Parthi Gang
-
తిరగబడ్డ దోపిడీ దొంగలు.. పెద్ద అంబర్‌పేటలో పోలీసుల కాల్పులు
హైదరాబాద్, సాక్షి: పెద్ద అంబర్‌పేటలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చెలరేగింది. చోరీ చేసి పారిపోతున్న దోపిడీ ముఠాను పట్టుకునే నల్లగొండ పోలీసులు ఛేజింగ్‌కు దిగారు. ఈ క్రమంలో ఆ దొంగలు పోలీసులపైకి కత్తులు దూశారు. దీంతో పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది. నల్లగొండలో చోరీలు చేసిన ఓ ముఠా పారిపోతుండగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు వాళ్లను వెంబడి అడ్డగించారు. ఆ టైంలో పోలీసులపై దుండగులు కత్తులు దూశారు. దీంతో వాళ్లను అదుపు చేసేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం నలుగురు గ్యాంగ్ సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని నల్లగొండకు తరలించారు. వీళ్లను పార్థీ(పార్థ) గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్య వరుసగా పోలీస్ ఫైరింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిలకలగూడలో మొబైల్ ఫోన్ స్నాచర్లపై, సైదాబాద్‌లో చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే తాజా ఘటన మాత్రం నగర శివారులో చోటు చేసుకుంది. -
కదిరి: గవర్నమెంట్ టీచర్ హత్య.. పార్థీ గ్యాంగ్ పనేనా?
అనంతపురం క్రైం/ కదిరి: కదిరి ఎన్జీఓ కాలనీలో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే రెండిళ్లలో చోరీకి తెగబడ్డారు. నగల అపహరణతో ఆగకుండా ఉషారాణి (47) అనే టీచర్‌ను హతమార్చి..పక్కింట్లో ఉండే టీస్టాల్ రమణ భార్య శివమ్మనూ తీవ్రంగా గాయపరిచారు. అది కూడా జనసంచారం మొదలయ్యే ఉదయం 5.15 నుంచి 5.40 గంటల మధ్య ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. ఈ తరహా దొంగతనాలు జిల్లా, అంతర్ జిల్లాల దొంగలు చేసే అవకాశం లేదని, మధ్యప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన ‘పార్థీ గ్యాంగ్’ పని అయ్యిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కోణంలో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు సంచలనం రేకెత్తించిన ఈ కేసును ఛేదించడానికి పోలీసు శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప 10 నుంచి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆయన స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి..పోలీసులకు తగిన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో వేలిముద్రలు, ఇతరత్రా ఆధారాలు సేకరించారు. ఈ తరహా కేసుల ఛేదింపులో అనుభవం కల్గిన పోలీసు అధికారులు, సీసీఎస్ కానిస్టేబుళ్లను ప్రత్యేక బృందాల్లో నియమించారు. ఈ బృందాలు ఇప్పటికే పని మొదలుపెట్టాయి. కదిరి సమీపంలోని టోల్గేట్తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెక్‌పోస్టులు, ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాటిలో అనుమానితుల ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. కదిరి ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరైనా వచ్చారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలైన పులివెందుల, మదనపల్లి, హిందూపురం తదితర ప్రాంతాలకూ బృందాలను పంపి, ఆ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు పరిశీలించేందుకు చర్యలు చేట్టారు. పార్థీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నందున మధ్యప్రదేశ్‌కూ ఓ బృందాన్ని పంపుతున్నట్లు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగానే ఛేదిస్తామని చెప్పారు. లాడ్జీల్లో తనిఖీలు ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవరైనా వచ్చి బస చేశారా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు కదిరి పట్టణంలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. సుమారు 15 లాడ్జీల్లో తనిఖీలు చేయడంతో పాటు సీసీ ఫుటేజీ కూడా పరిశీలించారు. అలాగే పాత నేరస్తులపై నిఘా వేశారు. శోకసంద్రంలో చీకిరేవులపల్లి అమడగూరు : దొంగల చేతిలో ప్రభుత్వ టీచర్ ఉషారాణి హత్యకు గురికావడంతో మండలంలోని చీకిరేవులపల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి, ఉషారాణి దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. శంకర్‌రెడ్డి ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ హైసూ్కల్లో బయోలాజికల్ సైన్స్ టీచర్ కాగా.. ఉషారాణి ఓడీచెరువు జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ప్రణీత్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా... చిన్నకుమారుడు దీక్షిత్‌రెడ్డి విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్నారు. ఉషారాణి మృతదేహాన్ని కదిరి నుంచి చీకిరేవులపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బంధువులు, తోటి ఉపాధ్యాయులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆమె మృతదేహంపై పడి కుమారులు, భర్త రోదించిన తీరు పలువురిని కలచివేసింది. ఎంపీపీ గజ్జల ప్రసాద్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కడగుట్ట కవితతో పాటు మండల వైఎస్సార్సీపీ నాయకులు హతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు కదిరి ప్రభుత్వాస్పత్రిలో ఉషారాణి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పరిశీలించి..కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
రన్నింగ్‌లోనే కొల్లగొట్టేస్తారు !
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల–పాణ్యం మధ్యలో ఈ నెల 4వ తేదీ రాత్రి ‘వరల్డ్ ఫస్ట్ కొరియర్’ వాహనాన్ని దొంగలు కొల్లగొట్టారు. ఇందులో బిగ్‌సీ, లాట్ మొబైల్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ షాపింగ్ సంస్థల వస్తువులు రవాణా అవుతుంటాయి. కర్నూలు–కడప హైవేపై ఈ నెల 5న అర్ధరాత్రి డీటీడీసీ కొరియర్ వాహనంలో దొంగలు దారిదోపిడీకి తెగబడ్డారు. ‘డాట్‌జాట్’ అనే ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థతో డీటీడీసీకి ఒప్పందం ఉంది. అదృష్టవశాత్తు ఆ రోజు లోడింగ్ లేదు. దీంతో కేవలం రూ.2 లక్షల విలువైన వస్తువులు దోపిడీకి గురయ్యాయి. దీనిపై నంద్యాల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత నంద్యాల– ఆళ్లగడ్డ మధ్యలో ‘వరల్డ్ ఫస్ట్ కొరియర్’ వాహనాన్ని కూడా దోపిడీ చేశారు. ఆళ్లగడ్డ స్టేషన్లో కేసు నమోదైంది. వరుసగా రెండు రోజులు వరల్డ్ ఫస్ట్ కొరియర్ వాహనాన్ని కొల్లగొట్టడం గమనార్హం. ఈ నెల 6న కర్నూలు– బెంగళూరు హైవేపై ‘ఎక్స్‌ప్రెస్ బీస్’ అనే కొరియర్ వాహనాన్ని కొల్లగొట్టారు. ఇది కూడా ఆన్లైన్ షాపింగ్ వస్తువులను రవాణా చేస్తుంటుంది. అదే రోజు అర్ధరాత్రి తర్వాత నంద్యాల గాం«దీచౌక్లోని వెంకటరమణ అనే వ్యాపారి దుకాణంలో 1.4 కిలోల బంగారం, రూ.5లక్షల నగదు దోచేశారు. దీనిపై నంద్యాల వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు వరుసగా జరిగిన ఈ దొంగతనాలను పరిశీలిస్తే ఉత్తర భారతదేశానికి చెందిన ‘పార్థిగ్యాంగ్’ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హైవే దొంగతనాలు, సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా రైలు దోపిడీలు చేయడంలో ‘పార్థిగ్యాంగ్’ దిట్ట. వీరు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని దిగారంటే వరుసగా నెల రోజుల పాటు కొల్లగొట్టి వెళతారు. హైవేలో దోపిడీలు ఎలా చేస్తారంటే.. కొరియర్ సర్వీసులు, బంగారు దుకాణాలకు చెందిన నగలు ఎక్కువగా ఐచర్ వాహనాల్లో రవాణా చేస్తుంటారు. సదరు వాహనంపై ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. ఒక్కో దోపిడీకి నాలుగు ముఠాలు పనిచేస్తాయి. రెండు ముఠాలు బైక్‌లను, ఒక ముఠా క్యారేజ్ కారు, మరో ముఠా లారీని వినియోగిస్తాయి. ఐచర్ ముందు వెళుతుంటే బైక్‌లో ఇద్దరు అనుసరిస్తారు. వాహనం వెనుకభాగంలోని లాక్కు దగ్గరగా బైక్ వెళుతుంది. బైక్ వెనుకభాగంలోని వ్యక్తి కట్టర్ ద్వారా లాక్ తొలగిస్తాడు. ఆ తర్వాత రన్నింగ్‌లోనే బెక్ ముందుభాగంలోకి వచ్చి ఐచర్‌లోకి వెళతాడు. ఇలా మరో వ్యక్తిని కూడా ఐచర్‌లోకి పంపిస్తారు. డోర్ మూసేసి లోపల ఉన్న బాక్స్‌లను కట్ చేస్తారు. సెల్ఫోన్లు, బంగారం, ఇతరత్రా చిన్నగా ఉన్న విలువైన వస్తువులన్నీ రెండు పెద్ద బ్యాగ్‌లలో సర్దుతారు. ఐచర్ వెనుక వీరి ముఠాకు చెందిన లారీనే వస్తుంది. దీని వెనుక బైక్‌లో అనుసరించే మరో ముఠా వెనుక వాహనాలు రాని సమయం చూసి ఫోన్లో సమాచారం ఇస్తుంది. అప్పుడు క్యారేజ్ కారును ఐచర్ వాహనానికి దగ్గరగా రప్పించి.. డోర్లు తెరిచి బ్యాగ్‌లను వెనుక పడేస్తారు. కారును ఒక ప్రదేశంలో ఆపేసి ఆ బ్యాగ్‌లను లారీలోకి మారుస్తారు. ఇలా రోజూ 2– 3 ఐచర్ వాహనాలను దోచేస్తారు. దోపిడీ జరిగిన విషయం లారీ డ్రైవర్‌కు ఏమాత్రమూ తెలీదు. 4,5 ,6 తేదీల్లో జిల్లాలో జరిగిన హైవే చోరీలన్నీ ఈ తరహావే కావడం గమనార్హం. డీటీడీసీ నిర్వాహకుడు నాగేంద్రరెడ్డితో పాటు ఇతర కొరియర్ సరీ్వసుల బాధ్యులు, పోలీసులు దోపిడీల తీరు చూసి విస్తుపోయారు. ఈ తరహా దోపిడీలు చేసేది ఉత్తరభారతదేశానికి చెందిన ‘పార్థి గ్యాంగ్’ మాత్రమే! బైక్ నడపడం, దానిపై నుంచి మరో వాహనంలోకి వెళ్లడం లాంటి ప్రమాదకర ఫీట్లు వారు మాత్రమే అత్యంత చాకచక్యంగా చేయగలరు. కొరియర్ల ద్వారా విలువైన సామగ్రి రవాణా.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ల ద్వారా వస్తువులను బుక్‌చేసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. మొత్తం వ్యాపారంలో 40శాతం ఆన్లైన్ షాపింగ్ ద్వారానే జరుగుతుండడం గమనార్హం. వీటిని వినియోగదారులకు అందజేసే కొరియర్లతో పాటు బిగ్‌సీ, బిగ్‌బీ, లాట్, హ్యాపీ మొబైల్స్ లాంటి సంస్థలు తమ వస్తువులను ఐచర్ వాహనాల్లో రవాణా చేస్తున్నాయి. ఇది తెలిసే దొంగలు దారి దోపిడీలకు తెగబడుతున్నారు. పగలు రెక్కీ..రాత్రి దోపిడీ.. పార్థి గ్యాంగ్ ఒక ప్రాంతాన్ని ఎంచుకుని రంగంలోకి దిగుతుంది. నెల రోజుల పాటు ఆ ప్రాంతంలో దారిదోపిడీలు, చోరీలకు తెగబడుతుంది. ఆపై తిరిగి సొంతప్రాంతానికి చేరుకుంటుంది. హైవేలో దారి దోపిడీలతో పాటు బంగారు దుకాణాలు, ఇళ్లలోనూ చోరీలకు పాల్పడతారు. ఉదయం దుప్పట్లు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ తాళాలు వేసిన ఇళ్లు, బాగా వ్యాపారం జరిగే, విలువైన వస్తువులు ఉంటాయని భావించే షాపులను గుర్తిస్తారు. ఇళ్ల ముందు తీగలపై ఆరేసిన దుస్తులు చూసి ఇంట్లో ఏ వయసు వారు ఉన్నారు? ఎంతమంది ఉన్నారనేది పసిగడతారు. ఇంటి చుట్టూ వాసన చూసి కిచెన్ ఎక్కడుంది? హాలు, స్టోర్ రూం ఎక్కడున్నాయనేది తేల్చేస్తారు. రాత్రికి రంగంలోకి దిగుతారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్లలో కూడా దొంగతనాలకు పాల్పడతారు. రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు గ్రీన్‌లైట్ లేకుండా సిగ్నల్ కట్ చేస్తారు. రైలు ఆగిపోతుంది. వెంటనే రైలులోని ‘పార్థిగ్యాంగ్’ సభ్యులు కత్తులతో భయపెట్టి నగదు, నగలు దోచుకుని దిగివెళ్లిపోతారు. ఇదంతా 2–4 నిమిషాల్లోనే పూర్తి చేస్తారు. హైవే దోపిడీలు, బంగారు దుకాణంలో చోరీతో ‘దొంగల ముఠా’లు జిల్లాలో హల్చల్ చేస్తున్నాయి. పోలీసులు, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వరుస చోరీలకు తెగబడే ప్రమాదమూ లేకపోలేదు. వరుస చోరీలతో భయమేస్తోంది.. రోజూ హైదరాబాద్ నుంచి కడపకు, కడప నుంచి హైదరాబాద్‌కు మా వాహనాలు వెళుతుంటాయి. విలువైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్ వస్తువులు రవాణా అవుతుంటాయి. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ తీసుకోరు. చోరీ జరిగిన తర్వాత గొడవ చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఆళ్లగడ్డ–కర్నూలు మధ్యలోనే ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. వాహనం గమ్యం చేరేదాకా నిద్రపట్టడం లేదు. –నాగేంద్రరెడ్డి, డీటీడీసీ సూపర్ ఫ్రాంచైజీ ఇన్చార్జ్, కడప ఆధారాలు దొరికాయి..త్వరలోనే పట్టుకుంటాం బైక్‌లో వెళుతూ రన్నింగ్లోని వాహనం లాక్ కట్ చేసి..లోపలికి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా వాహనంలో నుంచి వస్తువులను కింద పడేస్తారు. వెనుక ఉన్నవారు వాటిని తీసుకుంటారు. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఈ ప్రాంతానికి చెందిన వారే అని తెలుస్తోంది. కొన్ని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. త్వరలోనే పట్టుకుంటాం. – ఫక్కీరప్ప, ఎస్పీ, కర్నూలు -
సకుటుంబ సపరివార సమేతంగా’ రంగంలోకి..
సాక్షి, సిటీబ్యూరో: మధ్యప్రదేశ్ నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో 2004 నుంచి చోరీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్‌ను ఉస్మానియా వర్సిటీ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. తార్నాకలో జరిగిన ఓ చోరీ కేసులో వీరిని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం ప్రకటించిన విషయం విదితమే. పార్థీ గ్యాంగ్‌లలో అనేక ముఠాలు ఉండగా వీరు మధ్యప్రదేశ్‌కు చెందిన పాసి పార్థీలు. ఇదే తెగకు చెందిన, మహారాష్ట్ర కేంద్రంగా పని చేసే పన్ పార్థీలు, గ్రామ్ పార్థీలు అత్యంత ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. బందిపోటు, దోపిడీ దొంగతనాలు చేస్తూ పాశవికంగా హత్యలు చేసే వీరు కొన్నేళ్ల క్రితం వరకు ఉమ్మడి సైబరాబాద్‌లో సంచరించినట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో ఉంటూ జంతువుల్ని వేటాడి తినడం వారి వృత్తిగా పేర్కొన్నారు. అత్యంత క్రూరమైన మహారాష్ట్ర పార్థీ గ్యాంగ్స్ వ్యవహారశైలి ఇదీ... పగలు రెక్కీ... రాత్రికి పంజా... కొన్నేళ్ల క్రితం వరకు సైబరాబాద్ (ప్రస్తుత రాచకొండతో సహా) శివార్లలో ఒంటరి ఇళ్లు, ఫామ్‌హౌస్‌లను ఎంచుకుని బందిపోటు దొంగతనాలకు పాల్పడేవారు. వేటాడే సమయంలో క్రూరమృగాలపై దాడి చేసే తరహాలోనే మనుషుల పైనా విరుచుకుపడతారు. బాధితుల్ని తీవ్రంగా గాయపరచడం, ఎదిరిస్తే హతమార్చడం వారి నైజం. నిర్మానుష్య ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని ఉంటూ పగలు ప్లాస్టిక్ వస్తువులు, పూసలు అమ్ముకునే వారిలా వీధుల్లో తిరుగుతారు. అనువైన ఇంటిని ఎంపిక చేసుకుని అర్ధరాత్రి దాటిన తరవాత పంజా విసురుతారు. అవసరమైతే హత్యలకూ తెగబడి అందినంత దోచుకెళతారు. ఈ ముఠా పేరు చెబితే పోలీసులు సైతం హడలిపోయేవారు. పార్థీల చరిత్ర ఇదీ... బ్రిటీష్ కాలంలో ఉత్తరాదికి చెందిన పార్థీ గ్యాంగ్‌లను క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద నోటిఫై చేశారు. అప్పట్లో వీరు నేరాలు మాత్రమే చేస్తుండటంతో వారిపై పటిష్ట నిఘా ఉంచారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం పార్థీలకు జీవనోపాధి కల్పించడంతో దాదాపు 99 శాతం మంది తమ జీవనశైలి మార్చుకున్నారు. అయినా ఇప్పటికీ కొన్ని ముఠాలు నేరాలనే జీవనాధారంగా చేసుకున్నాయి. అలాంటి గ్యాంగ్‌లు మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఒకప్పుడు మహారాష్ట్రకు చెందిన ముఠాలకు గణేష్ బాపు రావు పవార్ దలే నాయకుడిగా ఉండేవాడు. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పేరున్న ఇతడిపై సైబరాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, గుంటూరు జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. 2005లో సైబరాబాద్ విభాగంలోని స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. అనంతరం2011లో సైబరాబాద్ పోలీసులే అతడి సోదరుడు రాహుల్ బాపురావు పవార్‌ను పట్టుకున్నారు. సీజన్లు మారుస్తూ పంజా... ఈ ముఠాలు సాధారణంగా వేసవిలోనే సైబరాబాద్‌లో విరుచుకుపడేవి. పార్థీలు ఏటా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు తమ స్వస్థలాల్లో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. డిసెంబర్లో దొంగతనాలు ప్రారంభించే వీరు మహారాష్ట్ర, ఆపై గుజరాత్లో నేరాలు చేసేవారు. అక్కడి నుంచి సైబరాబాద్‌కు చేరే సరికి మార్చి, ఏప్రిల్ వచ్చేది. అలా ఆగస్టు వరకు సైబరాబాద్‌తో పాటు నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల్లో విరుచుకుపడేవారు. ఇక్కడి నుంచి కర్ణాటకలోకి ప్రవేశించి సెప్టెంబరు వచ్చేసరికి మళ్ళీ తమ స్వస్థలాలకు చేరేవారు. ఒక్కోసారి ఈముఠాలు సీజన్‌ను మారుస్తూ నవంబరులోనూ సైబరాబాద్‌పై విరుచుకుపడేవారు. పోలీసుల్ని ఏ మార్చడానికి ఈ ఎత్తు వేసేవారని తెలుస్తోంది. పార్ధీ గ్యాంగ్స్ నైజమిదీ... శివార్లలో గుడిసెలు వేసుకుని నివసిస్తారు. రాహుల్ బాపురావు పవార్ ముఠా అప్పట్లో లింగంపల్లిలో మకాం వేసింది. పగలు గ్యాంగ్‌లోని మహిళలు రెక్కీ నిర్వహించేవారు. అనువైన ఇళ్లను ఎంచుకుని అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడేవారు. సాధారణంగా దొంగతనం చేయబోయే ఇంటి ఆవరణలో, ఇంట్లో చేతికి దొరికిన వస్తువుతో పాశవికంగా దాడి చేస్తుంది. ఆ సమయంలో బాధితులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. బాధితుల్ని గాయపరచడం ద్వారా భయభ్రాంతులకు గురిచేసి... ఆపై సొత్తు చేజిక్కించుకోవడం వీరి నైజం. వీరు ఎక్కువగా బాధితుల తలపైనే దాడి చేస్తుంటారు. బందిపోటు దొంగతనాలు చేసేదిలా... వీరు తాము ఎంచుకున్న ఇంటి పరిసరాలను ముందుగానే పూర్తిగా పరిశీలిస్తారు. ‘సకుటుంబ సపరివార సమేతంగా’ రంగంలోకి దిగుతారు. కిటికీ గ్రిల్స్ తొలగించడం, బలవంతంగా కిటికీ, తలుపులు పగులకొట్టడం ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తారు. రావడంతోనే ఇంట్లోని వారందరినీ బంధించి దాడికి దిగుతారు. ఏమాత్రం ఎదురుతిరిగినా హతమార్చడానికీ వెనుకాడరు. స్వయంగా ఇల్లంతా వెతికి విలువైన ఆభరణాలు, డబ్బు దోచుకుంటారు. ఒంటిపైనున్న ఆభరణాల్ని తీసిచ్చే అవకాశాన్నీ బాధితులకు ఇవ్వరు. బలవంతంగా లాక్కుంటారు. ఒక్కసారి ఓ ప్రాంతంలోకి ప్రవేశించిన తరవాత వరుసపెట్టి దొంగతనాలకు పాల్పడతారు. ఈ కారణంగానే పార్ధీ గ్యాంగ్ పేరు చెప్పగానే పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. నాగోలులోని కో–ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలోని ఓ ఇంట్లో కొన్నేళ్ల క్రితం వీరు సృష్టించిన విలయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
భార్యలు పసిగడతారు.. భర్తలు దోపిడీలకు పాల్పడతారు
సాక్షి, సిటీబ్యూరో: ‘మహిళలు అందంగా కనిపించేందుకు అవసరమైన సవరాలు అమ్ముతాం...చిన్న పిల్లల ఆట బొమ్మలు విక్రయిస్తాం...జీవితంలో సమస్యలు లేకుండా చేసే రుద్రాక్ష మాలలు ఇస్తాం’ అంటూ పగటివేళలో కాలనీల్లో తిరుగుతూ మహిళలు అనువైన ఇళ్లను గుర్తించగా, రాత్రి వేళల్లో వారి భర్తలు దోపిడీలకు పాల్పడతారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ పార్థీ గ్యాంగ్ సభ్యులు నలుగురిని సైబరాబాద్ స్పెషల్ అపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు మంగళవారం రాత్రి మేడ్చల్‌లో అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువైన కిలో బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే హత్యలకు వెనకాడని సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎస్వోటీ ఇన్చార్జ్ దయానంద్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో అడ్డాలు... మధ్యప్రదేశ్‌లోని హోసాంగాబాద్ జిల్లా, సియోని మాలా ప్రాంతానికి చెందిన షేర్ సింగ్ రాథోడ్ చిన్నతనం నుంచే చోరీల బాట పట్టాడు.మధ్యప్రదేశ్‌లోనే పలు ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడిన అతను సియోని, ఖంద్వా పోలీసులకు చిక్కాడు. అనంతరం అతనిపై నిఘా పెరగడంతో బయటి రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, బీహర్, వెస్ట్‌బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టి సారించాడు. అదే రాష్ట్రంలోని కత్ని జిల్లా, బెరూలికి చెందిన షాహీద్ కపూర్, రిజ్వాడి లాల్, అతని కుమారులు దిలావర్‌సింగ్, ఇన్సానియత్, ఇక్బల్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఈ ముఠా సభ్యులు తమ కుటుంబాలతో కలిసి వివిధ నగరాల్లోని రైల్వే స్టేషన్ల సమీపంలోని శివారు ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. రోడ్డుకు 200 మీటర్ల దూరంలో చిన్న గుడిసెల్లో జీవనం సాగించేవీరు పోలీసుల కంటపడినా తప్పించుకునే ందుకు సిద్ధంగా ఉంటారు. ముఠాలోని స్త్రీలు సవరాలు, రుద్రాక్ష మాలలు, ఆట బొమ్మలను విక్రయిస్తున్నట్లు కాలనీల్లో తిరుగుతూ దోపిడీకి అనువైన ఇళ్లను గుర్తిస్తారు. అలా గుర్తించిన ఇంట్లో రాత్రి సమయాల్లో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళతారు. ఈ క్రమంలో ఎవరైనా ఎదురు తిరిగినా హత్యలకు కూడా వెనకాడరు. ఈ దోపిడీ క్రమంలోనే మహారాష్ట్రలో ఒక హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. వీరు ఒక చోట మూడు రోజులు ఉండి ఆ వెంటనే మరో ఐదు కిలోమీటర్ల దూరంలో తాత్కాలిక నివాసం ఏర్పరచుకొని దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఎస్ఓటీ కృషితో 21 కేసుల ఛేదన గతేడాది జూలై నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 12, రాచకొండ కమిషనరేట్‌లో 3, వరంగల్ కమిషనరేట్‌లో రెండు, ఖమ్మం కమిషనరేట్‌లో మూడు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక దోపిడీ...మొత్తంగా రాష్ట్రంలో 21 కేసులు నమోదయ్యాయి.గత ఫిబ్రవరిలో చివరిసారిగా మేడ్చల్‌లో ఒక ఇంట్లో దోపిడీ చేసే క్రమంలో యజమానిని గాయపరిచినట్లు నమోదైంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎస్ఓటీ బాలానగర్ ఇన్స్పెక్టర్ సంగని రమేశ్, శంషాబాద్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డిలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మేడ్చల్, దుండిగల్, పేట్ బషీరాబాద్, అల్వాల్ గచ్చిబౌలి, శంషాబాద్ దోపిడీల్లో లభించిన వేలిముద్రల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రత్యేక బృందం అక్కడ వేలిముద్రలు సరిపోలడంతో వారి వివరాలను సేకరించారు. వారు మళ్లీ దోపిడీలకు హైదరాబాద్‌కే వచ్చినట్లుగా గుర్తించారు. మంగళవారం మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన సూత్రధారి షేర్ సింగ్ రాథోడ్‌తో పాటు దిలావర్‌సింగ్, రిజ్వాడి లాల్, షాహీద్ కపూర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు సీపీ సజ్జనార్‌తెలిపారు. -
చొక్కా చెప్పిన ఆచూకీ..
‘‘ఆడు మగాడురా బుజ్జీ. ఎవడైనా కోపంతో కొడతాడు. లేదా బలంగా కొడతాడు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.’’ అతడు సినిమాలో తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్ ఇదీ. ఇప్పుడు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న ‘వాంగ్మోడే’ నేర చరిత్ర చూస్తే.. అచ్చం ఇలాగే ఉంటుంది. రైల్వే చోరీల్లో ఆరితేరిన ఇతను తన ముఠాతో కలిసి రంగంలోకి దిగితే ఆ రైలు నిలువు దోపిడీకి గురవ్వాల్సిందే. ‘ఉయ్ డోంట్ వాంట్ ఫర్ఫెక్ట్ లైఫ్.. ఉయ్ వాంట్ హ్యాపీ లైఫ్’ ఫిలాసఫీతో చోరీలకు పాల్పడే ఈ ముఠా దోచుకున్న సొమ్మునంతా జల్సాలకే వెచ్చిస్తుండటం విశేషం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: షోలాపూర్‌కు చెందిన పార్థి గ్యాంగ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నెల రోజుల్లో ఏడు రైళ్లను కొల్లగొట్టిన దొంగల ముఠాను పట్టుకోవడం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. ఈ చోరీల వ్యవహారం రాష్ట్రంతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖలోనూ కలకలం రేపింది. ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో రైల్వే డీజీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చోరీల నియంత్రణ బాధ్యతను జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తన భుజానికెత్తుకున్నారు. ఇప్పటికే జీఆర్పీ, సివిల్ పోలీసులతో రెండు బృందాలను ఏర్పాటు చేసి షోలాపూర్‌కు పంపించారు. రైల్వే దొంగతనాలకు పాల్పడిన ముఠా తీరుతెన్నులు, జీవనశైలి, అక్కడి రాజకీయ నేతల అండదండలు తదితర అంశాలను లోతుగా పరిశీలిస్తే ఆ గ్యాంగ్‌ను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలేనని తెలుస్తోంది. జిల్లాలో గుత్తి–తాడిపత్రి’ మధ్య గత జూన్ 21 నుంచి జూలై 17వ తేదీ వరకు ఏడు చోట్ల చోటు చేసుకున్న వరుస రైల్వే చోరీల సందర్భంగా లభించిన ఆధారాలతో షోలాపూర్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఈనెల 16న షోలాపూర్‌కు ప్రత్యేక బృందాలను పంపిన మరుసటి రోజు కూడా మరో రైలులో చోరీ జరిగింది. ఆ తర్వాత 18వ తేదీన మహారాష్ట్రలోని కురుద్వాడి వద్ద మరో రైలును కొల్లగొట్టడం గమనార్హం. తప్పించుకున్న వ్యక్తే కీలకం 2016లో గార్లదిన్నె, తాటిచెర్ల వద్ద సిగ్నల్ కట్ చేసిన దొంగలు రెండు రైళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసుల తనిఖీల్లో రైల్వేపట్టాల సమీపంలో ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఓ చొక్కా కాలర్‌పై ప్రభాకర్ వాంగ్మోడే అనే పేరు కన్పించింది. షోలాపూర్‌లో దుస్తులు ఇస్త్రీకి ఇస్తే పేర్లు రాయడం అలవాటు. ఈ క్లూతో అప్పట్లో పోలీసులుషోలాపూర్లో దొంగల కోసం గాలించారు. కేసులో ఐదుగురిని చేర్చి నలుగురిని అరెస్టు చేశారు. ఒకరు తప్పించుకున్నారని కేసు నమోదు చేశారు. పట్టుబడిన నలుగురూ మామూలు దొంగలు కాగా తప్పించుకున్న వ్యక్తే వాంగ్మోడే. ఇతను ఈ దొంగల ముఠాకు నాయకుడు. పోలీసులు అప్పట్లో ఈ కేసును సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఇటీవల వరుస చోరీలకు కారణమైంది. ఎవరీ వాంగ్మోడే.. షోలాపూర్‌లోని నార్కెడ్ ఇతని స్వగ్రామం. పార్థి గ్యాంగ్ తరహా చోరీలకు పాల్పడే దన్గర్ తెగకు చెందిన వ్యక్తి. అనంతపురం జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ఏడు రైళ్లను కొల్లగొట్టి చల్లగా జారుకున్నాడు. కర్ణాటకలో 2.. మహారాష్ట్రలో 2 చోట్ల కూడా రైళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. చొక్కా చెప్పిన ఆచూకీ ఎంతటి చాకచక్యంగా చోరీలకు పాల్పడే దొంగలైనా.. ఎక్కడో ఒకచోట తప్పు చేయడం సహజం. 2016లో అనంతపురం జిల్లాలో రైల్వే చోరీలు చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంగా పోలీసులు తనిఖీలు చేపట్టగా ఒక చోట రైల్వే పట్టాల సమీపంలో ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఓ చొక్కా కాలర్‌పై ప్రభాకర్ వాంగ్మోడే అనే పేరు కన్పించింది. షోలాపూర్‌లో దుస్తులు ఇస్త్రీకి ఇస్తే పేర్లు రాయడం అలవాటు. అలా ఈ వాంగ్మోడే వెలుగులోకి వచ్చాడు. 35–40 గ్రామాల్లో గాలించిన పోలీసులు షోలాపూర్‌కు వెళ్లిన బృందాలు అక్కడి పోలీసులను సంప్రదించారు. అక్కడి పోలీసులు, దొంగలకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఏపీ పోలీసులకు మహారాష్ట్ర పోలీసులు సహకరించరని తెలుస్తోంది. అయితే మహారాష్ట్రలో కూడా దొంగతనాలు జరగడంతో అక్కడి పోలీసులపైనా ఒత్తిడి పెరిగింది. చివరకు ఇరు రాష్ట్రాల పోలీసులు వాంగ్మోడే పాత్రపై అనుమానించి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ పోలీసులు ఈనెల 16 నుంచి షోలాపూర్ జిల్లాలోని 35–40గ్రామాలను జల్లెడ పట్టారు. దొంగలకు అడ్డాగా ఉన్న మొహల్తో పాటు వాంగ్మోడే సొంత ప్రాంతమైన నార్కెడ్లో కలియతిరిగినా వాంగ్మోడే ఆచూకీ లేకపోయింది. పోలీసు వర్గాల్లో, గ్రామాల్లోని వ్యక్తులు పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు వాంగ్మోడేతో పాటు అక్కడి గ్యాంగ్‌కు అందిస్తుండటంతోనే ఆచూకీ లభించడం లేదని సమాచారం. ఇప్పటి వరకు 3–4 ముఠాలను గుర్తించినా.. షోలాపూర్ పోలీసులతో పాటు పూణేక్రైం బ్రాంచ్ పోలీసుల సహకారంతో వేట కొనసాగిస్తున్నారు. చంపేందుకూ వెనుకాడని గ్యాంగ్: దొంగతనాల్లో అధికశాతం ‘పార్థిగ్యాంగ్’ హస్తమే ఉంటోంది. అయితే వాంగ్మోడే దన్గర్ తెగకు చెందిన వ్యక్తి. అవసరమైతే వీరు ఎంతకైనా తెగబడతారు. గతంలో మహారాష్ట్రలోని అక్లూజీ స్టేషన్ పరిధిలో ముగ్గురు దొంగలను పట్టుకునేందుకు వెళితే పోలీసులకు సమాచారం అందించిన ఇన్ఫార్మర్ను గొంతుకోసి చంపేశారు. మరో హెడ్‌కానిస్టేబుల్ పొట్టలో పొడిచారు. దీంతో వీరిపై అక్కడి ప్రభుత్వం మోకా యాక్టు(మహారాష్ట్ర ఆర్గనైజర్ క్రైమ్ యాక్టు)ను తీసుకొచ్చింది. ఇది ఆ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన చట్టం. కఠిన సెక్షన్లతో జైలుకు పంపడటంతో పాటు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో వారు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. వీరికి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉండవు. వీటి ఆధారంతో పోలీసులు పట్టుకుంటారని తీసుకోరు. ఇళ్లు కూడా ఉండవు. రేకులషెడ్లు వేసుకుని జీవిస్తుంటారు. మోకా యాక్టు పెడితే షెడ్డులో ఏమీ ఉండదు. అక్కడి రాజకీయ నేతలు కూడా వీరికి మద్దతు. కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్‌కుమార్ షిండే ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించేవారు. ఇప్పుడు ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారు. చోరీ సొమ్మంతా జల్సాలకే.. దొంగలు ఎక్కువగా రైళ్లలో ప్రయాణికుల నుంచి బంగారం చోరీ చేస్తారు. దీన్ని అక్కడి బంగారు దుకాణాల్లో అతి తక్కువ ధరకు విక్రయిస్తారు. ప్రస్తుతం తులం రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఠాను పోలీసులు పట్టుకుని విక్రయించిన వ్యాపారుల వద్దకు వెళితే ఎంతో కొంత రికవరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత రిస్కు తీసుకున్నందుకు తులంపై రూ.10వేలు వ్యాపారి ఆశిస్తాడు. దీంతో తక్కువ ధరకే బంగారం విక్రయిస్తారు. ఈ డబ్బుతో విచ్చలవిడిగా మద్యం, ఆహారంతో పాటు పేకాట ఆడతారు. చోరీ చేసిన సొమ్ముతో జీవితాలను బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి చట్టాలపైనా వీరికి అవగాహన ఎక్కువే. నిఘా పెట్టాం..దొంగలను పట్టుకుంటాం రైల్వే దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. రెండు బృందాలను షోలాపూర్ పంపించాం. జీఆర్పీ, సివిల్, రైల్వే పోలీసులు సంయుక్తంగా ప్రణాళికతో వ్యవహరిస్తున్నాం. కొన్ని బృందాలపై అనుమానాలు ఉన్నాయి. పాతనేరస్తులను గుర్తించి వారిని విచారిస్తున్నాం. ప్రస్తుతం చోరీలను అరికట్టగలిగాం. తాటిచెర్ల, గార్లదిన్నె ఘటనలను కూడా ఈ దొంగతనాల కేసులో పరిగణనలోకి తీసుకుని ఆరా తీస్తున్నాం. – జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకోవాలి
కడప అర్బన్ : పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంను విస్తృతంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య అన్నారు. మంగళవారం ఆయన కడప నగరంలో పర్యటించారు. విజయవాడ నుంచి కడపకు వచ్చిన ఆయన కడప నగరం కో–ఆపరేటివ్ కాలనీలోని పోలీసు అతిథిగృహం చేరుకున్నారు. తర్వాత జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నేరాల పరిస్థితిని డీఎస్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జిల్లాలో నేరాలను తగ్గించే దిశగా ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. కడప, ప్రొద్దుటూరులలో నిర్వహిస్తున్న ఎల్‌హెచ్‌ఎంఎస్, కమాండ్ అండ్ కంట్రోల్ రూం పనితీరును గురించి అడిగితెలుసుకున్నారు. నేరాలను నియంత్రించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న జిల్లా పోలీసు అధికారుల పనితీరు భేష్‌గా ఉందన్నారు. రాష్ట్రంలో పార్థీగ్యాంగ్ లేదు.. అధికారుల సమీక్ష అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్థి గ్యాంగ్ లేదన్నారు. జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి నేరాలను తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్, కమాండ్ అండ్ కంట్రోల్ రూం విధానం వలన చోరీలకు అడ్డుకట్ట వేశారన్నారు. సైబర్ నేరాలను నిర్మూలించేదిశగా కృషి చేయాలన్నారు. బ్యాంక్ అధికారుల మాదిరిగా ఎవరైనా ఫోన్‌చేసి వివరాలను అడిగినపుడు చెప్పరాదన్నారు. నేరస్తులు కూడా సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడే విషయంపై ఇప్పటికే జార్ఖండ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా పోలీసు అధికారిని నియమించి నియంత్రణకు కృషి చేస్తున్నారన్నారు. పోలీసుశాఖతో మమేకమై యువతతో కమ్యూనిటీ పోలీస్, విద్యార్థులతో స్టూడెంట్ పోలీస్, మహిళలతో మహిళా మిత్ర పేరుతో పనిచేసేందుకు ఆసక్తిగలవారిని నియమించారన్నారు. పోలీసు సంక్షేమానికి విశేష కృషి ... పోలీసు సంక్షేమంలో భాగంగా కడపలో పోలీసు శాఖకు 22 ఎకరాల స్థలం వుందనీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ ద్వారా మొదట కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మింపచేసి తద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంక్‌లకు చెల్లిస్తూనే పోలీసు కుటుంబాలకు అవసరమైన క్వార్టర్స్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. పోలీసుల సంక్షేమంపై దృష్టి పెడతామన్నారు. ఇటీవల 5వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఇచ్చామనీ వారు విధుల్లో ఇప్పటికే చేరారనీ, ఎస్ఐలు 662 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారనీ వారు త్వరలో విధుల్లో చేరతారన్నారు. జిల్లాలో కడప, రాయచోటిలలో మోడల్ పోలీస్ స్టేషన్లను నిర్మించారనీ, త్వరలో వాటిని ప్రారంభించనున్నారన్నారు. రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య కడప పర్యటన ముగించుకుని సాయంత్రం అనంతపురం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాల్లో కడప కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ, జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం ఆస్మి, జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ఏ.శ్రీనివాసరెడ్డి, ట్రైనీ ఏఎస్పీ వకుల్ జిందాల్, ఏఆర్ అదనపు ఎస్పీ రిషికేÔశ్‌రెడ్డి, డీఎస్పీలు బి.శ్రీనివాసులు, రాజగోపాల్ రెడ్డి, లోసారి సుధాకర్, పి. షౌకత్ఆలీ, శ్రీనివాసులు, షేక్ మాసుంబాష, రాఘవ, కోలార్ కృష్ణన్, నాగరాజు, లక్ష్మినారాయణ, బిఆర్ శ్రీనివాసులు, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, చంద్రశేఖర్లతో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పుకార్లు.. షికార్లు అంటుండగానే కనిపించిన దొంగలు
సాక్షి, కడప : మహారాష్ట్ర ప్రాంతంలో కరుడుగట్టిన.. పేరు మోసిన పార్థీ గ్యాంగ్ దొంగల పేరెత్తితేనే ఒకింత భయాందోళన.. దాదాపు రెండు నెలలుగా జిల్లాలోని అనేక పల్లెల్లో గ్యాంగుల భయంతో పహారా కాస్తున్న పరిస్థితి.. ఏ గ్యాంగ్ పేరేత్తితే జనాలు భయపడుతున్నారో అదే గ్యాంగ్‌కు చెందిన ముఠా సభ్యులు దొరకడంతో అది ప్రచారం కాదు.. వాస్తవం అన్న విషయాన్ని తెలుసుకుని ప్రజల్లో మళ్లీ అలజడి ప్రారంభమైంది. సోషల్ మీడియాలో పార్థి గ్యాంగ్‌పై విస్తృత ప్రచారం జరగడంతో భయాందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అదే స్థాయిలో ప్రజలకు భరోసా ఇస్తూ వచ్చారు. అంతేకాకుండా గ్రామాల్లో సభలు పెట్టి ప్రజలకు ధైర్యం నూరిపోశారు. అయినా చివరిలో రాజంపేట ప్రాంతంలో సంచరిస్తున్న పార్థి గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేయడంతో జిల్లాలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లాలో ఇంకా ఉన్నారా? మహారాష్ట్రకు చెందిన పార్థిగ్యాంగులోని కొంతమంది సికింద్రాబాద్‌లోని లాలాగూడా ఏరియాలో నివసిస్తూ దొంగతనాలకు పక్కా స్కెచ్‌లు వేస్తున్నారు. రాజంపేటలో రెండు రోజుల క్రితం అదే గ్యాంగుకు చెందిన ఇద్దరు మహిళా దొంగలను అరెస్టు చేశారు. వీరిద్దరూ రాజంపేటలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. అయితే రాజంపేటలో దొరికిన వీరిద్దరి వెనుక ఎంతమంది ఉన్నారు? లేక వీరిద్దరే దొంగతనాలకోసం ఇక్కడికి వచ్చారా? ఎలాగూ పార్థిగ్యాంగ్ అని పోలీసులు నిగ్గు తేల్చడంతో మగవాళ్లతో కూడిన గ్యాంగ్ జిల్లాలో తిరుగుతోందా? అసలు ఎంతమంది ఉన్నారు.. ఉంటే వీరి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు.. తదితర విషయాలపై లోతుగా దర్యాప్తు జరిపి వాస్తవాలను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా పార్థిగ్యాంగ్ అంటేనే ఉలిక్కిపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయడం అవసరం. రాజంటలోనే కాకుండా ఇటీవల అదే తరహాలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలపై కూడా పరిశీలన చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. చిక్కు వెంట్రుకలు..స్టీల్ సామాన్ల పేరుతో రెక్కీ.. జిల్లాలో పగటిపూట చిక్కు వెంట్రుకలు కొనుగోలు చేస్తూ.., స్టీల్ సామాన్లు విక్రయించే వారిలాగా వీరు తిరుగుతుంటారని పోలీసులు వెల్లడించారు. అలా తిరిగే సమయంలోనే తాళం వేసిన ఇళ్లను గుర్తించి అదేరోజు రాత్రి దొంగతనానికి పాల్పడతారు. ఒక వేళ వీరు ఇంటిలోకి ప్రవేశించిన సమయంలో అక్కడ ఎవరైనా ఉండి తిరగబడితే వారిని కర్కోటకంగా చంపేందుకు కూడా వీరు వెనుకాడరని తెలుస్తోంది. వీరివద్ద పెద్దకత్తి.. తపంచా కూడా ఉంటుందని సమాచారం. వీరి కుటుంబాల్లో మహిళలు, పిల్లలు కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మహిళలు రెక్కీ నిర్వహించి వారి మగవాళ్లకు సమాచారం చేరవేస్తే వారు ప్లాన్ అమలు చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో మహిళలు, పిల్లలు కూడా దొంగతనాలకు పాల్పడుతుంటారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారం పేరుతో అలా వచ్చిన వారిపై దాడులు చేయకుండా అనుమానం వస్తే డయల్ 100కు సమాచారం అందించినా నేరుగా పోలీసులే రంగంలోకి దిగుతారని స్పష్టం చేస్తున్నారు. మళ్లీ సోషల్ మీడియాలో... జిల్లాలో పార్థీ గ్యాగ్ కదలికలు బయటపడటంతో సోషల్ మీడియాలో మళ్లీ ప్రచారం జోరందుకుంది. రాజంపేటలో గ్యాంగ్ వ్యవహారం వెలుగుచూడటంతో ప్రతి ఒక్కరు పార్థీ గ్యాంగ్ గురించి చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పోలీసులు స్పందించి మిగిలిన ముఠా సభ్యులను కూడా అరెస్టు చేసి వారి ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. -
అదిగో పులి..ఇదిగో తోక!
సాక్షి, గుంటూరు: జిల్లాలో పార్థి గ్యాంగ్, కిడ్నాపర్లు తిరుగుతున్నారన్న వదంతులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొత్తవారు ఎవరైనా కొంచెం అనుమానంగా కనిపిస్తే దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నాయి. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య సమాచారం కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. రాత్రిళ్లు భయంతో గ్రామాల్లో గస్తీ కాసే దుస్థితిని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితి ‘అదుగో పులి అంటే.. ఇదిగో తోక’ అన్న చందంగా ఉంది. అప్రమత్తమైన పోలీసులు ప్రజలకుఅవగాహన కల్పిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. అసత్య పోస్టింగ్‌లు పెడితే జైలుకే.. ముఖ్యంగా సోషల్ మీడియాలో పార్థి గ్యాంగ్, చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే కిడ్నాపింగ్ ముఠాలు జిల్లాలో తిరుగుతున్నాయనే తప్పుడు పోస్టింగ్‌లు విస్తృతంగా వ్యాపించాయి. వీరు పగటిపూట మతిస్థిమితం లేనివారిగా నటిస్తూ గ్రామాల్లో రెక్కీ నిర్వహిస్తారని, రాత్రి వేళల్లో ఇళ్లపై దాడులు చేస్తారంటూ ఎక్కువగా పోస్టింగ్‌లు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల కూడా గుర్తించారు. ఇటువంటి పోస్ట్‌లు పెట్టినా, అమాయకులను పట్టుకుని దాడికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ♦ వారం రోజుల కిందట నూజెండ్ల మండలం పాతఉప్పలపాడు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని గ్రామస్తులు పట్టుకుని కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. పూర్తిగా విచారించిన అనంతరం మతిస్థిమితం లేని వ్యక్తిగా నిర్ధారించిన అతన్ని వదిలేశారు. అదే మండలం జంగాలపల్లి గ్రామం వెళ్లిన సదరు వ్యక్తిని మళ్లీ అక్కడి గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. ఏం చేయాలో తెలియని పోలీసులు అతన్ని ట్రైన్లో ప్రకాశం జిల్లా వెల్లల చెరువుకు పంపించేశారు. ♦ ఈ నెల 23న రేపల్లె రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్న మతిస్థిమితం లేని ఓ యువతిని కిడ్నాపర్‌గా అనుమానించి కొందరు యువకులు కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆమెను జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేయించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ♦ రెండు రోజుల కిందట ఫిరంగిపురం మండలం వేములూరిపాడులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మరికొందరు కొండపైన తిరుగుతున్నారనే వదంతులు వ్యాపించడంతో గ్రామస్తులు రాత్రంతా కర్రలు పట్టుకుని గస్తీ కాశారు. ∙గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలో శుక్ర, శనివారాల్లో రాత్రి పూట వందల మంది యువకులు కర్రలు పట్టుకుని రాత్రి పూట కాపలా కాస్తున్నారు. ఆదివారం ఉదయం గ్రామంలో మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలిని పట్టుకుని కొందరు చెట్టుకు కట్టేసి కొట్టారు. ఎవ్వరినీ కొట్టొద్దు.. ఎవరైనా అనుమానం కనిపించినా, కొత్త వ్యక్తులు సంచరిస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. కొంత మంది మతిస్థిమితం లేకపోవడంతో పాటు, భాష రాకపోవడంతో సమాధానం చెప్పలేక ఊరకుండిపోతున్నారని, అటువంటి వారిపై దాడులు చేయొద్దంటున్నారు. గ్రామాల్లో గస్తీ.. జిల్లాలో బూచోళ్లు తిరుగుతున్నారనే భయంతో పలు గ్రామాల్లో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. యువకులు అయితే రాత్రిళ్లు కర్రలు పట్టుకుని గ్రామం మొత్తం తిరుగుతూ గస్తీ కాస్తున్నారు. కొత్త వ్యక్తులు, మతిస్థితిమితం లేని వారిని అనుమానిస్తూ చితకబాదుతున్నారు. గుంటూరు నగరంలోని న్యూ గుంటూరు రైల్వేస్టేషన్ సమీపంలో సైతం వారం రోజుల కిందట కిడ్నాపర్ల వచ్చారన్న వదంతులతో ఆ ప్రాంతానికి చెందిన యువకులు రాత్రి వేళల్లో కాపలా కాశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే రాత్రి గస్తీ తిరిగే పోలీసు కానిస్టేబుళ్లు యువకులను వెంటబెట్టుకుని గస్తీ కాస్తున్నట్టు సమాచారం. పార్థి గ్యాంగ్ లేదని, ముఠానాయకుడు ఎప్పుడో చనిపోయాడని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య ప్రకటించినప్పటికీ వదంతులు మాత్రం ఆగడం లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించం.. జిల్లాలో పార్థి గ్యాంగ్, కిడ్నాప్ ముఠాల జాడ లేదని జిల్లా అర్బన్, రూరల్ ఎస్పీలు ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టి ప్రజలను భయాందోళనకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని వారిపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. ప్రజలు సైతం అనుమానాలు, అపోహలతో అమాయకులపై దాడులకు పాల్పడొద్దని చెబుతున్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలిని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని హెచ్చరిస్తున్నారు. -
అంతా ఐపీఎల్ మాయ
వీరఘట్టం : రాష్ట్రంలో పార్థిగ్యాంగ్ సంచరిస్తున్నట్టు ఎవరు పుకార్లు సష్టిస్తున్నారు... ఎందుకు సృష్టిస్తున్నారు... ఇలా చేస్తే వారికి ప్రయోజనం ఏంటి... అని ఆలోచిస్తున్నారా... ఈ వదంతుల వెనుక పెద్ద వ్యవహారమే ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యక్తులు ముఠాలుగా మారి వారి స్వప్రయోజనం కోసం ఇటువంటి పుకార్లు పెడుతూ పోలీసులను, ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి వదంతులు సష్టిస్తున్నవారిలో ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ ముఠా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. క్వాలీఫయిర్, ఫైనల్ మ్యాచ్‌లు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. శుక్రవారం క్వాలీఫయిర్ మ్యాచ్, ఈ నెల 27న ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు రూ. కోట్లలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి బెట్టింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లు చివరి దశలో కూడా బెట్టింగ్‌లు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తమపై పోలీసులు దృష్టి సారించకుండా ఉండాలంటే వారిని దారి మళ్లించాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పార్థి గ్యాంగ్ ఉన్నట్టు... మనుషులను భయంకరంగా చంపేస్తున్నట్టు గ్రాఫిక్‌లో సృష్టిస్తూ తప్పుడు పోస్టింగ్‌లు పెడుతూ గుట్టుగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు వినిపిస్తుంది. చావ బాది... అయ్యో! గత పది రోజులుగా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా కంటి మీద కునుకు లేకుండా రాత్రి వేళల్లో పహరా కాస్తున్నారు. అపరిచితులు గాని అనుమానితులు గాని ఎవరైనా తమ ప్రాంతాల్లో సంచరిస్తే చితక బాదేస్తున్నారు. తర్వాత పోలీసులు వచ్చి విచారించే సరికి దెబ్బలు తిన్న బాధితులకు పార్థిగ్యాంగ్‌కు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుండడంతో అయ్యో అంటూ బిక్క మొహాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి వదులుతున్న వారిపై పోలీసులు కఠినంగా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌లో ఇంకా ఘోరాలు జరిగే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇదీ విషయం ఐపీఎల్ మ్యాచ్‌లు ఎప్పుడు జరిగినా భారీగా రూ. కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ బెట్టింగ్‌లను అదుపుచేసేందుకు, బెట్టింగ్ రాయుళ్లను పట్టుకునేందుకు నిత్యం పోలీసులు నిఘా వేస్తున్నారు. దీంతో పోలీసుల దృష్టి తమపై పడకుండా ఉండేందుకు పార్థిగ్యాంగ్ రాష్ట్రంలో సంచరిస్తున్నట్టు, పోలీసులు అత్యవసర సమావేశాలు పెడుతున్నట్టు వాట్సాప్‌ల ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను వదిలారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై అనుమానితులు, అపరిచితులు ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వడం... పోలీసులు వచ్చి పరిశీలిస్తే వారు సామాన్య ప్రజలేనని తేలడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అమాయకులు బలైపోతున్నారు ఈ నెల 20వ తేదీన పాలకొండ మండలం కస్పావీధికి చెందిన రాము అనే యువకుడు తన తాతగారి గ్రామమైన కొర్లవలస వెళ్లేందుకు గురవాం నుంచి కొర్లవలస బయలుదేరాడు. గురవాం నుంచి పొలాల గట్లు మీదుగా నడిచి వెళుతుండగా అనుమానితునిగా భావించి స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. తర్వాత ఆ వ్యక్తికి దొంగలతో ఎటువంటి సంబంధం లేదని తెలియడంతో అంతా కంగుతిన్నారు. అదే రోజు విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకాంకు చెందిన ఇద్దరు యువకులు మద్యం కోసం వీరఘట్టం కొత్త బస్టాండ్‌కు వచ్చారు. వీరి వేషధారణ చూసి దొంగలుగా భావించి స్థానికులు చుట్టిముట్టి పోలీసులకు అప్పగించారు. తర్వాత పోలీసులు విచారించగా వీరికి దొంగల ముఠాకు ఎటువంటి సంబంధం లేదని విడిచిపెట్టారు. అలాగే రెండు రోజుల క్రితం వైజాగ్‌లో మతిస్థిమితం లేని ఇద్దరు మహిళలను అనుమానితులుగా భావించిన స్థానికులు చితక బాది పోలీసులకు అప్పగించారు. తర్వాత వారు మతిస్థిమితం లేనివారని పోలీసులు తెలియజేశారు. ఈ వీడియోలు కూడా ప్రస్తుతం వాట్స్‌ప్‌లలో హల్చల్ చేస్తున్నాయి. ఇలా పార్థిగ్యాంగ్ పేరుతో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను కొందరు బయపెడుతున్నారని పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు, ఎవరు చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తే అసలు దొంగలు దొరుకుతారు. కఠిన చర్యలు తీసుకుంటాం పార్థిగ్యాంగ్ పేరుతో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నవారు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే శుక్ర, ఆదివారాల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై నిఘావేస్తాం. – జి.స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ -
వణికిస్తున్న ‘పార్ధి’ వదంతులు
పార్ధి గ్యాంగ్.. ఈ పేరు వింటే చాలు కొన్ని రోజులుగా జిల్లా వణికిపోతోంది.. పిల్లలు, పెద్దలు చలి జ్వరం వచ్చినట్లు గజగజలాడిపోతున్నారు.. ఈ పేరు చెవిన పడితే చాలు పట్టణవాసులతో పాటు మారుమూల గ్రామాల ప్రజలు సైతం హడలెత్తిపోతున్నారు.. జిల్లాలో ఎక్కడ చూసినా పార్ధి గ్యాంగ్ పేరే వినబడుతోంది. నిజంగా ఆ గ్యాంగ్ ఉందో లేదో తెలీదుగానీ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు, కొంత మంది పెడుతున్న పోస్టింగ్‌లు జిల్లావాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : ‘అరేయ్ ఈరిగా రాత్రి పక్కూళ్లో ఎవరో పసిపిల్లోడిని చంపేసి మెదడు తినేశారంట్రా..’, ‘ఒరేయ్ సూరిగా నిన్న రాత్రి టౌన్లో పార్ధీ గ్యాంగ్ దిగిందంట్రా... పిల్ల ల్ని సంపి కిడ్నీలు, మెదడు తినేయాలని తిరుగుతున్నారంటా.. మావోడొకడు ఫోను చేశాడు..’, ‘యారోయ్ నీకీ సంగతి తెలిసిందా... నిన్న పక్క జిల్లాలో పార్ధీ గ్యాంగ్‌ని పట్టుకోబోతుంటే పోలీసోడి పీక కోసేసి పారిపోయారంట్రా’ .. ఇవీ కొన్ని రోజులుగా జిల్లాలో జరుగుతున్న ప్రచారం. ఇది జిల్లా ప్రజలను గజగజలాడిస్తోంది. సోషల్ మీడియాలో హల్చల్.. జిల్లాలోకి పార్ధి గ్యాంగ్ వచ్చినట్లు, పసి పిల్లల్ని ఆ గ్యాంగ్ అతి క్రూరంగా చంపి వారి అవయవాలను పీక్కు తింటున్నట్లు, అందుకోసం అర్ధరాత్రి తలుపుల వద్దకు వచ్చి పిల్లుల్లా అరవటం... కుక్కల్లా మొరగటం... పసి పిల్లల్లా ఏడ్వటం వంటి ఫొటోలు, వీడియోలను కొంత మంది వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టటం కొన్ని రోజులుగా జరుగుతోంది. అవి చూసిన అనేక మంది వాటిని ఇతరులకు షేర్ చేస్తుండటంతో జిల్లాలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఆ వీడియోలు, ఫొటోలు చూసిన తల్లితండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, పార్ధి గ్యాంగ్ జిల్లాలో సంచరిస్తుందా అంటే ఇంత వరకు అలాంటి దాఖలాలు లేవనే చెప్పాలి. కేవలం వదంతులు మాత్రమే. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ.. జిల్లాలో పార్ధి గ్యాంగ్ తిరుగుతుందంటూ వస్తున్న వదంతులతో ఆందోళన చెందుతున్న జనం అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా ఎవరైనా తారసపడితే చాలు ఆడ, మగా తేడా లేకుండా అంతు చూసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల జిల్లాలో రోజుకు రెండు మూడు జరగటమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మంగళవారం రాత్రి ఇలాంటి ఘటనే జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. నార్త్ ఇండియాకు చెందిన ఓ దుప్పట్ల వ్యాపారి క్రికెట్ ఆడుతున్న యువకులను తీక్షణంగా చూస్తుండటంతో అనుమానం వచ్చిన ఆ యువకులు అతన్ని చుట్టుముట్టి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విచారణలో దుప్పట్ల వ్యాపారం కోసం మరో తొమ్మిది మందితో కలిసి మచిలీపట్నం వచ్చినట్లు తేలింది. ఇలాంటి ఘటనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకోవటం పరిపాటిగా మారింది. పరుగులు పెడుతున్న పోలీసులు.. పార్ధి గ్యాంగ్ ప్రచారం పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి ఏవేవో పనుల నిమిత్తం వస్తున్న వ్యక్తులపై అనుమానపడుతున్న జనం పట్టుకుని యక్ష ప్రశ్నలు వేస్తున్నారు. తెలుగు మాట్లాడటం రాకపోయినా, సరైన సమాధానం చెప్పలేకపోయినా పార్ధి గ్యాంగ్ ముఠా సభ్యుడు అంటూ చితకబాదుతున్నారు. ఇలాంటి ఘటనలు పరిపాటిగా మారటంతో అప్రమత్తమవుతున్న పోలీసులు ఆయా ప్రదేశాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ విచారించి విషయం తెలుసుకుని పోలీసులతో పాటు ప్రజలు సైతం అవాక్కవుతుండటం కనబడుతోంది. భయపడాల్సిన అవసరం లేదు.. జిల్లాలో పార్ధి గ్యాంగ్ తిరుగుతుందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దు. అలాంటి ఘటనలు ఇంత వరకు జిల్లాలో జరిగిన దాఖలాలు లేవు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అధికారులతో పల్లె నిద్ర చేయిస్తున్నాం. అనుమానిత వ్యక్తులు, అపరిచితులు తారసపడితే డయల్–100కు సమాచారం అందించాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలను హింసిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం.– సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ -
తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే కేసు నమోదు
బేస్తవారిపేట: జిల్లాలో పార్థీ గ్యాంగ్ నరహంతక ముఠా తిరుగుతోందని తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ సత్య ఏసుబాబు అన్నారు. బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. గ్రూప్‌లో వచ్చిన మెసేజ్‌లను నిజానిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయవద్దన్నారు. ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు పోలీసులతో పల్లెనిద్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. 150 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడంతో 2–8 రోజులు శిక్ష పడిందన్నారు. పల్లెల్లో వెనుకబాటుతనం, సైబర్‌క్రైమ్, బ్యాంక్ ఖాతా ఓటీపీతో నగదు అపహరణ, బాల్య వివాహాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, లక్కీ లాటరీ పేరుతో జరిగే మోసాలపై మేలుకొలుపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎల్‌హెచ్‌ఎంఎస్ పోలీస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, గృహస్తులు బయటకు వెళ్లేటప్పుడు యాప్ ద్వారా సమాచారం అందిస్తే పోలీస్‌లు వచ్చి కెమెరా బిగిస్తారన్నారు. మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుట్కాపై అనేక కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 90 శాతం బెల్ట్‌షాపులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు, సీఐలు వై శ్రీనివాసరావు, ఎం భీమానాయక్, ఎస్సై ఏ శశికుమార్ పాల్గొన్నారు. -
అవన్నీ ఒట్టి పుకార్లే
ఒంగోలు : పార్థి గ్యాంగ్‌కు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహాలు తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా పోలీస్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. గత రెండు, మూడు వారాలుగా దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పార్థీ గ్యాంగ్ పుకార్లతో భయపడుతున్నారని పేర్కొన్నారు. పార్థీగ్యాంగ్ కదలికల్లేకపోయినా అనవసరంగా భయపడుతూ రాత్రివేళల్లో నిద్ర లేకుండా కర్రలతో, రాడ్లతో పహారా తిరుగుతున్నారని పేర్కొన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తులను, బిచ్చగాళ్లను, అసహాయులను, ముసలివారిని అనుమానించి కొడుతున్నారని చెప్పారు. తీవ్రంగా కొట్టి ఆ తర్వాత పోలీస్స్టేషన్లకు అప్పగించిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఇవి ఒట్టి పుకార్లు మాత్రమే. వీటిని గుడ్డిగా నమ్మి నిద్ర లేకుండా తిరగడం అమాయకులను ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. జిల్లాలో ప్రజలు అనుకుంటున్నట్లుగా ఎటువంటి పార్థి గ్యాంగ్ ఆనవాళ్లు లేవని ఎస్పీ భరోసా ఇచ్చారు. మరణాయుధాలతో తిరగడం నేరం ‘ఒంగోలు నగరంలో పాటు పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో సైతం మరణాయుధాలతో తిరగడం నేరం. నిజం కాని పుకార్లను నమ్మి రోడ్లపై కర్రలు, కత్తులతో తిరుగుతూ బిచ్చగాళ్ల, మతిస్థిమితం లేని వ్యక్తులను,ముసలివారిని కరుడుకట్టిన నేరగాళ్లుగా చూడటం మంచి పద్ధతి కాదు. అలాంటి వారిని అనుమానించటం, వారిని అందరూ కలిసి కొట్టడంఘోరం. ఇది ఒకట్రెండు కాదు, జిల్లావ్యాప్తంగాదాదాపు 10కిపైగా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజూ పేపర్లలో ప్రకటనలు ఇస్తున్నాం. పార్థీగ్యాంగ్ లేదని ప్రకటనలు కూడా ఇస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా అమాయకులను కొట్టి గాయపరిచిన, ఎలాంటి సంఘటనలు జరిగినా అలా చేసి వారు నేరస్తులవుతారు. వారిపై చట్టరీత్యా కఠిన చర్యలుంటాయి.’ అని ఎస్పీ హెచ్చరించారు.. సోషల్ మీడియాలో అపోహలు.. కొంత మంది సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పార్థి గ్యాంగ్ సంచారం ఉందని పోస్టులు చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. అటువంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఈ విధమైన ప్రచారాల ద్వారా ఎవరైనా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే ఆ విధంగా ప్రచారం చేసిన వాళ్లను గుర్తించటం చాలా సులభమని, లేనిపోని పుకార్లను వ్యాప్తి చేయవద్దని, తద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. మీకోసం పోలీసుల పల్లెనిద్ర.. జిల్లాలో పార్థి గ్యాంగ్ గానీ, మరీ ఏ ఇతర గ్యాంగ్‌ల కదలికలు లేనçప్పటికీ ప్రజలకు ధైర్యం చెప్పేందుకు పోలీసులు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపడతారని ఎస్పీ చెప్పారు. ప్రజల్లో అపోహలను, భయాన్ని పోగొట్టి వారికి అవగాహన కల్పించేందుకు శనివారం నుంచే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. పోలీసులు వచ్చి గ్రామాల్లో నేరుగా ప్రజలతో మాట్లాడతారని, అవసరమైన గ్రామాల్లో పోలీసులు బస చేస్తారని చెప్పారు. కాబట్టి ప్రజలు ఆనందంగా నిద్రపోవచ్చని హామీ ఇచ్చారు. అనుమానితులపై సమాచారమివ్వండి.. ఎక్కడైనా అనుమానితులు ఉంటే అలాంటి వారిపై పోలీసులకు సమాచారమివ్వాల్సిందిగా ఎస్పీ సూచించారు. హిందీ భాష మాట్లాడేవారు గానీ, కొత్త వ్యక్తులు గానీ సంచరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లకు సమాచారమివ్వాలని కోరారు. ఎస్సైలకు, సీఐలకు లేదా డయల్–100కు ఫోన్ ద్వారా తెలియజేయాలని, పోలీసులు వచ్చి వారిని విచారించి వారిపై తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అంతే గానీ అమాయకులను అనవసరంగా అనుమానించి ఇబ్బంది పెట్టవద్దని పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
అసలేం జరుగుతోంది..
‘‘జిల్లాలోకి సైకోలు వచ్చారు.. పిల్లలను ఎత్తుకు పోతున్నారు.. మీ పిల్లలను కనిపెట్టుకుని ఉండండి..’’ వంటి సూచనలు, హెచ్చరికలతో వారం రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులతో జిల్లావాసులు వణుకుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ఇవి అసత్య ప్రచారాలని, ప్రజలు నమ్మవద్దని పోలీసు అధికారులు పత్రికా ప్రకటనలు చేస్తున్నా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలనే ప్రజలు నమ్ముతూ భయపడిపోతున్నారు. దీంతో నాలుగు రోజులుగా కోనసీమలో పలు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమలాపురం టౌన్ : సోషల్‌మీడియా ప్రచారాల జోరుతో ఏ గ్రామానికైనా కొత్తగా మానసిక రోగి అడుగుపెడితే వాడు సైకో అని, వాడే పిల్లలను ఎత్తుకు పోయేవాడంటూ గ్రామ ప్రజలు చితకబాదుతున్నారు. అయినవిల్లి, అల్లవరం మండలం సామంతకుర్రు, బోడసకుర్రు గ్రామాల్లో ఈ తరహా దాడులు జరిగాయి. పి.గన్నవరంలో గురువారం రాత్రి ఓ మానసిక రోగి రోడ్డుపై వెళుతుండగా అతడిని స్థానికులు ఆపి అనుమానంతో ప్రశ్నించారు. అతను హిందీలో మాట్లాడాడు. అతడిని బ్యాగ్ తనిఖీ చేయగా ఓ చాకు, సిరంజి ఉండడంతో ఇతడు పిల్లలను ఎత్తుకుపోయేవాడిగా భావించి చితకబాదారు. ప్రజలు మానసిక రోగులపై దాడులు చేస్తున్నప్పుడు పోలీసులే అడ్డుకుని వారికి రక్షణ కల్పించారు. చిత్తవుతున్న మానసిక రోగులు.. అమలాపురం రూరల్ మండలం సవరప్పాలెం, తాండవపల్లి గ్రామల్లో రోడ్ల చెత్త ఏరుకుని జీవించే సంచార జాతులకు చెందిన రెండు కుటుంబాలను పిల్లలను పట్టుకుపోయే ముఠాగా భావించి అక్కడి ప్రజలు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కోనసీమలో జరిగిన సంఘటనలే కాకుండా వేరే జిల్లాలు, రాష్ట్రాల్లో ఎవరినో నిర్బంధించి ప్రశ్నిస్తున్న ఫొటోలను కూడా వాట్సాప్‌ల ద్వారా పోస్టింగ్‌లు చేసి ఫలానా గ్రామంలో సైకోలు, పిల్లలను ఎత్తుకెళ్లే వారిని నిలదీస్తున్నారంటూ రాస్తున్నారు. అంబాజీపేట మండలం చిరుతపూడిలో పిల్లల అవయవాలు అపహరించే ముఠా పోలీసులకు చిక్కింది.. ఇదిగో ఆధారమంటూ చనిపోయిన పిల్లల మృతదేహాలు, వారి అవయవాలు ఉన్న వేరే ఫొటోలను గ్రాఫిక్ చేసి వాట్సాప్‌ల్లో షేర్ చేస్తున్నారు. ఈ ముఠా ప్రస్తుతం అమలాపురం పరిసర ప్రాంతాల్లో తిరుగుతోందని.. మీ పిల్లలను తీసుకుని జనం లేని ప్రాంతాలకు వెళ్లవద్దు.. ఈ మెసేజ్‌ను అందరికీ షేర్ చేయండి.. అంటూ వాట్సాప్‌లో పోస్టింగ్‌లు చేస్తున్నారు. ‘ఆ వదంతులు నమ్మవద్దు’ కాకినాడ రూరల్: జిల్లాలో ఇటీవల చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాల్లో వస్తున్న వదంతుల్లో నిజం లేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వదంతులు వ్యాపించి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఎవరైనా గ్రామాల్లో కొత్తవారు కనిపిస్తే వారి పట్ల ప్రజలు అనుమానంతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. నిజానికి ఏ రకమైన గ్యాంగ్‌లు, కిడ్నాప్ ముఠాలు ఏవీ లేవని తమ విచారణలో తెలిసిందన్నారు. ఎవరైనా అనుమానిత, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వారిపై ప్రజలు ఏవిధమైన చర్యలు తీసుకోకుండా, వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ విశాల్‌గున్ని కోరారు. అటువంటి వ్యక్తులపై పోలీసులే చర్యలు తీసుకుంటారన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలో రాత్రి, పగలు గస్తీలు పెంచామన్నారు. 24 గంటలు పోలీస్ సిబ్బంది గస్తీ తిరుగుతుంటారని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. -
పార్దీ, చెడ్డీ గ్యాంగుల సంచారంతో టెర్రర్
నూజెండ్ల: గుర్తు తెలియని వ్యక్తుల సంచారంతో మండల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తాజాగా నూజెండ్ల మండలం ఉప్పలపాడులో తిరుగుతున్న యువకుడిని ఆదివారం గ్రామస్తులు కట్టివేసి దేహశుద్ధి చేశారు. అనంతరం ఐనవోలు పోలీసులు స్టేషనుకు తరలించి విచారణ చేపట్టి పిచ్చివాడని రాత్రి వదలి వేశారు. అతడు సోమవారం ఉదయం జంగాలపల్లి సమీపంలో తిరుగుతుండగా గ్రామస్తులు గుర్తించి తరిమివేశారు.అక్కడ నుంచి వినుకొండ పోలీసులు తీసుకొచ్చి వైద్య చికిత్సలు చేయించి ప్రకాశం జిల్లా వెల్లల చెరువులో వదలిపెట్టారు. యువకుడు గ్రామాల్లో తిరుగుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. గ్రామాల్లో యువకుల గస్తీ రాష్ట్రంలోకి పార్దీ, చెడ్డి గ్యాంగ్ ముఠా సభ్యులు వందల సంఖ్యలో వచ్చారని ప్రచారం జరుగుతుండటంతో యువకులు నిద్ర లేకుండా గస్తీ తిరుగుతున్నారు. మండలంలోని కంభంపాడు, తెల్లబాడు, ఉప్పలపాడు గ్రామాల్లో కర్రలు చేతబూని కాపలాకాస్తున్నారు. ఆదివారం రాత్రి కంభంపాడు ఎస్సీ కాలనీలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు డ్రాయర్లు ధరించి ముఖానికి మాస్కులు వేసుకుని సంచరిస్తున్నారని గ్రామస్తులు నిద్రాహారాలు మాని తెల్లవారే వరకు కర్రలతో కాపలాకాశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే వెంటనే వారిని వదిలి వేయడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిని మెంటల్ ఆస్పత్రికి తరలిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.రాత్రివేళల్లో గస్తీ ముమ్మురం చేసి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అన్నీ అపోహలే... ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా రాష్ట్రంలో ఎలాంటి ముఠాలు లేరని, కేవలం ప్రజల అపోహలేనని కొట్టిపారేస్తున్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కన్పిస్తే 100కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. -
భయం దరువు..కునుకు కరువు
ఆదోని: కరుడుగట్టిన నేరుస్తులుగా పేరొందిన పార్థి, బిహార్, చెడ్డి గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయనే సోషల్ మీడియా ప్రచారంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చాలా గ్రామాల్లో ప్రజల కంటికి కునుకు కరువైంది. పలు గ్రామాలలో వంతులు వారిగా కర్రలు, పొంజులు పట్టుకుని కాపలా కాస్తున్నారు. గ్రామాలలో ఏ కొత్త వ్యక్తి కనిపించినా పిల్లలను ఎత్తుకు వెళ్లే ముఠా సభ్యుడిగానో, దోపిడీ దొంగగానో అనుమానిస్తూ వారిపై మూకుమ్మడి దాడికి పాల్పడుతున్నారు. ఆదోని కిల్చిన్పేటలో తమకు కనిపించిన కొత్త వ్యక్తిని పిల్లలను ఎత్తుకు వెళ్లే బిహార్ ముఠాకు చెందిన కిడ్నాపర్‌గా భావించిన స్థానికులు చెట్టుకు కట్టేసి, కర్రలతో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఆ వ్యక్తి దొంగో, కిడ్నాపరో తెలియదు.సోషల్ మీడియా ప్రచారం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. వరుస దాడులు.. గత బుధవారం పట్టణంలోని ఇందిరా నగర్లో అనుమానస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. వారిలో ఇద్దరు తప్పించుకోగా దొరికిన ఓ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు కూడా ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది. షరాప్ బజారులో మురుగు కాలువలలోని మట్టిని తీసి అందులో బంగారు చూర్ణాలను ఏరుకుని బతుకేందుకు పట్టణానికి వచ్చిన వారిగా పోలీసులు గుర్తించి వారిని వదిలేశారు. గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడి, మహానంది మండలం గోపవరంలో తమకు తారసపడిన వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. అయితే వారు ఇద్దరు భిక్షగాళ్లుగా పోలీసుల విచారణలో తేలింది. చిప్పగిరి మండలం బెల్డోణలో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన వ్యక్తికి మతి స్థిమితం లేని వ్యక్తిగా పోలీసు విచారణలో తేలింది. మద్దికెర మండలం పెరవలికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు చితకబాది పోలీసులక అప్పగించారు. అయితే ఆ వ్యక్తులు బతుకుదెరువు కోసం వచ్చిన వ్యక్తులుగా పోలీసుల గుర్తించారు. జిల్లాలో దాదాపు సగం గ్రామాల్లో రాత్రి పూట యువకులు వంతులు వేసుకుని కాపలా కాస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా ప్రచారంతో.. రాయలసీమ జిల్లాల్లో కరడుగట్టిన పార్థి, బిహార్, చెడ్డీ గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రెస్మీట్లు పెట్టి ప్రజలను హెచ్చరించారు. అయితే కొంతమంది వ్యక్తులు అదే పనిగా సోషల్ మీడియా ద్వారా గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయని, ఏ క్షణంలో అయినా గ్రామాలపై పడి దోచుకోవచ్చని, ఎవరైనా ఎదురిస్తే విచక్షణా రహితంగా ప్రజలను చంపేస్తున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో ప్రశాంతంగా ఉండే పల్లెల్లో అలజడి చెలరేగింది. ఎండా కాలం కావడంతో ఆరు బయట, మిద్దెపై నిద్ర పోవడానికి కూడా జంకుతున్నారు. యువకులు వంతులు వేసుకుని రాత్రంతా కాపలా కాస్తున్నారు. కొత్త వ్యక్తులు కనిపించేలోగా కరుడుగట్టిన నేరస్తుడేమోనన్న అనుమానంతో చితకబాది పోలీసులకు అప్పగిస్తున్నారు. జిల్లాలో కరుడుగట్టిన నేరగాళ్ల సంచారం లేదన్న విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ద్వారా ప్రజలలో లేని పోని భయాలు, అపోహలు, అనుమానాలు కల్పించే వారి పట్ల కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
ఫేసు బుక్కయ్యాడు..
ప్రొద్దుటూరు క్రైం : పార్థీ గ్యాంగ్ తిరుగుతోందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తద్వారా తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవాలని ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టిన యువకుడిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో పార్థీ గ్యాంగ్ సంచారం లేకున్నా ప్రజలు జంకుతున్నారు. ఒక వైపు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తరుణంలో వినోద్‌కుమార్‌రెడ్డి అనే కుక్కుల వ్యాపారి ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం సీఐ ఓబులేసు అరెస్ట్ విరాలను వెల్లడించారు. పాతకోట వినోద్‌కుమార్‌రెడ్డి ఆరేళ్ల నుంచి ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెలో భైరవ కెన్నల్ పేరుతో కుక్కల వ్యాపారం నిర్వహించేవాడు. ఇటీవల జిల్లాలో పార్థీ గ్యాంగ్ గురించి పుకార్లను, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవాలని చూశాడు. పార్థీ గ్యాంగ్ లేదని చెప్పిన పోలీసుల మాటలను నమ్మవద్దని, జిల్లాలో పార్థీ గ్యాంగ్ ముఠా సంచరిస్తోందని, ఇంటికి కాపలాగా ప్రతి ఒక్కరూ కుక్కను పెట్టుకోవాలని ప్రజలు నమ్మేలా ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడు. ఫేస్బుక్ ద్వారా ప్రజలను నమ్మించే విధంగా తప్పుడు ప్రచారం చేసిన అతన్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రజల్లో ఉన్న పార్థీ గ్యాంగ్ భయాన్ని పోగొట్టేందుకు పోలీసులు శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో పార్థీ గ్యాంగ్ ఉందని ప్రజల్లో భయాన్ని కలిగించడం నేరమని సీఐ తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పార్థీ గ్యాంగ్ కదలికలు లేవు.. జిల్లాలో పార్థీ గ్యాంగ్ సంచారం లేదని సీఐ ఓబులేసు అన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో పార్థీ గ్యాంగ్ చేసిన నేరాలు, ఇతర సంఘటనలు ఒక్కటి కూడా లేదని చెప్పారు. ఎక్కడో జరిగిన సంఘటనలను జిల్లాలో జరిగినట్లు వాట్సప్, ఫేస్బుక్ ద్వారా కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులను ఇతరులకు పంపరాదని సీఐ సూచించారు. ఇలాంటి పుకార్లను, వదంతులను నమ్మరాదని కోరారు. పట్టణంలోనూ, గ్రామాల్లోనూ నిరంతరం పోలీసులు గస్తీ తిరుగుతున్నారని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రజలను కోరారు. -
తెలుగు మాట్లాడకపోతే పార్థీ గ్యాంగేనా?
అనంతపురం సెంట్రల్: కరుడుగట్టిన నేరస్తుల ముఠా జిల్లాలో సంచరిస్తున్నట్లు వస్తున్న వదంతులు జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆ ముఠా చిన్న పిల్లలను అత్యంత క్రూరంగా చంపుతారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో రాత్రిళ్లు కాపలా కాస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో పార్థీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. తాడిపత్రి, గుంతకల్లు ప్రాంతాల నుంచి ఈ తరహా వదంతులు వ్యాపిస్తున్నాయి. సోమవారం రాత్రి గుత్తి ఆర్ఎస్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తుండటంతో స్థానికులు వారిని వెంబడించి ఒకరిని పట్టుకొని చితకబాదారు. మరికొందరు పారిపోయారు. అలాగే పెద్దపప్పూరు మండలం పెండేకల్లు రిజర్వాయర్ సమీపంలో ఓ మహిళ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అనుమానం వచ్చిన ప్రజలు సదరు మహిళను పట్టుకొని పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తెలుగు మాట్లాడకపోతే పార్థీ గ్యాంగేనా? పార్థీగ్యాంగ్ సంచరిస్తున్నట్లు ఎక్కువుగా రైల్వే లైన్ ఉన్న ప్రాంతాల్లో వినిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి భిక్షాటన చేస్తూ వచ్చిన వ్యక్తులు జిల్లాలో గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, హిందూపురం తదితర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల మీద ఉంటున్నారు. మాసిపోయి, చిరిగిన దుస్తులు, గడ్డాలు పెంచుకొని అనుమానంగా కనిపిస్తుండటంతో స్థానికులు వారిని చితకబాదుతున్నారు. గుత్తిలో ఇలాగే జరిగింది. పెద్దపప్పూరులో స్థానికులు అప్పగించిన మహిళను మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. ఇదిలా ఉంటే స్థానికంగా పట్టుబడిన యాచకులు, పార్థీగ్యాంగ్ సభ్యుల ఫొటోలను పక్కన పక్కన జతచేసి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఇది ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఒక్కరోజులో 200 ఫోన్‌కాల్స్ పార్థీ గ్యాంగ్ వదంతుల నేపథ్యంలో సోమవారం రాత్రి డయల్ 100, 9989819191లకు దాదాపు 200 ఫోన్‌కాల్స్ వచ్చాయి. గుత్తి మండలంలోని 20 గ్రామాల్లో స్థానికులు రాత్రిళ్లు నిద్ర మానేసి కాపలా కాస్తున్నారు. బుక్కరాయసముద్రం నుంచి 16, యాడికి నుంచి 10, పామిడి నుంచి 12, గార్లదిన్నె నుంచి 15, గుంతకల్లు నుంచి 36 ఫోన్‌కాల్స్ వచ్చాయి. వీటితో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భయాందోళనతో పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. అపరిచితులపై దాడి మంగళవారం గార్లదిన్నె మండలం పెనకచెర్లలో హెచ్చెల్సీ కాలువ లైనింగ్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్ వద్దకు పనికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని పార్థీగ్యాంగ్ సభ్యుడిగా అనుమానించి స్థానికులు చితకబాదారు. వడియంపేట సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అసలు పార్థీ గ్యాంగ్ ఉందా? కొద్దికాలంగా సామాజిక మాధ్యమాల్లో అలజడి సృష్టిస్తున్న పార్థీగ్యాంగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్లు సమాచారం. కానీ.. తెలుగురాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ సంచరించిన ఘటనలు లేవు. తొలుత నెల్లూరు జిల్లాలో పార్థీగ్యాంగ్ అడుగుపెట్టినట్లు, అక్కడి నుంచి చిత్తూరు జిల్లా, వైఎస్సార్ కడప జిల్లాలో పార్థీగ్యాంగ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. పదిరోజులుగా అనంతపురం జిల్లాకు వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి. కానీ రాష్ట్రం లో ఎక్కడా వీరి జాడ కనిపించలేదు. ఒక్క కేసూ నమోదు కాలేదు. వదంతులు నమ్మొద్దు జిల్లాలో పార్థీ గ్యాంగ్, బిహార్ ముఠాలు ప్రవేశించినట్లు వస్తున్న వదంతులు నమ్మొద్దు. ఉత్తరాది రాష్ట్రల్లోని ముఠాలకు సంబంధించిన ఫైల్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి అలజడి సృష్టించారు. అందరూ వాటిని షేర్ చేస్తుండటంతోప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఆ తరహా ముఠాలు ఏవీ ప్రవేశించలేదు. పొరుగు జిల్లాలోనూ అలాంటి దాఖలాల్లేవు. ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100, 9989819191 నంబర్లకు సమాచారం ఇవ్వండి. వారిపై దాడి చేసి గాయపర్చవద్దు. – జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ -
పార్థీ గ్యాంగ్ ముసుగులో ఎర్రచందనం రవాణా
రేణిగుంట:రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న పార్థీ గ్యాంగ్ ముసుగులో ఎర్ర స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామానగర్ సమీపంలోని అటవీ ప్రాంతం గుండాలకోన నుంచి ఎర్రచందనం తరలిస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశా రు. ఎర్ర స్మగ్లర్లు పారిపోగా వారు పడవేసిన 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ విజయనరసింహులు కథనం మేరకు.. రోజు వారి తనిఖీల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి ఆర్ఎస్ఐ విజయనరసింహులు, డీఆర్వో శ్రీనివాసరావు, ఎఫ్ఎస్వో నాగరాజు తమ సిబ్బందితో కలిసి తారకరామానగర్, గుండాలకోన వద్ద గస్తీ చేపట్టారు. శ్రీనివాసపురం గ్రామం వద్ద పార్థీ గ్యాంగ్ ఉన్నట్లు అలజడి రేగిందని తెలుకుని గ్రామశివారున ఉన్న మరో టీంకు సమాచారం అందించారు. దుండగులు పార్థీ గ్యాంగ్ సభ్యులు కాదని, ఎర్రచందనం దొంగలని నిర్ధారించుకున్న పోలీసులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకుని వెంబడించారు. దీంతో ఎర్రస్మగ్లర్లు తమ వద్దనున్న దుంగలను పడేసి గుండాల కోన నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. 675 కిలోల బరువున్న 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గత 20 రోజులుగా గ్రామంలో అలజడి ఉన్నందున తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని శ్రీనివాసపురం, తారకరామానగర్ వాసులు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏసీఎఫ్ నాగార్జునరెడ్డి, ఆర్ఐ చంద్రశేఖర్, మురళి, ఎఫ్ఆర్వో ప్రసాద్ పరిశీలించారు. ఆపరేషన్ టీంలో ఆర్ఎస్ఐ విజయనరసింహులు, డీఆర్వో శ్రీనివాసులు, ఎఫ్ఎస్వో నాగరాజురెడ్డి, జగదీష్, నవీన్, మోహన్, రెడ్డెప్ప, ముజీఫ్ పాల్గొన్నారు. -
నెల్లూరు సరిహద్దుల్లో పార్ధిగ్యాంగ్..!
సాక్షి, నెల్లూరు(క్రైమ్) : దేశంలోనే అత్యంత కరుడు గట్టిన నరరూప రాక్షసులుగా పిలువబడే పార్ధిగ్యాంగ్ చిత్తూరు–తమిళనాడు, చిత్తూరు–నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తుందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ శుక్రవారం సిబ్బందితో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్ధిగ్యాంగ్ కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి, రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నిందితులు దాడులకు తెగబడే అవకాశమున్న దృష్ట్యా గస్తీ సిబ్బంది విధిగా ఆయుధాలు (షాట్ వెపన్స్)ను వెంట ఉంచుకోవాలన్నారు. అవసరమైతే కాల్చివేయడానకి వెనుకాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. ఎవరీ పార్ధిగ్యాంగ్! మహారాష్ట్ర–మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాధ్, మధ్యప్రదేశ్, భూపాల్ తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు. వీరి కుటుంబాల్లో అందరూ దోపిడీలు, దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులు. కుటుంబాలతో ఉపాధి కూలీల్లా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతారు. గ్రామ సరిహద్దులు, పట్టణ శివార్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల కింద, రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల సమీపంలో గుడారాలు వేసుకుని సంచార జీవనం సాగిస్తారు. మహిళలు పగటి వేళల్లో పరిసర ప్రాంతాల్లో చిత్తుకాగితాలు ఏరుకోవడం, పిన్నీసులు, పూసలు అమ్మడం, యాచకుల్లా జీవనం చేస్తూ తమ పనులకు వీలుగా ఉండే ఇంటిని లక్ష్యంగా ఎం చుకుంటారు. రాత్రి వేళల్లో ఆ ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతారు. ఆ సమయంలో వారి కదలికలను ఎ వరూ గుర్తుపట్టకుండా ఉండేలా జాగ్రత్త పడుతారు. ఆనవాళ్లు దొరక్కుండా.. వీరు దొంగతనం చేసే ఇంటికి వెళ్లిన సమయంలో తమ ఆనవాళ్లను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వీరి వ్యవహారశైలి అత్యంత క్రూరంగా ఉంటుంది. లక్ష్యంగా ఎంచుకొన్న ఇంట్లో భయానక వాతావరణం సృష్టిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న, పెద్దా, వృద్ధులు, వికలాంగులు తేడా లేకుండా అందర్ని అతి క్రూరంగా (రాడ్లు, కర్రలతో తలపై విచక్షణా రహితంగా కొట్టడం, కత్తులతో గొంతులు కోయడం) మట్టుపెట్టి అందిన కాడికి దోచుకెళుతారు. నేరానికి పాల్పడే సమయంలో ఎవరు అడ్డొచ్చినా వారిని హత మారుస్తారు. పార్ధి గ్యాంగ్‌లు సుమారు 10 ఉండొచ్చని పోలీసులు అంచనా. ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉంటారని సమాచారం. గ్యాంగ్‌లో పురుషులే కాదు మహిళలు సైతం చురుగ్గా వ్యవహరిస్తారు. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన పలువురిని 2014లో వరంగల్, 2015లో విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 ఆగస్టులో కండి జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న నలుగురు పార్థిగ్యాంగ్ సభ్యులు తప్పించుకున్నారు. 2005లో నెల్లూరులో దొంగతనం పార్ధిగ్యాంగ్ గతంలో నెల్లూరులో దొంగతనానికి పాల్పడింది. 2005లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంజీ బ్రదర్స్ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. రెండు రోజులు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. ఇంటి కుక్కలకు మత్తు బిస్కెట్లు వేసి వాచ్‌మన్‌ను హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద కలకలం సృష్టించింది. కావలిలోనూ ఇదే తరహాలో నేరానికి పాల్పడినట్లు సమాచారం. అప్రమత్తంగా ఉండాలి జిల్లా సరిహద్దులో పార్ధిగ్యాంగ్ సంచరిస్తుందన్న సమాచారం. ముందస్తు చర్యల్లో భాగంగా సిబ్బం దిని అప్రమత్తం చేశాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, కొత్తవారు తారసపడితే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. – పీహెచ్డీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ -
రక్తచరిత్రే..
వరంగల్ క్రైం/రఘునాథపల్లి/జనగామ రూరల్ : వీరిని చూస్తే... అమాయకులని అనిపిస్తుంది. కానీ.. వీరి వెనుక పెద్ద రక్త‘చరిత్రే’ ఉంది. జిల్లాతోపాటు రాష్ర్ట్రంలోని పలు ప్రాంతాల్లో నరమేధం సాగించి.. దోపిడీ చేసిన పార్థీ ముఠా సభ్యులు వీరే. వీరికి 31 హత్య కేసుల్లో ప్రమేయముండగా... బీబీనగర్, రఘునాథపల్లి, లింగంపల్లి,సదాశివపేట, పెద్దపల్లి ఘటనల్లో ప్రధాన నిందితులు. గత నెల 24న హైదరాబాద్‌లోని లింగంపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి జైలులో ఉన్న నలుగురు నిందితులను రఘునాథపల్లి హత్యాకాండ కేసుపై జనగామ కోర్టుకు హాజరుపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇలాంటి కరుడు గట్టిన నరరూప రాక్షసులు పార్థీ గ్యాంగ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఖాకీలకు చిక్కింది పార్థీ గ్యాంగ్‌లోని ఒక ముఠాకు చెందిన వారే. పార్థీ ముఠాకు సంబంధించిన మరో 8 బృందాలు జిల్లాలో తిరుగుతున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. మహారాష్ట్రలోని ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే ప్రాంతాలకు చెందిన ఈ దొంగల ముఠా ఇప్పటివరకు జిల్లాలో ఐదు దొంగతనాలకు పాల్పడింది. దీంతోపాటు పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంటలో ఒక్కొక్క దొంగతనానికి పాల్పడ్డారు. వీరు చేసిన ప్రతి దొంగతనంలోనూ హత్యలకు పాల్పడ్డారు. ‘మర్డర్ ఫర్ గెయిల్’ నేరాల కింద పిలువబడే పార్థీ గ్యాంగ్ సభ్యుల వ్యవహార శైలి అత్యంత క్రూరత్వం. వారు సృష్టించిన నరమేధాలే ఇందుకు నిదర్శనం. దొంగతనానికి ఒడిగట్టే ఇంటిలో ఆ రాత్రి భయానక వాతావరణం కల్పించడం... ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు అనే తేడా లేకుండా ఇంట్లో ఎవరు ఉన్నా, రాడ్లు, కర్రలతో తలపై కొట్టడం, కత్తులతో కోయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటివరకు ఈ ముఠాలోని సభ్యులు గతంలో మూడు సార్లు పోలీసులకు చిక్కారు. ప్రతి ఒక్క దోపిడీలోనూ హత్యలే... ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉండే పార్థీ గ్యాంగ్ సుబేదారి, శాయంపేటలో చేసిన రెండు దొంగతనాల్లో బీభత్సం సృష్టించారు. హన్మకొండ జులైవాడలో జరిగిన సంఘటనలో భార్య, భర్తలను తీవ్రంగా కొట్టడంతో పాటు భార్య గొంతుకోసి సొత్తు దొంగిలించారు. అదేవిధంగా... శాయంపేట, నెక్కొండ మండల కేంద్రంలో జరిగిన దోపిడీ సంఘటనల్లో కూడా హత్యకు పాల్పడారు. నెక్కొండ సమీపంలోని తండాల్లో మరో రెండు దొంగతనాలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ను హత్యచేసి దోచుకెళ్లారు. నల్లగొండ పోలీసులకు దొరికిన వీరు రాష్ర్టవ్యాప్తంగా పది దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. ఇందులో హైదరాబాద్‌లో నాలుగు కాగా... వరంగల్ రఘునాథపల్లికి చెందినది మరొకటి. గీత వృత్తి చేస్తూ రఘునాథపల్లి మండల కేంద్రంలో హోటల్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న చెరుకు నర్సింహులు, రేణుక ద ంపతుల కుటుంబం ఈ ముఠా కిరాతకంతో చిన్నాభిన్నమైంది. ఇంట్లో బంగారం, నగదు దోచుకుపోవడంతోపాటు మేల్కొన్న రేణుక కూతురు అకిరనందిని, తల్లి లచ్చమ్మ, అమ్మమ్మ రాధమ్మను రాడ్లతో బాది అతి కిరాతకంగా బలిగొన్నారు. ముక్కుపచ్చలారని రేణుక కుమారుడు హర్షవర్దన్‌పైనా ప్రతాపం చూపించారు. తీవ్ర గాయాల పాలు చేయడంతో ఇప్పటికీ ఆ బాబు ఆరోగ్యం నిలకడగా లేదు. రాత్రి వేళల్లో మాత్రమే దొంగతనాలు ..... పగలు గానీ.. రాత్రి గానీ తాళాలు వేసి ఉన్న ఇళ్లను మాత్రమే దొంగతనాలకు ఎంచుకుంటారు దొంగలు. కానీ.. పార్ధీ గ్యాంగ్ కేవలం రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతుంది. చూడడానికి పొట్టిగా, నల్లగా ఉండే వీరు చిత్తు కాగితాలు ఏరుకోవడం, పిన్నిసులు అమ్మడం, బిచ్చం ఎత్తుకోవడం వంటివి చేస్తుంటారు. మధ్యాహ్నం వేళల్లోఈ పనిచేస్తూ.. రెక్కీ నిర్వహించి దొంగతనం చేసే ఇంటిని ఎంచుకుంటారు. రాత్రి వేళలో ముఠాగా ఆ ఇంటి పరిసరాల్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లో వారికి తెలిసే విధంగానే తలుపులు, కిటికీలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తారు. లోనికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వారిని చావబాది డబ్బులు, బంగారం అపహరిస్తారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లే వీరి అడ్డా. ఎక్కువ మంది ఉన్న సమయంలో ఈ స్టేషన్లకు దగ్గరగా డేరాలు వేసుకుని ఉంటారు. ఎక్కువసార్లు బస్‌స్టేషన్‌లోని డార్మెట్లలో బసచేస్తుంటారు. దొంగతనం చేసిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల లోపు వీరు ఎలాంటి దోపిడీకి పాల్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా, రఘునాథపల్లిలో బీభత్సం సృష్టించి పట్టుబడిన పార్థీ ముఠా సభ్యులు షేరియాష్కాడే, సంతోష్ షిండే, తరుణ్బోస్లే, పరమేశ్వర్ బోస్లేను జనగామ కోర్టులో హాజరు పరుస్తున్నారనే సమాచారంతో మండల కేంద్రం లోని పలువురు యువకులు అక్కడికి తరలివెళ్లారు. కిరాతకంగా ముగ్గురిని బలిగొన్న నిందితుల్ని ఉరితీయాలని నినాదాలు చేశారు. నగరంలో స్టూవర్ట్‌పురం దొంగలు నగరంలో పార్థీ గ్యాంగ్‌తో పాటు స్టూవర్ట్‌పురానికి చెందిన దొంగల ముఠా ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ప్రజల దృష్టి మర ల్చి దొంగిలించడం వీరి స్టైల్. బ్యాంకుల వద్ద, డబ్బులు మారే చోట వీరు ఎక్కువగా గమనిస్తుంటారు. ఇటీవల కాలంలో సుబేదారిలోని ఎస్బీహెచ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల వద్ద చోరీ చేశారు. వరంగల్ ఎస్బీహెచ్ వద్ద పలు దొంగతనాలకు పాల్పడ్డారు. స్టువర్ట్ ప్రాంతంలోని నగరి, బాపట్ల, ఎదుళ్లపల్లి నుంచి వీరు ఇక్కడకు వచ్చి తిష్టవేశారు. సుమారు 5 గ్యాంగ్‌లు నగరంలో తిరుగుతున్నట్లు, ఒక్కో గ్యాంగ్‌లో నలుగురు సభ్యులు ఉన్నట్లు సమాచారం.