అనంతపురం సెంట్రల్: కరుడుగట్టిన నేరస్తుల ముఠా జిల్లాలో సంచరిస్తున్నట్లు వస్తున్న వదంతులు జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆ ముఠా చిన్న పిల్లలను అత్యంత క్రూరంగా చంపుతారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో రాత్రిళ్లు కాపలా కాస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో పార్థీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. తాడిపత్రి, గుంతకల్లు ప్రాంతాల నుంచి ఈ తరహా వదంతులు
వ్యాపిస్తున్నాయి. సోమవారం రాత్రి గుత్తి ఆర్‌ఎస్‌లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తుండటంతో స్థానికులు వారిని వెంబడించి ఒకరిని పట్టుకొని చితకబాదారు. మరికొందరు పారిపోయారు. అలాగే పెద్దపప్పూరు మండలం పెండేకల్లు రిజర్వాయర్ సమీపంలో ఓ మహిళ అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో అనుమానం వచ్చిన ప్రజలు సదరు మహిళను పట్టుకొని పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
తెలుగు మాట్లాడకపోతే పార్థీ గ్యాంగేనా?
పార్థీగ్యాంగ్ సంచరిస్తున్నట్లు ఎక్కువుగా రైల్వే లైన్ ఉన్న ప్రాంతాల్లో వినిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి భిక్షాటన చేస్తూ వచ్చిన వ్యక్తులు జిల్లాలో గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, హిందూపురం తదితర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల మీద ఉంటున్నారు. మాసిపోయి, చిరిగిన దుస్తులు, గడ్డాలు పెంచుకొని అనుమానంగా కనిపిస్తుండటంతో స్థానికులు వారిని చితకబాదుతున్నారు. గుత్తిలో ఇలాగే జరిగింది. పెద్దపప్పూరులో స్థానికులు అప్పగించిన మహిళను మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. ఇదిలా ఉంటే స్థానికంగా పట్టుబడిన యాచకులు, పార్థీగ్యాంగ్ సభ్యుల ఫొటోలను పక్కన పక్కన జతచేసి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఇది ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది.
ఒక్కరోజులో 200 ఫోన్‌కాల్స్
పార్థీ గ్యాంగ్ వదంతుల నేపథ్యంలో సోమవారం రాత్రి డయల్ 100, 9989819191లకు దాదాపు 200 ఫోన్‌కాల్స్ వచ్చాయి. గుత్తి మండలంలోని 20 గ్రామాల్లో స్థానికులు రాత్రిళ్లు నిద్ర మానేసి కాపలా కాస్తున్నారు. బుక్కరాయసముద్రం నుంచి 16, యాడికి నుంచి 10, పామిడి నుంచి 12, గార్లదిన్నె నుంచి 15, గుంతకల్లు నుంచి 36 ఫోన్‌కాల్స్ వచ్చాయి. వీటితో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భయాందోళనతో పోలీసులకు ఫోన్ చేస్తున్నారు.
అపరిచితులపై దాడి
మంగళవారం గార్లదిన్నె మండలం పెనకచెర్లలో హెచ్చెల్సీ కాలువ లైనింగ్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్ వద్దకు పనికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని పార్థీగ్యాంగ్ సభ్యుడిగా అనుమానించి స్థానికులు చితకబాదారు. వడియంపేట సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న మతిస్థిమితం లేని వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
అసలు పార్థీ గ్యాంగ్ ఉందా?
కొద్దికాలంగా సామాజిక మాధ్యమాల్లో అలజడి సృష్టిస్తున్న పార్థీగ్యాంగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్లు సమాచారం. కానీ.. తెలుగురాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ సంచరించిన ఘటనలు లేవు. తొలుత నెల్లూరు జిల్లాలో పార్థీగ్యాంగ్ అడుగుపెట్టినట్లు, అక్కడి నుంచి చిత్తూరు జిల్లా, వైఎస్సార్ కడప జిల్లాలో పార్థీగ్యాంగ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. పదిరోజులుగా అనంతపురం జిల్లాకు వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి. కానీ రాష్ట్రం లో ఎక్కడా వీరి జాడ కనిపించలేదు. ఒక్క కేసూ నమోదు కాలేదు.
వదంతులు నమ్మొద్దు
జిల్లాలో పార్థీ గ్యాంగ్, బిహార్ ముఠాలు ప్రవేశించినట్లు వస్తున్న వదంతులు నమ్మొద్దు. ఉత్తరాది రాష్ట్రల్లోని ముఠాలకు సంబంధించిన ఫైల్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి అలజడి సృష్టించారు. అందరూ వాటిని షేర్ చేస్తుండటంతోప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఆ తరహా ముఠాలు ఏవీ ప్రవేశించలేదు. పొరుగు జిల్లాలోనూ అలాంటి దాఖలాల్లేవు. ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులు లేదా డయల్ 100, 9989819191 నంబర్లకు సమాచారం ఇవ్వండి. వారిపై దాడి చేసి గాయపర్చవద్దు.
– జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment