సాక్షి, ఖమ్మంక్రైం: చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో వస్తున్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను ఓ దొంగ అపహరించుకుని పోయిన సంఘటన సోమవారం తెనాలిలో జరిగింది. ఖమ్మం జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న ఇల్లెందు మండలానికి చెందిన ఇద్దరు మహిళల నుంచి బంగారం దోచుకున్నారు. తెనాలి స్టేషన్‌లో రైల్‌లోని బాత్రూంలో వేచి ఉన్న దొంగ రైలు కదిలే సమయానికి బాత్రూంలోంచి బయటకు వచ్చాడు. బోగి మహిళలది కావడంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తేరుకొనేలోపే ఆగంతకుడు సీట్‌లో కూర్చొని ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమ్ముగూడేనికి చెందిన గుగులోత్ సుజాత, ఖమ్మం నగరానికి చెందిన బి.పద్మ అనే మహిళలను కత్తితో బెదిరించాడు. వారి మెడలో ఉన్న గొలుసులు, రింగులు, నగదును లాక్కొన్నాడు. సుజాత ప్రతిఘటించటంతోపాటు, రైలు చైన్ లాగటానికి ప్రయత్నిస్తుండగా ఆగంతుకుడు కత్తితో మెడపై తీవ్ర గాయం చేసి కిందపడేసాడు. ఆమె తలకు గాయం అయింది. ఈ సంఘటనతో బోగీలోని మహిళలంతా గట్టిగా కేకలు వేశారు. అప్పటికే ఆగంతకుడు రైలు నుంచి దూకి పారిపోయాడు. పక్కనే ఉన్న గార్డ్‌కు సమాచారం అందించినా గార్డు పట్టించుకోలేదు.
విజయవాడ రైల్వే పోలీసుల ఓవర్‌యాక్షన్..
ఆగంతకుడి చేతిలో తీవ్రంగా గాయపడి, సొత్తు పోగొట్టుకొన్న ఇద్దరు మహిళలు విజయవాడలో రైలు ఆగగానే రైల్వే పోలీసులను సంప్రదించగా వారు కనీసం స్పందించకపోగా మీరు ఖమ్మం వెళ్లి జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని చెప్పారు. కనీసం మానవత్వం కూడా లేకుండా రక్తం కారుతున్న మహిళలకు ప్రాథమిక చికిత్స చేయకుండా అక్కడి పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మహిళలు మీడియా వద్ద వాపోయారు. ఇద్దరి మహిళలలో పద్మ అనే మహిళ పుస్తెలతాడు, గుగులోతు సుజాత రెండు తులాల చైన్, రెండు బంగారు రింగులు, వెయ్యి రూపాయల నగదును ఆగంతుకుడు అపహరించుకుపోయాడు. వీరిలో సుజాత చైన్నె నుంచి వస్తుండగా, పద్మ సూళ్లూరుపేట నుంచి వస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు జీఆర్‌పీ ఎస్‌ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే మహిళా బోగీలలో జొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటే రాత్రిపూట ప్రయాణం చేసే మహిళలకు భద్రత ఎక్కడిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
Published Tue, Mar 5 2019 9:26 AM | Last Updated on Tue, Mar 5 2019 9:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment