రజతోత్సవానికి సిద్ధమైన పీఎస్‌ఎల్వీ సిరీస్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఐదు దశాబ్దాల్లో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలను సాధించింది. ఇందులో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ)దే అగ్రస్థానం. నవంబర్ ఐదున మార్స్ ఆర్బిట్ మిషన్‌ను పీఎస్‌ఎల్వీ - సీ25 ద్వారా ప్రయోగించనున్నారు. దీంతో పీఎస్‌ఎల్వీ 25 ప్రయోగాలను పూర్తిచేసుకోనుంది. అంగారక గ్రహం మీద పరిశోధనకు ఉపగ్రహం పంపటం ద్వారా పీఎస్‌ఎల్వీ సిరీస్ రాకెట్ రజతోత్సవాన్ని జరుపుకోనుండటం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
1963లో ప్రయోగాలకు శ్రీకారం
కేరళలోని తుంబా ఈక్విటోరియల్ రాకెట్ కేంద్రం నుంచి 1963లో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1975లో రష్యా నుంచి మొదటి ఆర్యభట్ట ఉపగ్రహంతో మన ప్రయోగాల పరంపర మొదలైంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 1979 ఆగస్ట్ 10న ఎస్‌ఎల్వీ - 3 ఈ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1979 నుంచి ఇప్పటివరకు చేపట్టిన 39 ప్రయోగాల్లో ఎనిమిది మినహా, మిగిలినవి విజయవంతమయ్యాయి. ఇటీవల ప్రయోగించ తలపెట్టిన జీఎస్‌ఎల్వీ- డీ5ను సాంకేతిక లోపంతో ఆపేసిన విషయం తెలిసిందే. ఇస్రో ప్రయోగించిన ఎస్‌ఎల్వీ, ఏఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ ఉపగ్రహ వాహకనౌకల్లో పీఎస్‌ఎల్వీ మాత్రమే తిరుగులేనిదిగా నిలిచింది.
1993లో పీఎస్‌ఎల్వీ - డీ1 ప్రయోగాలకు శ్రీకారం
1993 సెప్టెంబర్ 20న మొదటిసారిగా పీఎస్‌ఎల్వీ - డీ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 ప్రయోగాలు చేశారు. మొదటి ప్రయోగం మినహా మిగిలినవి విజయవంతమయ్యాయి. 1993లో చేసిన మొదటి ప్రయోగం అపజయం కావడంతో 1994 అక్టోబర్ 15న పీఎస్‌ఎల్వీ - డీ2 ద్వారా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూరపరిశీలన ఉపగ్రహం)ను కక్ష్యలోకి విజయవంతంగా పంపారు. 1996 మార్చి 21న పీఎస్‌ఎల్వీ - డీ3లో కూడా ఐఆర్‌ఎస్ శాటిలైట్‌ను పంపారు. పీఎస్‌ఎల్వీ - సీ1 నుంచి సీ25 వరకు అన్ని ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ - 1 మిషన్‌ను పీఎస్‌ఎల్వీ - సీ11 రాకెట్ ద్వారానే ప్రయోగించడం విశేషం. ఈ రాకెట్ ద్వారా ఇప్పటివరకు ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించారు. కల్పన ఉపగ్రహం, జీశాట్ - 12 అనే కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను ప్రయోగించారు.
పీఎస్‌ఎల్వీతో రెండురకాలుగా ఉపయోగం
పీఎస్‌ఎల్వీ రాకెట్ రెండురకాల ప్రయోగాలకు ఉపయోగపడుతుంది. తక్కువ బరువున్న ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉన్న సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి మోసుకెళ్లాలంటే స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. అదే బరువైన ఉపగ్రహాలను భూమికి అతి దూరంగా ఉండే జియో సింక్రోనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య), భూస్థిర మధ్యం తర బదిలీ కక్ష్యలోకి తీసుకెళ్లాలంటే ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగిస్తారు. ఒకేసారి పది ఉపగ్రహాలను మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టిన ఘనత, వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగపడే రాకెట్‌గా పీఎస్‌ఎల్వీ గుర్తింపు పొందింది. రాకెట్‌లో ఉపయోగించే కొన్ని విడిభాగాలను మళ్లీ ఉపయోగించుకోవడానికి వీలుండే స్పేస్ క్యాప్సూల్స్ రికవరీ ప్రయోగం నిర్వహించిందీ పీఎస్‌ఎల్వీ ద్వారానే కావడం విశేషం. విదేశాలకు చెందిన 37 ఉపగ్రహాలను ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రో ఆదాయం తెచ్చిపెడుతోంది. నవంబర్ 5 మధ్యాహ్నం 2.36 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్వీ - సీ25 షార్ నుంచి చేసే 40వ ప్రయోగం కాగా, పీఎస్‌ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 25వది. ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను పంపేందుకు సర్వం సిద్ధం చేశారు. భవిష్యత్తులో చంద్రయాన్ - 2 ఉపగ్రహ ప్రయోగాన్నీ పీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారానే చేయనుండటం విశేషం.