ్చే విజయవాడ డివిజన్లో కలపాలని నిర్ణయించారు. మిగిలిన భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌గా మార్చాలని నిర్ణయించడం ద్వారా వాల్తేర్ డివిజన్ ఉనికే లేకుండా చేస్తున్నారు. ఆగస్టు 31లోగా కొత్త డివిజన్ తూర్పు కోస్తా జోన్ పరిధిలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాల్తేరు డివిజన్ విభజన, కొత్త డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు విధివిధానాలు రూపొందించాలని రైల్వేబోర్డు నుంచి తూర్పు కోస్తా జోన్ జనరల్ మేనేజర్‌కు ఆదేశాలు అందాయి. కొత్త డివిజన్ డీపీఆర్‌తోపాటు ఇతర వ్యవహారాల పర్యవేక్షణకు వెంటనే ఒక నోడల్ అధికారిని నియమించాలని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్రసింగ్ ఆదేశించారు. వాల్తేరు డివిజన్ అధికారులు, దక్షిణ కోస్తా జోన్ ఓఎస్డీతో కొత్తగా నియమితులయ్యే నోడల్ అధికారిని సమన్వయం చేసుకుంటూ కొత్త డివిజన్‌కు రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను ఆగస్టు 31లోగా తమకు అందించాలని సూచించారు. ఈ పరిణామాలతో వాల్తేరు డివిజన్ విభజన ఖరారయినట్లే. సింహభాగం ఆదాయం వాల్తేరుదే.. తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ బంగారు బాతులాంటిది. అతిపెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇందులో రూ.7 వేల కోట్లు ఒక్క వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది తూర్పుకోస్తా ప్రధాన కేంద్రం భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. డివిజన్ ఆదాయంలో సింహభాగం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా ఇప్పుడు రాయగడ డివిజన్ సొంతమవుతుంది. ఉద్యోగులకూ తీవ్ర ఇబ్బందులు వాల్తేరు డివిజన్ ఉనికి కోల్పోతే దీని పరిధిలోని ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం డివిజన్లో 16,600 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నివాసముంటున్నారు. డివిజన్‌ను విడదీసి అటో ముక్క.. ఇటో ముక్క కలిపేస్తే వీరికి డివిజన్ కేంద్రం ఉండది. జోనల్ హెడ్ క్వార్టర్స్‌తో పనీ ఉండదు. జీత భత్యాలు, అలవెన్సుల్లో తేడాలొచ్చినా, సెలవు పెట్టాలన్నా, ఇతర సమస్యలున్నా విజయవాడ డివిజన్‌కు పరుగులు తీయాల్సిందే. ఇక రాయగడ డివిజన్‌కు కేటాయించే ఉద్యోగులు కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉద్యోగులకు ఇబ్బందికరమైన పరి ణామాలేనని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అఖిల భారత ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్‌తో పాటు వివిధ యూనియన్లు.. వాల్తేర్ డివి జన్ను కొనసాగించాలంటూ ఉద్యమాలు నిర్వహించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. డివిజన్ కొనసాగించాల్సిందే శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఉనికి లేకుండా విడదీయాలనుకోవడం సరికాదు. దీనివల్ల ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ డివిజన్‌కు భారతీయ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తాం. ప్రజలు, అన్ని యూనియన్లు, వివిధ ప్రజాసంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – డా. పెదిరెడ్ల రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఇది సరైన నిర్ణయం కాదు వాల్తేరు డివిజన్ రద్దును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. జోన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి.. ఆ సాకుతో చారిత్రక నేపథ్యం ఉన్న డివిజన్‌ను విడదీయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. వాల్తేరును విజయవాడలో విలీనం చెయ్యడం అవగాహన రాహిత్యం. దీని వల్ల వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనిపై మరోసారి ఉద్యమాన్ని ఉధ్ధృతం చేస్తున్నాం. డివిజన్ విభజనను వ్యతిరేకిస్తూ.. బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం. – బమ్మిడి దామోదరరావు, కార్యదర్శి, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ -
పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–నర్సాపూర్ ప్రత్యేక రైలు (07256) ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00కు నర్సాపూర్ చేరు కుంటుంది. నర్సాపూర్–హైదరాబాద్ రైలు (07255) ఏప్రిల్ 29న రాత్రి 7.30కు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కు హైదరాబాద్ చేరుకుంటుంది. లింగంపల్లి–విశాఖపట్నం రైలు (07148) ఏప్రిల్ 26న సాయంత్రం 5.00 గంటలకు లింగంపల్లిలో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం–లింగంపల్లి రైలు (07147) ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 10.15కు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రి 11.10కు లింగంపల్లి చేరుకుంటుంది. -
బంగారు భవనం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ రైల్వే డివిజనల్ కార్యాలయం హైదరాబాద్ భవన్‌కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి గోల్డ్ రేటింగ్ లభించింది. సహజ వనరుల సమర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పోదుపులో సాధించిన అద్భుత ఫలితాలకు ఈ అవార్డు లభించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణకు హైదరాబాద్ భవన్ అనేక చర్యలు చేపట్టి సత్ఫలితాలు సాధించింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు డస్ట్బిన్లు, నీటి సంరక్షణకు నాలుగు వాటర్ మీటర్లు ఏర్పాటు చేశారు. భవన పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు హానికారక రసాయనాలకు బదులు పర్యావరణప్రియమైన వాటినే వినియోగిస్తున్నారు. మొక్కలు పెంపకానికి సేంద్రియ ఎరువులే వాడుతున్నారు. అలాగే విదేశీ వృక్షాలకు బదులు దేశవాళీ వృక్షాల పెంపకానికే ప్రాధాన్యమిస్తున్నారు. భవనంలో గాలి, వెలుతురు, చల్లదనం ఉండేందుకు వీలుగా 2,300 చదరపు మీటర్ల పైకప్పునకు సోలార్ రిఫ్లెక్షన్ ఇండెక్స్ పెయింటింగ్‌ను అమర్చారు. విద్యాంగుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలు, ఆటలు, యోగా కోసం ఏర్పాటు చేసిన వసతులు తదితర సదుపాయాలకు గాను ఈ భవనానికి గోల్డ్ రేటింగ్ లభించింది. -
పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వరుస పండుగల నేపథ్యంలో పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిల్చార్–బెంగళూరు కాన్ట్ ప్రత్యేక రైలు (02552) డిసెంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సిల్చార్‌లో బయలుదేరి రెండో రోజు ఉదయం 10.00కి బెంగళూరు కాన్ట్ చేరుకుంటుంది. కాగా, హైదరాబాద్–తిరుపతి రైలు (07441) 27న సాయంత్రం 6.00కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.00కు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి–హైదరాబాద్ రైలు (07442) 28న మధ్యాహ్నం 2.15కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–కాకినాడ పోర్ట్ రైలు (07447) 29న సాయంత్రం 6.50కు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. -
‘కైసే హో ’.. అచ్చా హై!
♦ సీనియర్ డీపీవో శ్రీరాములుకు డీఆర్ఎం వీజీ భూమా కితాబు ♦ రైల్వే డివిజన్లో మూడు కొత్త ప్రణాళికలు ప్రారంభం లక్ష్మీపురం (గుంటూరు) : సౌత్ సెంట్రల్ పరిధిలోని గుంటూరు రైల్వే డివిజన్లో ఎన్నడూ లేని విధంగా డివిజన్ పరిధిలో ఉన్న 4 వేల మంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ‘కైసే హో (ఎలా ఉన్నావు)’ కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమని గుంటూరు రైల్వే డీఆర్ఎం వీజీ భూమా అన్నారు. స్థానిక పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలోని సీనియర్ డీపీవో కార్యాలయంలో డీఆర్ఎం వీజీ భూమా, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఎం. శ్రీరాములు సంయుక్తంగా మంగళవారం కైసే హో (ఎలా ఉన్నావు), మై ఫ్యామిలీ ట్రీ, ఎస్.ఎమ్.ఎస్.. కార్యక్రమాలపై డివిజన్ పరిధిలోని సంబంధిత విభాగాధిపతులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఈ మూడు కార్యక్రమాలను డీఆర్ఎం ప్రారంభించారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకే.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని 129 మంది సూపర్వైజర్ల కంట్రోల్లో 4 వేల మంది సిబ్బంది ఆయా విభాగాలలో వి«ధులు నిర్వర్తిస్తున్నారని, వారందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కైసే హో కార్యక్రమం ఏర్పాటు మంచి ప్రయత్నమని సీనియర్ డీపీవో శ్రీరాములును అభినందించారు. ఈ కార్యక్రమం మొదటగా సౌత్ సెంట్రల్లో ప్రారంభించడం, అది కూడా గుంటూరు రైల్వే డివిజన్లో మొదలెట్టడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు. తమ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగితో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం బాగుంటుందన్నారు. అలాగే ‘మై ఫ్యామిలీ ట్రీ’ అనే కార్యక్రమంలో ప్రధానంగా డివిజన్ పరిధిలోని విధులు నిర్వర్తించే 4 వేల మంది ఉద్యోగుల పేరు వివరాలతో పాటు వారి జనన ధృవీకరణ వివరాలు కూడా సేకరించడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా డివిజన్ పరిధిలో ప్రతి ఉద్యోగి జన్మదినం రోజు స్వయానా డీఆర్ఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు చెప్పారు. అదే రోజు ఆ ఉద్యోగి డివిజన్ పరిధిలోగాని, విధులు నిర్వర్తించే ప్రాంతంలోగానీ ఓ మొక్కను నాటే కార్యక్రమం కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు. దీని ద్వారా 4 వేల మంది నాలుగు వేల మొక్కలను నాటే అవకాశం కల్పించామని తెలిపారు. ఆ మొక్కల బాగోగులు కూడా ఆ ఉద్యోగి చూసుకోవాలని చెప్పారు. అదే విధంగా ‘ఎస్.ఎమ్.ఎస్’ కార్యక్రమంలో డివిజన్ పరిధిలో ప్రమాదవశాత్తు గాయాల పాలైన, మరణించిన, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగికి ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 9701309607 కు మెసేజ్ చెయ్యడం ద్వారా సంబంధిత విభాగాధిపతులకు ఆ సమాచారం పంపించి తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ప్రతి మంగళవారం.. సీనియర్ డివిజనల్ పర్సనల్ అధికారి ఎం. శ్రీరాములు మాట్లాడుతూ డీఆర్ఎం వీజీ భూమా, ఏడీఆర్ఎం రంగనాథ్ సహకారంతో ఈ సరికొత్త కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో కైసే హో కార్యక్రమం ప్రతి మంగళవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు డివిజన్ పరిధిలో ఉన్న 4 వేల మంది ఉద్యోగుల సమస్యల గురించి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు, సీనియర్ డీఎస్టీ మునికుమార్, సీనియర్ డీఎస్వో సుబ్రహ్మణ్యం, సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు. -
నేడు పలు రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం
గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్లో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు గురువారం చేయనున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ మేనేజర్ ఆమితాబ్ ఓజా చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేçష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల చేతుల మీదుగా విజయవాడ తిమ్మంపల్లి క్షేత్రంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఆన్లైన్ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించడానికి ఎల్ఈడీ ప్రొజెక్టర్లను స్థానిక రైల్వే కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేశారు. గుంతకల్లు రైల్వే డివిజన్లోని గుంతకల్లు–వాడి సెక్షన్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారన్నారు. అదే విధంగా కడప–బెంగుళూరు ప్రాజెక్టులో భాగంగా కడప–పెండ్లమర్రి మార్గంలో నిర్మించిన కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి డెమో రైలు నిర్వహిస్తారన్నారు. ఇక గుత్తి–ధర్మవరం సెక్షన్లో డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా తిరుపతిలో 2.5 టన్నుల సామర్థ్యంతో యాంత్రీక లాండ్రి పనులను ప్రారంభిస్తారు. తిరుపతి–జమ్మూతావి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు హాజరుకావాలన్నారు. -
రైల్వే డివిజన్‌కు గట్టి దెబ్బ
* ట్రాక్ పునరుద్ధరణకు రెండు రోజులు * సమాచారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూం నగరంపాలెం: గుంటూరు రైల్వే డివిజను పరిధిలో అతి పెద్ద నష్టం వాటిల్లింది. సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో వరదనీటికి రైల్వే ట్రాకు కనీసం పది నుంచి పదిహేను చోట్ల దెబ్బతింది. సత్తెనపల్లి– రెడ్డిగూడెం మధ్యలో ఎక్కువ చోట్ల, రెడ్డిగూడెం– బెల్లంకొండ, బెల్లంకొండ– పిడుగురాళ్ల మధ్యలో అక్కడక్కడ రైల్వే ట్రాకు మీద నుంచి వర్షంనీరు ప్రవహించింది. వర్షం ప్రారంభం నుంచే రైల్వే అధికారులు అప్రమత్తతతో వ్యవహరించటంతో ట్రాకు దెబ్బతిన్న సమాచారం తక్షణమే తెలుసుకొని ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపివేశారు. గురువారం సాయంత్రం వరకు ట్రాక్ సమీపంలో నీటి ప్రవాహం తగ్గకపోవటంతో నష్టంపై కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. నిలిచిపోయిన పల్నాడు, పలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ల వద్దకు వెళ్లటానికి రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవటంతో మధ్యాహ్నానికి అధికారులు అక్కడకు చేరుకున్నారు. ట్రాక్ పునరుద్ధరణకు కనీసం రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు.. డివిజనులో రద్దు, దారిమళ్లిన రైళ్లు, ఇతర సమాచారం కోసం గుంటూరు రైల్వేస్టేషన్లో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు. వివరాల కోసం 9701379072, 0863–2222014, రైళ్లరాకపోకలకు సంబంధించి సెంట్రల్ కంట్రోల్ రూం 9701379073, 9701371072 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
రైల్వేస్టేషన్‌కు రాజధాని హంగులెప్పుడో!
రైల్వే కొత్త జీఎం రవీంద్రగుప్తా వీటిపై దృష్టి పెట్టేనా! విజయవాడ : విజయవాడ రైల్వే డివిజన్‌కు తొలిసారిగా వస్తున్న జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రాజధానిగా విజయవాడ మారడానికితోడు వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు జరగనుండటంతో ఈ ప్రాంతంపై రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొత్త జీఎం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంత అవసరాలపై చర్చ జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో పాటు విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు కొత్త రైళ్లు, రైల్వేస్టేషన్లో అత్యాధునిక సౌకర్యాల కల్పన, శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు అంశాలను ప్రజాప్రతినిధులు జీఎం దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది. కొత్తరైళ్లు అవసరం నగరం నుంచి బెంగళూరు, అహ్మదాబాద్, షిర్డి, ముంబై, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు నూతన రైళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. బెంగళూరు, షిర్డి, తిరుపతి, హైదరాబాద్‌లకు వెళ్లే రైళ్లలో బెర్త్‌లన్నీ వచ్చే సంక్రాంతికి ఇప్పుడే నిండిపోయాయంటే డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తెల్లవారుజామున చేరే విధంగా కొత్త రైళ్లు వేయాలి. విజయవాడ, మచిలీపట్నం నుంచి రైళ్లు ప్రారంభమైతే ఈ ప్రాంత వాసులకు ఉపయుక్తం. నత్తనడకన కొత్త రైల్వేలైన్లు మచిలీపట్నం-భీమవరం-నర్సాపురం డబ్లింగ్ పనులు ప్రారంభమై ఐదేళ్లయినా నత్తనడకనే సాగుతున్నాయి. వచ్చే పుష్కరాల నాటికి ఈ పనులు పూర్తి చేసేలా జీఎం దృష్టిపెట్టాలి. కోటిపల్లి-నర్సాపురం లైను 13 ఏళ్ల కిందట మంజూరైనా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రాజధాని స్టేషన్లపై దృష్టిపెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కోరితే కృష్ణా కెనాల్, మంగళగిరి రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసి కొత్త రాజధానికి రాకపోకలు సులభతరం చేస్తామని గతంలో జీఎం శ్రీవాస్తవ ప్రకటించారు. దీనిపై ప్రజాప్రతినిధులు దృష్టిపెడితే బాగుంటుంది. భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడికి తరలి వస్తే రాకపోకలు పెరుగుతాయి. పుష్కరాల నాటికి ఆర్.ఆర్. ఐ వచ్చే పుష్కరాల నాటికి 8, 9, 10 ఫ్లాట్‌ఫారాల లైన్‌ను విశాఖపట్నం, హైదరాబాద్ రూట్లకు అనుసంధానం చేస్తూ రైల్వే రూట్ ఇంటర్ లాకింగ్ సిస్టిమ్‌ను ఏర్పాటు చేయాలి. రూ.150 కోట్లతో జరుగుతున్న ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్లాట్‌పారాలపై పలుచోట్ల షెల్టర్స్ లేవు. స్టేషన్లో సౌకర్యాలపై ఇన్చార్జి జీఎం ప్రదీప్ కుమార్ సక్సేనా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. శాటిలైట్ స్టేషన్లపై దృష్టిపెట్టాలి గుణదల రైల్వేస్టేషన్‌ను శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తే విజయవాడ రైల్వేస్టేషన్‌పై వత్తిడి తగ్గుతుంది. అయితే ఇది కార్యరూపం దాల్చడం లేదు. గుణదల రైల్వేస్టేషన్‌ను రూ.3 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రైల్వే అధికారులు సిద్దంగా వున్నారు. రాయనపాడు, ఇబ్రహీంపట్నం స్టేషన్లను కూడా శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. -
కనికరించని ప్రభు
గుంతకల్లు : రైల్వే బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు మరోసారి అన్యాయం జరిగింది. గురువారం కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు రైల్వే డివిజన్‌కు ఆదాయపరంగా అత్యంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ రైళ్ల కేటాయింపుల్లో కానీ, పొడగింపుల్లో కానీ, ైరె ల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో కానీ తగినంత ప్రాధాన్యత కల్పించడం లేదన్నది ఈ బడ్జెట్‌తో అవగతమైంది. రెండు దశాబ్దాలుగా రైలే ్వ మంత్రులుగా పనిచేసిన వారంతా తమ తమ రాష్ట్రాలకు, ప్రాంతాలకు రైళ్లను, ప్రాజెక్టులను కేటాయించుకోవడంలో చూపిన చొరవ, ఆసక్తి రాయలసీమపై చూపలేదన్న వాస్తవాన్ని సురేష్‌ప్రభు పునరావృతం చేయడం సీమ ప్రజల హృదయాలను బాధిస్తోంది. రైల్వే నిధుల కేటాయింపుల విషయంలో ఎంపీలు చొరవ మచ్చుకైనా లేదన్న విషయం గురువారం నాటి రైల్వేబడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తుందని రైల్వే వర్గాలు, ఉన్నత స్థాయి మేధావులు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌కు వేల కోట్లు నిధులు అవసరమని డివిజనల్ స్థాయి అధికారులు ప్రతిపాదనలు పంపితే రైల్వే మంత్రిత్వ శాఖ అత్తెసరు నిధులు కేటాయింపులు చేసి మమా అనిపించుకుంది. తాజా బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కేటాయింపులు ఇలా : నూతన రైలు మార్గాలు : నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గానికి రూ.130 కోట్లు మునీరాబాద్-మహబూబ్‌నగర్ రైలు మార్గానికి రూ 185 కోట్లు ఓబుళవారిపల్లి-కృష్ణపట్నం రైలు మార్గ నిర్మాణానికి రూ.లక్ష కేటాయింపులు చేశారు. కడప-బెంగుళూరు రైలు మార్గ నిర్మాణానికి రూ. 15 కోట్లు కంభం-పొద్దుటూరు రైలు మార్గం నిర్మాణానికి కోటి రూపాయలు మద్దికెర-నంచర్ల స్టేషన్ల మధ్య బైపాస్‌లైన్ ఏర్పాటుకు రూ.15 కోట్లు కేటాయించారు. డబులింగ్ రైలు మార్గాలు : గుంటూరు-గుంతకల్లు, గుంతకల్లు-కల్లూరు వయా గూళ్యపాళ్యం, కల్లూరు-ధర్మవరం మధ్య డబులింగ్ పనులకు రూ. 50 కోట్లు ధర్మవరం-పాకాల మధ్య డబులింగ్ పనులకు రూ 10 కోట్లు హోస్పేట-గుంతకల్లు మధ్య డబులింగ్‌కు రూ.10 కోట్లు రేణిగుంట-తిరుపతిల మధ్య డబులింగ్ పనులకు రూ 1.10 కోట్లు రాయచూర్-గుంతకల్లు మార్గంలో పెండింగ్‌లో ఉన్న 13 కి.మీల డబులింగ్ పనులకు రూ 6 కోట్లు విద్యుద్దీకరణ పనులు : పూణె-గుంతకల్లు మధ్య విద్యుద్దీకరణ పనులకు రూ.250 కోట్లు కృష్ణపట్నం-వెంకటాచలం స్టేషన్ల మధ్య విద్యుద్దీకరణ పనులకు రూ.5 కోట్లు బెంగుళూరు-గుత్తి మధ్య విద్యుద్దీకరణ పనులకు రూ 41.16 కోట్లు కల్లూరు-గుంతకల్లు మధ్య విద్యుద్దీకరణ పనులకు రూ 9.37 కోట్లు అభివృద్ధి పనులకు.. : గుంతకల్లు విద్యుత్ లోకో షెడ్ నిర్మాణానికి రూ 12 కోట్లు గుంతకల్లులోని ప్రభాత్‌నగర్‌లో 40 టైప్-2 క్వార్టర్ల నిర్మాణానికి రూ 5 కోట్లు గుంతకల్లులో క్వార్టర్స్ మరమ్మతులు, రోడ్లు, పైపులైన్లు, డ్రైనేజీ పనులకు రూ 15 కోట్లు పాకాల-ధర్మవరం సెక్షన్లో 26 టైప్-2, 9 టైప్-3 క్వార్టర్స్ నిర్మాణానికి రూ.కోటి డివిజన్ పరిధిలో రైల్ లెవల్ ప్లాట్‌ఫారాలను అభివృద్ధిపరచడానికి రూ 20 లక్షలు ఈ నిధుల కేటాయింపులో ప్రధానంగా మద్దికెర-నంచర్ల బైపాస్‌లైన్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాది నుంచి దక్షణాదికి వెళ్లే రైళ్లన్నీ గుంతకల్లు జంక్షన్ మీదుగా మళ్లే అవకాశం ఏర్పడుతుంది. తాజా బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా ఒక్క కొత్త రైలు కూడా పరుగులు పెట్టకపోవడం శోచనీయం. కార్మికులకు ఒరిగిందేమి లేదు రైల్వే బడ్జెట్లో కార్మికులకు ఒరిగింది శూన్యం. రైల్వే చార్జీలు పెంచలేదంటూనే ప్రీమియం రైళ్లను పెంచారు. ఈ రైళ్లలో సామాన్య ప్రయాణీకులు ప్రయాణించడం కష్టం. గత 20 ఏళ్ల రైల్వే బడ్జెట్లో 2002 నూతన రైళ్లను ప్రకటించారు. పట్టాలపై పరుగులు తీసినవి 1360 రైళ్లు మాత్రమే. ఇందుకు ప్రధాన కారణం కోచ్‌ల లేమి. గత ఏడాది రైల్వే బడ్జెట్లో కార్మికుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన బెనిఫిట్స్, సంక్షేమాల ఊసే మరిచారు. - విజయ్‌కుమార్, మజ్దూర్ యూనియన్ గుంతకల్లు డివిజన్ అధ్యక్షుడు ఇలాంటి బడ్జెట్ ఎన్నడూ చూడలేదు నా సర్వీస్‌లో ఇలాంటి రైల్వే బడ్జెట్ ఎన్నడూ చూడలేదు. బీజేపీ ప్రభుత్వం రైల్వేలో ఎఫ్‌డీఐలను ప్రోత్సహించడానికి ప్రస్తుత బడ్జెట్ తార్కాణంలా నిలుస్తుంది. పీపీఓ, ఎఫ్‌డీఐలను ప్రోత్సహించి కార్మికులకు వ్యతిరేకంగా నిలిచింది. గుంతకల్లు డివిజన్‌కు ఒక్క రైలు కేటాయించకపోవడం శోచనీయం. - కేవీ శ్రీనివాసులు, ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి -
రైల్వే అధికారుల విస్తృత తనిఖీలు
పాకాల: పాకాల రైల్వే జంక్షన్లో గురువారం గుంతకల్ రైల్వే డివిజన్ అడిషనల్ రీజనల్ మేనేజన్ పీవీవీ సత్యనారాయణ విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తూ రైల్వే ఆదాయానికి గండి కొడుతున్న ప్రయాణికులను అదుపు చేసే దిశగా ఆయన చిత్తూరు, తిరుపతి, రేణిగుంట స్టేషన్ల నుంచి ప్రత్యేక తనిఖీ బృందాలను తీసుకువచ్చి ఆగిన రైళ్లలో టికెట్ తనిఖీలు చేపట్టారు. రాత్రి తొమ్మిదింటి వరకు ఆయన స్టేషన్ అంతటా తిరుగుతూ నిశితంగా పరిశీలించారు. చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ద్వారకనాథ్ ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న ప్యాసెంజర్ల నుంచి రూ.51 వేలు జరిమానా వసూలు చేశారు. రైలులో 40 శాతం మేరకు టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. పాకాల స్టేషన్ పరిధిలో రెండేళ్ల కిందట వచ్చే ఆదాయంతో పోలిస్తే టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. స్టేషన్లో ప్రయాణికులకు వుంచినీటి సౌకర్యం బాగుందని, అయితే అక్కడక్కడా లీకేజీలు ఉన్నాయని, సరిదిద్దుకోవాలని స్టేషన్ మేనేజర్ జనార్ధన్‌రావుకు సూచించారు. అనంతరం స్థానికంగా ఉన్న రైల్వే టెన్నిస్ క్లబ్‌ను ఆయన సందర్శించారు. స్థానిక రైల్వే క్వార్టర్స్ పైకప్పు శిథిలావస్థకు చేరుకుందని, దాదాపు 50 గదులకు వురో ఏడాదిలో మరమ్మతులు చేయిస్తామన్నారు. పాకాల జంక్షన్లో సౌకర్యాల స్థాయి పెంపునకు కృషి చేస్తామన్నారు. వురో 15 రోజుల్లో వుళ్లీ తాను ఇక్కడికి వస్తానని, టికెట్టు లేకుండా చేస్తున్న ప్రయాణాలను నివారించి రైల్వే ఆదాయన్ని పెపొందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో పాకాల స్టేషన్ మేనేజర్ జనార్దన్‌రావు, సూపర్వైజర్లు జయదేవ్, శ్రీహరిరావు, టెలికం జేఈలు ఆనందకుమార్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట్‌కు రైల్వే డివిజన్ హోదా!
-
ఖర్గే కనికరిస్తారా?
కొత్త ప్రాజెక్టుల ఊసే లేకుండా పాత ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే చాలని ప్రతిపాదనలు పంపామంటూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ మంగళవారం సాయంత్రం కుండబద్దలు కొట్టారు. కర్నూలు ఎంపీ కోట్ల ఆ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న తరుణంలో మన పొరుగు రాష్ట్రానికి చెందిన రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే నేడు పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ స్థితిలో గుంతకల్లు రైల్వే డివిజన్ రూపురేఖలు మారుతాయని ఆశించడం ఆశా.. అత్యాశా..? గుంతకల్లు, న్యూస్‌లైన్: గుంతకల్లు రైల్వే డివిజన్లో పడకేసిన ప్రాజెక్టుల్లో కదలిక రావాలంటే నేటి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తేనే సాధ్యమని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కనీసం వెయ్యి కోట్లు కేటాయిస్తే తప్ప ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టుల్లో కదలిక కనిపించదని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ మేరకు నివేదికలను రైల్వే బోర్డుకు సమర్పించారు. చాలాకాలంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌కు నిధుల కేటాయింపులు సరిగా జరగడం లేదని, దీంతో మంజూరైన, చేపట్టిన రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్న విషయాన్ని ఆ నివేదికల్లో పొందుపర్చారు. నిధుల లేమి వల్ల‘సీమ’ జిల్లాల్లో రైల్వే అభివృద్ధి అధ్వాన్నంగా తయారైందని కూడా ఆ నివేదికల్లో విశ్లేషించినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపలేదని, ఈ ఏడాదిని ప్లాన్ హాలిడేగా ప్రకటించాని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ మంగళవారం సాయంత్రం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేటి రైల్వే బడ్జెట్ ఏమేరకు ఈ ప్రాంతాభివృద్ధికి దోహదపడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. గుంతకల్లు డివిజన్‌కు మంజూరైన ప్రాజెక్టులు పూర్తవ్వడానికి గతంలో రూపొందించిన అంచనాల ప్రకారం రూ.1684.56 కోట్ల అవసరం. 2011-12 రైల్వే బడ్డెట్లో రూ.135.38 కోట్లు, 2012-13 రైల్వే బడ్జెట్లో రూ.145 కోట్లు, 2013-14 బడ్జెట్లో రూ.160 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 90కి పైగా రైల్వేస్టేషన్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. 2011-12, 2012-13, 2013-14 బడ్జెట్లలో అడిగిన నిధులనే మళ్లీ అడుగుతూ 2014-15 బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపారు. రైల్వే మంత్రిపై అందరి దృష్టి అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాలు రైల్వే పరంగా అభివృద్ధి చెందితేనే ‘సీమ’ ప్రాంతం పారిశ్రామికంగా ముందంజవేస్తుంది. సీమ వెనుకబాటుతనం గురించి బాగా తెలిసిన రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు పంపిన నివేదిక మేరకు నిధులు విడుదల చేస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు మహర్దశ వచ్చేనా? రైల్వే డివిజన్ పరిధిలో విద్యుత్తు లోకోషెడ్డు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్ నిర్మాణం, గుత్తి షెడ్ అభివృద్ధి, గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్, మంత్రాలయం రోడ్డు- కర్నూలు కొత్తలైన్ నిర్మాణం, కర్నూలు-మార్కాపురం కొత్తలైన్, కదిరి-రాయచోటి నూతన మార్గం, పెన్నానదిపై వంతెన నిర్మాణం, వాడి-గుంతకల్లు డబ్లింగ్ నిర్మాణం, కడప- బెంగుళూరు రైల్వే లైన్ నిర్మాణం. కర్ణాటకకే పెద్దపీట! కొత్త రైళ్లను పరుగులు తీయించే క్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్ర ప్రయోజనాలకు ఇప్పటికే పెద్దపీట వేశారు. 2013-14 బడ్జెట్లో కొత్తగా మంజూరైన రైళ్లలో గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటిలో ఏకంగా ఆరు రైళ్లు ఏదోవిధంగా కర్ణాటక రాష్ర్ట ప్రజల అవసరాలు తీర్చేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. పనిలో పనిగా మరో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పొడిగింపులు ఇచ్చారు. తన హయాంలో కర్ణాటకకు రైల్వేపరంగా వీలైనంత ప్రయోజనం చేకూర్చే దిశగా మంత్రి ఖర్గే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకంటూ మూడు నెలల వ్యవధిలోనే మూడు పర్యాయాలు గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే కర్ణాటక ప్రాంతంలో పర్యటించారు. కొత్త రైళ్ల ప్రారంభం, పాత రైళ్లకు పొడిగింపులు ఇవ్వడం వల్ల కర్ణాటక ప్రజలకు ఎక్కువగా లబ్ధి చేకూరినా.. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల ప్రజలకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి. నేటి బడ్జెట్లో కూడా అదేరీతిలో రైల్వే స్పందించి లబ్ధి చేకూరుస్తారని కన్నడిగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశ నెరవేరితే మనకూ కాస్త లబ్ధి చేకూరినట్లే. -
పెండింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ పడేనా
సాక్షి, గుంటూరు :ఆదాయంలో గణనీయ ప్రగతి సాధించిన గుంటూరు రైల్వే డివిజన్ ప్రజాకర్షక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనుకబడింది. 2003లో ఏర్పాటైన గుంటూరు డివిజన్‌కు అడపాదడపా ఒకటో, రెండో కొత్త రైళ్లు వస్తున్నప్పటికీ ప్రధాన రైల్వే మార్గాల డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు గ్రీన్‌సిగ్నల్ లభించడం లేదు. రైల్వేస్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికులకు సదుపాయాల కల్పన వంటి పనులన్నీ మంద గిస్తున్నాయి. = గుంటూరు- తెనాలి మధ్య 24.7 కిలోమీటర్ల మేర ఉన్న రైల్వే మార్గానికి డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు కేంద్రం నిధులు కేటాయించింది. పనులను త్వరితగతిన పూర్తి చేయించే విషయంలో అధికారులు అలసత్వాన్ని కనబరుస్తున్నారు. ఈ పనులు త్వరగా పూర్తయితే చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీ, నాగ్‌పూర్, ముంబయి వంటి సుదూర పట్టణాలకు నేరుగా వెళ్లే వీలుంటుంది. = గుంటూరు స్టేషన్లో రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రెండో పిట్‌లైన్ పనులు నెలల తరబడి సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే మరికొన్ని రైళ్లు గుంటూరు మీదుగా వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. = గుంటూరు రైల్వే డివిజన్లో ప్రధాన రైల్వే మార్గమైన గుంటూరు-సికింద్రాబాద్ రూట్‌ను అభివృద్ధి చేస్తే ప్రయాణికులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సింగిల్ లైన్‌గా ఉన్న ఈ మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్పుచేయడం, విద్యుదీకరణ మార్గంగా మార్చడం కోసం ఆరేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పనులు పూర్తయితే సికింద్రాబాద్ వయా ఖాజీపేట మీదుగా విజయవాడ వెళ్లే కొన్ని రైళ్లను నడికుడి లైనులోకి మళ్లించే వీలుంటుంది. = నడికుడి -శ్రీకాళహస్తి మధ్య (282 కి.మీ) కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించాలన్న దక్షిణ మధ్య రైల్వే ఇంజినీరింగ్ అధికారుల ప్రతిపాదనలు సర్వే దశలోనే ఆగిపోయాయి. దీని కోసం కిందటి బడ్జెట్లో రూ.4 కోట్ల వరకు కేటాయింపులు జరిపినా = ఆయా నిధులు సర్వేలు, భూసేకరణలకు సరిపోయాయి. అదేవిధంగా మాచర్ల-నల్లగొండ, జాన్‌పహాడ్-మేళ్లచెర్వుల మధ్య కొత్త మార్గాల నిర్మాణ పనులకు నిధుల కేటాయింపులే జరగడం లేదు. = గుంటూరు-తెనాలి, గుంటూరు-గుంతకల్లు, గుంటూరు-బీబీనగర్ మార్గాలన్నీ సింగిల్ లైన్లుగానే ఉన్నాయి. డబ్లింగ్ పను లు పూర్తయితేనే విద్యుదీకరణ పనులు కూ డా జరుగుతాయి. ప్రధాన మార్గాల్లో ఈ పనులేమీ జరగకపోవడంతో గుంటూరు-నడికుడి, గుంటూరు-గుంతకల్లు మార్గా ల్లో అరకొరగా రైళ్లు తిరుగుతున్నాయి. -
‘కొత్త పెన్షన్’ ఆమోదం సిగ్గుచేటు
గుంతకల్లు, న్యూస్‌లైన్ : లోకసభలో కేవలం 177 మంది ఎంపీల బలంతో యూపీఏ పాలక పక్షాల ‘కొత్త పెన్షన్ బిల్లు’ను ఆమోదించడం సిగ్గు చేటని, కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరికి ఈ చర్య నిదర్శనమని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్సీఆర్ఎంయూ) గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యదర్శి కే.కళాధర్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక డీఆర్ఎం కార్యాలయం ఎదుట రైల్వే కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష బీజేపీ సైతం ఈ ‘బిల్లు’ ఆమోదానికి వంత పాడటం శోచనీయమన్నారు. దీన్నిబట్టి ఈ రెండు పార్టీలు కార్మికుల పట్ల ఎంత కక్ష సాధింపు ధోరణిని అనుసరిస్తున్నాయో అర్ధమవుతోందని విమర్శించారు. ఈ బిల్లు వల్ల రైల్వే కార్మికులు, ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం సామాజిక భద్రత లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముప్పై ఏళ్లు ప్రజా సేవ చేసిన కార్మికులు, ఉద్యోగులకు పెన్షన్ సదుపాయాన్ని దూరం చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత రైల్వే కార్మికుల కుటుంబాలకు ఆసరాగా ఉన్న పింఛన్ విధానానికి కాంగ్రెస్ పెద్దలు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. ప్రతినెలా ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వమే తీసుకుని, దానిని షేర్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టి, తద్వారా వచ్చే ఆదాయంతో రైల్వే కార్మికులకు, ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పింఛన్ ఇవ్వాలనుకోవడం అర్థరహితమన్నారు. ఈ నెల 13వ తేదీన న్యూఢిల్లీలో ఏఐఆర్ఎఫ్, హెచ్ఎంఎస్, ఎస్సీఆర్ఎంయూ, తదితర కార్మిక సంఘాల నేతలందరూ సమావేశమై ఈ నూతన పెన్షన్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చే సేం దుకు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో దేశ వ్యాప్తంగా రైల్వే ఉద్యోగులు, కార్మికులు సమ్మెలోకి వెళ్లడానికి కూడా వెనుకాడబోరని హెచ్చరించారు. ఎస్సీఆర్ఎంయూ గుంతకల్లు డివిజన్ అధ్యక్షుడు ఫళనీస్వామి, ఏడీఎస్‌లు కేఎండీ.గౌస్, ఇబ్రహీంఖాన్, బీ.శ్రీనివాసులు, వివిధ బ్రాంచుల కార్యదర్శులు మస్తాన్‌వలీ, విజయ్‌కుమార్, హుస్సేన్, తదితరులు పాల్గొని ప్రసంగిస్తూ కొత్త పింఛన్ విధానంపై నిరసన వ్యక్తం చేశారు.