గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్‌లో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు గురువారం చేయనున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ మేనేజర్ ఆమితాబ్ ఓజా చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేçష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల చేతుల మీదుగా విజయవాడ తిమ్మంపల్లి క్షేత్రంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఆన్‌లైన్ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా వీక్షించడానికి ఎల్‌ఈడీ ప్రొజెక్టర్లను స్థానిక రైల్వే కమ్యూనిటీహాల్‌లో ఏర్పాటు చేశారు.
గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని గుంతకల్లు–వాడి సెక‌్షన్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారన్నారు. అదే విధంగా కడప–బెంగుళూరు ప్రాజెక్టులో భాగంగా కడప–పెండ్లమర్రి మార్గంలో నిర్మించిన కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి డెమో రైలు నిర్వహిస్తారన్నారు. ఇక గుత్తి–ధర్మవరం సెక‌్షన్‌లో డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా తిరుపతిలో 2.5 టన్నుల సామర్థ్యంతో యాంత్రీక లాండ్రి పనులను ప్రారంభిస్తారు. తిరుపతి–జమ్మూతావి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు హాజరుకావాలన్నారు.