మద్దికెర మండలం ఎం. అగ్రహారంలో యువకుల కాపలా
ఆదోని: కరుడుగట్టిన నేరుస్తులుగా పేరొందిన పార్థి, బిహార్, చెడ్డి గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయనే సోషల్ మీడియా ప్రచారంతో జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చాలా గ్రామాల్లో ప్రజల కంటికి కునుకు కరువైంది. పలు గ్రామాలలో వంతులు వారిగా కర్రలు, పొంజులు పట్టుకుని కాపలా కాస్తున్నారు. గ్రామాలలో ఏ కొత్త వ్యక్తి కనిపించినా పిల్లలను ఎత్తుకు వెళ్లే ముఠా సభ్యుడిగానో, దోపిడీ దొంగగానో అనుమానిస్తూ వారిపై మూకుమ్మడి దాడికి పాల్పడుతున్నారు. ఆదోని కిల్చిన్‌పేటలో తమకు కనిపించిన కొత్త వ్యక్తిని పిల్లలను ఎత్తుకు వెళ్లే బిహార్ ముఠాకు చెందిన కిడ్నాపర్‌గా భావించిన స్థానికులు చెట్టుకు కట్టేసి, కర్రలతో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఆ వ్యక్తి దొంగో, కిడ్నాపరో తెలియదు.సోషల్ మీడియా ప్రచారం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది.
వరుస దాడులు..
గత బుధవారం పట్టణంలోని ఇందిరా నగర్‌లో అనుమానస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకున్నారు. వారిలో ఇద్దరు తప్పించుకోగా దొరికిన ఓ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు కూడా ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది.
షరాప్ బజారులో మురుగు కాలువలలోని మట్టిని తీసి అందులో బంగారు చూర్ణాలను ఏరుకుని బతుకేందుకు పట్టణానికి వచ్చిన వారిగా పోలీసులు గుర్తించి వారిని వదిలేశారు. గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడి, మహానంది మండలం గోపవరంలో తమకు తారసపడిన వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. అయితే వారు ఇద్దరు భిక్షగాళ్లుగా పోలీసుల విచారణలో తేలింది. చిప్పగిరి మండలం బెల్డోణలో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన వ్యక్తికి మతి స్థిమితం లేని వ్యక్తిగా పోలీసు విచారణలో తేలింది. మద్దికెర మండలం పెరవలికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు చితకబాది పోలీసులక అప్పగించారు. అయితే ఆ వ్యక్తులు బతుకుదెరువు కోసం వచ్చిన వ్యక్తులుగా పోలీసుల గుర్తించారు. జిల్లాలో దాదాపు సగం గ్రామాల్లో రాత్రి పూట యువకులు వంతులు వేసుకుని కాపలా కాస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియా ప్రచారంతో..
రాయలసీమ జిల్లాల్లో కరడుగట్టిన పార్థి, బిహార్, చెడ్డీ గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రజలను హెచ్చరించారు. అయితే కొంతమంది వ్యక్తులు అదే పనిగా సోషల్ మీడియా ద్వారా గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయని, ఏ క్షణంలో అయినా గ్రామాలపై పడి దోచుకోవచ్చని, ఎవరైనా ఎదురిస్తే విచక్షణా రహితంగా ప్రజలను చంపేస్తున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో ప్రశాంతంగా ఉండే పల్లెల్లో అలజడి చెలరేగింది. ఎండా కాలం కావడంతో ఆరు బయట, మిద్దెపై నిద్ర పోవడానికి కూడా జంకుతున్నారు. యువకులు వంతులు వేసుకుని రాత్రంతా కాపలా కాస్తున్నారు. కొత్త వ్యక్తులు కనిపించేలోగా కరుడుగట్టిన నేరస్తుడేమోనన్న అనుమానంతో చితకబాది పోలీసులకు అప్పగిస్తున్నారు. జిల్లాలో కరుడుగట్టిన నేరగాళ్ల సంచారం లేదన్న విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ద్వారా ప్రజలలో లేని పోని భయాలు, అపోహలు, అనుమానాలు కల్పించే వారి పట్ల కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment