'జీరో' ఎఫ్ ఐ ఆర్ తో రైలు దొంగతనాలకు చెక్!
రైల్లో దొంగతనం జరిగితే ఏ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి? అన్ని రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీస్ స్టేషన్లుండవు. అలాంటప్పుడు ఏం చేయాలి? మౌలాలీలో దొంగతనం జరిగితే కాజీపేట దాకా ఆగాల్సిందేనా? అన్నవరంలో సూట్ కేస్ పోతే సామర్లకోట దాకా పోలీసుల కోసం వేచి ఉండాల్సిందేనా?
ఇకపై ప్రయాణికులు అలా బాధపడుతూ కూర్చోనక్కర్లేదంటున్నారు రైల్వే పోలీసులు. ఇకపై జీరో ఎఫ్ ఐ ఆర్ అనే కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. ప్రయాణం చేస్తూనే ఏదో ఒక రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేయొచ్చు. దీన్ని ఆ స్టేషన్ సిబ్బంది సమీప పోలీస్ స్టేషన్ కు ఫ్యాక్స్ చేస్తారు. దాంతో పోలీసులు తక్షణమే రంగ ప్రవేశం చేయడానికి, దొంగల్ని పట్టుకోవడానికి వీలుంటుంది.
ఢిల్లీలో శుక్రవారం జరిగిన రైల్వే ఐజీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి దాకా ఏ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడి దాకా అన్నది పెద్ద సమస్యగా ఉంది. వేరే చోట దొంగతనం అయితే తమ స్టేషన్ లో కేసు నమోదు చేయమని పోలీసులు వాదిస్తున్నారు. దీని వల్ల పోలీసులు రంగంలోకి దిగడం ఆలస్యమౌతోంది. అంతలో దొంగలు సొమ్ముతో సహా ఉడాయించేస్తున్నారు.
ఇదొక్కటే కాదు. గవర్నమెంట్ రైల్వే పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా సరిహద్దుల విషయంలో బోల్డన్ని పట్టింపులున్నాయి. ఇవన్నీ కేసులను నీరు కార్చేస్తున్నాయి.
కొత్త విధానం అమలైతే ఆ సమస్యలన్నీ పరిష్కారమౌతాయని, వీలైనంత త్వరగా సొమ్ము రికవరీ చేయవచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ప్రయాణికులు కూడా జీరో ఎఫ్ ఐఆర్ 'జీరో' గా మిగలకూడదని, 'హీరో' గా ఎదగాలని కోరుకుంటున్నారు.