మంగళవారం రాత్రి లక్డీపూల్ లో ప్రయాణిస్తున్న లేక వెలవెలబోతున్న ప్రైవేట్ బస్ సెక్టార్
తెలంగాణ సర్కారు ప్రవేశ పన్ను విధింపుతో ఉభయ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సుల రాకపోకలు
అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఎంట్రీ ట్యాక్స్
సరిహద్దుల్లో పన్ను వసూలు కేంద్రాలను ఏర్పాటు చేసిన
తెలంగాణ ప్రభుత్వం.. మూడు నెలల మొత్తాన్ని చెల్లిస్తేనే అనుమతి
పన్నుపై కోర్టుకెక్కనున్న ఆపరేటర్లు
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ప్రైవేటు బస్సులకు ట్యాక్స్ బ్రేక్ పడింది! తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన ఎంట్రీ ట్యాక్స్(ప్రవేశ పన్ను)తో రాకపోకలు స్తంభించాయి. మూడు నెలల ఎంట్రీ ట్యాక్స్ చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీలోని 13 జిల్లాల్లో సుమారు 32 లక్షల లారీలు, 800కిపైగా ప్రైవేటు బస్సులున్నాయి. వీటిలో చాలావరకూ నిత్యం తెలంగాణ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి రోజుకు 300 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. ఏపీ సరిహద్దుల్లోని గరికపాడు, తిరువూరు సమీపంలోని గంపలగూడెంలో తెలంగాణ ప్రభుత్వం.. రవాణా పన్నుల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రతి లారీ తాత్కాలిక పర్మిట్ (నెలకు) కింద సుమారు రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో ఆపరేటర్లు తమ తమ వాహనాలను నిలిపివేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రెవేట్ ఆపరేటర్లు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు విన్నవించారు. అయితే సీఎం చంద్రబాబు అందుబాటులో లేకపోవటంతో ప్రెవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లకు ఎలాంటి హామీ లభించలేదు. ఫలితంగా తెలంగాణ వైపు నడిపే బస్సుల్ని నిలిపివేస్తున్నారు. కృష్ణా జిల్లాలో టూరిస్ట్ ఆపరేటర్లుకు చెందిన బస్సులు 200 వరకు ఉన్నాయి. వీటిలో విజయవాడలోనే 150 దాకా ఉన్నాయి. గతంలో పెళ్లిళ్లులాంటి కార్యక్రమాల కోసం రాష్ట్రం నుంచి ఓ ప్రైవేటు బస్సు కోదాడకు వెళ్లాలంటే అద్దె కింద బస్సు యజమానులు రూ.12 వేలు తీసుకునేవారు. కానీ ఇప్పడు మూడు నెలల్లో ఒక్కసారి వెళ్లినా పర్మిట్‌కే రూ.14 వేలు చెల్లించాల్సి వస్తోంది. తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వాహనాలకు ప్రస్తుతం ఎలాంటి ట్యాక్సులు లేవు. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక నిర్ణయం తీసుకొని దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు తెలంగాణ విధించిన ఎంట్రీ టాక్స్‌పై ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కోర్టుకు వెళ్లనున్నారు.
ప్రయాణికుల ఇక్కట్లు...
హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి రోజూ వివిధ ప్రాంతాలకు 500కు పైగా ప్రైవేట్ బస్సులు బయలుదేరుతాయి. పన్ను నేపథ్యంలో 85 శాతానికిపైగా బస్సులు రద్దయ్యాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మంగళవారం రాత్రి 10 గంటల వరకు 16 బస్సులే వెళ్లాయి. దీంతో ప్రయాణికులు వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైంది.