రైల్వేస్టేషన్‌కు రాజధాని హంగులెప్పుడో!
రైల్వే కొత్త జీఎం రవీంద్రగుప్తా వీటిపై దృష్టి పెట్టేనా!
విజయవాడ : విజయవాడ రైల్వే డివిజన్‌కు తొలిసారిగా వస్తున్న జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రాజధానిగా విజయవాడ మారడానికితోడు వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు జరగనుండటంతో ఈ ప్రాంతంపై రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొత్త జీఎం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంత అవసరాలపై చర్చ జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో పాటు విజయవాడ నుంచి దూర ప్రాంతాలకు కొత్త రైళ్లు, రైల్వేస్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాల కల్పన, శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు అంశాలను ప్రజాప్రతినిధులు జీఎం దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది.
కొత్తరైళ్లు అవసరం
నగరం నుంచి బెంగళూరు, అహ్మదాబాద్, షిర్డి, ముంబై, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు నూతన రైళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. బెంగళూరు, షిర్డి, తిరుపతి, హైదరాబాద్‌లకు వెళ్లే రైళ్లలో బెర్త్‌లన్నీ వచ్చే సంక్రాంతికి ఇప్పుడే నిండిపోయాయంటే డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు తెల్లవారుజామున చేరే విధంగా కొత్త రైళ్లు వేయాలి. విజయవాడ, మచిలీపట్నం నుంచి రైళ్లు ప్రారంభమైతే ఈ ప్రాంత వాసులకు ఉపయుక్తం.
నత్తనడకన కొత్త రైల్వేలైన్లు
మచిలీపట్నం-భీమవరం-నర్సాపురం డబ్లింగ్ పనులు ప్రారంభమై ఐదేళ్లయినా నత్తనడకనే సాగుతున్నాయి. వచ్చే పుష్కరాల నాటికి ఈ పనులు పూర్తి చేసేలా జీఎం దృష్టిపెట్టాలి. కోటిపల్లి-నర్సాపురం లైను 13 ఏళ్ల కిందట మంజూరైనా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
రాజధాని స్టేషన్లపై దృష్టిపెట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం కోరితే కృష్ణా కెనాల్, మంగళగిరి రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసి కొత్త రాజధానికి రాకపోకలు సులభతరం చేస్తామని గతంలో జీఎం శ్రీవాస్తవ ప్రకటించారు. దీనిపై ప్రజాప్రతినిధులు దృష్టిపెడితే బాగుంటుంది. భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడికి తరలి వస్తే రాకపోకలు పెరుగుతాయి.
పుష్కరాల నాటికి ఆర్.ఆర్. ఐ
వచ్చే పుష్కరాల నాటికి 8, 9, 10 ఫ్లాట్‌ఫారాల లైన్‌ను విశాఖపట్నం, హైదరాబాద్ రూట్లకు అనుసంధానం చేస్తూ రైల్వే రూట్ ఇంటర్ లాకింగ్ సిస్టిమ్‌ను ఏర్పాటు చేయాలి. రూ.150 కోట్లతో జరుగుతున్న ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్లాట్‌పారాలపై పలుచోట్ల షెల్టర్స్ లేవు. స్టేషన్‌లో సౌకర్యాలపై ఇన్‌చార్జి జీఎం ప్రదీప్ కుమార్ సక్సేనా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.
శాటిలైట్ స్టేషన్లపై దృష్టిపెట్టాలి
గుణదల రైల్వేస్టేషన్‌ను శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తే విజయవాడ రైల్వేస్టేషన్‌పై వత్తిడి తగ్గుతుంది. అయితే ఇది కార్యరూపం దాల్చడం లేదు. గుణదల రైల్వేస్టేషన్‌ను రూ.3 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రైల్వే అధికారులు సిద్దంగా వున్నారు. రాయనపాడు, ఇబ్రహీంపట్నం స్టేషన్లను కూడా శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.