14 నుంచి ‘ఎక్కడి వారక్కడే’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తాత్కాలిక విభజనలో భాగంగా అధికారులు, సిబ్బంది ఏ రాష్ట్రానికి చెంది న వారు ఆ రాష్ట్రానికే వెళ్లేలా చేసిన కేటాయింపులు వచ్చే నెల 14 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సంస్థ ఎండీ సాంబశివరావు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, డిపో మేనేజర్ స్థాయి అధికారులు, జూనియర్ స్కేల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని స్థానికత ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య కేటాయించారు. ఆ తర్వాత వారి నుంచి ఆప్షన్లు కోరారు. ఇందుకు ఈ నెల 30 వర కు గడువును పొడిగించారు. ఆప్షన్లను పరిశీలించి తుది కేటాయింపు చేయాల్సి ఉంది. ఈ తంతును మే 14లోపు పూర్తి చేసి తుది ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ తర్వాత ఇక అధికారికంగా ఎక్కడి సిబ్బంది అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకుబస్‌భవన్ విభజన ఇప్పటికే పూర్తయింది. ‘ఎ’ బ్లాక్ ను ఏపీకి, ‘బి’ బ్లాక్‌ను తెలంగాణకు కేటాయించా రు. అందుకు వీలుగా మార్పుచేర్పులు చేశారు. ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని రూ.1.85 కోట్లతో ఆధునీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల విభజన, బస్సు పర్మిట్ల కేటాయింపు తదితరాలకు సంబంధించి వివాదాలు ఉండటంతో ప్రస్తుతానికి వాటిని పక్కనపెట్టారు.
కమలనాథన్ కమిటీ విధివిధానాలతోనే..
కమలనాథన్ కమిటీ జారీ చేసిన విధివిధానాలనే ఆర్టీసీ అనుసరిస్తోంది. అయితే అవి ఆర్టీసీకి వర్తించవని రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు పేర్కొనడంతో ‘కమలనాథన్ కమిటీ’ పేరుతో కాకుండా, వాటినే ఆర్టీసీ ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులుగా మార్చి అమలు చేస్తున్నారు. ఆప్షన్లకు అవకాశం ఇవ్వడం కూడా అందులో భాగమే. అయితే ఆప్షన్ల పరిగణనకు ప్రాతిపదికలు ఏమిటనే విషయంలో ఎండీ సాంబశివరావు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. వాటిని వెల్లడించ కపోవడంతో తెలంగాణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి చెందిన అధికారులను తెలంగాణకు కేటాయిస్తే వారికి సహకరించబోమని తేల్చిచెప్పారు.