సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులు (ఇన్‌సెట్) మాట్లాడుతున్న రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య
కడప అర్బన్ : పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంను విస్తృతంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య అన్నారు. మంగళవారం ఆయన కడప నగరంలో పర్యటించారు. విజయవాడ నుంచి కడపకు వచ్చిన ఆయన కడప నగరం కో–ఆపరేటివ్ కాలనీలోని పోలీసు అతిథిగృహం చేరుకున్నారు. తర్వాత జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నేరాల పరిస్థితిని డీఎస్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జిల్లాలో నేరాలను తగ్గించే దిశగా ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. కడప, ప్రొద్దుటూరులలో నిర్వహిస్తున్న ఎల్‌హెచ్‌ఎంఎస్, కమాండ్ అండ్ కంట్రోల్ రూం పనితీరును గురించి అడిగితెలుసుకున్నారు. నేరాలను నియంత్రించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న జిల్లా పోలీసు అధికారుల పనితీరు భేష్‌గా ఉందన్నారు.
రాష్ట్రంలో పార్థీగ్యాంగ్ లేదు..
అధికారుల సమీక్ష అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్థి గ్యాంగ్ లేదన్నారు. జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి నేరాలను తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఎల్‌హెచ్‌ఎంఎస్, కమాండ్ అండ్ కంట్రోల్ రూం విధానం వలన చోరీలకు అడ్డుకట్ట వేశారన్నారు. సైబర్ నేరాలను నిర్మూలించేదిశగా కృషి చేయాలన్నారు. బ్యాంక్ అధికారుల మాదిరిగా ఎవరైనా ఫోన్‌చేసి వివరాలను అడిగినపుడు చెప్పరాదన్నారు. నేరస్తులు కూడా సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడే విషయంపై ఇప్పటికే జార్ఖండ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా పోలీసు అధికారిని నియమించి నియంత్రణకు కృషి చేస్తున్నారన్నారు. పోలీసుశాఖతో మమేకమై యువతతో కమ్యూనిటీ పోలీస్, విద్యార్థులతో స్టూడెంట్ పోలీస్, మహిళలతో మహిళా మిత్ర పేరుతో పనిచేసేందుకు ఆసక్తిగలవారిని నియమించారన్నారు.
పోలీసు సంక్షేమానికి విశేష కృషి ...
పోలీసు సంక్షేమంలో భాగంగా కడపలో పోలీసు శాఖకు 22 ఎకరాల స్థలం వుందనీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ ద్వారా మొదట కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మింపచేసి తద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంక్‌లకు చెల్లిస్తూనే పోలీసు కుటుంబాలకు అవసరమైన క్వార్టర్స్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. పోలీసుల సంక్షేమంపై దృష్టి పెడతామన్నారు. ఇటీవల 5వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్‌కు శిక్షణ ఇచ్చామనీ వారు విధుల్లో ఇప్పటికే చేరారనీ, ఎస్‌ఐలు 662 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారనీ వారు త్వరలో విధుల్లో చేరతారన్నారు. జిల్లాలో కడప, రాయచోటిలలో మోడల్ పోలీస్ స్టేషన్‌లను నిర్మించారనీ, త్వరలో వాటిని ప్రారంభించనున్నారన్నారు.
రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య కడప పర్యటన ముగించుకుని సాయంత్రం అనంతపురం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాల్లో కడప కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ, జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం ఆస్మి, జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ఏ.శ్రీనివాసరెడ్డి, ట్రైనీ ఏఎస్పీ వకుల్ జిందాల్, ఏఆర్ అదనపు ఎస్పీ రిషికేÔశ్‌రెడ్డి, డీఎస్పీలు బి.శ్రీనివాసులు, రాజగోపాల్ రెడ్డి, లోసారి సుధాకర్, పి. షౌకత్‌ఆలీ, శ్రీనివాసులు, షేక్ మాసుంబాష, రాఘవ, కోలార్ కృష్ణన్, నాగరాజు, లక్ష్మినారాయణ, బిఆర్ శ్రీనివాసులు, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, చంద్రశేఖర్‌లతో పాటు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment