అప్రమత్తతతో నేరాలకు చెక్‌ | Robberies in Trains PSR Nellore | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతో నేరాలకు చెక్‌

Published Mon, Apr 22 2019 12:38 PM | Last Updated on Mon, Apr 22 2019 12:38 PM

Robberies in Trains PSR Nellore - Sakshi

ఇటీవల రైల్వే పోలీసులకు చిక్కిన మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ చెన్నై శ్రీను (ఫైల్‌)

నెల్లూరు(క్రైమ్‌): వేసవిలో రైళ్లలో  దోపిడీలు, దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన గస్తీకి పూనుకున్నారు. నేరాల నియంత్రణకు  ప్రయాణికులకు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడం...కిక్కిరిసిన జనాల మధ్యన ప్రయాణం చేయాల్సి రావడం దొంగలకు వరంగా మారింది. దొంగతనాల నివారణకు రైల్వేశాఖ పలు చర్యలు చేపడుతున్నా ప్రయాణికుల సంఖ్యకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వేసవిలో నేరాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో దొంగతనాలను  నియంత్రించేందుకు  నెల్లూరు  జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది సంయుక్త కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నారు. రైల్వేప్లాట్‌ఫామ్‌లపై నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను పబ్లిక్‌ అడ్రస్సింగ్‌ సిస్టం ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో జిల్లా మీద రాకపోకలు సాగించే దాదాపు అన్నీ రైళ్లల్లో పోలీసు బీట్‌లను ఏర్పాటు చేశారు. సిబ్బంది రైళల్లో గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు తారసపడితే వెంటనే  అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు.

అంతేకాకుండా ప్రయాణికుల భద్రత దృష్ట్యా  బీట్‌ సిబ్బంది వద్ద ఉన్న పుస్తకంలో జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్‌ అధికారుల ఫోను నంబర్లు అందుబాటులో ఉంచారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే ప్రయాణికులు విజయవాడ, గుంతకల్‌ కంట్రోల్‌రూమ్‌కు, ఉన్నతాధికారులకు, సమీపంలోని రైల్వేపోలీసు అధికారులకు సమాచారం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నిందితులను త్వరిగతిన పట్టుకునే అవకాశం ఉంది. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెంచారు. అలార్మింగ్‌ చైన్‌ పుల్లింగ్‌ జరిగే ప్రాంతాలైన ఎల్‌సీగేట్, సిగ్నలింగ్‌ పాయింట్, రోడ్డు సమీపంలోని రైల్వేట్రాక్‌ ఏరియాలతో పాటు తలమంచి, మనుబోలు, వెందోడు ప్రాంతాల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బందితో పికెట్లు ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణకు రైల్వే పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత కొంతకాలంగా నేరాలకు  పాల్పడుతున్న మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ ఎం శ్రీనివాసు అలియాస్‌ చెన్నై శ్రీనును నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి రూ.33లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులందరూ పూర్తిస్థాయిలో సహకరిస్తే నేరాలను కట్టడి చేస్తామని రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు.

అంతర్‌రాష్ట్ర ముఠాలపై నిఘాల
రైళల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రకు చెందిన ముఠాలు, తమిళనాడుకు చెందిన పలువురు దొంగలు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో వారి కదలికలపై నిఘా ఉంచారు. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించారు. వారి ఛాయాచిత్రాలను రైల్వేస్టేషన్‌లు, ప్లాట్‌ఫామ్‌లపై ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రైళల్లో దొంగలు కనిపిస్తే కాల్చివేయమని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దొంగలు కనిíపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని రైల్వే పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నేరాలు అదుపునకు రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు సైతం తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ప్రయాణ సమయంలో ఒంటిపై ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించడం మంచిదికాదు.
ఒంటిపై ఆభరణాలు వేసుకున్నా బయటకు కనిపించకుండా చూసుకోవాలి.
విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌లను పక్కవారికి అప్పగించడం, రైల్లోనే వదిలేసి రైలు ఆగిన సమయంలో ప్లాట్‌ఫామ్‌ మీదకు వెళ్లడం వంటివి చేయరాదు.
చాలామంది విలువైన వస్తువులను సైతం కర్రసంచుల్లో నిర్లక్ష్యంగా ఉంచి తీసుకెళుతున్నారు. ఇలా చేయడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఉంటుంది
తమ బ్యాగులు, సూట్‌కేసులకు చైన్‌లాక్‌ సిస్టంను వేసుకోవాలి.
దొంగలు సైతం ప్రయాణీకుల వలే పక్కనే కూర్చుని మాయమాటలు చెబుతారు. ఇలాంటి వారి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
అపరిచిత వ్యక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలను తినరాదు.
రాత్రి వేళల్లో ప్రయాణించే సమయంలో కిటికీలు మూసుకోవాలి.
బోగీ ప్రధాన ద్వారాలను సిబ్బంది మూస్తారు. ప్రయాణికులు వాటిని ఎప్పటికప్పుడు తెరవకూడదు.
అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే డయల్‌  100, రైల్వే పోలీసు కంట్రోల్‌రూమ్‌ నంబర్‌ 1082కు సమాచారం అందించాలి.  

గస్తీ ముమ్మరం
రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. వేసవి దృష్ట్యా రైళ్లలో గస్తీని ముమ్మరం చేశాం. నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక సిబ్బందితో పికెట్లు ఏర్పాటు చేశాం. దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే ముఠాలు, పాతనేరస్థుల  కదలికలపై నిఘా ఉంచాం. దొంగలు కనిపిస్తే కాల్చివేయమని ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రయానికులు సహకరించాలి.– జీ దశరథరామారావు, నెల్లూరు రైల్వే సీఐ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement