సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఉద్యమం హోరెత్తుతోంది. సింహపురిలో 49వ రోజైన మంగళవారం సమైక్య పోరులో ఉద్యమకారులు, విద్యార్థులు సమై క్య రాష్ట్రాన్ని సాధిస్తామని ప్రతినబూనారు. నగరంలో నీటిపారుదలశాఖ ఉద్యోగులు మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీఓ హోంలో పశుసంవర్థకశాఖ ఉద్యోగులు నిరసనదీక్షలు ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండ్ నుంచి బస్సులతో ర్యాలీ నిర్వహించారు. వీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థి, అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి గాంధీవిగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. చిట్టమూరు మండలం కొత్తగుంటలో సమైక్యవాదులు కేసీఆర్‌కు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. ముత్తకూరులో క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల నిరసనదీక్షలు సాగుతున్నాయి.
ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యాలయాలు, ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. ఉద్యమ కార్యాచరణపై ఎన్‌జీఓ హోంలో ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలో విధులు నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ ఉద్యోగులపై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. కంప్యూటర్లను ఆపేసి ఉద్యోగులను బయటకు పంపారు.నెల్లూరు స్వర్ణాల చెరువులో నగర, రూరల్ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర జెండా ఆవిష్కరించి జలాభిషేకం నిర్వహించారు.
ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో 20వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. ఐకేపీ మహిళలు దీక్షలో కూర్చొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్‌లో 30వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. సీతారాంపురంలో 20వ రోజు ఉపాధ్యాయ రిలే దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో తెలంగాణ ఉపాధ్యాయునికి సన్మానం చేశారు. కలిగిరిలో బుధవారం నిర్వహించనున్న మహిళా గర్జనపై ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజించడంతో సీమాంధ్రలో ప్రతి గుండె మండుతోందని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
గూడూరు టవర్‌క్లాక్ సెంటర్‌లో నిర్వహిస్తున్న రిలే దీక్షలకు ఎల్లసిరి, నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ సంఘీభావం తెలిపారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు టవర్‌క్లాక్ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసి అక్కడే ఆటలు ఆడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు దీక్షకు దిగారు. దీక్షా శిబిరాన్ని గూడూరు ఎమ్మెల్యే దుర్గాప్రసాద్‌రావు సందర్శించి సంఘీభావం తెలిపారు.కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయిబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం కోట క్రాస్‌రోడ్డు వద్ద రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. వాకాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ నాయకులు ముట్టడించి తరగతులను నిలిపివేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యానాది, జేఏసీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంటలో కేసీఆర్‌కు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు.
పొదలకూరులో మంగళవారం రెడీమేడ్ వస్త్ర దుకాణదారులు, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ నుంచి ఉపాధ్యాయ జేఏసీ నాయకులు మంగళవారం నాల్గోరోజు పాదయాత్ర ప్రారంభించారు. నాలుగు గ్రామాల మీదుగా సాగిన పాదయాత్ర పేడూరులో ముగిసింది. వెంకటగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం వెంకటగిరిలో సమైక్య గర్జన నిర్వహిస్తున్నట్టు పద్మశాలి సంఘం నాయకులు తెలిపారు. సూళ్లూరుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య పోరు ఉధృతంగా సాగుతోంది. రిలే నిరాహారదీక్షలు 38వ రోజుకు చేరాయి. తడలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. వీఆర్వోలు దీక్షలో కూర్చుని నిరసన పాటించారు. వీరికి సంఘీభావంగా ఐటీఐ విద్యార్థులు బజారు సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. నాయుడుపేటలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహాదీక్షలు కొనసాగుతున్నాయి.
సమైక్యం సాధిస్తాం
Published Wed, Sep 18 2013 2:04 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement