navajeevan express
-
పక్కా స్కెచ్ వేశారు.. నగదు కొట్టేశారు!
నెల్లూరు(క్రైమ్): నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ కేసులో చిక్కుముడి వీడుతోంది. సూత్రదారి టీడీపీ నేత కాగా పాత్రదారులు చట్టాన్ని రక్షిచాల్సిన ఖాకీలేనని తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సదరు ఖాకీల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. కావలికి చెందిన మహిళ ఓ బంగారు వ్యాపారి వద్ద çఎంతోకాలంగా పనిచేస్తోంది. ఆమె ద్వారానే సదరు వ్యాపారి బంగారాన్ని చెన్నై నుంచి తెప్పించుకునేవాడు. నమ్మకస్తురాలు కావడంతో పెద్దమొత్తంలో నగదు ఇచ్చి చెన్నైకి పంపేవాడు. ఆమె సైతం నమ్మకంగా బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసుకుని తీసుకువచ్చేది. టీడీపీ నాయకుడి పరిచయం ఈ క్రమంలో సదరు మహిళకు కావలి రూరల్ మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రవితో పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా మెలగసాగారు. బంగారు వ్యాపారిని ఎలాగైనా బురిడీ కొట్టించి నగదు దోచుకోవాలని ఇద్దరూ పన్నాగం పన్నారు. ఇదే విషయాన్ని రవి తన బంధువైన ఓ కానిస్టేబుల్‌తో చర్చించి సహకరించాలని కోరాడు. అందుకు అతను అంగీకరించడంతో అందరూ కలిసి సమయం కోసం వేచిచూడసాగారు. ఎన్నికల రూపంలో వారికి అవకాశం లభించింది. ఎన్నికల సమయంలో పోలీసు తనిఖీలు అధికంగా ఉండే అవకాశం ఉండడం వారికి లాభించింది. ఇటీవల సదరు వ్యాపారి రూ.50 లక్షలు ఆ మహిళకు ఇచ్చి సీజన్బాయ్తో కలిసి చెన్నైకి వెళ్లి బంగారు బిస్కెట్లు తీసుకురావాలని సూచించాడు. వెంబడిస్తూ.. ఇదే అదునుగా భావించిన ఆ మహిళ విషయాన్ని రవికి తెలియజేసింది. తనతోపాటు స్నేహితురాలు, సీజన్బాయ్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళుతున్నామని చెప్పింది. రవి తన బంధువైన కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. అతని సూచనల మేరకు రవి ఆమెను వెంబడిస్తూ అదే రైలులో చెన్నైకి బయలుదేరాడు. కావలిలో రైలు ప్రారంభమైన నాటి నుంచి రవి కానిస్టేబుల్‌కు ఫోన్లో టచ్‌లో ఉన్నాడు. రైలు నెల్లూరులో ఆగగానే ఇద్దరు వ్యక్తులు పోలీసు వేషంలో బోగీలోకి చొరబడి మహిళను ఆమెతోపాటు ఉన్న సీజన్బాయ్, స్నేహితురాలిని అటకాయించారు. తాము పోలీసులమని వారిని బెదిరించి వారి వద్ద నున్న రూ.50 లక్షలు నగదు దోచుకుని గూడూరు రైల్వేస్టేషన్‌కు కొద్దిదూరంలోనే రైలులో నుంచి దిగిపోయినట్లు సమాచారం. దీంతో ఆ మహిళ జరిగిన విషయాన్ని తన యజమానికి తెలియజేసి కావలికి వెళ్లింది. యజమాని సూచనల మేరకు రెండోరోజుల అనంతరం ఆమె దోపిడీ ఘటనపై గూడూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. నెల్లూరు రైల్వే డీఎస్పీ డాక్టర్ వసంతకుమార్, సీఐ దశరథరామయ్యల ఆదేశాల మేరకు గూడూరు రైల్వే పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. సిబ్బందిని బృందాలుగా ఏర్పాటుచేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్ డీటైల్స్, టవర్ లొకేషన్, రైల్వేస్టేషన్‌లోని సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. వీడుతున్న చిక్కుముడి దోపిడీ అనంతరం నగదును రవి, ఆ మహిళ, కానిస్టేబుల్స్ పంచుకున్నట్లు తెలిసింది. దోపిడీ ఘటనపై ఫిర్యాదు చేసిన మహిళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో రైల్వే పోలీసులు తొలుత ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ మహిళ ఫోన్‌ను పరిశీలించగా ఒకే నంబర్‌కు పెద్ద సంఖ్యలో కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. సదరు ఫోన్ నంబర్ టీడీపీ నాయకుడు రవిదని తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విభిన్న కోణాల్లో విచారించడంతోపాటు అతని కాల్ డీటైల్స్ పరిశీలించగా కానిస్టేబుల్, అతని స్నేహితులైన మరో ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్ర ఉన్నట్లుగా వెల్లడైనట్లు సమాచారం. దీంతో పోలీసులు రవిని వెంటబెట్టుకుని కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి అక్కడ రూ.6 లక్షలు నగదు, నెల్లూరు ఉడ్‌హౌస్ సంఘంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంట్లో రూ.15 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దోపిడీలో పాత్రదారులైన వారు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ అని తేలింది. వారు ప్రస్తుతం విజయవాడలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. వీరితోపాటు ఇంకెవరైనా ఈ ఘటనలో ఉన్నారా అన్న వివరాలను సైతం రైల్వే పోలీసులు సేకరిస్తున్నారు. ఈ తరహా నేరాలు ఇంకేమైనా చేశారా అన్న కోణంలో సై తం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటన జిల్లాలో జిల్లాలో సంచలనం రేపింది. గతంలోనూ.. 2015లో ఇదే తరహాలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ జరిగింది. కావలికి చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు రూ.86.55 లక్షలు నగదుతో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి బయలుదేరారు. కొందరు వ్యక్తులు రైలులో ఎక్కి తాము పోలీసులమని, లెక్కలు చూపాలని వ్యాపారులను బెదిరించి నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో ఓఎస్డీ, ఏఆర్ కానిస్టేబుల్స్‌ను పోలీసులను అరెస్ట్ చేశారు. తాజా ఘటనలో సైతం ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ దోపిడీకి పాల్పడడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా నేరాలు తరచూ రైళ్లలో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. బంగారు వ్యాపారమంతా జీరో బిజినెస్ కావడంతో అధికశాతం మంది వ్యాపారులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. -
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
సాక్షి, ఖమ్మంక్రైం: చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో వస్తున్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను ఓ దొంగ అపహరించుకుని పోయిన సంఘటన సోమవారం తెనాలిలో జరిగింది. ఖమ్మం జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న ఇల్లెందు మండలానికి చెందిన ఇద్దరు మహిళల నుంచి బంగారం దోచుకున్నారు. తెనాలి స్టేషన్లో రైల్లోని బాత్రూంలో వేచి ఉన్న దొంగ రైలు కదిలే సమయానికి బాత్రూంలోంచి బయటకు వచ్చాడు. బోగి మహిళలది కావడంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తేరుకొనేలోపే ఆగంతకుడు సీట్లో కూర్చొని ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమ్ముగూడేనికి చెందిన గుగులోత్ సుజాత, ఖమ్మం నగరానికి చెందిన బి.పద్మ అనే మహిళలను కత్తితో బెదిరించాడు. వారి మెడలో ఉన్న గొలుసులు, రింగులు, నగదును లాక్కొన్నాడు. సుజాత ప్రతిఘటించటంతోపాటు, రైలు చైన్ లాగటానికి ప్రయత్నిస్తుండగా ఆగంతుకుడు కత్తితో మెడపై తీవ్ర గాయం చేసి కిందపడేసాడు. ఆమె తలకు గాయం అయింది. ఈ సంఘటనతో బోగీలోని మహిళలంతా గట్టిగా కేకలు వేశారు. అప్పటికే ఆగంతకుడు రైలు నుంచి దూకి పారిపోయాడు. పక్కనే ఉన్న గార్డ్‌కు సమాచారం అందించినా గార్డు పట్టించుకోలేదు. విజయవాడ రైల్వే పోలీసుల ఓవర్‌యాక్షన్.. ఆగంతకుడి చేతిలో తీవ్రంగా గాయపడి, సొత్తు పోగొట్టుకొన్న ఇద్దరు మహిళలు విజయవాడలో రైలు ఆగగానే రైల్వే పోలీసులను సంప్రదించగా వారు కనీసం స్పందించకపోగా మీరు ఖమ్మం వెళ్లి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని చెప్పారు. కనీసం మానవత్వం కూడా లేకుండా రక్తం కారుతున్న మహిళలకు ప్రాథమిక చికిత్స చేయకుండా అక్కడి పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మహిళలు మీడియా వద్ద వాపోయారు. ఇద్దరి మహిళలలో పద్మ అనే మహిళ పుస్తెలతాడు, గుగులోతు సుజాత రెండు తులాల చైన్, రెండు బంగారు రింగులు, వెయ్యి రూపాయల నగదును ఆగంతుకుడు అపహరించుకుపోయాడు. వీరిలో సుజాత చైన్నె నుంచి వస్తుండగా, పద్మ సూళ్లూరుపేట నుంచి వస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే మహిళా బోగీలలో జొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటే రాత్రిపూట ప్రయాణం చేసే మహిళలకు భద్రత ఎక్కడిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నవజీవన్ స్టాపింగ్ పునరుద్ధరణ
రైల్వేస్టేషన్లో ఆనందోత్సాహాలు సూళ్లూరుపేట: చెన్నై–అహమ్మదాబాద్‌ల మధ్య తిరుగుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్‌ను శనివారం నుంచి పునరుద్ధరించడంతో జైన్ సోదరులు, ప్రజా సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి స్టాపింగ్ ఇచ్చినట్టే ఇచ్చి పాజిబులిటీ లేదని ఈనెల మొదటి వారం నుంచి స్టాపింగ్ రద్దు చేశారు. దీంతో జైన్ సోదరులు, వివిధ ప్రజాసంఘాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలిసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌కు జైన్ సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆయన ఢిల్లీస్థాయిలో రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో మాట్లాడి స్టాపింగ్‌ను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. లోక్‌సత్తా నాయకులు శ్రీపతి రవీంద్ర కూడా తనవంతు ప్రయత్నం చేసి డీఆర్ఎంకు లేఖ రాశారు. అందరూ మూకుమ్మడిగా చేసిన ప్రయత్నాలు, ఆందోళన వల్ల రైల్వే బోర్డు స్పందించి శనివారం ఉదయం 10.55 గంటలకు నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను ఎట్టికేలకు ఆపారు. దీంతో జైన్ సంఘాల వారు, ఛాంబర్ ఆప్ కామర్స్ నుంచి అందరూ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ట్రైన్ డ్రైవర్‌కు, స్టేషన్ సిబ్బందికి స్వీట్లు పంచారు. ఇకనుంచి ఈ ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపింగ్‌ను నిరంతరాయంగా కొనసాగించాలని వారు స్టేషన్ సిబ్బందిని కోరారు. స్టాపింగ్ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు, ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌కు పట్టణ ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
పోలీసు అధికారే దోపిడీ సూత్రధారి
-
పోలీసు అధికారే దోపిడీ సూత్రధారి
నెల్లూరు: నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీ కేసు సంచలన మలుపు తిరిగింది. బంగారం వ్యాపారి నుంచి రూ. 90 లక్షల దోపిడీలో ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీడీ సమయ్‌జాన్‌రావేనని తేలడంతో నెల్లూరు జిల్లా పోలీసులు సోమవారం ఆయనను అరెస్టు చేశారు. ఏఎస్పీ హోదా కలిగిన సమయ్ జాన్ రావు గత నాలుగేళ్లుగా మార్కాపురంలో ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఏఆర్ కానిస్టేబుళ్లతో కలిసి సమయ్ జాన్ రావు భారీ దోపిడీకి పథకం రచించారని, తమ దర్యాప్తులో అందుకు తగిన ఆధారాలు లభ్యమయ్యాయని నెల్లూరు ఎస్పీ చెప్పారు. నిందితులను కావలి కోర్టులో హాజరుపర్చడంతోపాటు శాఖపరమైన చర్యలకు కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ నెల 14న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ. 82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులమని చెప్పి తుపాకీ చూపించి వారిని బెదిరించారు. పడుగుపాడు స్టేషన్ సమీపంలో ఆ రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో విచారణ పేరుతో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లి, అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్దకు వెళ్లిన తరువాత వారి వద్ద ఉన్న 82 లక్షల రూపాయలను తీసుకుని వ్యాపారులను వదిలి పారిపోయారు. బంగారు వ్యాపారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటన జరిగిన మరుసటిరోజే నిందితులను అరెస్టు చేయడంతోపాటు వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ ముగ్గురు కానిస్టేబుళ్లలో వెంకటసుబ్బయ్య, నాగరాజులు ఒంగోలులో పనిచేస్తుండగా, రవి చీరాలలో విధులు నిర్వర్తించేవాడు. -
తుపాకీతో బెదిరించి రూ.82 లక్షల దోపిడీ
-
రూ. 82 లక్షలు దోపిడీ చేసిన కానిస్టేబుళ్లు
కావలి: బంగారు వ్యాపారులను బెదిరించి కానిస్టేబుళ్లు రూ. 82 లక్షలు దోపిడీ చేసిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. దోపిడీ జరిగిన కొన్ని గంట ల్లోనే నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ముగ్గు రు ప్రకాశం జిల్లా కానిస్టేబుళ్లని సమాచారం. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ. 82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి తాము పోలీసులమని తుపాకీ చూపి బెదిరించారు. మీపై అనుమానంగా ఉందని చెప్పి పడుగుపాడు స్టేషన్ సమీపంలో ఆ రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకె ళ్లారు. అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్ద వ్యాపారులను వదిలేశారు. అక్కడ నుంచి నలుగురు వ్యక్తు లు వెళ్లిపోయారు. మోసం జరిగిందని తెలుసుకున్న బంగారు వ్యాపారులు కావలి పోలీసులను ఆశ్రయించగా వారు నిందితులు ప్రయాణించిన అంబాసిడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఓ కారులో వెళ్తున్న వారిని సినీఫక్కీలో వెంబడించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. స్టూవర్టుపురానికి చెందిన మరో నిందితుడు పరారయ్యాడు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాలకు చెందిన ఏఆర్ కానిస్టేబుళ్లుగా అనుమానిస్తున్నారు. -
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
విజయవాడ: నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. ఈ రైలు విజయవాడ రైల్వేస్టేషన్‌లోని 6వ నెంబరు ఫ్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉండగా తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగింది. దుండగులు ప్రయాణికుల వద్ద నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు దోచుకువెళ్లారు. బాధిత ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ** -
‘నవజీవన్’లో మంటలు
బాపట్ల, న్యూస్‌లైన్: చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు ఉలిక్కిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 2.55 గంటలకు గుంటూరు జిల్లా బాపట్ల నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా అప్పికట్ల వద్దకు వచ్చేసరికి ఎస్-9 బోగి కింద భాగం నుంచి మంటలు వచ్చాయి. దీంతో బోగీ అంతా పొగ కమ్మేయడంతో ప్రయాణికులు కేకలు వేశారు. వెంటనే చైన్‌లాగి రైలును నిలుపుదల చేశారు. డ్రైవర్, గార్డు మంటలను అదుపుచేశారు. తెనాలి నుంచి ఇంజనీర్లు వచ్చి మరమ్మతులు చేశారు. రైలు చక్రం పైన ఉండే డైనమా బెల్ట్ ట్రిప్ కావడంవల్ల మంటలు వ్యాపించాయని వారు తెలిపారు. ఈ కారణంగా రైలు సుమారు అర గంటపాటు నిలిచిపోయింది.