Guntakalakal
-
అంతా ఎన్నికల స్టంటే
ఉప ఎన్నికలో గెలిచేందుకు గడ్డితినేందుకైనా చంద్రబాబు సిద్ధమే గుంతకల్లు మహాధర్నాలో చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ రఘువీర ఫైర్ గుంతకల్లు : సీఎం చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో గెలవడానికి ఎలాంటి గడ్డి తినడానికైనా, అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధంగా ఉన్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఒక్క నంద్యాల పట్టణంలోనే 13 వేల నివాస గృహాలు మంజూరు చేశారని, కరువు జిల్లా అనంతపురంలో మూడేళ్ల కాలంలో ఎన్ని పక్కాగృహాలు నిర్మించారని ప్రశ్నించారు. ఈ సమాధానమే చంద్రబాబు ఎన్నికల స్టంట్‌ను బహిర్గతం చేస్తుందని ఎద్దేవా చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్లులో మహాధర్నా నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అజంతా సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ ఇన్చార్జి దౌల్తాపురం ప్రభాకర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రమణ, మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని పంటలకు ఫసల్ బీమా పథకాన్ని వర్తింపజేస్తుంటే అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఈ మూడేళ్ల కాలంలో 250కి పైగా చనిపోతే వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అర్హులైన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సాధించడానికే ఈ ధర్నా చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి గాలి మల్లికార్జున, పట్టణ అధ్యక్షుడు లక్ష్మీనారాయణయాదవ్, నాయకులు ఆలంనవాజ్, అశ్వర్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు పలు రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం
గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్లో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు గురువారం చేయనున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ మేనేజర్ ఆమితాబ్ ఓజా చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేçష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల చేతుల మీదుగా విజయవాడ తిమ్మంపల్లి క్షేత్రంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఆన్లైన్ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించడానికి ఎల్ఈడీ ప్రొజెక్టర్లను స్థానిక రైల్వే కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేశారు. గుంతకల్లు రైల్వే డివిజన్లోని గుంతకల్లు–వాడి సెక్షన్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారన్నారు. అదే విధంగా కడప–బెంగుళూరు ప్రాజెక్టులో భాగంగా కడప–పెండ్లమర్రి మార్గంలో నిర్మించిన కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి డెమో రైలు నిర్వహిస్తారన్నారు. ఇక గుత్తి–ధర్మవరం సెక్షన్లో డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా తిరుపతిలో 2.5 టన్నుల సామర్థ్యంతో యాంత్రీక లాండ్రి పనులను ప్రారంభిస్తారు. తిరుపతి–జమ్మూతావి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు హాజరుకావాలన్నారు. -
మీ ఇంట్లో వారికి జరిగితే.. అలాగే చేస్తారా?
వైటీచెరువు ఘటన సమయంలో సహాయక చర్యలపై కలెక్టర్ అసంతృప్తి అనుమతి లేకుండా జిల్లా దాటితే చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్ అనంతపురం సెంట్రల్ : ‘గుంతకల్లు మండలం వైటీచెరువులో తెప్ప ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విజయవాడ నుంచి రోడ్డుమార్గం గుండా హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చా. వీవీఐపీలు కూడా చేరుకున్నారు. కానీ జిల్లా అధికారులు మాత్రం అందుబాటులో లేరు. ఇక నుంచి నా అనుమతి లేకుండా జిల్లా దాటిపోయారంటే చర్యలు తప్పవు’ అని కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా ఉన్నతాధికారులతోను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలస్థాయి అధికారులతోను కలెక్టర్ మాట్లాడారు. వైటీచెరువు ప్రమాదం తర్వాత మృతదేహాలను ట్రాక్టర్ ట్రాలీలో తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మీ కుటుంబీకులకు జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా? మృతదేహాలను కుప్పగా పోసి తీసుకెళ్లడమేంటి’ అని ప్రశ్నించారు. వాహనాలను సమకూర్చాల్సిన రోడ్డు, రవాణాశాఖ అధికారులు పత్తా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరవాణా కమిషనర్ సెలవులో ఉంటే ఇన్చార్జ్గా వ్యవహరించాల్సిన అధికారులు పట్టించుకోలేదన్నారు. జీవించి ఉన్నప్పుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా జనం బాగోగులు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని స్పష్టం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తన అనుమతి లేనిదే సెలవుపై వెళ్లడానికి వీల్లేదన్నారు. ‘జిల్లా యంత్రాంగం ఫెయిల్యూర్’ అనే పదం వినిపించకూడదన్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంలో వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు అధికారులు బాగా పనిచేశారని అభినందించారు. ప్రజల్లో నమ్మకం కలిగించేలా పనిచేయాలి అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. వందకు పైగా అర్జీలు పెండింగ్ ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ అర్జీల వివరాలు తెలియవని కొంతమంది అధికారులు చెప్పడంతో.. ‘మీపై నమ్మకం లేకపోవడంతోనే సీఎం కార్యాలయం వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన అర్జీలే పరిష్కరించకపోతే మిగిలినవి ఏ విధంగా పరిష్కరిస్తారో అర్థమవుతోంద’ని అన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని, ప్రజల్లో నమ్మకం కలిగించేలా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌కలెక్టర్ –2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, ఇన్చార్జ్ డీఆర్వో రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.