అనుమానాస్పద వ్యక్తుల సంచారంతో నందిగామ మండలం అనాసాగరంలో రాత్రివేళ గుమిగూడిన గ్రామస్తులు (ఫైల్)
పార్ధి గ్యాంగ్.. ఈ పేరు వింటే చాలు కొన్ని రోజులుగా జిల్లా వణికిపోతోంది.. పిల్లలు, పెద్దలు చలి జ్వరం వచ్చినట్లు గజగజలాడిపోతున్నారు.. ఈ పేరు చెవిన పడితే చాలు పట్టణవాసులతో పాటు మారుమూల గ్రామాల ప్రజలు సైతం హడలెత్తిపోతున్నారు.. జిల్లాలో ఎక్కడ చూసినా పార్ధి గ్యాంగ్ పేరే వినబడుతోంది. నిజంగా ఆ గ్యాంగ్ ఉందో లేదో తెలీదుగానీ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు, కొంత మంది పెడుతున్న పోస్టింగ్‌లు జిల్లావాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : ‘అరేయ్ ఈరిగా రాత్రి పక్కూళ్లో ఎవరో పసిపిల్లోడిని చంపేసి మెదడు తినేశారంట్రా..’, ‘ఒరేయ్ సూరిగా నిన్న రాత్రి టౌన్‌లో పార్ధీ గ్యాంగ్ దిగిందంట్రా... పిల్ల ల్ని సంపి కిడ్నీలు, మెదడు తినేయాలని తిరుగుతున్నారంటా.. మావోడొకడు ఫోను చేశాడు..’, ‘యారోయ్ నీకీ సంగతి తెలిసిందా... నిన్న పక్క జిల్లాలో పార్ధీ గ్యాంగ్‌ని పట్టుకోబోతుంటే పోలీసోడి పీక కోసేసి పారిపోయారంట్రా’ .. ఇవీ కొన్ని రోజులుగా జిల్లాలో జరుగుతున్న ప్రచారం. ఇది జిల్లా ప్రజలను గజగజలాడిస్తోంది.
సోషల్ మీడియాలో హల్‌చల్..
జిల్లాలోకి పార్ధి గ్యాంగ్ వచ్చినట్లు, పసి పిల్లల్ని ఆ గ్యాంగ్ అతి క్రూరంగా చంపి వారి అవయవాలను పీక్కు తింటున్నట్లు, అందుకోసం అర్ధరాత్రి తలుపుల వద్దకు వచ్చి పిల్లుల్లా అరవటం... కుక్కల్లా మొరగటం... పసి పిల్లల్లా ఏడ్వటం వంటి ఫొటోలు, వీడియోలను కొంత మంది వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టటం కొన్ని రోజులుగా జరుగుతోంది. అవి చూసిన అనేక మంది వాటిని ఇతరులకు షేర్ చేస్తుండటంతో జిల్లాలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఆ వీడియోలు, ఫొటోలు చూసిన తల్లితండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, పార్ధి గ్యాంగ్ జిల్లాలో సంచరిస్తుందా అంటే ఇంత వరకు అలాంటి దాఖలాలు లేవనే చెప్పాలి. కేవలం వదంతులు మాత్రమే.
ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ..
జిల్లాలో పార్ధి గ్యాంగ్ తిరుగుతుందంటూ వస్తున్న వదంతులతో ఆందోళన చెందుతున్న జనం అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా ఎవరైనా తారసపడితే చాలు ఆడ, మగా తేడా లేకుండా అంతు చూసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల జిల్లాలో రోజుకు రెండు మూడు జరగటమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మంగళవారం రాత్రి ఇలాంటి ఘటనే జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. నార్త్ ఇండియాకు చెందిన ఓ దుప్పట్ల వ్యాపారి క్రికెట్ ఆడుతున్న యువకులను తీక్షణంగా చూస్తుండటంతో అనుమానం వచ్చిన ఆ యువకులు అతన్ని చుట్టుముట్టి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విచారణలో దుప్పట్ల వ్యాపారం కోసం మరో తొమ్మిది మందితో కలిసి మచిలీపట్నం వచ్చినట్లు తేలింది. ఇలాంటి ఘటనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకోవటం పరిపాటిగా మారింది.
పరుగులు పెడుతున్న పోలీసులు..
పార్ధి గ్యాంగ్ ప్రచారం పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి ఏవేవో పనుల నిమిత్తం వస్తున్న వ్యక్తులపై అనుమానపడుతున్న జనం పట్టుకుని యక్ష ప్రశ్నలు వేస్తున్నారు. తెలుగు మాట్లాడటం రాకపోయినా, సరైన సమాధానం చెప్పలేకపోయినా పార్ధి గ్యాంగ్ ముఠా సభ్యుడు అంటూ చితకబాదుతున్నారు. ఇలాంటి ఘటనలు పరిపాటిగా మారటంతో అప్రమత్తమవుతున్న పోలీసులు ఆయా ప్రదేశాలకు పరుగులు పెడుతున్నారు. అక్కడ విచారించి విషయం తెలుసుకుని పోలీసులతో పాటు ప్రజలు సైతం అవాక్కవుతుండటం కనబడుతోంది.
భయపడాల్సిన అవసరం లేదు..
జిల్లాలో పార్ధి గ్యాంగ్ తిరుగుతుందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దు. అలాంటి ఘటనలు ఇంత వరకు జిల్లాలో జరిగిన దాఖలాలు లేవు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అధికారులతో పల్లె నిద్ర చేయిస్తున్నాం. అనుమానిత వ్యక్తులు, అపరిచితులు తారసపడితే డయల్–100కు సమాచారం అందించాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలను హింసిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం.– సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment