నవజీవన్ స్టాపింగ్ పునరుద్ధరణ
-
రైల్వేస్టేషన్లో ఆనందోత్సాహాలు
సూళ్లూరుపేట:
చెన్నై–అహమ్మదాబాద్‌ల మధ్య తిరుగుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్‌ను శనివారం నుంచి పునరుద్ధరించడంతో జైన్ సోదరులు, ప్రజా సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి స్టాపింగ్ ఇచ్చినట్టే ఇచ్చి పాజిబులిటీ లేదని ఈనెల మొదటి వారం నుంచి స్టాపింగ్ రద్దు చేశారు. దీంతో జైన్ సోదరులు, వివిధ ప్రజాసంఘాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలిసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌కు జైన్ సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆయన ఢిల్లీస్థాయిలో రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో మాట్లాడి స్టాపింగ్‌ను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. లోక్‌సత్తా నాయకులు శ్రీపతి రవీంద్ర కూడా తనవంతు ప్రయత్నం చేసి డీఆర్‌ఎంకు లేఖ రాశారు. అందరూ మూకుమ్మడిగా చేసిన ప్రయత్నాలు, ఆందోళన వల్ల రైల్వే బోర్డు స్పందించి శనివారం ఉదయం 10.55 గంటలకు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను ఎట్టికేలకు ఆపారు. దీంతో జైన్ సంఘాల వారు, ఛాంబర్ ఆప్ కామర్స్ నుంచి అందరూ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ట్రైన్ డ్రైవర్‌కు, స్టేషన్ సిబ్బందికి స్వీట్లు పంచారు. ఇకనుంచి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపింగ్‌ను నిరంతరాయంగా కొనసాగించాలని వారు స్టేషన్ సిబ్బందిని కోరారు. స్టాపింగ్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు, ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌కు పట్టణ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.