నిరాక‘రణం’ | Employment, trade union leaders are doing strike. | Sakshi
Sakshi News home page

నిరాక‘రణం’

Published Thu, Aug 15 2013 3:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

Employment, trade union leaders are doing strike.

 తెల్లదొరల దాస్యశృంఖలాల నుంచి భరతమాతను విడిపించేందుకు అలనాడు మహాత్మా గాంధీ జాతిని ఏకం చేశారు. ఉప్పు సత్యాగ్రహం..ఖాదీ ఉద్యమంతో బ్రిటీష్ వారి గుండెల్లో వణుకు పుట్టించారు. శాంతియుత నిరసనలతోనే దేశా నికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారు. నేడు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం జిల్లా ప్రజలు అదే ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. తెలుగు జాతిని విడదీయవద్దంటూ రోడ్లెక్కి నినదిస్తున్నారు. ఉద్యోగులు, అధికారులు, కార్మికులు సహాయ నిరాక  ‘రణ’ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఆందో
 ళనలు ఆపబోమని హెచ్చరిస్తున్నారు.
 
 సాక్షి, కర్నూలు: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది.  ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. పట్టణాల్లో, పల్లెల్లో ప్రజలు ఐక్యంగా రాస్తారోకోలు, ధర్నాలు, వంటావార్పు, మానవహారాలు, ప్రదర్శనలు, శవయాత్రలు వంటి వినూత్న నిరసన కార్యక్రమాలతో సమైక్యవాణిని వినిపిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని ఉపసహంరించుకునే వరకూ విశ్రమించేది లేదంటూ నినదించారు. సుమారు 50 శాఖలకు చెందిన 45వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. సుమారు రెండువేలకు మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
 
 కర్నూలు నగరంలో కేశవరెడ్డి విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది.. వేల మంది విద్యార్థులతో కలిసి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టిన 200 మంది ఉద్యోగులకు వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి మద్దతు తెలిపారు. కేఈ సోదరులు కూడా వీరికి మద్దతు ప్రకటించారు. రాస్తారోకోలతో జాతీయ రహదారులపై రవాణా స్తంభించింది. న్యాయవాదులు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ఆదోనిలో బుధవారం కూడా సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగానే సాగింది. మేదరి సంఘం ఆధ్వర్యంలో పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డుపై వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆయా శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్డీఓ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆళ్లగడ్డలో ఆర్టీసీ బస్సులో డిపోకే  పరిమితమయ్యాయి. బనగానపల్లె ఆర్టీసీ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఆత్మకూరులో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు నోటికి కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. వీరు గౌడుసెంటర్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వెలుగోడు పొట్టి శ్రీరాములు సెంటర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పాటు మోటర్‌బైక్ ర్యాలీ నిర్వహించారు.
 
 కోడుమూరులో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పట్టణంలో మౌన ప్రదర్శన చేపట్టారు. వీఆర్‌ఓలు, గ్రామసేవకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి పాతబస్టాండ్‌లో రోడ్డుపై మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సి.బెళగల్‌లో ఆర్‌ఎంపీలు, మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించి రిలేనిరాహారదీక్షలో కూర్చున్నారు. పత్తికొండలో 11 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతుగా దూదేకొండ గ్రాామానికి చెందిన ఎద్దులబండ్లతో బారీగా ర్యాలీ చేపట్టారు. హాసూరు గ్రామానికి చెందిన ప్రజలు స్కూటర్లు, ట్యాక్టర్లుతో ఐదు గంటల పాటు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో  జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పనిచేస్తున్న క్లరికల్ సిబ్బంది భోజన విరామం సమయంలో నల్లబ్యాడ్జిలను దరించి మౌన ప్రదర్శనను చేపట్టారు.
 
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కూర్చున్న వారికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. డోన్ పట్టణంలో సమైక్యాంధ్ర కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో 14వరోజు రిలేనిరాహారదీక్షలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గనరాజారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోరుతూ ర్యాలీ నిర్వహించి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం పట్టణంలోని సుందర్‌సింగ్‌కాలనీ, టీచర్సుకాలనీలో సమైక్యాంధ్ర గురించి వివరించే కరపత్రాలను బుగ్గన ఆధ్వర్యంలో కార్యకర్తలు పంపిణీ చే శారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement