బంద్ సంపూర్ణం | In nellore district bandh sucessfully | Sakshi
Sakshi News home page

బంద్ సంపూర్ణం

Published Wed, Aug 14 2013 5:10 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

In nellore district bandh sucessfully

సాక్షి, నెల్లూరు :  రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సింహపురి వాసులు ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో 14 రోజులుగా చురుగ్గా పాల్గొంటున్న స్ఫూర్తితోనే ఎన్జీఓ, విద్యార్థి, ఉద్యోగ జేఏసీల పిలుపుమేరకు మంగళవారం బంద్ పాటించారు. బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగేందుకు పూర్తి సహకారం అందించారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా వ్యాపార  సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల పైకి వచ్చి సమైక్యాంధ్ర కోరుతూ ర్యాలీలు, రాస్తారోకో, ప్రదర్శనలతో పాటు దిష్టిబొమ్మల దహనం, వంటా వార్పు తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
 
 ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో  బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నెల్లూరులో జరిగిన బంద్‌లో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఎంపీ మేకపాటి ఆరోపిం చారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ అధ్యక్షుడితో పాటు 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు.రాష్ట్ర విభజన ప్రకటనను ఉపసంహరించేంత వరకూ ఆందోళనలు  ఉధృతం చేస్తామని జేఏసీ,ఎన్‌జీఓ, విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ   నేతలు హెచ్చరించారు.
 
 నగరంలో ఉదయాన్నే  బంద్ ప్రారంభమైంది. ఎన్‌జీఓలు, జేఏసీ చేపట్టిన ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు.
 డీజిల్ బంకుల యజమానుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ నేతలు కోటరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ మద్దతు ప్రకటించారు. వివిధ చేతి వృత్తి సంఘ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా, ఆందోళన చేశారు. కలెక్టరేట్ ఉద్యోగులను విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
 
  సమైక్యాంధ్ర విద్యార్థి  జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్, వీఆర్‌సీ, గాంధీబొమ్మ సెంటర్లలో రోడ్డుపైన అల్పాహారం తిని, తలకిందులుగా నడిచి నిరసన వ్యక్తం చేశారు. వాహనాలను అడ్డుకున్నారు. దుకాణాలను మూసివేయిం చారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పూలే విగ్రహం వద్ద మానవ హారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో  సిబ్బందిని హాజరు పుస్తకంలో సంతకం కూడా చేయించకుండా విధులు బహిష్కరింప చేశారు.
 
  ఉదయగిరిలో ఎన్‌జీఓ, విద్యార్థి జే ఏసీ ఆధ్వర్యంలో బస్టాండు సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వింజమూరులో విద్యార్థి జేఏసీ, ఎన్‌జీఓల ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండు నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివే యించి బంద్ నిర్వహించారు. కలిగి రిలో వైఎస్సార్‌సీపీ నేత  పావులూరి మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండు సెంటర్‌లో నిరసన చేపట్టారు.  
 
  వెంకటగిరిలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కాశీపేట నుంచి అడ్డ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కారు స్టాండు కార్మిక సంఘం ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెం టర్ నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూసి వేయించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి కాశీపేట కూడలిలో దహనం చేశారు. దీంతో వెంకటగిరిలో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచి పోయాయి.
 
  సూళ్లూరుపేటలో జేఏసీ,  ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది.  సూళ్ళూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో పీర్లచావిడి సెంటర్‌లో రిలేదీక్ష ప్రారంభించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో  విధులు బహిష్కరించి  డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement