-
నేడు బోర్డు ముందుకు నివేదిక
-
హైదరాబాద్‌లోని ఆస్తులపై కొనసాగుతున్న వివాదం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) విభజనకు రంగం సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆర్టీసీ ఆస్తులు, అప్పుల్లో జరిపే కేటాయింపులకు సంబంధించిన ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. గురువారం జరగనున్న ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తుది నివేదికకు ఆమోదముద్ర వేసి గవర్నరుకు పంపనున్నారు. ఆరుగురు సభ్యుల ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఈ కసరత్తును పూర్తి చేసింది. బస్సుల సంఖ్య, జోన్లు, డివిజన్ల సంఖ్య, మంజూరైన పోస్టుల సంఖ్య ఆధారంగా సిబ్బంది, అధికారుల సంఖ్య లాంటివి మినహా.. ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందనున్నందున వాటి వివరాలను ప్రత్యేకంగా నివేదికలో పొందుపరచలేదు.
అయితే పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లోని ఆస్తుల వివరాలను మాత్రం ప్రస్తావించారు. ఇప్పటికే విభజనకు సంబంధించి అధికారికంగా ఖరారు చేసిన నిష్పత్తి ఆధారంగా సిబ్బంది పంపకం, ఇతర ఆదాయాలు, అప్పులపై స్పష్టత ఇచ్చారు. వాటి ఆధారంగానే ఉమ్మడి ఆస్తులను పంపకం చేయాలని పేర్కొన్నారు. ఆస్తులు, అప్పులను రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 53(1) ప్రకారం విభజిస్తున్నట్టు అందులో స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించిన గడువుకనుగుణంగా ఫైళ్ల విభజన, డిజిటలైజేషన్ పూర్తి చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం సిబ్బంది కేటాయింపు జరిగిందని పేర్కొన్న కమిటీ.. జిల్లా, జోనల్ స్థాయివి కాకుండా రాష్ట్రస్థాయి పోస్టుల్లోని అధికారులను 13:10 నిష్పత్తిలో విభజించినట్టు తెలిపింది.
నివేదికలోని వివరాలు
రవాణా సంస్థ ప్రధాన పరిపాలన భవనం అయిన బస్‌భవన్‌ను రెండుగా విభజించారు. ఇందులోని ‘ఎ’వింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థకు, ప్రస్తుతం ఎండీ, ఇతర ఉన్నతాధికారులు ఉంటున్న ‘బి’ వింగ్‌ను తెలంగాణ రవాణాసంస్థకు కేటాయించారు.
తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, ట్రాన్స్‌పోర్టు అకాడమీ, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపం, బ్యాంకు, ఎటీఎంలను ఉమ్మడి ఆస్తులుగా పరిగణిస్తూ రెండుగా విభజించారు.
రెండుగా విభజించే వీలులేని ఉమ్మడి ఆస్తులుగా ఆసుపత్రి రేడియాలజీ విభాగం, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్, మియాపూర్‌లోని బస్‌బాడీ ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాపు, ప్రింటింగ్‌ప్రెస్, ఓపీఆర్‌ఎస్, సీఐఎస్, వీటీఎస్ ఐటీ సేవల వ్యవస్థలను, అనంతపూర్‌లోని విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను గుర్తించారు. అంటే వీటిపై జనాభా సంఖ్య ఆధారంగా రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందన్నమాట.
ఎంవీ ట్యాక్స్ రీయింబర్స్‌మెంట్, బకాయిలు, అంతర్‌రాష్ట్ర రవాణాసంస్థలతో ఉన్న ఒప్పందాలకు సంబంధించి జూన్ 2లోపు రెండు రాష్ట్రాల మధ్య సర్దుబాటు చేయాల్సి ఉంది.
అయితే ఈ విభజన ప్రాతిపదికలపై తెలంగాణ ప్రాంత అధికారులు, సిబ్బంది, కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులను ఆ ప్రాంతానికి కేటాయించినపుడు.. తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్‌లోని ఆస్తులపై, నిజాం కాలంలో సంక్రమించిన ఆస్తులపై సీమాంధ్రకు హక్కు ఉండదని వారు వాదిస్తున్నారు. తమ అభ్యంతరాలు పట్టించుకోకుంటే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. దీనిపై సీమాంధ్ర సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రాంతాల ఆదాయంతో సమకూర్చుకున్న ఆస్తులపై జనాభా ప్రాతిపదికన వాటా ఉండాల్సిందేనని వారంటున్నారు.
అయితే పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లోని ఆస్తులకు సంబంధించిన వివరాలను మాత్రం అందులో ప్రస్తావించారు. ఇంతకాలం ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడిగా వినియోగించుకుంటున్న ఆస్తులను విభజించాల్సి ఉన్నందున వాటి వివరాలను ఇందులో స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులకు డీఏ ఇవ్వండి: ఎన్‌ఎంయూ
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ కార్మికులకు కూడా 8.1 శాతం చొప్పున కరువు భత్యాన్ని అందజేయాలని ఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి మహమూద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కరువు భత్యాన్ని ఈ నెల వేతనంతో అందజేయాలని, దీనిని జనవరి నుంచి వర్తింపచేయాల్సి ఉన్నందున ఆ బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు డీఏ చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని మరో కార్మిక నేత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.