రికార్డులను తనిఖీ చేస్తున్న ఎస్పీ సత్య ఏసుబాబు
బేస్తవారిపేట: జిల్లాలో పార్థీ గ్యాంగ్ నరహంతక ముఠా తిరుగుతోందని తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ సత్య ఏసుబాబు అన్నారు. బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. గ్రూప్‌లో వచ్చిన మెసేజ్‌లను నిజానిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయవద్దన్నారు. ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు పోలీసులతో పల్లెనిద్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు.
150 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడంతో 2–8 రోజులు శిక్ష పడిందన్నారు. పల్లెల్లో వెనుకబాటుతనం, సైబర్‌క్రైమ్, బ్యాంక్ ఖాతా ఓటీపీతో నగదు అపహరణ, బాల్య వివాహాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, లక్కీ లాటరీ పేరుతో జరిగే మోసాలపై మేలుకొలుపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎల్‌హెచ్‌ఎంఎస్ పోలీస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, గృహస్తులు బయటకు వెళ్లేటప్పుడు యాప్ ద్వారా సమాచారం అందిస్తే పోలీస్‌లు వచ్చి కెమెరా బిగిస్తారన్నారు. మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల్లో ఎల్‌హెచ్‌ఎంఎస్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుట్కాపై అనేక కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 90 శాతం బెల్ట్‌షాపులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు, సీఐలు వై శ్రీనివాసరావు, ఎం భీమానాయక్, ఎస్సై ఏ శశికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment