cargo service
-
మస్త్ పైసల్!...లాభాల బాటలో మెదక్ డిపో
మెదక్‌జోన్ : మెదక్ ఆర్టీసీ డిపో లాభాల బాటలో దూసుకుపోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ముందంజలో ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఙాపూర్, దుబ్బాక డిపోలు ఉన్నాయి. వాటిలో ఆదాయం రాబట్టడంలో మెదక్ ప్రథమ స్థానంలో ఉంది. ● మెదక్ డిపోలో మొత్తం 98 బస్సులు ఉన్నాయి. వాటిలో 66 ప్రైవేట్ బస్సులు, 35 ఆర్టీసీ సంస్థకు చెందినవి ఉన్నాయి. వీటిలో 8 ఎక్స్‌ప్రెస్, 10 డీలక్స్, 2 సూపర్ లగ్జరీలు ఉండగా, మిగతావి ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. ● ఈ బస్సులు నిత్యం 35,180 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా 36, 800 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నాయి. లెక్కల ప్రకారం తిరగాల్సిన దానికన్న 1,620 కిలోమీటర్లు అదనంగా తిరుగుతున్నాయి. దీంతో రోజుకు రూ.15 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా రూ.16.50 లక్షల ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ● ఈ లెక్కన మెదక్ డిపోకు నెలకు రూ.4.50 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, ఏకంగా రూ.4.95 కోట్లు వస్తుంది. అంటే నెలకు రూ.45లక్షలు అదనంగా ఇన్‌కం వస్తుంది. అలాగే ఇందుకు భిన్నంగా గత ఏప్రిల్, మే నెలల్లో ఏకంగా రూ.11.45 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో ఆర్టీసీకి అదనంగా కోటి రూపాయల ఆదాయం రావడం ఉమ్మడి జిల్లాలోనే రికార్డుగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఆదాయం సమకూరే రూట్లు ఇవే.. మెదక్ జిల్లాలో మెదక్ డిపోతో పాటు పాతబస్టాండ్, రామాయంపేట బస్టాండ్, కౌడిపల్లి బస్టాండ్, చేగుంట, నర్సాపూర్ డిపోలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మెదక్ –జేబీఎస్, మెదక్– పటాన్చెరువు, మెదక్– సిద్దిపేట రూట్లలో అధిక ఆదాయం వస్తుంది. అలాగే పాత బస్సుల స్థానంలో 8 కొత్త బస్సులను వేశారు. అందులో 2 సూపర్ లగ్జరీ, 6 డీలక్స్ బస్సులు ఉన్నాయి. బీదర్‌తో పాటు కర్నూల్, తిరుపతి ప్రాంతాలకు నిత్యం మెదక్ డిపో నుంచి బస్సులను నడుపుతున్నారు. ఆర్టీసీ అందిస్తున్న సబ్సిడీలు ఆర్టీసీ పలు రకాల సబ్సిడీలు అందిస్తుంది. ప్రధానంగా డయాలసిస్ పేషెంట్లకు, జర్నలిస్టులకు ఫ్రీబస్ పాస్‌తో పాటు 80 శాతం సబ్సిడీపై విద్యార్థులకు బస్ పాస్‌లను అందిస్తోంది. అలాగే బస్సులో ప్రయాణిస్తుండగా ఏదేని ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి పరిహారం కూడా ఇస్తారు. కార్గోతో ఆదాయం 2020లో ప్రవేశ పెట్టిన కార్గో సర్వీస్ ద్వారా ఆర్టీసీ ఆర్థికంగా పుంజుకుందని చెప్పవచ్చు. ఈ సర్వీస్‌కు ప్రజలు త్వరగా కనెక్టు అయ్యారు. ఏదేని వస్తువును పంపాలన్నా, ఉత్తరాల నుంచి మొదలుకుని వస్తువుల వరకు త్వరగా చేరవేయటంలో కార్గో సక్సెస్ అయ్యింది. ప్రయాణంలో ఆర్టీసీ ఎంత సురక్షితమో వస్తు రవాణాలో కార్గో కూడా అంతే సుక్షితమనే భావనను ప్రజల్లో కలిగించింది. కొత్త విధానాలతో మార్పు ఆర్టీసీ సంస్థ అమలు చేస్తున్న కొత్త విధానాలతో ప్రజలకు మరింత చేరువైంది. ఆర్టీసీ బస్ ఆఫీసర్ పేరుతో గ్రామానికో వ్యక్తిని నియమించారు. గ్రామాల్లో ఎవరికై నా పెళ్లి బస్సులు కావాలన్నా, ఆయా గ్రామాల్లో పండగలు, జాతరలు జరిగే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపటం, ప్రైవేట్ వాహనాలతో పోల్చుకుంటే ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమైనదిగా ప్రజలకు అవగాహన కలిపించటం వీరి విధి నిర్వహణ. ఇలాంటి నిర్ణయాలతో ఒకప్పుడు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లాతో పోల్చితే మెదక్ డిపో లాభాల బాటలో నడుస్తోంది. లాభాల బాటలో.. మెదక్ ఆర్టీసీ డిపో లాభాల బాటలో నడుస్తోంది. నా తోటి ఉద్యోగులతో పాటు కార్మికుల సమష్టి కృషి ఫలితంగానే డిపోను ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఆదాయంలో ముందంజలో ఉంచాం. అందరి సహకారంతో ఇలాగే అధిక లాభాలు గడిస్తాం –రవిచందర్, డీఎం, మెదక్ -
Telangana: బస్సుల్లో లగేజీ చార్జీలను భారీఎత్తున పెంచిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ప్రయాణికుల లగేజీపై దృష్టి సారించింది. బస్సుల్లో తరలించే సామగ్రిపై విధించే చార్జీలను భారీఎత్తున పెంచేసింది. పల్లె వెలుగు బస్సుల్లో 25 కి.మీ. దూరానికి ఇప్పటివరకు ఉన్న రూపాయి చార్జీని ఏకంగా రూ.20కి పెంచింది. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో ఇదే దూరానికి ఉన్న రూ.2 చార్జీని రూ.50కి పెంచింది. సిటీ బస్సుల్ని కూడా వదలకుండా పాత చార్జీలతో పోల్చుకుంటే పెద్దమొత్తంలో చార్జీలు వసూలు చేయనుంది. కొత్త చార్జీలను ఈ నెల 22 నుంచే అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2002 నాటి చార్జీలే ఇప్పటివరకు.. బస్సుల్లో లగేజీ చార్జీలు 2002లో ఖరారు చేసినవే ఇప్పటికీ అమలవుతున్నాయి. అప్పటి నామమాత్రపు రుసుములే కొనసాగుతున్నాయి. 2002 తర్వాత పలుమార్లు టికెట్ చార్జీలు పెరిగినా లగేజీ చార్జీలను మాత్రం సవరించలేదు. ఇటీవల నష్టాలను పూడ్చుకునేందుకు డీజిల్ సెస్ విధింపు, ఆ వెంటనే దాని సవరింపుతో టికెట్ రూపంలో ఆదాయాన్ని భారీగా పెంచుకున్న ఆర్టీసీ..తాజాగా లగేజీ చార్జీలను పెంచడంతో పాటు పకడ్బందీగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంతకాలం ఇవి రూపాయి, రెండు రూపాయలు.. ఇలా మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆర్టీసీ సరుకు రవాణా (కార్గో) చార్జీలకు దాదాపు సమంగా పెంచేసింది. ఒక్కో బస్సులో గరిష్ట లగేజీ పరిమితి ఇలా.. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ 750 కిలోలు సూపర్ లగ్జరీ 1,000 కిలోలు 50 కిలోలు మించితే బాదుడే.. ఒక్కో ప్రయాణికుడు/ప్రయాణికురాలు తమ వెంట 50 కిలోల బరువుండే సామగ్రిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అంతకంటే మించి ఉండే సామగ్రిపై చార్జీలు విధిస్తారు. 25 కిలోల వరకు బరువును ఓ యూనిట్‌గా పరిగణిస్తారు. అంటే ఉచిత పరిమితికి మించి ఒక కిలో ఎక్కువున్నా సరే, దాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించి చార్జీ వడ్డిస్తారు. 25 కిలోల కంటే ఒక కిలో ఎక్కువున్నా..దాన్ని రెండో యూనిట్‌గా పరిగణించి చార్జీ విధిస్తారు. ఆ మేరకు చార్జీలు నిర్ధారించారు. పల్లె వెలుగులో అయితే ప్రతి 25 కి.మీ చొప్పున, ఎక్స్‌ప్రెస్, ఆ పై కేటగిరీలో ప్రతి 50 కి.మీ చొప్పున చార్జీ మారుతుంది. మూడు ప్యాకెట్లు మించకూడదు! ►ప్రయాణికుడు ఉచితంగా తీసుకెళ్లే 50 కిలోల బరువు కూడా మూడు ప్యాకెట్ల (బ్యాగులు, సూట్‌కేసులు వగైరా)కు మించి ఉండకూడదు. ►ప్రతి ప్యాకెట్ 20 కిలోల బరువు మించి ఉండకూడదు. ఒకవేళ ఉచిత పరిమితిలోపు ఉండే బరువు మూడు ప్యాక్‌లకు మించితే అదనపు ప్యాక్‌లపై చార్జీ విధిస్తారు. ►ఒక్కో ప్రయాణికుడు వంద కిలోలకు మించిన బరువును తీసుకెళ్లరాదు. వంద కిలోల్లో 50 ఉచితం కాగా, మిగతాది చార్జీ పరిధిలోకి వస్తుంది. ►చార్జీ విధించే 50 కిలోల బరువు రెండు ప్యాకెట్లలో మాత్రమే ఉండాలి. మూడో ప్యాక్ ఉంటే దాన్ని అదనపు యూనిట్‌గా భావించి అదనపు చార్జీ విధిస్తారు. ►100 కిలోలకు మించి బరువు ఉంటే ప్రయాణికుల బస్సుల్లో అనుమతించరు. కార్గో బస్సుల్లోనే తరలించాలి. జంతువుల తరలింపు అనుమతించరు ►బస్సుల్లో నిషేధిత వస్తువులు, అగ్ని ప్రమాదాలకు కారణమయ్యేవి, అటవీ సంబంధిత వస్తువులు, పెంపుడు జంతువులు సహా ఏ జంతువులనూ అనుమతించరు. ►భారీ వస్తువులు, పాడయ్యే వస్తువులకు రెట్టింపు చార్జీ విధిస్తారు. ట్రక్ టైర్‌ను మూడు యూనిట్లుగా పరిగణిస్తారు. టీవీ, రిఫ్రిజరేటర్, సైకిల్, ఫిల్మ్ బాక్స్ (ప్యాక్డ్), వాషింగ్ మెషీన్, కార్ టైర్.. వీటిని రెండు యూనిట్లుగా పరిగణిస్తారు. ►చాలాచోట్ల కూరగాయలు, పాలు, పండ్లను ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారు. ఇప్పుడు అలాంటి రైతులు భారీగా చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దుర్వినియోగం అరికట్టేందుకు.. ఆర్టీసీకి సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా కార్గో బస్సులున్నాయి. కానీ కొంతమంది కార్గో చార్జీలను తప్పించుకునేందుకు సరుకును ప్రయాణికుల బస్సుల్లో తరలిస్తున్నారు. వీటి చార్జీ నామమాత్రంగా ఉండటంతో, డ్రైవర్/కండక్టర్లకు కొంత మొత్తం ముట్టచెప్పి సరుకు తరలిస్తున్నారు. దీంతో ఆర్టీసీ నష్టపోతోంది. దీన్ని నివారించేందుకు ఈ చార్జీలను పెంచినట్టు ఆర్టీసీ పేర్కొంటోంది. -
మామిడితో కాసులు.. ఆర్టీసీకి ఏ దిల్ ‘మ్యాంగో’ మోర్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీకి మామిడి కాసులు తెచ్చి పెడుతోంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు మామిడి కాయలు/పండ్లను పార్శిల్ ద్వారా పంపే వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్టీసీ కార్గో, కొరియర్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటికి డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పించడంతో మంచి ఆదరణ లభిస్తోంది. పార్శిల్ బుక్ చేసిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని నిర్దేశిత ప్రాంతాలకు సరకును అందజేస్తోంది. ఇది వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. చదవండి: కేశినేని కుటుంబంలో కుంపటి! మామిడికి ప్రత్యేక కౌంటర్.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్)లో కార్గో బుకింగ్ కౌంటర్ అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం నుంచి మామిడి సీజను మొదలైంది. మామిడిని పార్శిల్ ద్వారా పంపే వారి కోసం ప్రత్యేకంగా పీఎన్ బస్టాండులోని 60వ నంబరు ప్లాట్‌ఫాం వద్ద కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక ర్యాక్‌లను కూడా అమర్చారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే మ్యాంగో బాక్సుల డెలివరీకి 57వ నంబరు ప్లాట్‌ఫాం వద్ద మరో ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కార్గో బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు వేగంగా పార్శిళ్లను బుక్ చేసుకునే వీలుంటోంది. ఇలా ఈ మ్యాంగో బుకింగ్ కౌంటర్లో నెలకు 600 నుంచి 800 వరకు బాక్సులు/పార్శిళ్లు బుక్ అవుతున్నాయి. గతేడాది కంటే మిన్నగా.. గత ఏడాది ఏప్రిల్‌లో 400 మ్యాంగో పార్శిళ్లు, మే నెలలో 600, జూన్‌లో 600 చొప్పున పీఎన్ బస్టాండు నుంచి వేర్వేరు ప్రాంతాలకు బుక్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 600, మే నెలలో ఇప్పటివరకు 800 వరకు పార్శిళ్లను పంపించారు. అంటే గత ఏడాదికంటే ఈ సీజనులో మామిడి పండ్ల/కాయల పార్శిళ్ల సంఖ్య పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆర్టీసీ ఒక్కో బాక్సుకు (5–15 కిలోల బరువు వరకు) రూ.100–120 వరకు రవాణా చార్జీ వసూలు చేస్తోంది. ఈ లెక్కన మామిడి రవాణా ద్వారా ఏప్రిల్‌లో రూ.60 వేలు, మే నెలలో (ఇప్పటి దాకా) రూ.80 వేల వరకు కార్గో ఆదాయం సమకూరింది. జూన్‌లోనూ 800 వరకు మ్యాంగో పార్శిళ్లు బుక్ అవుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, విశాఖలకు అధికం.. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నంలకు అధికంగా మ్యాంగో పార్శిళ్లు బుక్ చేస్తున్నారు. ఆ తర్వాత తిరుపతి, రాజమండ్రిలకు బుక్ అవుతున్నాయని ఆర్టీసీ కార్గో విభాగం అధికారులు చెబుతున్నారు. ఒకే వినియోగదారుడు నాలుగైదుసార్లు పార్శిళ్లను పంపుతున్న వారు కూడా ఉంటున్నారని వివరిస్తున్నారు. మామిడి తర్వాత.. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు కార్గో రవాణాలో మామిడి తర్వాత మందులు, ఫ్యాన్సీ సరుకులు, వ్రస్తాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, పుస్తకాలు వంటివి ఉంటున్నాయి. ఇలా వీటి ద్వారా విజయవాడ కార్గో కౌంటర్‌కు రోజుకు రూ.2.50 నుంచి 3 లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని ఆర్టీసీ కార్గో విభాగం డెప్యూటీ సీటీఎం (కమర్షియల్) రాజశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు. డోర్ డెలివరీ కూడా.. మరోవైపు పది కిలోమీటర్లలోపు డోర్ డెలివరీకి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఇది కూడా వినియోగదారులకు వెసులుబాటుగా ఉంటోంది. బుక్ చేసిన సరకును వెళ్లి తీసుకురావడానికి సమయాన్ని వెచ్చించడంతో పాటు ఆటో, బస్సు, వాహన చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. డోర్ డెలివరీ వెసులుబాటు ఉండడం వల్ల వీరికి డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. దీంతో పలువురు ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. విడిపించని సరకులకు నేడు వేలం.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పార్శిళ్లను కొంతమంది విడిపించుకోరు. అలాంటి వాటిని ఆర్టీసీ అధికారులు కొన్నాళ్ల పాటు వేచి చూసి ఎవరూ రాకపోతే వేలం వేస్తుంటారు. ఇలా పీఎన్ బస్టాండులో 2–3 నెలలుగా విడిపించుకోని 80 వరకు పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో మందులు, దుస్తులు, స్టేషనరీ, స్పేర్ పార్టులు వంటివి ఉన్నట్టు గుర్తించారు. వీటికి శనివారం ఉదయం 11 గంటల నుంచి వేలం వేస్తామని పార్శిల్ విభాగం అధికారులు తెలిపారు. -
ఇళ్లకే రామయ్య కల్యాణ తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలి బుకింగ్ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది. బుక్ చేసుకున్నవారు రూ.80 చెల్లించాలి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉంటుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్ చేసుకున్నారు. మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు. -
కల్లం వద్దకు కార్గో బస్సు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల రవాణా తీరు మారిపోయింది. బండ్లు పోయి బస్సులొ చ్చాయి. కల్లాల వద్ద కార్గో బస్సులు దర్శనమిస్తున్నాయి. కల్లాల నుంచి ఇళ్లకు వరి ధాన్యం తరలించడానికి ఇదివరకు ఎడ్లబండ్లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో కార్గో బస్సులు వచ్చాయి. కల్లంలో ఒడ్లు సిద్ధం కాగానే వాటిని ఎడ్లబండి మీద ఇంటికి తీసుకెళ్లేవారు. తర్వాత ఊరికి లారీ రాగానే రైతులంతా మళ్లీ బండ్లకెత్తుకుని లారీలోకి మార్చేవారు. లారీలు అంతగా అందుబాటులో లేని సమయంలో ధాన్యాన్ని ఎక్కడికి తీసు కెళ్లాలన్నా ఎడ్లబండ్లే దిక్కు. ఇప్పుడు ఫోన్ చేయగానే నేరుగా కల్లం వద్దకే కార్గో బస్సు వస్తోంది. ధాన్యం ఎత్తుకుని రైస్ మిల్లుకంటే మిల్లుకు, కాదు మార్కెట్‌కంటే మార్కెట్‌కు తీసుకెళ్తోంది. ప్రస్తుతం 200 ఎర్రబస్సులు రైతులసేవలో పరుగుపెడుతున్నాయి. వానభయం ఉండదు.. ఎదురుచూపు లేదు.. సాగునీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఈసారి కల్లాలు ధాన్యంతో కళకళలాడు తున్నాయి. దాదాపు కోటి మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. దీంతో పొలాల నుంచి రైస్ మిల్లులకు, మార్కెట్ యార్డులకు ధాన్యం తరలింపు పెరిగింది. రవాణావేళ వానొస్తే ధాన్యం తడిసిపోతుందే మోనన్న భయం ఇప్పుడు లేదు. స్థానిక డిపో బస్సులే కావటంతో ఆలస్యం అవుతుందన్న బెంగా లేదు. ప్రస్తుతం 150 పెద్ద బస్సులు, 50 మినీ బస్సులు కార్గో వాహనాలుగా పరుగులు పెడుతున్నాయి. అవసరానికి తగ్గట్టు మరిన్ని బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు ఇతర సరుకుల తరలింపులో బిజీగా ఉన్న ఆ బస్సులు ఇప్పుడు ధాన్యం తరలింపులో తలమునకలై ఉన్నాయి. గతంలో కనీసం 300 కి.మీ. బుక్ చేసుకోవాల్సి వచ్చేది. పైగా అప్ అండ్ డౌన్ ఛార్జీలూ భరించాల్సి ఉండేది. ఇప్పుడు 50 కి.మీ. పరిధిలో కూడా బుక్ చేసుకోవచ్చు. దీంతోపాటు కేవలం ఒకవైపు ఛార్జీ భరిస్తే సరిపోయేలా మార్చారు. 8 టన్నుల సామర్ధ్యం ఉండే బస్సు 50 కి.మీ.కు రూ.4,420, 75 కి.మీ.రూ.5,010, 100 కి.మీ. 5,600, 125 కి.మీ.రూ.6,190.. ఇలా ఛార్జీలతో అందుబాటులో ఉన్నాయి. ఇవి లారీల ఖర్చు కంటే తక్కువే అని ఆర్టీసీ చెబుతోంది. అయితే వ్యక్తిగతంగా రైతుల్లో ఇంకా ఆర్టీసీ కార్గో బస్సులపై అవగాహన రాకపోవటంతో ఆర్డర్లు తక్కువే ఉంటున్నాయి. దీంతో ఎక్కడికక్కడ డిపో మేనేజర్లు ఊళ్లలోకి బస్సులు తీసుకెళ్లి సర్పంచుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చిన్న నిడివి గల వీడియోలు రూపొందించి వాట్సాప్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో క్రమంగా రైతులు ఆర్టీసీ కార్గోకు చేరువవుతున్నారు. త్వరలో భారీ డిమాండ్: కృష్ణకాంత్, కార్గో ప్రత్యేకాధికారి ‘ఆర్టీసీ కార్గో బస్సులు రైతులకు ఎంతో ఉపయోగం. తక్కువ ఖర్చు, పూర్తి భద్రత ఉంటుంది. జవాబుదారీతనం కూడా ఉన్నందున రైతులు నష్టపోరు. ఇప్పుడిప్పుడే వారిలో అవగాహన పెరుగుతోంది. త్వరలో కార్గో బస్సులను భారీగా వినియోగించుకునే అవకాశం ఉంది’ -
ఆర్టీసీ ‘కార్గో’ రూట్!
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీ.. రైల్వేలను అనుసరించే దిశగా అడుగులేస్తోంది. ప్రయాణికుల చేరవేతతో నష్టాలు చవిచూస్తున్న రైల్వే సరుకు రవాణాతో భారీ లాభాలను పొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ కూడా ఇదే బాటలో సాగే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకున్న ఈ సంస్థ.. గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు పలు ప్రయత్నాలు చేసింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రూ. 250 కోట్ల గ్రాంటును ప్రకటించగా, ఏపీ ప్రభుత్వం అంతే మొత్తం ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ ప్రభుత్వ సాయం తాత్కాలికమే అయినందున ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మూడేళ్లక్రితం అప్పటి ప్రభుత్వం అంగీకరించిన సరుకు రవాణా అంశాన్ని మళ్లీ పరిశీలించాలనే ఒత్తిడి ఆర్టీసీపై పెరిగింది. ఇలాగే నష్టాలు పెరుగుతుంటే ఆర్టీసీని ప్రైవేటీకరించక తప్పని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముందని కార్మిక సంఘాలు ఆందోళనలో ఉన్నాయి. అం దుకే వెంటనే ఆర్టీసీలో కార్గో విభాగాన్ని ప్రారంభించాలంటూ ఆ సంఘాలు తాజాగా ఉన్నతాధికారులకు నివేదించాయి. దీని సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీని నియమించి, వీలైనంత త్వరగా నివేదిక తెప్పించుకోవాలని కోరాయి. పాత బస్సులను వినియోగించొచ్చు.. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు ఐదు వేల వరకు పాత బస్సులున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎంతోపాటు సొంత వనరులతో సంస్థకు కొత్త బస్సులు సమకూరుతున్నందున.. పాత వాటిని సరుకు రవాణాకు ఉపయోగించుకోవచ్చుననే సూచనలు వస్తున్నాయి. కొంత కుదురుకోగానే భారీ సరుకు రవాణాకు ప్రత్యేక వాహనాలను సమీకరించుకోవచ్చని ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు. అయితే గతంలోనే ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించినా.. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సరుకు రవాణా సాధ్యం కాదన్న వాదన వినిపించింది. కానీ ప్రస్తుతమున్న ఆర్థిక సమస్యల దృష్ట్యా ఈ అంశాన్ని మరోసారి పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఏటా వెయ్యి కోట్లకుపైగా రాబడి రైల్వే ఆదాయంలో 80 శాతం సరుకు రవాణా ద్వారానే వస్తోంది. దీంతో ఈ విభాగాన్ని పటిష్టం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఇదే తరహాలో ఆర్టీసీలో సరుకు రవాణాను ప్రారంభిస్తే ఐదారేళ్లలో నష్టాలను పూడ్చుకుని లాభాల బాట పట్టే అవకాశముందని నిపుణులు ఇచ్చిన సూచనలను కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో బొగ్గు, సిమెంటు, ఎరువులు వంటి వాటితో పాటు సాధారణ సరుకు రవాణాకు పుష్కలంగా డిమాండ్ ఉందని పేర్కొంటున్నాయి. సరుకు రవాణాతో వార్షికంగా రూ. వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా ఆదాయం ఉంటుందని గతంలో జరిపిన అధ్యయనం లెక్కలను పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి ఏటా రూ. 300 కోట్లు లాభం ఉంటుందని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.