ఆర్టీసీ ‘కార్గో’ రూట్!
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీ.. రైల్వేలను అనుసరించే దిశగా అడుగులేస్తోంది. ప్రయాణికుల చేరవేతతో నష్టాలు చవిచూస్తున్న రైల్వే సరుకు రవాణాతో భారీ లాభాలను పొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ కూడా ఇదే బాటలో సాగే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకున్న ఈ సంస్థ.. గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు పలు ప్రయత్నాలు చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రూ. 250 కోట్ల గ్రాంటును ప్రకటించగా, ఏపీ ప్రభుత్వం అంతే మొత్తం ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ ప్రభుత్వ సాయం తాత్కాలికమే అయినందున ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మూడేళ్లక్రితం అప్పటి ప్రభుత్వం అంగీకరించిన సరుకు రవాణా అంశాన్ని మళ్లీ పరిశీలించాలనే ఒత్తిడి ఆర్టీసీపై పెరిగింది. ఇలాగే నష్టాలు పెరుగుతుంటే ఆర్టీసీని ప్రైవేటీకరించక తప్పని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముందని కార్మిక సంఘాలు ఆందోళనలో ఉన్నాయి. అం దుకే వెంటనే ఆర్టీసీలో కార్గో విభాగాన్ని ప్రారంభించాలంటూ ఆ సంఘాలు తాజాగా ఉన్నతాధికారులకు నివేదించాయి. దీని సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీని నియమించి, వీలైనంత త్వరగా నివేదిక తెప్పించుకోవాలని కోరాయి.
పాత బస్సులను వినియోగించొచ్చు..
ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు ఐదు వేల వరకు పాత బస్సులున్నాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంతోపాటు సొంత వనరులతో సంస్థకు కొత్త బస్సులు సమకూరుతున్నందున.. పాత వాటిని సరుకు రవాణాకు ఉపయోగించుకోవచ్చుననే సూచనలు వస్తున్నాయి. కొంత కుదురుకోగానే భారీ సరుకు రవాణాకు ప్రత్యేక వాహనాలను సమీకరించుకోవచ్చని ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు. అయితే గతంలోనే ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించినా.. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సరుకు రవాణా సాధ్యం కాదన్న వాదన వినిపించింది. కానీ ప్రస్తుతమున్న ఆర్థిక సమస్యల దృష్ట్యా ఈ అంశాన్ని మరోసారి పరిశీలించే అవకాశం కనిపిస్తోంది.
ఏటా వెయ్యి కోట్లకుపైగా రాబడి
రైల్వే ఆదాయంలో 80 శాతం సరుకు రవాణా ద్వారానే వస్తోంది. దీంతో ఈ విభాగాన్ని పటిష్టం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇదే తరహాలో ఆర్టీసీలో సరుకు రవాణాను ప్రారంభిస్తే ఐదారేళ్లలో నష్టాలను పూడ్చుకుని లాభాల బాట పట్టే అవకాశముందని నిపుణులు ఇచ్చిన సూచనలను కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో బొగ్గు, సిమెంటు, ఎరువులు వంటి వాటితో పాటు సాధారణ సరుకు రవాణాకు పుష్కలంగా డిమాండ్ ఉందని పేర్కొంటున్నాయి. సరుకు రవాణాతో వార్షికంగా రూ. వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా ఆదాయం ఉంటుందని గతంలో జరిపిన అధ్యయనం లెక్కలను పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి ఏటా రూ. 300 కోట్లు లాభం ఉంటుందని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.