ప్రకాశం జిల్లా వెల్లలచెరువులో పిచ్చివాడని వదలివేస్తున్న పోలీసులు
నూజెండ్ల: గుర్తు తెలియని వ్యక్తుల సంచారంతో మండల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తాజాగా నూజెండ్ల మండలం ఉప్పలపాడులో తిరుగుతున్న యువకుడిని ఆదివారం గ్రామస్తులు కట్టివేసి దేహశుద్ధి చేశారు. అనంతరం ఐనవోలు పోలీసులు స్టేషనుకు తరలించి విచారణ చేపట్టి పిచ్చివాడని రాత్రి వదలి వేశారు. అతడు సోమవారం ఉదయం జంగాలపల్లి సమీపంలో తిరుగుతుండగా గ్రామస్తులు గుర్తించి తరిమివేశారు.అక్కడ నుంచి వినుకొండ పోలీసులు తీసుకొచ్చి వైద్య చికిత్సలు చేయించి ప్రకాశం జిల్లా వెల్లల చెరువులో వదలిపెట్టారు. యువకుడు గ్రామాల్లో తిరుగుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు.
గ్రామాల్లో యువకుల గస్తీ
రాష్ట్రంలోకి పార్దీ, చెడ్డి గ్యాంగ్ ముఠా సభ్యులు వందల సంఖ్యలో వచ్చారని ప్రచారం జరుగుతుండటంతో యువకులు నిద్ర లేకుండా గస్తీ తిరుగుతున్నారు. మండలంలోని కంభంపాడు, తెల్లబాడు, ఉప్పలపాడు గ్రామాల్లో కర్రలు చేతబూని కాపలాకాస్తున్నారు. ఆదివారం రాత్రి కంభంపాడు ఎస్సీ కాలనీలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు డ్రాయర్లు ధరించి ముఖానికి మాస్కులు వేసుకుని సంచరిస్తున్నారని గ్రామస్తులు నిద్రాహారాలు మాని తెల్లవారే వరకు కర్రలతో కాపలాకాశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే వెంటనే వారిని వదిలి వేయడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిని మెంటల్ ఆస్పత్రికి తరలిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.రాత్రివేళల్లో గస్తీ ముమ్మురం చేసి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
అన్నీ అపోహలే...
ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా రాష్ట్రంలో ఎలాంటి ముఠాలు లేరని, కేవలం ప్రజల అపోహలేనని కొట్టిపారేస్తున్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కన్పిస్తే 100కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment