మెదక్ డిపో
మెదక్‌జోన్ : మెదక్ ఆర్టీసీ డిపో లాభాల బాటలో దూసుకుపోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ముందంజలో ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఙాపూర్, దుబ్బాక డిపోలు ఉన్నాయి. వాటిలో ఆదాయం రాబట్టడంలో మెదక్ ప్రథమ స్థానంలో ఉంది.
● మెదక్ డిపోలో మొత్తం 98 బస్సులు ఉన్నాయి. వాటిలో 66 ప్రైవేట్ బస్సులు, 35 ఆర్టీసీ సంస్థకు చెందినవి ఉన్నాయి. వీటిలో 8 ఎక్స్‌ప్రెస్, 10 డీలక్స్, 2 సూపర్ లగ్జరీలు ఉండగా, మిగతావి ఆర్డినరీ బస్సులు ఉన్నాయి.
● ఈ బస్సులు నిత్యం 35,180 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా 36, 800 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నాయి. లెక్కల ప్రకారం తిరగాల్సిన దానికన్న 1,620 కిలోమీటర్లు అదనంగా తిరుగుతున్నాయి. దీంతో రోజుకు రూ.15 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా రూ.16.50 లక్షల ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
● ఈ లెక్కన మెదక్ డిపోకు నెలకు రూ.4.50 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, ఏకంగా రూ.4.95 కోట్లు వస్తుంది. అంటే నెలకు రూ.45లక్షలు అదనంగా ఇన్‌కం వస్తుంది. అలాగే ఇందుకు భిన్నంగా గత ఏప్రిల్, మే నెలల్లో ఏకంగా రూ.11.45 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో ఆర్టీసీకి అదనంగా కోటి రూపాయల ఆదాయం రావడం ఉమ్మడి జిల్లాలోనే రికార్డుగా నిలిచిందని అధికారులు తెలిపారు.
ఆదాయం సమకూరే రూట్లు ఇవే..
మెదక్ జిల్లాలో మెదక్ డిపోతో పాటు పాతబస్టాండ్, రామాయంపేట బస్టాండ్, కౌడిపల్లి బస్టాండ్, చేగుంట, నర్సాపూర్ డిపోలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మెదక్ –జేబీఎస్, మెదక్– పటాన్‌చెరువు, మెదక్– సిద్దిపేట రూట్లలో అధిక ఆదాయం వస్తుంది. అలాగే పాత బస్సుల స్థానంలో 8 కొత్త బస్సులను వేశారు. అందులో 2 సూపర్ లగ్జరీ, 6 డీలక్స్ బస్సులు ఉన్నాయి. బీదర్‌తో పాటు కర్నూల్, తిరుపతి ప్రాంతాలకు నిత్యం మెదక్ డిపో నుంచి బస్సులను నడుపుతున్నారు.
ఆర్టీసీ అందిస్తున్న సబ్సిడీలు
ఆర్టీసీ పలు రకాల సబ్సిడీలు అందిస్తుంది. ప్రధానంగా డయాలసిస్ పేషెంట్లకు, జర్నలిస్టులకు ఫ్రీబస్ పాస్‌తో పాటు 80 శాతం సబ్సిడీపై విద్యార్థులకు బస్ పాస్‌లను అందిస్తోంది. అలాగే బస్సులో ప్రయాణిస్తుండగా ఏదేని ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి పరిహారం కూడా ఇస్తారు.
కార్గోతో ఆదాయం
2020లో ప్రవేశ పెట్టిన కార్గో సర్వీస్ ద్వారా ఆర్టీసీ ఆర్థికంగా పుంజుకుందని చెప్పవచ్చు. ఈ సర్వీస్‌కు ప్రజలు త్వరగా కనెక్టు అయ్యారు. ఏదేని వస్తువును పంపాలన్నా, ఉత్తరాల నుంచి మొదలుకుని వస్తువుల వరకు త్వరగా చేరవేయటంలో కార్గో సక్సెస్ అయ్యింది. ప్రయాణంలో ఆర్టీసీ ఎంత సురక్షితమో వస్తు రవాణాలో కార్గో కూడా అంతే సుక్షితమనే భావనను ప్రజల్లో కలిగించింది.
కొత్త విధానాలతో మార్పు
ఆర్టీసీ సంస్థ అమలు చేస్తున్న కొత్త విధానాలతో ప్రజలకు మరింత చేరువైంది. ఆర్టీసీ బస్ ఆఫీసర్ పేరుతో గ్రామానికో వ్యక్తిని నియమించారు. గ్రామాల్లో ఎవరికై నా పెళ్లి బస్సులు కావాలన్నా, ఆయా గ్రామాల్లో పండగలు, జాతరలు జరిగే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపటం, ప్రైవేట్ వాహనాలతో పోల్చుకుంటే ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమైనదిగా ప్రజలకు అవగాహన కలిపించటం వీరి విధి నిర్వహణ. ఇలాంటి నిర్ణయాలతో ఒకప్పుడు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లాతో పోల్చితే మెదక్ డిపో లాభాల బాటలో నడుస్తోంది.
లాభాల బాటలో..
మెదక్ ఆర్టీసీ డిపో లాభాల బాటలో నడుస్తోంది. నా తోటి ఉద్యోగులతో పాటు కార్మికుల సమష్టి కృషి ఫలితంగానే డిపోను ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఆదాయంలో ముందంజలో ఉంచాం. అందరి సహకారంతో ఇలాగే అధిక లాభాలు గడిస్తాం
–రవిచందర్, డీఎం, మెదక్
Comments
Please login to add a commentAdd a comment