గుంతకల్లు, న్యూస్‌లైన్ : లోకసభలో కేవలం 177 మంది ఎంపీల బలంతో యూపీఏ పాలక పక్షాల ‘కొత్త పెన్షన్ బిల్లు’ను ఆమోదించడం సిగ్గు చేటని, కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరికి ఈ చర్య నిదర్శనమని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్‌సీఆర్‌ఎంయూ) గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యదర్శి కే.కళాధర్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయం ఎదుట రైల్వే కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష బీజేపీ సైతం ఈ ‘బిల్లు’ ఆమోదానికి వంత పాడటం శోచనీయమన్నారు. దీన్నిబట్టి ఈ రెండు పార్టీలు కార్మికుల పట్ల ఎంత కక్ష సాధింపు ధోరణిని అనుసరిస్తున్నాయో అర్ధమవుతోందని విమర్శించారు.
ఈ బిల్లు వల్ల రైల్వే కార్మికులు, ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం సామాజిక భద్రత లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముప్పై ఏళ్లు ప్రజా సేవ చేసిన కార్మికులు, ఉద్యోగులకు పెన్షన్ సదుపాయాన్ని దూరం చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత రైల్వే కార్మికుల కుటుంబాలకు ఆసరాగా ఉన్న పింఛన్ విధానానికి కాంగ్రెస్ పెద్దలు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. ప్రతినెలా ఉద్యోగుల జీతాల నుంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వమే తీసుకుని, దానిని షేర్ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెట్టి, తద్వారా వచ్చే ఆదాయంతో రైల్వే కార్మికులకు, ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పింఛన్ ఇవ్వాలనుకోవడం అర్థరహితమన్నారు.
ఈ నెల 13వ తేదీన న్యూఢిల్లీలో ఏఐఆర్‌ఎఫ్, హెచ్‌ఎంఎస్, ఎస్‌సీఆర్‌ఎంయూ, తదితర కార్మిక సంఘాల నేతలందరూ సమావేశమై ఈ నూతన పెన్షన్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చే సేం దుకు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో దేశ వ్యాప్తంగా రైల్వే ఉద్యోగులు, కార్మికులు సమ్మెలోకి వెళ్లడానికి కూడా వెనుకాడబోరని హెచ్చరించారు. ఎస్‌సీఆర్‌ఎంయూ గుంతకల్లు డివిజన్ అధ్యక్షుడు ఫళనీస్వామి, ఏడీఎస్‌లు కేఎండీ.గౌస్, ఇబ్రహీంఖాన్, బీ.శ్రీనివాసులు, వివిధ బ్రాంచుల కార్యదర్శులు మస్తాన్‌వలీ, విజయ్‌కుమార్, హుస్సేన్, తదితరులు పాల్గొని ప్రసంగిస్తూ కొత్త పింఛన్ విధానంపై నిరసన వ్యక్తం చేశారు.
‘కొత్త పెన్షన్’ ఆమోదం సిగ్గుచేటు
Published Fri, Sep 6 2013 4:17 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement