సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.2 వేల కోట్లు వెచ్చించి సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పట్టించబోతున్నామని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. సూళ్లూరుపేటలో శనివారం రాత్రి నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్-14 ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
దళిత, గిరిజన విద్యార్థులకు హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో ప్రతిభావంతులైన 44 మంది ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను అమెరికాకు పంపామని చెప్పారు. ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కూడా మరో రూ. 2 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. పేదరికం నిర్మూలన చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అందరం సమైక్యాంధ్ర ఉద్యమంలో నిమగ్నమైనందున ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు. భవిష్యత్తులో వైభవంగా నిర్వహించి ఈ ప్రాంత ప్రకృతి ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేం దుకు కృషి చేస్తామన్నారు.
ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలిలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులం తమ గళాన్ని వినిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. అదేమని అడిగితే తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు చేయిచేసుకునే పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే పరసా రత్నం మాట్లాడుతూ ఏటా మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు కోటి రూపాయలు కేటాయించాలన్నారు. సూళ్లూరుపేట పట్టణ అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పక్షుల పండగలో పాలుపంచుకున్న వారందరికీ కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెమెంటోలు అందజేశారు.
సబ్‌ప్లాన్‌తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ
Published Sun, Jan 12 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement