Sulluru peta
-
మామా.. మేమొస్తున్నాం...!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అది శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ (షార్) కేంద్రం. అటు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇటు యావద్దేశం ఊపిరి కూడా బిగబట్టి మరీ అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలైంది. 25.3 గంటల కౌంట్‌డౌన్‌కు నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు తెర పడింది. ఆ వెంటనే ఇస్రో బాహుబలి ఎల్వీఎం3–ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. గత వైఫల్యాల నేపథ్యంలో అంతటా ఉది్వగ్న వాతావరణం. అందరిలోనూ మరింత ఉత్కంఠ. మనసు మూలల్లో ఎక్కడో కాసింత అనుమానం. కానీ, ఉత్కంఠకు తెర దించుతూ, అనుమానాలను పటాపంచలు చేస్తూ మన బాహుబలి దిగి్వజయంగా రోదసి చేరింది. అంతరిక్ష సీమలో విజయనాదం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పదేళ్ల కల నెరవేరింది. చంద్రయాన్–1, 2 ప్రయోగాలు నిరాశ పరిచినా పట్టు వీడకుండా మొక్కవోని దీక్షతో మన శాస్త్రవేత్తల బృందం రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు ఫలించింది. ముచ్చటగా మూడోసారి చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. మూడు దశల ఎల్వీఎం3–ఎం4 రాకెట్ చంద్రయాన్–3 త్రీ–ఇన్–ఒన్ మిషన్‌ను విజయవంతంగా రోదసి చేర్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకుని ప్రముఖులంతా ఇస్రోను, ఇంతటి విజయానికి కారకులైన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఆ ఉది్వగ్న క్షణాలు... తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి శుక్రవారం చేపట్టిన చంద్రయాన్–3 ప్రయోగం సూపర్ సక్సెసైంది. 640 టన్నుల ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహకనౌక, 3,920 కిలోల చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు వేగంగా దూసుకెళ్లింది. వెంటనే మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ కంటిమీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. మూడు దశలతో కూడిన ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లో పూర్తిచేశారు. చంద్రయాన్–3 మిషన్‌ను భూమికి 36,500 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు ఇది 89వ విజయం. గ్రహాంతర ప్రయోగాల్లో చంద్రయాన్–3 నాలుగో ప్రయోగం కాగా చంద్రునిపై పరిశోధనల నిమిత్తం చేసిన ప్రయోగాల్లో మూడోది. ఇది ఇస్రో బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్–3 సిరీస్‌లో మూడు ప్రయోగాలు, ఎల్వీఎం–3గా పేరు మార్చాక నాలుగో ప్రయోగం! కార్యక్రమాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రధాని కార్యాలయ ప్రతినిధి జితేంద్రసింగ్ స్వయంగా షార్ కేంద్రం నుంచి వీక్షించారు. ప్రయోగం జరిగిందిలా... ► 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది. ► చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. ► ఎల్వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగి్వజయంగా ప్రయాణం ప్రారంభించింది. ► ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది. ► 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి. ► 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ► అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ► ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. ► రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ► ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీ టర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ► ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ► చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ► చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకలి్పంచగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు. చంద్రుడిపైకి ఇలా వెళ్తుంది... ► చంద్రయాన్–3 మిషన్ మరో 41 రోజుల్లో, అంటే ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. ► 16 రోజుల్లో ప్రొపల్షన్ మాడ్యూల్లో నింపిన 1,696 కిలోల ఇంధనాన్ని మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ► ఆగస్టు 1న ఐదోసారి ప్రొపల్షన్ మాడ్యూల్‌ను ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుని దిశగా మళ్లిస్తారు. ► తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్‌కు చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రో బర్న్ చేసి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యను తగ్గించే ప్రక్రియను నాలుగుసార్లు చేపడతారు. ► అలా ఆగస్టు 17న చంద్రయాన్–3 చంద్రుని కక్ష్యలోకి వెళుతుంది. తరవాత ప్రొపల్షన్ మాడ్యూల్ తన ఎత్తును 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ ల్యాండర్‌ను విడిచిపెడుతుంది. ► తరవాత ల్యాండర్‌లోని ఇంధనాన్ని కూడా మండించి ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో సాఫ్ట్ లాండింగ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ► ల్యాండర్ విడిపోయిన తరువాత ల్యాండర్‌ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ► ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. మొట్టమొదటిగా భారతే చేయడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది. ► చంద్రయాన్–1లో వాడిన పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ వాడారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని కూడా చంద్రయాన్–2 తరహాలోనే నిర్వహించారు. ► చంద్రయాన్–2లో ల్యాండర్, రోవర్లను తీసుకెళిన్ల ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలోనే పని చేస్తూ విలువైన సమాచారం అందిస్తూనే వుంది. ► అందుకే ఈసారి ఆర్బిటర్‌కు బదులు ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా ల్యాండర్, రోవర్లను పంపారు. ► ఈ ప్రయోగంలో ఇస్రో తొలిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజన్లను చంద్రుని ఉపరితలంపై మృదువైన చోట ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు ఇప్పట్నుంచే ప్రయతి్నస్తున్నారు. మనకిక ఆకాశమే హద్దు మంత్రి జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ చంద్రయాన్–3 ప్రయోగం నిజంగా సవాలేనని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగం విజయవంతమయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. దేశీయంగా రూపొందించిన ఎల్వీఎం3–ఎం4 రాకెట్ ద్వారా ప్రయోగం తొలి దశను విజయవంతం చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కలసికట్టుగా పని చేయడమే ఇంతటి భారీ విజయానికి కారణమన్నారు. ‘‘ఇక రాబోయే 41 రోజులు అత్యంత కీలకం. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రునిపై విజయవంతంగా దించేందుకు ప్రయతి్నస్తాం. ఆగస్టు మూడో వారంలో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాం. మిషన్ సూర్య, చంద్ర రెండింటినీ పూర్తి చేస్తామని నమ్మకముంది’’ అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో త్వరలో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. ఆగస్టు 23న ల్యాండర్ చంద్రునిపై దిగితే అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కు ఆకాశమే హద్దన్నారు. ఇస్రో చైర్మన్‌తో కలిసిరాకెట్, చంద్రయాన్–3 నమూనాలను ఆయన ఆవిష్కరించారు. భేటీలో చంద్రయాన్–3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్, మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన్‌కుమార్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
పంతం నెగ్గించుకున్న మంత్రి నారాయణ
ముప్పాళ్లకే చెంగాళమ్మ చైర్మన్ పీఠం సూళ్లూరుపేట : సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం పాలకమండలిని ఎట్టికేలకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిని నియమించడంలో మంత్రి నారాయణ పంతం నెగ్గించుకున్నారు. స్థానిక నేతలు కొంతమంది వ్యతిరేకించినా తను అనుకున్న ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డికే చైర్మన్ పదవిని వచ్చేట్టు చేయడంలో మాట నిలబెట్టుకున్నారు. మధ్యలో అర్వభూమి చంద్రశేఖర్‌రెడ్డి కోర్టు నుంచి తెచ్చుకున్న ఉత్తర్వుల మేరకు వంశపారపర్య పాలకమండలి సభ్యులుగా నియమించారు. కొద్ది రోజులు కొనసాగిన తరువాత ఆయన కోర్టును తప్పుదారి పట్టించి ఆర్డర్ తెచ్చుకున్నారని, అర్వభూమి రామచంద్రారెడ్డి వంశానికి చెందిన వ్యక్తి కాదని ఆలయం తరుపున మళ్లీ కోర్టులో దావా వేయడంతో అతని పాలకమండలి సభ్యత్వాన్ని రద్దు చేసి కొత్త బోర్డును శుక్రవారం నియమించారు. ఆలయ నూతన పాలకమండలి చైర్మన్‌గా ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి, పాలకమండలి సభ్యులుగా ముప్పాళ్ల విజయలక్ష్మీ, చిలకా యుగంధర్‌యాదవ్, అలవల సూరిబాబు, చిట్టేటి పెరుమాళ్లు, వేనాటి గోపాల్‌రెడ్డి, ఆకుతోట రమేష్, పిట్ల సుహాసిని, డీటీడీసీ శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. ఎక్స్ ఆఫీషియో సభ్యుడు కీసరపల్లి నరేంద్రలను ఎన్నుకున్నారు. ఇందులో మాజీ చైర్మన్ ఇసనాక హర్షవర్థన్‌రెడ్డి అనుచరులు ఇద్దరికి, వేనాటి రామచంద్రారెడ్డి అనుచరులు ఇద్దరికి, కొండేపాటి గంగాప్రసాద్ అనుచరులు ఇద్దరికి, మిత్రపక్షమైన బీజేపీకి ఒక పాలకమండలి సభ్యులుగా నియమించారు. త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
నవజీవన్ స్టాపింగ్ పునరుద్ధరణ
రైల్వేస్టేషన్లో ఆనందోత్సాహాలు సూళ్లూరుపేట: చెన్నై–అహమ్మదాబాద్‌ల మధ్య తిరుగుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్‌ను శనివారం నుంచి పునరుద్ధరించడంతో జైన్ సోదరులు, ప్రజా సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి స్టాపింగ్ ఇచ్చినట్టే ఇచ్చి పాజిబులిటీ లేదని ఈనెల మొదటి వారం నుంచి స్టాపింగ్ రద్దు చేశారు. దీంతో జైన్ సోదరులు, వివిధ ప్రజాసంఘాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలిసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌కు జైన్ సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆయన ఢిల్లీస్థాయిలో రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో మాట్లాడి స్టాపింగ్‌ను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. లోక్‌సత్తా నాయకులు శ్రీపతి రవీంద్ర కూడా తనవంతు ప్రయత్నం చేసి డీఆర్ఎంకు లేఖ రాశారు. అందరూ మూకుమ్మడిగా చేసిన ప్రయత్నాలు, ఆందోళన వల్ల రైల్వే బోర్డు స్పందించి శనివారం ఉదయం 10.55 గంటలకు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను ఎట్టికేలకు ఆపారు. దీంతో జైన్ సంఘాల వారు, ఛాంబర్ ఆప్ కామర్స్ నుంచి అందరూ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ట్రైన్ డ్రైవర్‌కు, స్టేషన్ సిబ్బందికి స్వీట్లు పంచారు. ఇకనుంచి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపింగ్‌ను నిరంతరాయంగా కొనసాగించాలని వారు స్టేషన్ సిబ్బందిని కోరారు. స్టాపింగ్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు, ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌కు పట్టణ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
సబ్‌ప్లాన్‌తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.2 వేల కోట్లు వెచ్చించి సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పట్టించబోతున్నామని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. సూళ్లూరుపేటలో శనివారం రాత్రి నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్-14 ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత, గిరిజన విద్యార్థులకు హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో ప్రతిభావంతులైన 44 మంది ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను అమెరికాకు పంపామని చెప్పారు. ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కూడా మరో రూ. 2 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. పేదరికం నిర్మూలన చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అందరం సమైక్యాంధ్ర ఉద్యమంలో నిమగ్నమైనందున ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు. భవిష్యత్తులో వైభవంగా నిర్వహించి ఈ ప్రాంత ప్రకృతి ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేం దుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలిలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులం తమ గళాన్ని వినిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. అదేమని అడిగితే తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు చేయిచేసుకునే పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే పరసా రత్నం మాట్లాడుతూ ఏటా మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు కోటి రూపాయలు కేటాయించాలన్నారు. సూళ్లూరుపేట పట్టణ అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరు చేయాలని కోరారు. పక్షుల పండగలో పాలుపంచుకున్న వారందరికీ కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెమెంటోలు అందజేశారు. -
రజతోత్సవానికి సిద్ధమైన పీఎస్ఎల్వీ సిరీస్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఐదు దశాబ్దాల్లో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలను సాధించింది. ఇందులో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)దే అగ్రస్థానం. నవంబర్ ఐదున మార్స్ ఆర్బిట్ మిషన్‌ను పీఎస్ఎల్వీ - సీ25 ద్వారా ప్రయోగించనున్నారు. దీంతో పీఎస్ఎల్వీ 25 ప్రయోగాలను పూర్తిచేసుకోనుంది. అంగారక గ్రహం మీద పరిశోధనకు ఉపగ్రహం పంపటం ద్వారా పీఎస్ఎల్వీ సిరీస్ రాకెట్ రజతోత్సవాన్ని జరుపుకోనుండటం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 1963లో ప్రయోగాలకు శ్రీకారం కేరళలోని తుంబా ఈక్విటోరియల్ రాకెట్ కేంద్రం నుంచి 1963లో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1975లో రష్యా నుంచి మొదటి ఆర్యభట్ట ఉపగ్రహంతో మన ప్రయోగాల పరంపర మొదలైంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 1979 ఆగస్ట్ 10న ఎస్ఎల్వీ - 3 ఈ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1979 నుంచి ఇప్పటివరకు చేపట్టిన 39 ప్రయోగాల్లో ఎనిమిది మినహా, మిగిలినవి విజయవంతమయ్యాయి. ఇటీవల ప్రయోగించ తలపెట్టిన జీఎస్ఎల్వీ- డీ5ను సాంకేతిక లోపంతో ఆపేసిన విషయం తెలిసిందే. ఇస్రో ప్రయోగించిన ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌకల్లో పీఎస్ఎల్వీ మాత్రమే తిరుగులేనిదిగా నిలిచింది. 1993లో పీఎస్ఎల్వీ - డీ1 ప్రయోగాలకు శ్రీకారం 1993 సెప్టెంబర్ 20న మొదటిసారిగా పీఎస్ఎల్వీ - డీ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 ప్రయోగాలు చేశారు. మొదటి ప్రయోగం మినహా మిగిలినవి విజయవంతమయ్యాయి. 1993లో చేసిన మొదటి ప్రయోగం అపజయం కావడంతో 1994 అక్టోబర్ 15న పీఎస్ఎల్వీ - డీ2 ద్వారా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూరపరిశీలన ఉపగ్రహం)ను కక్ష్యలోకి విజయవంతంగా పంపారు. 1996 మార్చి 21న పీఎస్ఎల్వీ - డీ3లో కూడా ఐఆర్ఎస్ శాటిలైట్‌ను పంపారు. పీఎస్ఎల్వీ - సీ1 నుంచి సీ25 వరకు అన్ని ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ - 1 మిషన్‌ను పీఎస్ఎల్వీ - సీ11 రాకెట్ ద్వారానే ప్రయోగించడం విశేషం. ఈ రాకెట్ ద్వారా ఇప్పటివరకు ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించారు. కల్పన ఉపగ్రహం, జీశాట్ - 12 అనే కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను ప్రయోగించారు. పీఎస్ఎల్వీతో రెండురకాలుగా ఉపయోగం పీఎస్ఎల్వీ రాకెట్ రెండురకాల ప్రయోగాలకు ఉపయోగపడుతుంది. తక్కువ బరువున్న ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉన్న సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి మోసుకెళ్లాలంటే స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. అదే బరువైన ఉపగ్రహాలను భూమికి అతి దూరంగా ఉండే జియో సింక్రోనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య), భూస్థిర మధ్యం తర బదిలీ కక్ష్యలోకి తీసుకెళ్లాలంటే ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగిస్తారు. ఒకేసారి పది ఉపగ్రహాలను మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టిన ఘనత, వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగపడే రాకెట్‌గా పీఎస్ఎల్వీ గుర్తింపు పొందింది. రాకెట్లో ఉపయోగించే కొన్ని విడిభాగాలను మళ్లీ ఉపయోగించుకోవడానికి వీలుండే స్పేస్ క్యాప్సూల్స్ రికవరీ ప్రయోగం నిర్వహించిందీ పీఎస్ఎల్వీ ద్వారానే కావడం విశేషం. విదేశాలకు చెందిన 37 ఉపగ్రహాలను ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రో ఆదాయం తెచ్చిపెడుతోంది. నవంబర్ 5 మధ్యాహ్నం 2.36 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ - సీ25 షార్ నుంచి చేసే 40వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 25వది. ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను పంపేందుకు సర్వం సిద్ధం చేశారు. భవిష్యత్తులో చంద్రయాన్ - 2 ఉపగ్రహ ప్రయోగాన్నీ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారానే చేయనుండటం విశేషం.