రగిలిన జిల్లా
కర్నూలు, న్యూస్‌లైన్:
వేర్పాటు వాదంపై జిల్లా ప్రజలు యుద్ధభేరి ప్రకటించారు. విద్యార్థులు రోడ్డెక్కారు. ఉద్యోగులు విధులకు స్వస్తి చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. స్వార్థ రాజకీయాల్లో భాగంగా చోటు చేసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి నిరశనగా గురువారం రాత్రి ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా చైర్మన్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ కొడిదెల శివనాగిరెడ్డి, న్యాయవాదుల జేఏసి కన్వీనర్ మురళీమోహన్, ఆటో జేఏసి నాయకులు జయరామిరెడ్డి, కేదార్‌నాథ్, ఈశ్వర్, విద్యార్థి జేఏసి నాయకులు విజయ్, యువజన విభాగం జేఏసి నాయకులు రవీంద్రనాథ్, విజయ్‌కుమార్‌ల నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్థానిక బిర్లా జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టింది. రోడ్డుపై అరగంటపాటు బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రాకేష్‌రెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థి విభాగాల నాయకులు మహేశ్వరరెడ్డి, ప్రవీణ్, పవన్, రాజుమోహన్, రాజశేఖర్, శంకర్, శశి, శివల నాయకత్వంలో కార్యక్రమం జరిగింది. విషయం తెలిసిన వెంటనే రెండో పట్టణ సీఐ అబ్దుల్ గౌస్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఉద్యమకారులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలు సమైక్య నినాదాలతో మారుమ్రోగాయి. సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించేందుకు విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల బంద్‌కు ఉపాధ్యాయ జేఏసి పిలుపునిచ్చింది.
ఆత్మకూరుటౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు అనుకూలంగా గురువారం కేంద్రక్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ జిల్లా భగ్గుమంది. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు షఫీవుల్లా, జవహర్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఆత్మకూరులోని కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరసనకు దిగారు. రహదారిపై టైర్లకు నిప్పంటించి పెద్ద ఎత్తున ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు, పాదాచారుల రాకపోకలకు అంతరాయం కలిగింది. తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సత్వరమే పక్కన బెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు.
ప్రజాప్రతినిధులకు చీము, నెత్తురు ఉంటే తెలంగాణ బిల్లును అడ్డుకోవాలన్నారు. విభజన వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు జయకృష్ణ మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకుందని విమర్శించారు. తెలుగుతల్లిని చీల్చడం సోనియాగాంధీకి తగదన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుందన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే సత్వరమే తెలంగాణ బిల్లును అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో సమితి నాయకులు విజయకుమార్, సుధాకర్‌రెడ్డి, శంకర్, రవి, కృష్ణుడు, ప్రసాదరావు, వలి, నరసింహులు, వెంకటేశ్వర్లు, ఎస్‌కే.వలి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అంజాద్‌అలీ, ఇనాయతుల్లా, గోకారి, ముర్తుజా, మస్తాన్, సోమశేఖర్‌రెడ్డి, మురళి, భాస్కర్‌రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, టీడీపీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా సీఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మద్యం షాపులు మూయించిన పోలీసులు..
సమైక్యాంధ్ర ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని మద్యం దుకాణాలు, బార్లను రాత్రి 9 గంటలకే మూయించారు. మద్యం బాబులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావించి జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో నగరంలోని అన్ని స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాలతో పాటు హోటళ్లు, ఇతర వ్యాపార దుకాణాలను కూడా పది గంటల లోపే మూయించి రోడ్లపై జనం తిరగకుండా కట్టడి చేశారు.
రగిలిన కర్నూలు జిల్లా
Published Fri, Dec 6 2013 1:36 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement