అవన్నీ ఒట్టి పుకార్లే | There Is No Parthy Gang In Prakasam SP | Sakshi
Sakshi News home page

అవన్నీ ఒట్టి పుకార్లే

Published Sat, May 19 2018 11:22 AM | Last Updated on Sat, May 19 2018 11:22 AM

There Is No Parthy Gang In Prakasam SP - Sakshi

ఒంగోలు : పార్థి గ్యాంగ్‌కు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహాలు తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా పోలీస్‌ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. గత రెండు, మూడు వారాలుగా దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పార్థీ గ్యాంగ్‌ పుకార్లతో భయపడుతున్నారని పేర్కొన్నారు. పార్థీగ్యాంగ్‌ కదలికల్లేకపోయినా అనవసరంగా భయపడుతూ రాత్రివేళల్లో నిద్ర లేకుండా కర్రలతో, రాడ్లతో పహారా తిరుగుతున్నారని పేర్కొన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తులను, బిచ్చగాళ్లను, అసహాయులను, ముసలివారిని అనుమానించి కొడుతున్నారని చెప్పారు. తీవ్రంగా కొట్టి ఆ తర్వాత పోలీస్‌స్టేషన్లకు అప్పగించిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఇవి ఒట్టి పుకార్లు మాత్రమే. వీటిని గుడ్డిగా నమ్మి నిద్ర లేకుండా తిరగడం అమాయకులను ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. జిల్లాలో ప్రజలు అనుకుంటున్నట్లుగా ఎటువంటి పార్థి గ్యాంగ్‌ ఆనవాళ్లు లేవని ఎస్పీ భరోసా ఇచ్చారు.

మరణాయుధాలతో తిరగడం నేరం
‘ఒంగోలు నగరంలో పాటు పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో సైతం మరణాయుధాలతో తిరగడం నేరం. నిజం కాని పుకార్లను నమ్మి రోడ్లపై కర్రలు, కత్తులతో తిరుగుతూ బిచ్చగాళ్ల, మతిస్థిమితం లేని వ్యక్తులను,ముసలివారిని  కరుడుకట్టిన నేరగాళ్లుగా చూడటం మంచి పద్ధతి కాదు. అలాంటి వారిని అనుమానించటం, వారిని అందరూ కలిసి కొట్టడంఘోరం. ఇది ఒకట్రెండు కాదు, జిల్లావ్యాప్తంగాదాదాపు 10కిపైగా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజూ పేపర్లలో ప్రకటనలు ఇస్తున్నాం. పార్థీగ్యాంగ్‌ లేదని ప్రకటనలు కూడా ఇస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా అమాయకులను కొట్టి గాయపరిచిన, ఎలాంటి సంఘటనలు జరిగినా అలా చేసి వారు నేరస్తులవుతారు. వారిపై చట్టరీత్యా కఠిన చర్యలుంటాయి.’ అని ఎస్పీ హెచ్చరించారు..

సోషల్‌ మీడియాలో అపోహలు..
కొంత మంది సోషల్‌ మీడియాలో వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా పార్థి గ్యాంగ్‌ సంచారం ఉందని పోస్టులు చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. అటువంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ఈ విధమైన ప్రచారాల ద్వారా ఎవరైనా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే ఆ విధంగా ప్రచారం చేసిన వాళ్లను గుర్తించటం చాలా సులభమని, లేనిపోని పుకార్లను వ్యాప్తి చేయవద్దని, తద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు.

మీకోసం పోలీసుల పల్లెనిద్ర..
జిల్లాలో పార్థి గ్యాంగ్‌ గానీ, మరీ ఏ ఇతర గ్యాంగ్‌ల కదలికలు లేనçప్పటికీ ప్రజలకు ధైర్యం చెప్పేందుకు పోలీసులు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపడతారని ఎస్పీ చెప్పారు. ప్రజల్లో అపోహలను, భయాన్ని పోగొట్టి వారికి అవగాహన కల్పించేందుకు శనివారం నుంచే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. పోలీసులు వచ్చి గ్రామాల్లో నేరుగా ప్రజలతో మాట్లాడతారని, అవసరమైన గ్రామాల్లో పోలీసులు బస చేస్తారని చెప్పారు. కాబట్టి ప్రజలు ఆనందంగా నిద్రపోవచ్చని హామీ ఇచ్చారు.

అనుమానితులపై సమాచారమివ్వండి..
ఎక్కడైనా అనుమానితులు ఉంటే అలాంటి వారిపై పోలీసులకు సమాచారమివ్వాల్సిందిగా ఎస్పీ సూచించారు. హిందీ భాష మాట్లాడేవారు గానీ, కొత్త వ్యక్తులు గానీ సంచరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్లకు సమాచారమివ్వాలని కోరారు. ఎస్సైలకు, సీఐలకు లేదా డయల్‌–100కు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని, పోలీసులు వచ్చి వారిని విచారించి వారిపై తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అంతే గానీ అమాయకులను అనవసరంగా అనుమానించి ఇబ్బంది పెట్టవద్దని పోలీస్‌ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement