సాక్షి నెట్‌వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తుతోంది. ఐదు వారాలుగా సాగుతున్న పోరాటం 36వరోజు బుధవారం కూడా ఉధృతంగా ఎగసింది. ఊరూవాడా ఆందోళనలు పోటెత్తాయి.
కళాకారుల నిరసన
ఒంగోలులో రంగస్థల కళాకారులు, సంగీత కళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధికారులు విభజనవల్ల జరిగే నష్టాల గురించి పల్లెవాసులకు వివరించేందుకు బస్సుయాత్ర ప్రారంభించారు. ఒంగోలు కార్పొరేషన్ ఉద్యోగులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ రాష్ట్రపతిని కోరుతూ శ్రీ పొట్టి్ర శీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన విద్యార్థులు లక్ష పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. నెల్లూరులో ఆర్టీఓ ఉద్యోగులు తమ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విద్యార్థులు భారీ మానవహారంగా నిలబడి సమైక్య నినాదాలు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు సోనియా చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో ఉద్యానవన శాఖ ఉద్యోగులు రోడ్డుపై మొక్కలు నాటారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆశ్రం ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి, రోడ్డుపై కబడ్డీ ఆడారు. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో స్వర్ణకారులు రోడ్డుపైనే ఆభరణాలు తయారుచేసి నిరసన తెలిపారు. కేంద్రమంత్రి చిరంజీవి తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే చిరు కుటుంబ సభ్యుల సినిమాలను బహిష్కరిస్తామని సమైక్యవాదులు హెచ్చరించారు.
వెనక్కి నడిచి ఉద్యోగుల నిరసన
రాష్ట్రం విడిపోతే అభివద్ధిపథంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందంటూ విజయనగరంలో ఉద్యోగులంతా వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఎస్.కోటలో పలువురు ఉద్యోగులు శిరోముండనం చేయించుకున్నారు. ఓ మహిళా ఉద్యోగి కూడా శిరోముండనం చేయించుకుని నిరసన వ్యక్తంచేశారు.విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది చెత్తఎత్తి రోడ్లు ఊడ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌గేట్ వద్ద విద్యార్థులు రోడ్డును దిగ్బంధించారు. చోడవరం, కొత్తూరు జంక్షన్‌లో రజకులు రోడ్డుమీదే దుస్తులు ఉతుకుతూ నిరసన వ్యక్తంచేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 700 మందికి పైగా విద్యార్థులు సైకిల్ యాత్ర చేపట్టారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారం నిర్మించారు. కడప రిమ్స్, రాయచోటిలో ప్రభుత్వ వైద్యులు విధులను బహిష్కరించి ఉస్మానియా ఘటనకు నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శ్రీకూర్మం నుంచి శ్రీకాకుళం వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు.
పాలకొండ, పలాసల్లో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా డోన్‌లో రైతులు ఎడ్ల బండ్లతో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద కళాకారుల జేఏసీ ఆధ్వర్యంలో ‘పొలికేక’ పేరిట సాగిన ఆటాపాట సమైక్యవాదుల్లో ఉత్సాహం నింపింది. విభజన జరిగితే అనంతపురం పూర్తిగా ఎడారిగా మారుతుందంటూ ఐకేపీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాడిపత్రిలో ఆర్టీసీ జేఏసీ నేతలు కూరగాయల దండలు ధరించి నిరసన తెలిపారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన ‘అనంత జనగర్జన’కు వస్తున్న ఎస్కేయూ విద్యార్థులు, సమైక్యవాదులను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బుధవారం ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. విజయవాడలో ఉద్యమకారులు కోర్టు భవనాల ప్రాంగణానికి తాళాలు వేశారు. ఏపీఎన్జీవోలు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల అష్ట దిగ్బంధం చేశారు. గుడివాడ 72 గంటల బంద్ విజయవంతంగా ముగిసింది.
రోడ్డుపైనే నిద్రించి...
చిత్తూరుజిల్లా పీలేరులో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రోడ్డుపైనే నిద్రించి నిరసన తెలిపారు. మదనపల్లెలో మిట్స్ కళాశాల విద్యార్థులు వెయ్యి మీటర్ల జాతీయ జెండాను తయారుచేసి, బసినికొండపై ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో విద్యార్థులు, పొదుపు సంఘం సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు.
సమరం నిర్విరామం
Published Thu, Sep 5 2013 5:10 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement