‘‘ఆడు మగాడురా బుజ్జీ. ఎవడైనా కోపంతో కొడతాడు. లేదా బలంగా కొడతాడు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.’’ అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్ ఇదీ. ఇప్పుడు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న ‘వాంగ్మోడే’ నేర చరిత్ర చూస్తే.. అచ్చం ఇలాగే ఉంటుంది. రైల్వే చోరీల్లో ఆరితేరిన ఇతను తన ముఠాతో కలిసి రంగంలోకి దిగితే ఆ రైలు నిలువు దోపిడీకి గురవ్వాల్సిందే. ‘ఉయ్ డోంట్ వాంట్ ఫర్‌ఫెక్ట్ లైఫ్.. ఉయ్ వాంట్ హ్యాపీ లైఫ్’ ఫిలాసఫీతో చోరీలకు పాల్పడే ఈ ముఠా దోచుకున్న సొమ్మునంతా జల్సాలకే వెచ్చిస్తుండటం విశేషం.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: షోలాపూర్‌కు చెందిన పార్థి గ్యాంగ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నెల రోజుల్లో ఏడు రైళ్లను కొల్లగొట్టిన దొంగల ముఠాను పట్టుకోవడం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. ఈ చోరీల వ్యవహారం రాష్ట్రంతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖలోనూ కలకలం రేపింది. ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో రైల్వే డీజీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చోరీల నియంత్రణ బాధ్యతను జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తన భుజానికెత్తుకున్నారు. ఇప్పటికే జీఆర్‌పీ, సివిల్ పోలీసులతో రెండు బృందాలను ఏర్పాటు చేసి షోలాపూర్‌కు పంపించారు. రైల్వే దొంగతనాలకు పాల్పడిన ముఠా తీరుతెన్నులు, జీవనశైలి, అక్కడి రాజకీయ నేతల అండదండలు తదితర అంశాలను లోతుగా పరిశీలిస్తే ఆ గ్యాంగ్‌ను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలేనని తెలుస్తోంది. జిల్లాలో గుత్తి–తాడిపత్రి’ మధ్య గత జూన్ 21 నుంచి జూలై 17వ తేదీ వరకు ఏడు చోట్ల చోటు చేసుకున్న వరుస రైల్వే చోరీల సందర్భంగా లభించిన ఆధారాలతో షోలాపూర్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఈనెల 16న షోలాపూర్‌కు ప్రత్యేక బృందాలను పంపిన మరుసటి రోజు కూడా మరో రైలులో చోరీ జరిగింది. ఆ తర్వాత 18వ తేదీన మహారాష్ట్రలోని కురుద్వాడి వద్ద మరో రైలును కొల్లగొట్టడం గమనార్హం.
తప్పించుకున్న వ్యక్తే కీలకం
2016లో గార్లదిన్నె, తాటిచెర్ల వద్ద సిగ్నల్ కట్ చేసిన దొంగలు రెండు రైళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసుల తనిఖీల్లో రైల్వేపట్టాల సమీపంలో ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఓ చొక్కా కాలర్‌పై ప్రభాకర్ వాంగ్మోడే అనే పేరు కన్పించింది. షోలాపూర్‌లో దుస్తులు ఇస్త్రీకి ఇస్తే పేర్లు రాయడం అలవాటు. ఈ క్లూతో అప్పట్లో పోలీసులుషోలాపూర్‌లో దొంగల కోసం గాలించారు. కేసులో ఐదుగురిని చేర్చి నలుగురిని అరెస్టు చేశారు. ఒకరు తప్పించుకున్నారని కేసు నమోదు చేశారు. పట్టుబడిన నలుగురూ మామూలు దొంగలు కాగా తప్పించుకున్న వ్యక్తే వాంగ్మోడే. ఇతను ఈ దొంగల ముఠాకు నాయకుడు. పోలీసులు అప్పట్లో ఈ కేసును సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఇటీవల వరుస చోరీలకు కారణమైంది.
ఎవరీ వాంగ్మోడే..
షోలాపూర్‌లోని నార్కెడ్ ఇతని స్వగ్రామం. పార్థి గ్యాంగ్ తరహా చోరీలకు పాల్పడే దన్‌గర్ తెగకు చెందిన వ్యక్తి. అనంతపురం జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ఏడు రైళ్లను కొల్లగొట్టి చల్లగా జారుకున్నాడు. కర్ణాటకలో 2.. మహారాష్ట్రలో 2 చోట్ల కూడా రైళ్లలో చోరీలకు పాల్పడ్డాడు.
చొక్కా చెప్పిన ఆచూకీ
ఎంతటి చాకచక్యంగా చోరీలకు పాల్పడే దొంగలైనా.. ఎక్కడో ఒకచోట తప్పు చేయడం సహజం. 2016లో అనంతపురం జిల్లాలో రైల్వే చోరీలు చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంగా పోలీసులు తనిఖీలు చేపట్టగా ఒక చోట రైల్వే పట్టాల సమీపంలో ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఓ చొక్కా కాలర్‌పై ప్రభాకర్ వాంగ్మోడే అనే పేరు కన్పించింది. షోలాపూర్‌లో దుస్తులు ఇస్త్రీకి ఇస్తే పేర్లు రాయడం అలవాటు. అలా ఈ వాంగ్మోడే వెలుగులోకి వచ్చాడు.
35–40 గ్రామాల్లో గాలించిన పోలీసులు
షోలాపూర్‌కు వెళ్లిన బృందాలు అక్కడి పోలీసులను సంప్రదించారు. అక్కడి పోలీసులు, దొంగలకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఏపీ పోలీసులకు మహారాష్ట్ర పోలీసులు సహకరించరని తెలుస్తోంది. అయితే మహారాష్ట్రలో కూడా దొంగతనాలు జరగడంతో అక్కడి పోలీసులపైనా ఒత్తిడి పెరిగింది. చివరకు ఇరు రాష్ట్రాల పోలీసులు వాంగ్మోడే పాత్రపై అనుమానించి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ పోలీసులు ఈనెల 16 నుంచి షోలాపూర్ జిల్లాలోని 35–40గ్రామాలను జల్లెడ పట్టారు. దొంగలకు అడ్డాగా ఉన్న మొహల్‌తో పాటు వాంగ్మోడే సొంత ప్రాంతమైన నార్కెడ్‌లో కలియతిరిగినా వాంగ్మోడే ఆచూకీ లేకపోయింది. పోలీసు వర్గాల్లో, గ్రామాల్లోని వ్యక్తులు పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు వాంగ్మోడేతో పాటు అక్కడి గ్యాంగ్‌కు అందిస్తుండటంతోనే ఆచూకీ లభించడం లేదని సమాచారం. ఇప్పటి వరకు 3–4 ముఠాలను గుర్తించినా.. షోలాపూర్ పోలీసులతో పాటు పూణేక్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో వేట కొనసాగిస్తున్నారు.
చంపేందుకూ వెనుకాడని గ్యాంగ్: దొంగతనాల్లో అధికశాతం ‘పార్థిగ్యాంగ్’ హస్తమే ఉంటోంది. అయితే వాంగ్మోడే దన్‌గర్ తెగకు చెందిన వ్యక్తి. అవసరమైతే వీరు ఎంతకైనా తెగబడతారు. గతంలో మహారాష్ట్రలోని అక్లూజీ స్టేషన్ పరిధిలో ముగ్గురు దొంగలను పట్టుకునేందుకు వెళితే పోలీసులకు సమాచారం అందించిన ఇన్‌ఫార్మర్‌ను గొంతుకోసి చంపేశారు. మరో హెడ్‌కానిస్టేబుల్ పొట్టలో పొడిచారు. దీంతో వీరిపై అక్కడి ప్రభుత్వం మోకా యాక్టు(మహారాష్ట్ర ఆర్గనైజర్ క్రైమ్ యాక్టు)ను తీసుకొచ్చింది. ఇది ఆ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన చట్టం. కఠిన సెక్షన్లతో జైలుకు పంపడటంతో పాటు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వారు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. వీరికి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉండవు. వీటి ఆధారంతో పోలీసులు పట్టుకుంటారని తీసుకోరు. ఇళ్లు కూడా ఉండవు. రేకులషెడ్లు వేసుకుని జీవిస్తుంటారు. మోకా యాక్టు పెడితే షెడ్డులో ఏమీ ఉండదు. అక్కడి రాజకీయ నేతలు కూడా వీరికి మద్దతు. కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్‌కుమార్ షిండే ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించేవారు. ఇప్పుడు ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారు.
చోరీ సొమ్మంతా జల్సాలకే..
దొంగలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణికుల నుంచి బంగారం చోరీ చేస్తారు. దీన్ని అక్కడి బంగారు దుకాణాల్లో అతి తక్కువ ధరకు విక్రయిస్తారు. ప్రస్తుతం తులం రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఠాను పోలీసులు పట్టుకుని విక్రయించిన వ్యాపారుల వద్దకు వెళితే ఎంతో కొంత రికవరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత రిస్కు తీసుకున్నందుకు తులంపై రూ.10వేలు వ్యాపారి ఆశిస్తాడు. దీంతో తక్కువ ధరకే బంగారం విక్రయిస్తారు. ఈ డబ్బుతో విచ్చలవిడిగా మద్యం, ఆహారంతో పాటు పేకాట ఆడతారు. చోరీ చేసిన సొమ్ముతో జీవితాలను బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి చట్టాలపైనా వీరికి అవగాహన ఎక్కువే.
నిఘా పెట్టాం..దొంగలను పట్టుకుంటాం
రైల్వే దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. రెండు బృందాలను షోలాపూర్ పంపించాం. జీఆర్‌పీ, సివిల్, రైల్వే పోలీసులు సంయుక్తంగా ప్రణాళికతో వ్యవహరిస్తున్నాం. కొన్ని బృందాలపై అనుమానాలు ఉన్నాయి. పాతనేరస్తులను గుర్తించి వారిని విచారిస్తున్నాం. ప్రస్తుతం చోరీలను అరికట్టగలిగాం. తాటిచెర్ల, గార్లదిన్నె ఘటనలను కూడా ఈ దొంగతనాల కేసులో పరిగణనలోకి తీసుకుని ఆరా తీస్తున్నాం.
– జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment