rastho rako
-
విజయమ్మ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు
సాక్షి, నెల్లూరు : సింహపురిలో సమైక్యపోరు కెరటమై ఎగసిపడుతోంది. సమైక్య ఉద్యమం 21వ రోజూ ఉధృతంగా సాగింది. గుంటూరులో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలతో పాటు రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, వంటావార్పు, ర్యాలీలు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ మండలం దేవరపాళెం పంచాయతీ పరిధిలోని జొన్నవాడ రేవు వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ వారికి సంఘీభావం ప్రకటించారు. నగరంలో డీకేడబ్ల్యూ కళాశాల ఎదుట అధ్యాపకులు, విద్యార్థులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, ఎన్జీఓలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు రాస్తారోకోలు, వంటావార్పు, మానవహారాలతో పాటు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరులో కలెక్టరేట్ ఎదుట వీఆర్ఓలు ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్ ఆధర్యంలో కలెక్టరేట్ నుంచి గాంధీబొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో మున్సిపల్ బస్టాండ్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తొలుత వైఎస్సార్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని సత్రం సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడి,్డ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఇందూరు నర్సింహారెడ్డి, సూరా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో నెల్లూరుపాళెం నుంచి ఆత్మకూరు వరకు ర్యాలీ నిర్వహించారు. బోయిల చిరువెళ్ల గ్రామంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు-ముంబయి రహదారిపై వంటావార్పు నిర్వహించారు. కావలి జాతీయ రహదారిపై రెండుచోట్ల ఎన్జీఓలు, పంచాయతీరాజ్, ఆర్టీసీ, మున్సిపల్, పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం, వీఆర్ఓ సంఘం, తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు కలిసి ఆందోళనలు నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. వెంకటగిరిలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకష్ణ చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగింది. రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండు వద్ద ర్యాలీ చేశారు. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి నిరాహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు బ్యాంకు ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం కూడలిలో వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో చెన్నె-కోల్‌కతా జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి సుమారు గంటపాటు హైవేను స్తంభింపజేశారు. ఏడోరోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలో రెవెన్యూ ఉద్యోగులు కూర్చున్నారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా తడలో నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష రెండోరోజుకు చేరుకుంది. గూడూరు ఎన్టీఆర్ కాంప్లెక్ దుకాణదారులు వినూత్న రీతిలో తలలకు నల్లముసుగులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గ్రీన్‌వ్యాలీ ఇంగ్లిష్ మీడియంకు చెందిన చిన్నారులు దేశ నేతల వేషధారణలతో నాటిక ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ నాయకుడు బత్తిన విజయ్‌కుమార్ పార్టీ నాయకులతో కలిసి రిలే దీక్షలు చేపట్టారు. తోటపల్లిగూడూరులో వంటావార్పు నిర్వహించారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద ధర్నా, రాస్తారోకో జరిపారు. ఉదయగిరి బస్టాండులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మేళతాళాలతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో డిపో వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. కలిగిరిలో వైఎస్సార్సీపీ, వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. -
నిరాక‘రణం’
తెల్లదొరల దాస్యశృంఖలాల నుంచి భరతమాతను విడిపించేందుకు అలనాడు మహాత్మా గాంధీ జాతిని ఏకం చేశారు. ఉప్పు సత్యాగ్రహం..ఖాదీ ఉద్యమంతో బ్రిటీష్ వారి గుండెల్లో వణుకు పుట్టించారు. శాంతియుత నిరసనలతోనే దేశా నికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారు. నేడు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం జిల్లా ప్రజలు అదే ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నారు. తెలుగు జాతిని విడదీయవద్దంటూ రోడ్లెక్కి నినదిస్తున్నారు. ఉద్యోగులు, అధికారులు, కార్మికులు సహాయ నిరాక ‘రణ’ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఆందో ళనలు ఆపబోమని హెచ్చరిస్తున్నారు. సాక్షి, కర్నూలు: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. పట్టణాల్లో, పల్లెల్లో ప్రజలు ఐక్యంగా రాస్తారోకోలు, ధర్నాలు, వంటావార్పు, మానవహారాలు, ప్రదర్శనలు, శవయాత్రలు వంటి వినూత్న నిరసన కార్యక్రమాలతో సమైక్యవాణిని వినిపిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని ఉపసహంరించుకునే వరకూ విశ్రమించేది లేదంటూ నినదించారు. సుమారు 50 శాఖలకు చెందిన 45వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. సుమారు రెండువేలకు మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కర్నూలు నగరంలో కేశవరెడ్డి విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది.. వేల మంది విద్యార్థులతో కలిసి ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టిన 200 మంది ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి మద్దతు తెలిపారు. కేఈ సోదరులు కూడా వీరికి మద్దతు ప్రకటించారు. రాస్తారోకోలతో జాతీయ రహదారులపై రవాణా స్తంభించింది. న్యాయవాదులు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ఆదోనిలో బుధవారం కూడా సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగానే సాగింది. మేదరి సంఘం ఆధ్వర్యంలో పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డుపై వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆయా శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్డీఓ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆళ్లగడ్డలో ఆర్టీసీ బస్సులో డిపోకే పరిమితమయ్యాయి. బనగానపల్లె ఆర్టీసీ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఆత్మకూరులో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు నోటికి కట్టుకొని మౌన ప్రదర్శన నిర్వహించారు. వీరు గౌడుసెంటర్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వెలుగోడు పొట్టి శ్రీరాములు సెంటర్లో వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సోదరుడు బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పాటు మోటర్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. కోడుమూరులో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పట్టణంలో మౌన ప్రదర్శన చేపట్టారు. వీఆర్ఓలు, గ్రామసేవకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి పాతబస్టాండ్‌లో రోడ్డుపై మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సి.బెళగల్లో ఆర్ఎంపీలు, మెడికల్ షాప్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించి రిలేనిరాహారదీక్షలో కూర్చున్నారు. పత్తికొండలో 11 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతుగా దూదేకొండ గ్రాామానికి చెందిన ఎద్దులబండ్లతో బారీగా ర్యాలీ చేపట్టారు. హాసూరు గ్రామానికి చెందిన ప్రజలు స్కూటర్లు, ట్యాక్టర్లుతో ఐదు గంటల పాటు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పనిచేస్తున్న క్లరికల్ సిబ్బంది భోజన విరామం సమయంలో నల్లబ్యాడ్జిలను దరించి మౌన ప్రదర్శనను చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కూర్చున్న వారికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి మద్దతు ప్రకటించారు. డోన్ పట్టణంలో సమైక్యాంధ్ర కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో 14వరోజు రిలేనిరాహారదీక్షలు చేశారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గనరాజారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోరుతూ ర్యాలీ నిర్వహించి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం పట్టణంలోని సుందర్సింగ్కాలనీ, టీచర్సుకాలనీలో సమైక్యాంధ్ర గురించి వివరించే కరపత్రాలను బుగ్గన ఆధ్వర్యంలో కార్యకర్తలు పంపిణీ చే శారు.