విజయవాడలో పోకిరీ మూకల ఆగడాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అమాయకులైన ఆడపిల్లలను నమ్మించి వంచనకు గురిచేస్తున్నారు. అసభ్య వీడియోలు తీసి వేధిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారి అరాచకాలకు పాల్పడుతున్నారు. మత్తులో కూరుకుపోయిన కొందరు యువకులు శివారు ప్రాంతాల్లోని విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్నారు. దీంతో విద్యార్థినులు చిత్రవధ అనుభవిస్తున్నారు. శివారులోని రెండు పోలీసుస్టేషన్ల పరిధిలో ఆగడాలు తీవ్రంగా ఉన్నాయి.
సాక్షి, అమరావతిబ్యూరో : రాజధానిలో ఆకతాయి గ్యాంగ్‌ల విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేసే వారు కరువయ్యారు. కాలేజీ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని పోకిరీ గ్యాంగ్‌లు పెట్రేగిపోతున్నాయి. పథకం ప్రకారం విద్యార్థినులను ట్రాప్ చేస్తున్నారు. ఆ పోకిరీ మూకలో ఒకరు యువతిని ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి నమ్మిస్తారు. ఆ యువతిని అజ్ఞాత ప్రదేశానికి తీసుకువెళ్లి అసభ్యంగా వీడియోలు తీస్తున్నారు. తమ మాట వినకపోతే సోషల్‌మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధింపుల పరంపర కొనసాగిస్తున్నారు. ఇంట్లో చెప్పలేక వారి వేధింపులు తట్టుకోలేక ఎంతోమంది యువతులు బాధితులుగా మారుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసి నిలదీస్తున్న కుటుంబసభ్యులపై దాడులకు సైతం తెగబడుతున్నారు. ఇదేదో ఎప్పుడో ఎక్కడో ఓసారి జరుగుతున్న దారుణం కాదు... విజయవాడ పరిసరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న విషపు వల. ఇక యువతులను టీజింగ్, ఇతర వేధింపులకు అయితే అడ్డూ అదుపూ లేకుండాపోయింది. కాలనీలు, శివారు ప్రాంతాల్లో తిష్టవేసిన పోకిరీలు ఆగడాలకు యువతులు హడలెత్తుతున్నారు.
ఆ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోనేఅత్యధికంగా...
ప్రధానంగా కమిషరేట్‌లోని ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ... ఆ సమీపంలోని జిల్లా ఎస్పీ పరిధిలోకి వచ్చే మరో పోలీస్ స్టేషన్ పరిధిలో పరిస్థితి తీవ్రత ఎక్కువుగా ఉంది. ఆ రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే ఎక్కువుగా కాలేజీలు ఉన్నాయి. శివారులో ఉండటంతోపాటు ఎక్కువగా జనసంచారం లేని ఆ ప్రాంతాలను ఆకతాయిలు తమ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా చేసుకుంటున్నారు. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక కొందరు ధైర్యం చేసి కుటుంబసభ్యులకు విషయాన్ని చెబుతున్నారు. వారిలో చాలా కొద్దిమంది తల్లిదండ్రులే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో లెక్కకు మించి ఫిర్యాదులు నమోదు అవుతుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు తక్షణం స్పందిస్తూనే ఉన్నారు. యువతులకు సంబంధించిన వ్యవహారం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా కేసులను డీల్ చేస్తున్నారు. చాలావరకు కేసుల్లో పోకిరీలను తీసుకువచ్చి ‘తమదైన శైలిలో’ బుద్ధి చెప్పి పంపిస్తున్నారు. అయినప్పటికీ ఆకతాయిల ఆగడాలు పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు. ఆ రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలో కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి.
డ్రగ్స్ మహమ్మారి కూడా...
పోకిరీల విశృంఖలత్వానికి డ్రగ్స్ మరింత కిక్ ఇస్తున్నాయి. శివారులో ప్రాంతాలు డ్రగ్స్ రాకెట్‌కు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. గంజాయితోపాటు మరికొన్ని డ్రగ్స్ విక్రయం జోరుగా సాగుతోంది. సీఆర్‌డీఏ ప్రాంతంలో కొన్ని గ్రామాలు కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా సాగుతోంది. అక్కడ నుంచి శివారుప్రాంతాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. ఆకతాయి మూకలు వారంతపు రోజుల్లో ప్రత్యేకంగా డ్రగ్స్ పార్టీలు పెట్టుకుని మరీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకూంటూ భీతావాహ పరిస్థితులు సృష్టిస్తున్నారు. తీవ్ర గాయాలతో శివారులోని ఆసుపత్రుల్లో చేరుతున్నారు కూడా. వారు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు రక్త పరీక్షల్లో వెల్లడవుతోందని ఆసుపత్రివర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతపై పోలీసులు దృష్టి సారించారు. పెడదారి పడుతున్న యువతను కట్టడిచేసే విషయంపై కమ్యూనిటీ పోలీసింగ్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. త్వరలోనే కార్యాచరణను చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment