పోలీసు అధికారే దోపిడీ సూత్రధారి
నెల్లూరు: నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీ కేసు సంచలన మలుపు తిరిగింది. బంగారం వ్యాపారి నుంచి రూ. 90 లక్షల దోపిడీలో ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీడీ సమయ్‌జాన్‌రావేనని తేలడంతో నెల్లూరు జిల్లా పోలీసులు సోమవారం ఆయనను అరెస్టు చేశారు. ఏఎస్పీ హోదా కలిగిన సమయ్ జాన్ రావు గత నాలుగేళ్లుగా మార్కాపురంలో ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఏఆర్ కానిస్టేబుళ్లతో కలిసి సమయ్ జాన్ రావు భారీ దోపిడీకి పథకం రచించారని, తమ దర్యాప్తులో అందుకు తగిన ఆధారాలు లభ్యమయ్యాయని నెల్లూరు ఎస్పీ చెప్పారు. నిందితులను కావలి కోర్టులో హాజరుపర్చడంతోపాటు శాఖపరమైన చర్యలకు కూడా తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ నెల 14న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ. 82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులమని చెప్పి తుపాకీ చూపించి వారిని బెదిరించారు. పడుగుపాడు స్టేషన్ సమీపంలో ఆ రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో విచారణ పేరుతో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లి, అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్దకు వెళ్లిన తరువాత వారి వద్ద ఉన్న 82 లక్షల రూపాయలను తీసుకుని వ్యాపారులను వదిలి పారిపోయారు.
బంగారు వ్యాపారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటన జరిగిన మరుసటిరోజే నిందితులను అరెస్టు చేయడంతోపాటు వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ ముగ్గురు కానిస్టేబుళ్లలో వెంకటసుబ్బయ్య, నాగరాజులు ఒంగోలులో పనిచేస్తుండగా, రవి చీరాలలో విధులు నిర్వర్తించేవాడు.