పంతం నెగ్గించుకున్న మంత్రి నారాయణ
-
ముప్పాళ్లకే చెంగాళమ్మ చైర్మన్ పీఠం
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం పాలకమండలిని ఎట్టికేలకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిని నియమించడంలో మంత్రి నారాయణ పంతం నెగ్గించుకున్నారు. స్థానిక నేతలు కొంతమంది వ్యతిరేకించినా తను అనుకున్న ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డికే చైర్మన్ పదవిని వచ్చేట్టు చేయడంలో మాట నిలబెట్టుకున్నారు. మధ్యలో అర్వభూమి చంద్రశేఖర్‌రెడ్డి కోర్టు నుంచి తెచ్చుకున్న ఉత్తర్వుల మేరకు వంశపారపర్య పాలకమండలి సభ్యులుగా నియమించారు. కొద్ది రోజులు కొనసాగిన తరువాత ఆయన కోర్టును తప్పుదారి పట్టించి ఆర్డర్ తెచ్చుకున్నారని, అర్వభూమి రామచంద్రారెడ్డి వంశానికి చెందిన వ్యక్తి కాదని ఆలయం తరుపున మళ్లీ కోర్టులో దావా వేయడంతో అతని పాలకమండలి సభ్యత్వాన్ని రద్దు చేసి కొత్త బోర్డును శుక్రవారం నియమించారు. ఆలయ నూతన పాలకమండలి చైర్మన్‌గా ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి, పాలకమండలి సభ్యులుగా ముప్పాళ్ల విజయలక్ష్మీ, చిలకా యుగంధర్‌యాదవ్, అలవల సూరిబాబు, చిట్టేటి పెరుమాళ్లు, వేనాటి గోపాల్‌రెడ్డి, ఆకుతోట రమేష్, పిట్ల సుహాసిని, డీటీడీసీ శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. ఎక్స్ ఆఫీషియో సభ్యుడు కీసరపల్లి నరేంద్రలను ఎన్నుకున్నారు. ఇందులో మాజీ చైర్మన్ ఇసనాక హర్షవర్థన్‌రెడ్డి అనుచరులు ఇద్దరికి, వేనాటి రామచంద్రారెడ్డి అనుచరులు ఇద్దరికి, కొండేపాటి గంగాప్రసాద్ అనుచరులు ఇద్దరికి, మిత్రపక్షమైన బీజేపీకి ఒక పాలకమండలి సభ్యులుగా నియమించారు. త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.