విజయమ్మ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు | Vijayamma flooded the support of the strike | Sakshi
Sakshi News home page

విజయమ్మ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు

Published Wed, Aug 21 2013 2:46 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

Vijayamma flooded the support of the strike

సాక్షి, నెల్లూరు : సింహపురిలో సమైక్యపోరు కెరటమై ఎగసిపడుతోంది. సమైక్య ఉద్యమం 21వ రోజూ ఉధృతంగా సాగింది. గుంటూరులో వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలతో పాటు రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, వంటావార్పు, ర్యాలీలు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ మండలం దేవరపాళెం పంచాయతీ పరిధిలోని జొన్నవాడ రేవు వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్  వారికి సంఘీభావం ప్రకటించారు.
 
 నగరంలో డీకేడబ్ల్యూ కళాశాల ఎదుట అధ్యాపకులు, విద్యార్థులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. ఎన్‌జీఓల సంఘం ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, ఎన్‌జీఓలు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు రాస్తారోకోలు, వంటావార్పు, మానవహారాలతో పాటు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  
 
  నెల్లూరులో కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఓలు ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్ ఆధర్యంలో కలెక్టరేట్ నుంచి గాంధీబొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.  
 
 ఆత్మకూరులో మున్సిపల్ బస్టాండ్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తొలుత వైఎస్సార్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని సత్రం సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడి,్డ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఇందూరు నర్సింహారెడ్డి, సూరా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో నెల్లూరుపాళెం నుంచి ఆత్మకూరు వరకు ర్యాలీ నిర్వహించారు. బోయిల చిరువెళ్ల గ్రామంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు-ముంబయి రహదారిపై వంటావార్పు నిర్వహించారు.
 
  కావలి జాతీయ రహదారిపై రెండుచోట్ల ఎన్‌జీఓలు, పంచాయతీరాజ్, ఆర్టీసీ, మున్సిపల్, పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం, వీఆర్‌ఓ సంఘం, తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు కలిసి ఆందోళనలు నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.
 
  వెంకటగిరిలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకష్ణ చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగింది. రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండు వద్ద ర్యాలీ చేశారు.
 
  కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి నిరాహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు బ్యాంకు ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెం కూడలిలో వెంకటేశ్వర  కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
  సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో చెన్నె-కోల్‌కతా జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం  భారీ ర్యాలీ నిర్వహించి  సుమారు గంటపాటు హైవేను స్తంభింపజేశారు. ఏడోరోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలో రెవెన్యూ ఉద్యోగులు కూర్చున్నారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా తడలో  నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష రెండోరోజుకు చేరుకుంది.  
 
  గూడూరు ఎన్‌టీఆర్ కాంప్లెక్ దుకాణదారులు వినూత్న రీతిలో తలలకు నల్లముసుగులు ధరించి నిరసన వ్యక్తం చేశారు.  గ్రీన్‌వ్యాలీ ఇంగ్లిష్ మీడియంకు చెందిన చిన్నారులు దేశ నేతల వేషధారణలతో నాటిక ప్రదర్శించారు.   వైఎస్సార్‌సీపీ నాయకుడు బత్తిన విజయ్‌కుమార్  పార్టీ నాయకులతో కలిసి రిలే దీక్షలు చేపట్టారు.
 
  తోటపల్లిగూడూరులో వంటావార్పు నిర్వహించారు.  వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద ధర్నా, రాస్తారోకో జరిపారు.
 
  ఉదయగిరి  బస్టాండులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మేళతాళాలతో ర్యాలీ నిర్వహించి  బస్టాండ్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో డిపో వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. కలిగిరిలో వైఎస్సార్‌సీపీ, వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement