శుక్రవారం ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
వేసవి తాకిడి ప్రారంభం
ఇంకా ప్రత్యేక బస్సులపై దృష్టి సారించని ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్ : స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలకు రద్దీ మొదలైంది. సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు బయ లుదేరిన నగరవాసులతో శుక్రవారం రైళ్లు,బస్సులు కిటకిటలాడాయి. దీంతో ప్రైవేటు ఆపరేటర్ల హవా పెరిగింది. వారు రెండు రాష్ట్రాల్లో రవాణా పన్ను అనివార్యమైన నేపథ్యంలో ఇప్పటికే చార్జీల మోత మోగిస్తున్నారు. ఇక వేసవి సాకుతో రెండింతలు చేశాయి. విశాఖ, కాకినాడ,తదితర దూరప్రాంతాలకు ఏసీ బస్సుల్లో రూ.1000 నుంచి రూ.1200 తీసుకొనే ఆపరేటర్లు ప్రస్తుతం రూ.2000 నుంచి రూ.2500కు పెంచారు. విజయవాడ, తిరుపతి, బెంగళూర్ మార్గాల్లోనూ చార్జీలు రెట్టింపు చేసి ప్రయాణికులపై నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.
ఒక్కరోజే 4లక్షల మందికి పైగా..
సికింద్రాబాద్,నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లతో పాటు, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లోనూ రద్దీ నెలకొంది. జనరల్ బోగీలు సైతం కిక్కిరిసాయి. సాధారణ రోజుల్లో నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్‌ల నుంచి సుమారు 3.5 లక్షల మంది తరలి వెళ్లగా వేసవి రద్దీతో శుక్రవారం ఒక్కరోజే మరో 50 వేల మంది అదనంగా బయలుదేరినట్లు సమాచా రం. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్,మే,జూన్ నాలుగు నెలలను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే సుమారు 350 సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వీ టిలో అధికం వారాంతపు రైళ్లే . దీంతో రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 దాటింది.
రైళ్లు పెంచడమే పరిష్కారం...
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ 80 కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ,వందకు పైగా ప్యాసింజర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. నగరం నుంచి విజయవాడ,విశాఖ,కాకినాడ,తిరుపతి,షిరిడీ, బెంగళూరు, గోవా, ముంబై, ఢిల్లీ,చెన్నై, తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్, బెంగళూర్, షిరిడీ సాయినగర్ ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లలో డిమాండ్ అనూహ్యంగా ఉంది. తక్షణ పరిష్కారం అదనపు రైళ్లేనని ప్రయాణికులు భావిస్తున్నారు.
పత్తా లేని ప్రత్యేక బస్సులు...
ప్రతి సంవత్సరం వేసవి ప్రారంభం కాగానే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే ఆర్టీసీ ఈ ఏడాది మే నెలవచ్చినా ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయలేదు. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే సుమారు 1500 బస్సులు కాకుండా, వేసవి డిమాండ్ దృష్ట్యా మార్చి నాటికే ప్రత్యేక బస్సుల వివరాలను వెల్లడిస్తారు. ఈ సారి అలాంటి ఏర్పాట్లు లేవు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, బెంగళూరు, అమలాపురం, రాజమండ్రి, తదితర ప్రాంతాలకు డిమాండ్ బాగా పెరిగింది. గురువారం 200 బస్సులు అదనంగా ఏర్పాటు చేశారు. శుక్రవారం మరో 150 బస్సులు అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. రైళ్లలో రిజర్వేషన్‌లు లభించని ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు.