సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బస్టాండ్లలో టీఎస్‌ఆర్టీసీ బస్సులను నియంత్రిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ కొత్త వివాదానికి తెరలేపింది. రెండు రాష్ట్రాల మధ్య తిరిగే ఏపీ బస్సు పర్మిట్లు తగ్గిపోతున్నాయన్న కారణంతో.. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం వంటి ముఖ్యమైన బస్టాండ్లలోకి వచ్చే తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు విధిస్తోంది.
ఇప్పటివరకు తెలంగాణ బస్సులు నిలిచే ప్లాట్‌ఫామ్స్‌లోకి వాటిని అనుమతించకపోవటం, దూరంగా ఉన్న ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో నిలపాలని ఆదేశించటం, హైదరాబాద్‌కు వెళ్లే ఏపీ బస్సులను ముందు పంపి తర్వాత తెలంగాణ బస్సులను అనుమతించటం వంటి చర్యలను ఏపీ ఆర్టీసీ సిబ్బంది చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చే టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
ఆ బస్సులు ఎక్కడ నిలుస్తున్నాయో ప్రయాణికులకు తెలియకపోవటంతో వాటిలో సీట్లు నిండటం లేదు. ఫలితంగా వారం రోజుల నుంచి తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు పెరిగాయి. విషయాన్ని సిబ్బంది ఎప్పటికప్పుడు డిపో మేనేజర్లకు బస్‌భవన్‌లోని ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఆర్టీసీ అధికారులు విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సమస్యను పరిష్కరిస్తామని అక్కడి అధికారులు హామీ ఇచ్చారు.
భారీగా పెరిగిన తెలంగాణ సర్వీసులు
ఆర్టీసీ విభజన సమయంలో రెండు సంస్థల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల్లో భారీ వ్యత్యాసం ఉండేది. తెలంగాణ కంటే ఏపీ బస్సులు 2.35 లక్షల కిలోమీటర్ల మేర అదనంగా తిరిగేవి. దీంతో టీఎస్‌ఆర్టీసీ క్రమంగా ఏపీకి ప్రస్తుతం 185 వరకు సర్వీసులు పెంచింది. కిలోమీటర్ల వ్యత్యాసం భారీగా తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ కంటే ఏపీ బస్సులు 80 వేల కి.మీ. అదనంగా తిరుగుతున్నాయి.
మరో 120 బస్సులు ప్రారంభించేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నందున త్వరలో ఈ వ్యత్యాసం కూడా తగ్గనుంది. దీనివల్ల టీఎస్‌ఆర్టీసీకి రోజుకు రూ.70 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇక విజయవాడ వరకే తిరుగుతున్న సర్వీసుల్లో కొన్నింటిని సమీపంలోని పట్టణాలకు పొడిగిస్తున్నారు. విజయవాడ బస్టాండ్ ఇరుగ్గా మారటం కూడా ఈ నిర్ణయానికి కారణం.
విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు మార్గాల్లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. దీంతో సమీపంలోని పట్టణాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు ఆయా పట్టణాల్లోనే ఎక్కుతున్నారు. ఇది కూడా ఏపీ సిబ్బందికి కంటగింపుగా తయారైందని టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment