అసలేం జరుగుతోంది.. | East Godavari People Attack On Mentally Handicapped Persons | Sakshi
Sakshi News home page

అసలేం జరుగుతోంది..

Published Sat, May 19 2018 8:46 AM | Last Updated on Sat, May 19 2018 8:46 AM

East Godavari People Attack On Mentally Handicapped Persons  - Sakshi

అల్లవరం మండలం బోడసకుర్రులో ఓ మానసిక రోగిపై దాడి చేస్తున్న స్థానికులు

‘‘జిల్లాలోకి సైకోలు వచ్చారు.. పిల్లలను ఎత్తుకు పోతున్నారు.. మీ పిల్లలను కనిపెట్టుకుని ఉండండి..’’ వంటి సూచనలు, హెచ్చరికలతో వారం రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టింగులతో జిల్లావాసులు వణుకుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ఇవి అసత్య ప్రచారాలని, ప్రజలు నమ్మవద్దని పోలీసు అధికారులు పత్రికా ప్రకటనలు చేస్తున్నా సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలనే ప్రజలు నమ్ముతూ భయపడిపోతున్నారు. దీంతో నాలుగు రోజులుగా కోనసీమలో పలు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

అమలాపురం టౌన్‌ : సోషల్‌మీడియా ప్రచారాల జోరుతో ఏ గ్రామానికైనా కొత్తగా మానసిక రోగి అడుగుపెడితే వాడు సైకో అని, వాడే పిల్లలను ఎత్తుకు పోయేవాడంటూ గ్రామ ప్రజలు చితకబాదుతున్నారు. అయినవిల్లి, అల్లవరం మండలం సామంతకుర్రు, బోడసకుర్రు గ్రామాల్లో ఈ తరహా దాడులు జరిగాయి. పి.గన్నవరంలో గురువారం రాత్రి ఓ మానసిక రోగి రోడ్డుపై వెళుతుండగా అతడిని స్థానికులు ఆపి అనుమానంతో ప్రశ్నించారు. అతను హిందీలో మాట్లాడాడు. అతడిని బ్యాగ్‌ తనిఖీ చేయగా ఓ చాకు, సిరంజి ఉండడంతో ఇతడు పిల్లలను ఎత్తుకుపోయేవాడిగా భావించి చితకబాదారు. ప్రజలు మానసిక రోగులపై దాడులు చేస్తున్నప్పుడు పోలీసులే అడ్డుకుని వారికి రక్షణ కల్పించారు.

చిత్తవుతున్న మానసిక రోగులు..
అమలాపురం రూరల్‌ మండలం సవరప్పాలెం, తాండవపల్లి గ్రామల్లో రోడ్ల చెత్త ఏరుకుని జీవించే సంచార జాతులకు చెందిన రెండు కుటుంబాలను పిల్లలను పట్టుకుపోయే ముఠాగా భావించి అక్కడి ప్రజలు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కోనసీమలో జరిగిన సంఘటనలే కాకుండా వేరే జిల్లాలు, రాష్ట్రాల్లో ఎవరినో నిర్బంధించి ప్రశ్నిస్తున్న ఫొటోలను కూడా వాట్సాప్‌ల ద్వారా పోస్టింగ్‌లు చేసి ఫలానా గ్రామంలో సైకోలు, పిల్లలను ఎత్తుకెళ్లే వారిని నిలదీస్తున్నారంటూ రాస్తున్నారు. అంబాజీపేట మండలం చిరుతపూడిలో పిల్లల అవయవాలు అపహరించే ముఠా పోలీసులకు చిక్కింది.. ఇదిగో ఆధారమంటూ చనిపోయిన పిల్లల మృతదేహాలు, వారి అవయవాలు ఉన్న వేరే ఫొటోలను గ్రాఫిక్‌ చేసి వాట్సాప్‌ల్లో షేర్‌ చేస్తున్నారు. ఈ ముఠా ప్రస్తుతం అమలాపురం పరిసర ప్రాంతాల్లో తిరుగుతోందని.. మీ పిల్లలను తీసుకుని జనం లేని ప్రాంతాలకు వెళ్లవద్దు.. ఈ మెసేజ్‌ను అందరికీ షేర్‌ చేయండి.. అంటూ వాట్సాప్‌లో పోస్టింగ్‌లు చేస్తున్నారు.

‘ఆ వదంతులు నమ్మవద్దు’
కాకినాడ రూరల్‌: జిల్లాలో ఇటీవల చిన్నపిల్లలను కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయంటూ సోషల్‌ మీడియాల్లో వస్తున్న వదంతుల్లో నిజం లేదని జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వదంతులు వ్యాపించి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఎవరైనా గ్రామాల్లో కొత్తవారు కనిపిస్తే వారి పట్ల ప్రజలు అనుమానంతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ విశాల్‌ గున్ని వివరించారు. నిజానికి ఏ రకమైన గ్యాంగ్‌లు, కిడ్నాప్‌ ముఠాలు ఏవీ లేవని తమ విచారణలో తెలిసిందన్నారు. ఎవరైనా అనుమానిత, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వారిపై ప్రజలు ఏవిధమైన చర్యలు తీసుకోకుండా, వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ విశాల్‌గున్ని కోరారు. అటువంటి వ్యక్తులపై పోలీసులే చర్యలు తీసుకుంటారన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలో రాత్రి, పగలు గస్తీలు పెంచామన్నారు. 24 గంటలు పోలీస్‌ సిబ్బంది గస్తీ తిరుగుతుంటారని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని ఎస్పీ విశాల్‌ గున్ని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement