శతాబ్దానికిపైగా మహోజ్వల చరిత్ర.. ఆదాయంలో బంగారు బాతు.. ఎన్నో ప్రతిష్టాత్మక వ్యవస్థలు.. ఇవన్నీ వాల్తేర్ రైల్వే డివిజన్ సొంతం. ఇప్పుడవన్నీ చరిత్రలో కలిసిపోక తప్పదా?.. వాల్తేర్ డివిజన్ ఉనికి ఇక చరిత్రగానే మిగిలిపోనుందా??.. విశాఖతో డివిజన్ బంధం తెగిపోక తప్పదా???.. రైల్వే బోర్డు నుంచి వస్తున్న ఆదేశాలు.. ఈ ప్రశ్నలన్నింటికీ అవననే సంకేతాలనే ఇస్తున్నాయి. వాల్తేర్ డివిజన్ విభజన తథ్యమని చెబుతున్నాయి. ఆంధ్రుల చిరకాల డిమాండ్, రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీ అయిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో.. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో మొట్టిన చందంగా.. వాల్తేర్ డివిజన్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ డివిజన్‌ను రెండుగా విభజించి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లో కలపడం.. మరో భాగంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం.. వంటి దురదృష్టకర నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆగస్టు 31లోగా రాయగడ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ దిశగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నాన్ని స్థానికులు, ప్రజాసంఘాలతోపాటు రైల్వే యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే జోన్ వచ్చిందన్న ఆనందం.. అదే ఉత్తర్వుల్లో కేంద్రం పెట్టిన మెలికతో నీరుగారిపోయింది. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను అడ్డంగా విడదీసి ఒక భాగాన్ని కొత్త జోన్ పరిధిలోకి వచ్చే విజయవాడ డివిజన్‌లో కలపాలని నిర్ణయించారు. మిగిలిన భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌గా మార్చాలని నిర్ణయించడం ద్వారా వాల్తేర్ డివిజన్ ఉనికే లేకుండా చేస్తున్నారు.
ఆగస్టు 31లోగా కొత్త డివిజన్
తూర్పు కోస్తా జోన్ పరిధిలోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు రైల్వే బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాల్తేరు డివిజన్ విభజన, కొత్త డివిజన్ ఏర్పాటు, నిర్వహణకు విధివిధానాలు రూపొందించాలని రైల్వేబోర్డు నుంచి తూర్పు కోస్తా జోన్ జనరల్ మేనేజర్‌కు ఆదేశాలు అందాయి. కొత్త డివిజన్ డీపీఆర్‌తోపాటు ఇతర వ్యవహారాల పర్యవేక్షణకు వెంటనే ఒక నోడల్ అధికారిని నియమించాలని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్రసింగ్ ఆదేశించారు. వాల్తేరు డివిజన్ అధికారులు, దక్షిణ కోస్తా జోన్ ఓఎస్‌డీతో కొత్తగా నియమితులయ్యే నోడల్ అధికారిని సమన్వయం చేసుకుంటూ కొత్త డివిజన్‌కు రూపకల్పన చేయాలని సూచించారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను ఆగస్టు 31లోగా తమకు అందించాలని సూచించారు. ఈ పరిణామాలతో వాల్తేరు డివిజన్ విభజన ఖరారయినట్లే.
సింహభాగం ఆదాయం వాల్తేరుదే..
తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ బంగారు బాతులాంటిది. అతిపెద్దదైన ఈ డివిజన్ పరిధిలో ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇందులో రూ.7 వేల కోట్లు ఒక్క వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది తూర్పుకోస్తా ప్రధాన కేంద్రం భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. డివిజన్ ఆదాయంలో సింహభాగం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా ఇప్పుడు రాయగడ డివిజన్ సొంతమవుతుంది.
ఉద్యోగులకూ తీవ్ర ఇబ్బందులు
వాల్తేరు డివిజన్ ఉనికి కోల్పోతే దీని పరిధిలోని ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం డివిజన్‌లో 16,600 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నివాసముంటున్నారు. డివిజన్‌ను విడదీసి అటో ముక్క.. ఇటో ముక్క కలిపేస్తే వీరికి డివిజన్ కేంద్రం ఉండది. జోనల్ హెడ్ క్వార్టర్స్‌తో పనీ ఉండదు. జీత భత్యాలు, అలవెన్సుల్లో తేడాలొచ్చినా, సెలవు పెట్టాలన్నా, ఇతర సమస్యలున్నా విజయవాడ డివిజన్‌కు పరుగులు తీయాల్సిందే. ఇక రాయగడ డివిజన్‌కు కేటాయించే ఉద్యోగులు కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఉద్యోగులకు ఇబ్బందికరమైన పరి ణామాలేనని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అఖిల భారత ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్‌తో పాటు వివిధ యూనియన్లు.. వాల్తేర్ డివి జన్‌ను కొనసాగించాలంటూ ఉద్యమాలు నిర్వహించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి.
డివిజన్ కొనసాగించాల్సిందే
శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఉనికి లేకుండా విడదీయాలనుకోవడం సరికాదు. దీనివల్ల ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ డివిజన్‌కు భారతీయ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తాం. ప్రజలు, అన్ని యూనియన్లు, వివిధ ప్రజాసంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
– డా. పెదిరెడ్ల రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్
ఇది సరైన నిర్ణయం కాదు
వాల్తేరు డివిజన్ రద్దును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. జోన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి.. ఆ సాకుతో చారిత్రక నేపథ్యం ఉన్న డివిజన్‌ను విడదీయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. వాల్తేరును విజయవాడలో విలీనం చెయ్యడం అవగాహన రాహిత్యం. దీని వల్ల వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనిపై మరోసారి ఉద్యమాన్ని ఉధ్ధృతం చేస్తున్నాం. డివిజన్ విభజనను వ్యతిరేకిస్తూ.. బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం.
– బమ్మిడి దామోదరరావు, కార్యదర్శి, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్
Comments
Please login to add a commentAdd a comment