train robbery
-
మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
కేసముద్రం: సిగ్నల్ టాంపరింగ్‌తో రైలును నిలిపివేసిన దొంగలు ఇద్దరు ప్రయాణికుల మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం రైల్వేస్టేషన్ సమీపంలోని ఐబీ సిగ్నల్ పాయింట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వైపు శనివారం రాత్రి మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. కేసముద్రం–తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం తెల్లవారుజామున 1.40 గంటలకు రైలు ఆగిపోయింది. అప్పటికే ఎస్–5 బోగీలో కాచుకుని ఉన్న దుండగులు, భాగ్యనగర్‌తండాకు చెందిన మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు, అదే తండాకు చెందిన మరో వ్యక్తి మెడలో ఉన్న తులంనర బంగారు చైన్ లాక్కుపోయారు. బాధితులు కేకలు వేయడంతో దుండగులు ఎస్–6 బోగీలోకి పరుగుతీసి అక్కడా చోరీకి ప్రయ త్నించగా ప్రయాణికులు గట్టిగా కేకలు పెట్టడంతో కిందకు దూకి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను విచారించగా ముగ్గురు వ్యక్తులు బోగీలోకి వచ్చినట్లు తెలిపారు. దీంతో ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందం చుట్టుపక్కల గాలింపు చేపట్టింది. బాధి తులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సిగ్నల్ టాంపరింగ్ చేయడం ద్వారా దుండగులు రైలును నిలిపివేసినట్లు అనుమానిస్తున్నామని జీఆర్పీ సీఐ వినయ్‌కుమార్ చెప్పారు. ఇదే ప్రాంతంలో ఈ ఘటనకు ముందూ దుండగులు బెంగళూరు నుంచి పట్నా వెళ్లే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను ఆపడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. -
అప్రమత్తతతో నేరాలకు చెక్
నెల్లూరు(క్రైమ్): వేసవిలో రైళ్లలో దోపిడీలు, దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన గస్తీకి పూనుకున్నారు. నేరాల నియంత్రణకు ప్రయాణికులకు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడం...కిక్కిరిసిన జనాల మధ్యన ప్రయాణం చేయాల్సి రావడం దొంగలకు వరంగా మారింది. దొంగతనాల నివారణకు రైల్వేశాఖ పలు చర్యలు చేపడుతున్నా ప్రయాణికుల సంఖ్యకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వేసవిలో నేరాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో దొంగతనాలను నియంత్రించేందుకు నెల్లూరు జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్త కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నారు. రైల్వేప్లాట్‌ఫామ్‌లపై నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో జిల్లా మీద రాకపోకలు సాగించే దాదాపు అన్నీ రైళ్లల్లో పోలీసు బీట్లను ఏర్పాటు చేశారు. సిబ్బంది రైళల్లో గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు తారసపడితే వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల భద్రత దృష్ట్యా బీట్ సిబ్బంది వద్ద ఉన్న పుస్తకంలో జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ అధికారుల ఫోను నంబర్లు అందుబాటులో ఉంచారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే ప్రయాణికులు విజయవాడ, గుంతకల్ కంట్రోల్‌రూమ్‌కు, ఉన్నతాధికారులకు, సమీపంలోని రైల్వేపోలీసు అధికారులకు సమాచారం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నిందితులను త్వరిగతిన పట్టుకునే అవకాశం ఉంది. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెంచారు. అలార్మింగ్ చైన్ పుల్లింగ్ జరిగే ప్రాంతాలైన ఎల్సీగేట్, సిగ్నలింగ్ పాయింట్, రోడ్డు సమీపంలోని రైల్వేట్రాక్ ఏరియాలతో పాటు తలమంచి, మనుబోలు, వెందోడు ప్రాంతాల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందితో పికెట్లు ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణకు రైల్వే పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత కొంతకాలంగా నేరాలకు పాల్పడుతున్న మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ ఎం శ్రీనివాసు అలియాస్ చెన్నై శ్రీనును నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.33లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులందరూ పూర్తిస్థాయిలో సహకరిస్తే నేరాలను కట్టడి చేస్తామని రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలపై నిఘాల రైళల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రకు చెందిన ముఠాలు, తమిళనాడుకు చెందిన పలువురు దొంగలు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో వారి కదలికలపై నిఘా ఉంచారు. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించారు. వారి ఛాయాచిత్రాలను రైల్వేస్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌లపై ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రైళల్లో దొంగలు కనిపిస్తే కాల్చివేయమని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దొంగలు కనిíపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రైల్వే పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ నేరాలు అదుపునకు రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు సైతం తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ♦ ప్రయాణ సమయంలో ఒంటిపై ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించడం మంచిదికాదు. ♦ ఒంటిపై ఆభరణాలు వేసుకున్నా బయటకు కనిపించకుండా చూసుకోవాలి. ♦ విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌లను పక్కవారికి అప్పగించడం, రైల్లోనే వదిలేసి రైలు ఆగిన సమయంలో ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్లడం వంటివి చేయరాదు. ♦ చాలామంది విలువైన వస్తువులను సైతం కర్రసంచుల్లో నిర్లక్ష్యంగా ఉంచి తీసుకెళుతున్నారు. ఇలా చేయడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఉంటుంది ♦ తమ బ్యాగులు, సూట్‌కేసులకు చైన్‌లాక్ సిస్టంను వేసుకోవాలి. ♦ దొంగలు సైతం ప్రయాణీకుల వలే పక్కనే కూర్చుని మాయమాటలు చెబుతారు. ఇలాంటి వారి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ♦ అపరిచిత వ్యక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలను తినరాదు. ♦ రాత్రి వేళల్లో ప్రయాణించే సమయంలో కిటికీలు మూసుకోవాలి. ♦ బోగీ ప్రధాన ద్వారాలను సిబ్బంది మూస్తారు. ప్రయాణికులు వాటిని ఎప్పటికప్పుడు తెరవకూడదు. ♦ అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే డయల్ 100, రైల్వే పోలీసు కంట్రోల్‌రూమ్ నంబర్ 1082కు సమాచారం అందించాలి. గస్తీ ముమ్మరం రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. వేసవి దృష్ట్యా రైళ్లలో గస్తీని ముమ్మరం చేశాం. నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక సిబ్బందితో పికెట్లు ఏర్పాటు చేశాం. దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే ముఠాలు, పాతనేరస్థుల కదలికలపై నిఘా ఉంచాం. దొంగలు కనిపిస్తే కాల్చివేయమని ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రయానికులు సహకరించాలి.– జీ దశరథరామారావు, నెల్లూరు రైల్వే సీఐ -
అడ్డగిస్తే హతమారుస్తారు..!
గుంటూరు: విహార యాత్రలకు వెళ్లినట్టుగా సరదాగా వెళ్లి, దోపిడీలు, దొంగతనాలు చేస్తారు... ఆ సమయంలో ఎవరైనా అడ్డగించేందుకు యత్నిస్తే రాళ్లు, ఇనుప రాడ్లతో కొట్టి హతమార్చేందుకు కూడా వెనుకాడరు. చోరీలను వృత్తిగా ఎంచుకున్న వీరు ఇతర రాష్ట్రాల్లో చోరీలు చేసి స్వగ్రామాలకు వెళ్లి సరదాగా గడుపుతారు. ఆ మధ్య వచ్చిన ఖాకీ చిత్రం తరహాలోనే వీరు దోపిడీలు కొనసాగిస్తారంటే అతిశయోక్తి కాదు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు దోపిడీ దొంగల ముఠా సభ్యులను బుధవారం గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించే క్రమంలో పలు వాస్తవాలు వెలుగు చూశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధారా జిల్లా ఖరాచక్బాగ్ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల సభ్యులు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారు. మూడు నుంచి వారం రోజులపాటు ముందుగా నిర్దేశించుకున్న పట్టణాలకు రైలు మార్గంలోనే ముఠా సభ్యులు ప్రయాణాలు చేస్తుంటారు. ఆ సమయంలో వారు సెల్ఫోన్లు కూడా వాడకపోవడం గమనార్హం. చోరీలు ఇలా... తెలుగు రాష్ట్రాల్లో సంపాదన, సంపద మధ్యప్రదేశ్ రాష్ట్రం కంటే అధికంగా ఉంటుందని, పత్రికల ద్వారా తెలుసుకున్నారు. దీంతో కొన్ని ముఠాలు తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో కొద్ది నెలలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చోరీలను చేయడం ప్రారంభించారు. ఇప్పటికే 23 ప్రాంతాల్లో చోరీలు చేసి దర్జాగా వెళ్లినట్టు పోలీసుల విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఈ దిశగా పోలీసులు రెండు రాష్ట్రాల్లోని పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దర్యాప్తును వేగవంతంగా కొనసాగిస్తున్నట్టు సమాచారం. దోపిడీ చేయడమే లక్ష్యం... వీరు రైలు మార్గాలకు సమీపంలో ఉన్న పెద్ద పెద్ద అపార్టుమెంట్లను లక్ష్యంగా చేసుకుంటారు. రైలు దిగిన వెంటనే గంటపాటు రెక్కీ నిర్వహించి వెళ్లిపోతారు. అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిపై ముఠా సభ్యులందరూ కలిసి ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించి నిమిషాల వ్యవధిలో దోపిడీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ సమయంలో ఇంటి యజమానులు ఎవరైనా అడ్డుకునేందుకు, కేకలు వేసేందుకు యత్నించినా నిర్దాక్షిణ్యంగా వారి వెంట తెచ్చుకున్న రాళ్లు, ఇనుపరాడ్లతో తలపై మోది హతమార్చేందుకు కూడా వెనుకాడని ప్రమాదకరమైన దొంగలు. దోపిడీ పూర్తయిన అనంతరం వెంటనే సమీపంలోని రైలు మార్గం ద్వారానే మరో ప్రాంతానికి వెళ్లి అదేరోజు రాత్రి మరో దోపిడీ చేస్తారు. అక్కడి నుంచి వారు నిర్దేశించుకున్న నగదు, డబ్బు దోచుకున్న అనంతరం వారి స్వగ్రామానికి వెళతారు. ఎవరైనా పోలీసులు నిందితులను గుర్తించి ఆ గ్రామానికి వెళ్లాలని యత్నిస్తే దాడులు చేసేందుకు కూడా వెనుకాడబోరని అక్కడ ఉన్న పోలీసులే వెళ్లవద్దని చెప్పారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. నాణ్యమైన సీసీ కెమెరాలు వినియోగించాలి అపార్టుమెంట్లు, భవనాల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలి. హోటళ్లు, దుకాణాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పనిచేస్తున్నట్టు అయితే సమీప పోలీసు స్టేషన్లో వారి సమాచారాన్ని తప్పకుండా అందజేయాలి. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలి.– అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయారావు -
చొక్కా చెప్పిన ఆచూకీ..
‘‘ఆడు మగాడురా బుజ్జీ. ఎవడైనా కోపంతో కొడతాడు. లేదా బలంగా కొడతాడు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.’’ అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్ ఇదీ. ఇప్పుడు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న ‘వాంగ్మోడే’ నేర చరిత్ర చూస్తే.. అచ్చం ఇలాగే ఉంటుంది. రైల్వే చోరీల్లో ఆరితేరిన ఇతను తన ముఠాతో కలిసి రంగంలోకి దిగితే ఆ రైలు నిలువు దోపిడీకి గురవ్వాల్సిందే. ‘ఉయ్ డోంట్ వాంట్ ఫర్ఫెక్ట్ లైఫ్.. ఉయ్ వాంట్ హ్యాపీ లైఫ్’ ఫిలాసఫీతో చోరీలకు పాల్పడే ఈ ముఠా దోచుకున్న సొమ్మునంతా జల్సాలకే వెచ్చిస్తుండటం విశేషం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: షోలాపూర్‌కు చెందిన పార్థి గ్యాంగ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నెల రోజుల్లో ఏడు రైళ్లను కొల్లగొట్టిన దొంగల ముఠాను పట్టుకోవడం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. ఈ చోరీల వ్యవహారం రాష్ట్రంతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖలోనూ కలకలం రేపింది. ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో రైల్వే డీజీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చోరీల నియంత్రణ బాధ్యతను జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తన భుజానికెత్తుకున్నారు. ఇప్పటికే జీఆర్పీ, సివిల్ పోలీసులతో రెండు బృందాలను ఏర్పాటు చేసి షోలాపూర్‌కు పంపించారు. రైల్వే దొంగతనాలకు పాల్పడిన ముఠా తీరుతెన్నులు, జీవనశైలి, అక్కడి రాజకీయ నేతల అండదండలు తదితర అంశాలను లోతుగా పరిశీలిస్తే ఆ గ్యాంగ్‌ను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలేనని తెలుస్తోంది. జిల్లాలో గుత్తి–తాడిపత్రి’ మధ్య గత జూన్ 21 నుంచి జూలై 17వ తేదీ వరకు ఏడు చోట్ల చోటు చేసుకున్న వరుస రైల్వే చోరీల సందర్భంగా లభించిన ఆధారాలతో షోలాపూర్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఈనెల 16న షోలాపూర్‌కు ప్రత్యేక బృందాలను పంపిన మరుసటి రోజు కూడా మరో రైలులో చోరీ జరిగింది. ఆ తర్వాత 18వ తేదీన మహారాష్ట్రలోని కురుద్వాడి వద్ద మరో రైలును కొల్లగొట్టడం గమనార్హం. తప్పించుకున్న వ్యక్తే కీలకం 2016లో గార్లదిన్నె, తాటిచెర్ల వద్ద సిగ్నల్ కట్ చేసిన దొంగలు రెండు రైళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసుల తనిఖీల్లో రైల్వేపట్టాల సమీపంలో ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఓ చొక్కా కాలర్‌పై ప్రభాకర్ వాంగ్మోడే అనే పేరు కన్పించింది. షోలాపూర్‌లో దుస్తులు ఇస్త్రీకి ఇస్తే పేర్లు రాయడం అలవాటు. ఈ క్లూతో అప్పట్లో పోలీసులుషోలాపూర్లో దొంగల కోసం గాలించారు. కేసులో ఐదుగురిని చేర్చి నలుగురిని అరెస్టు చేశారు. ఒకరు తప్పించుకున్నారని కేసు నమోదు చేశారు. పట్టుబడిన నలుగురూ మామూలు దొంగలు కాగా తప్పించుకున్న వ్యక్తే వాంగ్మోడే. ఇతను ఈ దొంగల ముఠాకు నాయకుడు. పోలీసులు అప్పట్లో ఈ కేసును సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఇటీవల వరుస చోరీలకు కారణమైంది. ఎవరీ వాంగ్మోడే.. షోలాపూర్‌లోని నార్కెడ్ ఇతని స్వగ్రామం. పార్థి గ్యాంగ్ తరహా చోరీలకు పాల్పడే దన్గర్ తెగకు చెందిన వ్యక్తి. అనంతపురం జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ఏడు రైళ్లను కొల్లగొట్టి చల్లగా జారుకున్నాడు. కర్ణాటకలో 2.. మహారాష్ట్రలో 2 చోట్ల కూడా రైళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. చొక్కా చెప్పిన ఆచూకీ ఎంతటి చాకచక్యంగా చోరీలకు పాల్పడే దొంగలైనా.. ఎక్కడో ఒకచోట తప్పు చేయడం సహజం. 2016లో అనంతపురం జిల్లాలో రైల్వే చోరీలు చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంగా పోలీసులు తనిఖీలు చేపట్టగా ఒక చోట రైల్వే పట్టాల సమీపంలో ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఓ చొక్కా కాలర్‌పై ప్రభాకర్ వాంగ్మోడే అనే పేరు కన్పించింది. షోలాపూర్‌లో దుస్తులు ఇస్త్రీకి ఇస్తే పేర్లు రాయడం అలవాటు. అలా ఈ వాంగ్మోడే వెలుగులోకి వచ్చాడు. 35–40 గ్రామాల్లో గాలించిన పోలీసులు షోలాపూర్‌కు వెళ్లిన బృందాలు అక్కడి పోలీసులను సంప్రదించారు. అక్కడి పోలీసులు, దొంగలకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఏపీ పోలీసులకు మహారాష్ట్ర పోలీసులు సహకరించరని తెలుస్తోంది. అయితే మహారాష్ట్రలో కూడా దొంగతనాలు జరగడంతో అక్కడి పోలీసులపైనా ఒత్తిడి పెరిగింది. చివరకు ఇరు రాష్ట్రాల పోలీసులు వాంగ్మోడే పాత్రపై అనుమానించి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ పోలీసులు ఈనెల 16 నుంచి షోలాపూర్ జిల్లాలోని 35–40గ్రామాలను జల్లెడ పట్టారు. దొంగలకు అడ్డాగా ఉన్న మొహల్తో పాటు వాంగ్మోడే సొంత ప్రాంతమైన నార్కెడ్లో కలియతిరిగినా వాంగ్మోడే ఆచూకీ లేకపోయింది. పోలీసు వర్గాల్లో, గ్రామాల్లోని వ్యక్తులు పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు వాంగ్మోడేతో పాటు అక్కడి గ్యాంగ్‌కు అందిస్తుండటంతోనే ఆచూకీ లభించడం లేదని సమాచారం. ఇప్పటి వరకు 3–4 ముఠాలను గుర్తించినా.. షోలాపూర్ పోలీసులతో పాటు పూణేక్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో వేట కొనసాగిస్తున్నారు. చంపేందుకూ వెనుకాడని గ్యాంగ్: దొంగతనాల్లో అధికశాతం ‘పార్థిగ్యాంగ్’ హస్తమే ఉంటోంది. అయితే వాంగ్మోడే దన్గర్ తెగకు చెందిన వ్యక్తి. అవసరమైతే వీరు ఎంతకైనా తెగబడతారు. గతంలో మహారాష్ట్రలోని అక్లూజీ స్టేషన్ పరిధిలో ముగ్గురు దొంగలను పట్టుకునేందుకు వెళితే పోలీసులకు సమాచారం అందించిన ఇన్ఫార్మర్ను గొంతుకోసి చంపేశారు. మరో హెడ్‌కానిస్టేబుల్ పొట్టలో పొడిచారు. దీంతో వీరిపై అక్కడి ప్రభుత్వం మోకా యాక్టు(మహారాష్ట్ర ఆర్గనైజర్ క్రైమ్ యాక్టు)ను తీసుకొచ్చింది. ఇది ఆ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన చట్టం. కఠిన సెక్షన్లతో జైలుకు పంపడటంతో పాటు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వారు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. వీరికి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉండవు. వీటి ఆధారంతో పోలీసులు పట్టుకుంటారని తీసుకోరు. ఇళ్లు కూడా ఉండవు. రేకులషెడ్లు వేసుకుని జీవిస్తుంటారు. మోకా యాక్టు పెడితే షెడ్డులో ఏమీ ఉండదు. అక్కడి రాజకీయ నేతలు కూడా వీరికి మద్దతు. కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్‌కుమార్ షిండే ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించేవారు. ఇప్పుడు ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారు. చోరీ సొమ్మంతా జల్సాలకే.. దొంగలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణికుల నుంచి బంగారం చోరీ చేస్తారు. దీన్ని అక్కడి బంగారు దుకాణాల్లో అతి తక్కువ ధరకు విక్రయిస్తారు. ప్రస్తుతం తులం రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఠాను పోలీసులు పట్టుకుని విక్రయించిన వ్యాపారుల వద్దకు వెళితే ఎంతో కొంత రికవరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత రిస్కు తీసుకున్నందుకు తులంపై రూ.10వేలు వ్యాపారి ఆశిస్తాడు. దీంతో తక్కువ ధరకే బంగారం విక్రయిస్తారు. ఈ డబ్బుతో విచ్చలవిడిగా మద్యం, ఆహారంతో పాటు పేకాట ఆడతారు. చోరీ చేసిన సొమ్ముతో జీవితాలను బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి చట్టాలపైనా వీరికి అవగాహన ఎక్కువే. నిఘా పెట్టాం..దొంగలను పట్టుకుంటాం రైల్వే దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. రెండు బృందాలను షోలాపూర్ పంపించాం. జీఆర్పీ, సివిల్, రైల్వే పోలీసులు సంయుక్తంగా ప్రణాళికతో వ్యవహరిస్తున్నాం. కొన్ని బృందాలపై అనుమానాలు ఉన్నాయి. పాతనేరస్తులను గుర్తించి వారిని విచారిస్తున్నాం. ప్రస్తుతం చోరీలను అరికట్టగలిగాం. తాటిచెర్ల, గార్లదిన్నె ఘటనలను కూడా ఈ దొంగతనాల కేసులో పరిగణనలోకి తీసుకుని ఆరా తీస్తున్నాం. – జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
రైళ్లలో..దొంగల భయం..!
అసలే వేసవి సీజన్..ఈ సమయంలో రైలు ప్రయాణాలు అధికంగానే ఉంటాయి. యాత్రలు..పుణ్యక్షేత్రాల సందర్శన, పర్యాటక టూర్లుకు వేలాదిగా రైళ్లలో వెళుతుంటారు. బోగీలలో ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో దొంగలు ఏకంగా దోపిడీకి పాల్పడుతున్నారు. కిటికీల వద్ద ఉన్న వారి వద్ద నగలు చోరీ చేస్తున్నారు. రైలు రన్నింగ్‌లో పరారీ అవుతున్నారు. అయితే రైళ్లలో విధులు నిర్వర్తించే విషయంలో ఖాకీల సంఖ్య చాల తక్కువుగా ఉంది. ఇదే దొంగలకు కలిసివస్తోంది. రాజంపేట/ కడప కోటిరెడ్డి సర్కిల్ : ఈనెల 23న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలు రిజర్వేషన్ బోగీలో కడపకు చెందిన ఫాతిమా ప్రయాణం చేస్తోంది. ఈమె బ్యాగులోని నగదు దోపిడీ చేశారని కాచిగూడ రైల్వేస్టేషన్లో జీఆర్పీలకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లాలో ఇటీవలన రెండు రైళ్ల దోపిడీ దొంగల బీభత్సం ఒక్కసారిగా రైల్వే ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. గుత్తి రైల్వే జంక్షన్ పరిధిలో రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోకి మరణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడిన సంఘటన రైల్వే రక్షక దళాలు, ప్రభుత్వ రైల్వే పోలీసులను కలవరపాటుకు గురిచేసింది. ఇదే రీతిలో రెండేళ్ల కిందట సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో హస్తవరం రైల్వేస్టేషన్లో దోపిడీకి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. రైళ్లలో నిత్యం చిన్నచిన్న చోరీలు ఆడపదడపా జరుగుతూనే ఉన్నాయి. రద్దీగా నడుస్తున్న రైళ్లు జిల్లా మీదుగా నడిచే రైళ్లలో ఇప్పుడు రద్దీ రైలు సామర్ధ్యంకన్నా అధికమైంది. జిల్లా మీదుగా అటు తిరుపతి, చెన్నై, కన్యాకుమారి, అటు ముంబాయి, కొల్హాపూర్, హుబ్లీ, కర్నూలు, హైదరాబాదు, నిజామాబాదు, కాచిగూడల రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రైళ్లన్నింటిలోనూ జనరల్ బోగీలతోపాటు రిజర్వేషన్ బోగీలు ప్రయాణికులు ఫుల్‌గా ఉంటున్నారు. ఒకొక్కసారి పార్శిల్ వ్యాన్‌లో కూడా ప్రయాణికులు ప్రయాణం చేయక తప్పడంలేదు. అరకొరగా ఎస్కార్ట్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ విభాగాలకు చెందిన వారితో అరకొరగా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అరకొరగా ఉన్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఒకొక్క స్టేషన్ నుంచి ఇద్దరు ట్రైన్గార్డ్స్ (బీట్కానిస్టేబుల్స్)గా విధులు నిర్వహిస్తున్నారు. ఒక బీట్‌లో 3 నుంచి 4 రైళ్లను కవర్ చేసే విధంగా డ్యూటీలు అమలు చేస్తున్నారు. వీరితో పాటు ఆర్పీఎఫ్ విభాగం నుంచి ఇద్దరు ఉంటారు. కనీసం ఒక బీట్‌కు నలుగురు జీఆర్పీ పోలీసులు, నలుగురు ఆర్పీఎఫ్ పోలీసులను ఒక బీట్‌లో వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కవర్ చేసే విధంగా ఉంటే ప్రయాణికుల భద్రత పటిష్టపరిచే విధంగా ఉంటందనేది ప్రయాణికులు వాదన. ఆర్పీఎఫ్ విభాగానికి చెందిన వారి విధులు కూడా బలోపేతంగా లేవన్న విమర్శలున్నాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లే దొంగల టార్గెట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. టికెట్ తీసుకొని అనుమానం రాకుండా బోగీలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడతున్న దొంగలు కొందరు.. అలాగే రైళ్లను దారికాచి దోపిడీకి దిగుతున్నారు. ఇందులో రైళ్లను వ్యూహాత్మకంగా నిలిపివేసేందుకు పాల్పడి, ఆ తర్వాత బోగీ వద్ద ఒకరు వంగితే వానిపై మరొకరు ఎక్కి కిటీకీల పక్కన గాఢనిద్రలో ఉన్న వారి మెడలో నగలను దోచుకుంటున్నారు. అధికంగా ఉత్తరాదికి చెందిన ముఠాలే రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లుగా రైల్వే వర్గాల నుంచి వాదన వినిపిస్తోంది. అమలు కానీ ఉత్తర్వులు రైళ్లల్లో దోపిడీ దొంగల బీభత్సం జరుగుతున్న జీఆర్పీ పోలీసులకు కాల్చివేత ఉత్తర్వులు అమలు కాలేదు. ఎలాంటి అయుధాలు లేకుండా సిబ్బంది ఎస్కార్ట్ డ్యూటీకి వస్తున్నారు. అర్థరాత్రి 1గంట అవుతూనే స్లీపర్ క్లాస్‌లో ఎక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయో చూసుకుని నిద్రకు జారుకుంటున్నారు. టీసీలు ప్రొత్సహిస్తున్నారు రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు జనరల్ టిక్కెట్లు తీసుకుని అనధికార వ్యక్తులను టీటీఏలు యథేచ్ఛగా ఖాళీ బెర్తులు లేకపోయినా లోపల కూర్చుంటామంటే ఫైన్ కట్టించుకుని అనుమతిస్తున్నారు. దీనివల్ల స్వీపర్ బోగీల్లో ప్రయాణికులకు భద్రత లేకుండా పోతోంది. ఆ రైలుకు ఇద్దరే.. చిత్తూరు నుంచి కాచిగూడకు వెళుతున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో కడప రైల్వేస్టేషన్ వరకు ఇద్దరు ఎస్కార్ట్‌గా వచ్చి కడపలో దిగుతున్నారు. 22 నుంచి 24లు బోగీలు ఉంటే 12 మంది ఎస్కార్ట్ సిబ్బంది ఉండాలి. కానీ ఇలా జరగడంలేదు. -
రైల్లో చోరీ.. ఎమ్మెల్యేలు లబోదిబో
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రైల్లో తమ వస్తువులు పోయాయంటూ లబోదిబోమంటున్నారు. సీల్డా నుంచి మాల్డా వెళ్లే గౌర్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండు వేర్వేరు ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆసిఫ్ మెహబూబ్, సమర్ ముఖర్జీలకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని జీఆర్పీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రైలు రాంపుర్హట్-నల్హాటి స్టేషన్ల మధ్య ఉండగా తన ట్యాబ్ పోయిందని ఆసిఫ్ మెహబూబ్ చెప్పారు. ఇక తన ఓటరు గుర్తింపుకార్డు, ఎస్బీఐ పాస్‌బుక్, కొంత నగదు పోయినట్లు సమర్ ముఖర్జీ తెలిపారు. రెండు ఫిర్యాదులపై తాము దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ అధికారులు చెప్పారు. -
పోలీసు అధికారే దోపిడీ సూత్రధారి
-
పోలీసు అధికారే దోపిడీ సూత్రధారి
నెల్లూరు: నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీ కేసు సంచలన మలుపు తిరిగింది. బంగారం వ్యాపారి నుంచి రూ. 90 లక్షల దోపిడీలో ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీడీ సమయ్‌జాన్‌రావేనని తేలడంతో నెల్లూరు జిల్లా పోలీసులు సోమవారం ఆయనను అరెస్టు చేశారు. ఏఎస్పీ హోదా కలిగిన సమయ్ జాన్ రావు గత నాలుగేళ్లుగా మార్కాపురంలో ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఏఆర్ కానిస్టేబుళ్లతో కలిసి సమయ్ జాన్ రావు భారీ దోపిడీకి పథకం రచించారని, తమ దర్యాప్తులో అందుకు తగిన ఆధారాలు లభ్యమయ్యాయని నెల్లూరు ఎస్పీ చెప్పారు. నిందితులను కావలి కోర్టులో హాజరుపర్చడంతోపాటు శాఖపరమైన చర్యలకు కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ నెల 14న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ. 82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు పోలీసులమని చెప్పి తుపాకీ చూపించి వారిని బెదిరించారు. పడుగుపాడు స్టేషన్ సమీపంలో ఆ రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో విచారణ పేరుతో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లి, అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్దకు వెళ్లిన తరువాత వారి వద్ద ఉన్న 82 లక్షల రూపాయలను తీసుకుని వ్యాపారులను వదిలి పారిపోయారు. బంగారు వ్యాపారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటన జరిగిన మరుసటిరోజే నిందితులను అరెస్టు చేయడంతోపాటు వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ ముగ్గురు కానిస్టేబుళ్లలో వెంకటసుబ్బయ్య, నాగరాజులు ఒంగోలులో పనిచేస్తుండగా, రవి చీరాలలో విధులు నిర్వర్తించేవాడు. -
విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
విజయవాడ : విశాఖ-ముంబై ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏ1 బోగీలో క్లోరోఫామ్ చల్లి మహిళల వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అనంతరం విజయవాడ సమీపంలో చైన్ లాగి దుండగులు పరారయ్యారు. బాధితులు కాజీపేట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రయాణికులపై కాల్పులు.. రైలు దోపిడీ
చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకముందే మరో రైలు దోపిడీ జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఇటావా సమీపంలో సంగమ్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం రాత్రి ఈ దోపిడీ జరిగింది. దాదాపు డజను మంది సాయుధులు ప్రయాణికులపై కాల్పులు జరిపి, ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. మొత్తం అందరివద్ద ఉన్న నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని అక్కడినుంచి పరారయ్యారు. (చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం) అలహాబాద్ నుంచి మీరట్ వెళ్తున్న ఈ రైలు భర్తానా, ఎక్డిల్ రైల్వే స్టేషన్ల మధ్య ఆగినప్పుడు దుండగులు స్లీపర్ బోగీలోకి ప్రవేశించారు. వారిని ఆపేందుకు ఆ బోగీలో ప్రయాణిస్తున్న ముగ్గురు వైద్య విద్యార్థులు ప్రయత్నించగా, వాళ్లపై కాల్పులు జరిపి గాయపరిచారు. ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు, వాచీలు, నగలు.. అన్నింటినీ దోచుకుని, చైను లాగి పారిపోయారు. దొంగలను ఆపేందుకు రైల్లో ఉన్న పోలీసులు ప్రయత్నించగా, వాళ్లమీద కూడా కాల్పులు జరిపారు. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. (పక్కా ప్లాన్‌తోనే రైలు దోపిడీ) -
'జీరో' ఎఫ్ ఐ ఆర్ తో రైలు దొంగతనాలకు చెక్!
రైల్లో దొంగతనం జరిగితే ఏ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి? అన్ని రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీస్ స్టేషన్లుండవు. అలాంటప్పుడు ఏం చేయాలి? మౌలాలీలో దొంగతనం జరిగితే కాజీపేట దాకా ఆగాల్సిందేనా? అన్నవరంలో సూట్ కేస్ పోతే సామర్లకోట దాకా పోలీసుల కోసం వేచి ఉండాల్సిందేనా? ఇకపై ప్రయాణికులు అలా బాధపడుతూ కూర్చోనక్కర్లేదంటున్నారు రైల్వే పోలీసులు. ఇకపై జీరో ఎఫ్ ఐ ఆర్ అనే కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. ప్రయాణం చేస్తూనే ఏదో ఒక రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేయొచ్చు. దీన్ని ఆ స్టేషన్ సిబ్బంది సమీప పోలీస్ స్టేషన్ కు ఫ్యాక్స్ చేస్తారు. దాంతో పోలీసులు తక్షణమే రంగ ప్రవేశం చేయడానికి, దొంగల్ని పట్టుకోవడానికి వీలుంటుంది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన రైల్వే ఐజీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి దాకా ఏ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడి దాకా అన్నది పెద్ద సమస్యగా ఉంది. వేరే చోట దొంగతనం అయితే తమ స్టేషన్ లో కేసు నమోదు చేయమని పోలీసులు వాదిస్తున్నారు. దీని వల్ల పోలీసులు రంగంలోకి దిగడం ఆలస్యమౌతోంది. అంతలో దొంగలు సొమ్ముతో సహా ఉడాయించేస్తున్నారు. ఇదొక్కటే కాదు. గవర్నమెంట్ రైల్వే పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా సరిహద్దుల విషయంలో బోల్డన్ని పట్టింపులున్నాయి. ఇవన్నీ కేసులను నీరు కార్చేస్తున్నాయి. కొత్త విధానం అమలైతే ఆ సమస్యలన్నీ పరిష్కారమౌతాయని, వీలైనంత త్వరగా సొమ్ము రికవరీ చేయవచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ప్రయాణికులు కూడా జీరో ఎఫ్ ఐఆర్ 'జీరో' గా మిగలకూడదని, 'హీరో' గా ఎదగాలని కోరుకుంటున్నారు.