![Parthi Gang Arrest in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/29/savaralu.jpg.webp?itok=jamx9YNp)
వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్
సాక్షి, సిటీబ్యూరో: ‘మహిళలు అందంగా కనిపించేందుకు అవసరమైన సవరాలు అమ్ముతాం...చిన్న పిల్లల ఆట బొమ్మలు విక్రయిస్తాం...జీవితంలో సమస్యలు లేకుండా చేసే రుద్రాక్ష మాలలు ఇస్తాం’ అంటూ పగటివేళలో కాలనీల్లో తిరుగుతూ మహిళలు అనువైన ఇళ్లను గుర్తించగా, రాత్రి వేళల్లో వారి భర్తలు దోపిడీలకు పాల్పడతారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ పార్థీ గ్యాంగ్ సభ్యులు నలుగురిని సైబరాబాద్ స్పెషల్ అపరేషన్ టీమ్ (ఎస్‌వోటీ) పోలీసులు మంగళవారం రాత్రి మేడ్చల్‌లో అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువైన కిలో బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే హత్యలకు వెనకాడని సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎస్‌వోటీ ఇన్‌చార్జ్ దయానంద్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.
శివారు ప్రాంతాల్లో అడ్డాలు...
మధ్యప్రదేశ్‌లోని హోసాంగాబాద్ జిల్లా, సియోని మాలా ప్రాంతానికి చెందిన షేర్ సింగ్ రాథోడ్ చిన్నతనం నుంచే చోరీల బాట పట్టాడు.మధ్యప్రదేశ్‌లోనే పలు ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడిన అతను సియోని, ఖంద్వా పోలీసులకు చిక్కాడు. అనంతరం అతనిపై నిఘా పెరగడంతో బయటి రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, బీహర్, వెస్ట్‌బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టి సారించాడు. అదే రాష్ట్రంలోని కత్ని జిల్లా, బెరూలికి చెందిన షాహీద్ కపూర్, రిజ్వాడి లాల్, అతని కుమారులు దిలావర్‌సింగ్, ఇన్సానియత్, ఇక్బల్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఈ ముఠా సభ్యులు తమ కుటుంబాలతో కలిసి వివిధ నగరాల్లోని రైల్వే స్టేషన్ల సమీపంలోని శివారు ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. రోడ్డుకు 200 మీటర్ల దూరంలో చిన్న గుడిసెల్లో జీవనం సాగించేవీరు పోలీసుల కంటపడినా తప్పించుకునే ందుకు సిద్ధంగా ఉంటారు. ముఠాలోని స్త్రీలు సవరాలు, రుద్రాక్ష మాలలు, ఆట బొమ్మలను విక్రయిస్తున్నట్లు కాలనీల్లో తిరుగుతూ దోపిడీకి అనువైన ఇళ్లను గుర్తిస్తారు. అలా గుర్తించిన ఇంట్లో రాత్రి సమయాల్లో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళతారు. ఈ క్రమంలో ఎవరైనా ఎదురు తిరిగినా హత్యలకు కూడా వెనకాడరు. ఈ దోపిడీ క్రమంలోనే మహారాష్ట్రలో ఒక హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. వీరు ఒక చోట మూడు రోజులు ఉండి ఆ వెంటనే మరో ఐదు కిలోమీటర్ల దూరంలో తాత్కాలిక నివాసం ఏర్పరచుకొని దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఎస్‌ఓటీ కృషితో 21 కేసుల ఛేదన
గతేడాది జూలై నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 12, రాచకొండ కమిషనరేట్‌లో 3, వరంగల్ కమిషనరేట్‌లో రెండు, ఖమ్మం కమిషనరేట్‌లో మూడు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక దోపిడీ...మొత్తంగా రాష్ట్రంలో 21 కేసులు నమోదయ్యాయి.గత ఫిబ్రవరిలో చివరిసారిగా మేడ్చల్‌లో ఒక ఇంట్లో దోపిడీ చేసే క్రమంలో యజమానిని గాయపరిచినట్లు నమోదైంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎస్‌ఓటీ బాలానగర్ ఇన్‌స్పెక్టర్ సంగని రమేశ్, శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డిలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మేడ్చల్, దుండిగల్, పేట్ బషీరాబాద్, అల్వాల్ గచ్చిబౌలి, శంషాబాద్ దోపిడీల్లో లభించిన వేలిముద్రల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రత్యేక బృందం అక్కడ వేలిముద్రలు సరిపోలడంతో వారి వివరాలను సేకరించారు. వారు మళ్లీ దోపిడీలకు హైదరాబాద్‌కే వచ్చినట్లుగా గుర్తించారు. మంగళవారం మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన సూత్రధారి షేర్ సింగ్ రాథోడ్‌తో పాటు దిలావర్‌సింగ్, రిజ్వాడి లాల్, షాహీద్ కపూర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు సీపీ సజ్జనార్‌తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment