సి. హరికృష్ణ
సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
భూమి ఆవల రోదసి శోధనలో భాగంగా అంగారక గ్రహం అధ్యయనానికి ఉద్దేశించిన ‘మంగళయాన్’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ-సీ25 నౌక ద్వారా ప్రయోగించింది. ఈ క్రమంలో 40 కోట్ల కిలోమీటర్ల దూరంలోని అంగారక గ్రహాన్ని చేరే ప్రయత్నంలో తొలిదశ విజయవంతమైంది.
మొట్టమొదటిది
పీఎస్‌ఎల్‌వీ-సీ25 ద్వారా మంగళయాన్(మార్‌స ఆర్బిటార్) ను 246.9 కిలోమీటర్ల పెరీజీ, 23,560 కిలోమీటర్ల అపాజీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో కలిపి 1993 నుంచి ఇప్పటి వరకూ ఇస్రో 25 సార్లు పీఎస్‌ఎల్‌వీని ప్రయోగించింది. ఇందులో 1993 సెప్టెంబర్ 20న నిర్వహించిన మొదటి పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం (పీఎస్‌ఎల్‌వీ-డీ1) మాత్రమే విఫలమైంది. దీన్ని మినహాయిస్తే మిగతా ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. మొత్తం మీద ఇస్రోకిది 109వ ప్రయోగం.. గ్రహాంతర పరిశోధనల్లో ఇదే మొట్టమొదటిది. సామర్థ్యం పెంచిన స్ట్రాప్ ఆన్ మోటార్ల ద్వారా పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రూపంలో పీఎస్‌ఎల్‌వీ-సీ25ని ఇస్రో ప్రయోగించింది. గతానికి భిన్నంగా మొదటిసారిగా దీర్ఘ కాలంపాటు నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగంగా పీఎస్‌ఎల్‌వీ-సీ25 రికార్డుకెక్కింది. గత పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు అత్యధికంగా 18 నిమిషాలు కాగా, పీఎస్‌ఎల్‌వీ-సీ25 ప్రయాణం 44 నిమిషాలపాటు సాగింది. పీఎస్‌ఎల్‌వీలోని నాలుగో దశ బర్‌న అవుట్ జరిగిన 37 నిమిషాలకు మార్‌స ఆర్బిటర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
300 రోజుల ప్రయాణం
మంగళయాన్ భూకక్ష్యను వీడి డిసెంబర్ 1న అంగారక ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఈ లోపల మంగళయాన్‌లోని ఆన్‌బోర్‌డ ఇంజిన్లలోని ద్రవ ఇంధనాన్ని ఐదు దశల్లో మండించి కక్ష్యను పెంచుతారు. భూమి కక్ష్యను విజయవంతంగా వీడి 300 రోజులపాటు సాగే ప్రయాణం పూర్తయితే 2014, సెప్టెంబర్ 24న మంగళయాన్ అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
మార్‌స ఆర్బిటార్‌లో ప్రధానంగా ఐదు పరికరాలు ఉన్నాయి. ఒకటి మీథేన్ సెన్సర్ ఫర్ మార్‌స (ఎంఎస్‌ఎం). అంగారక వాతావరణంలో మీథేన్‌ను పసిగట్టే ప్రయత్నం చేస్తుంది. అంగారక వాతావరణంలోని ప్రతి బిలియన్ భాగాల్లో మీథేన్ (పీపీబీ పార్‌ట్స పర్ బిలియన్) ను ఈ పరికరం లెక్కిస్తుంది. ఈ వాయువు జీవం ఉనికిని సూచికగాను, భవిష్యత్‌లో అక్కడ జీవావిర్భావం జరిగే అవకాశాలను తెలియజేస్తుంది (భూమిపై జీవరసాయనాల ఆవిర్భావం, తద్వారా జీవ ఆవిర్భావంలో మీథేన్ పాత్ర చాలా కీలకమైందిగా ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు). అంగారక ఉపరితలం నుంచి పరావర్తనం చెందే సౌరకాంతి ఆధారంగా ఇది పని చేస్తుంది. ఈ నేపథ్యంలో సౌర కిరణం పడిన అంగారక గ్రహ భాగాన్ని మాత్రమే ఇది అధ్యయనం చేస్తుంది.
రెండో పరికరం లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ (ఎల్‌సీపీ).. అంగారకుడు తన వాతావరణాన్ని ఎలా కోల్పోతాడో తెలుసుకోవడానికి ఉద్దేశించింది. ముఖ్యంగా అంగారకుడిపై వాతావరణ లైమన్ ఆల్ఫా ఉద్గారాన్ని బట్టి హైడ్రోజన్‌కు చెందిన డ్యుడీరియం, ప్రొటియం అనే ఐసోటోపుల నిష్పత్తిని ఇది లెక్కిస్తుంది. ఈ పరికరంలో ఒక అతి నీలలోహిత డిటెక్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
మూడో పరికరం మార్‌స ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కంపొజిషన్ అనలైజర్. అంగారక వాతావరణంలోని అత్యంత బాహ్య ప్రాంతంలో తటస్థ వాయు పరమాణవులను విశ్లేషిస్తుంది.
నాలుగో పరికరం.. థర్మల్ ఇన్‌ప్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్. ఇది అంగారక ఉపరితల ఉష్ణోగ్రతలను తెలుసుకోవడంతోపాటు అంగారక పటలంలోని ఖనిజ సంఘటనాన్ని అధ్యయనం చేస్తుంది.
చివరి ఐదో పరికరం.. మార్స్ కలర్ కెమెరా. ఇది అంగారక ఉపరితలాన్ని చిత్రీకరిస్తుంది. అంగారక వాతావరణ పరిస్థితులను ముఖ్యంగా ధూళి తుపానులను అవగాహన చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. అంగారకుని చంద్రులు, ఫోబోస్, డైమోస్‌లను కూడా ఇది చిత్రీకరిస్తుంది.
ప్రధాన లక్ష్యం
అంగారక మిషన్ మొత్తం వ్యయం 450 కోట్లు. మార్‌స ఆర్బిటర్ బరువు 1,337 కిలోలు. దీనిలో 825 కిలోల ప్రొపెల్లెంట్ ఇంధనాన్ని లోడ్ చేశారు. దీనిలోని సాంకేతిక పరికరాల బరువు 13 కిలోలు. మంగళయాన్ ప్రయోగంలోని ప్రధాన లక్ష్యం జీవం ఆవిర్భావానికి కీలక సూచికగా వ్యవహరించే మీథేన్ అంగారకుడిపై ఉందా? లేదా? అనే అంశాన్ని పరిశీలించడం. అంగారకుడిపై ఒకప్పుడు ఉన్న నీరు ఎలా మాయమైందో తెలుసుకోవడం, దాని ఉపరితలం పటలంలోని మూలకాలు, ఖనిజాలను అధ్యయనం చేయడం, ప్రత్యేకంగా అక్కడి వాతావరణాన్ని పరిశోధించడం, భవిష్యత్‌లో మరిన్ని సంక్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం వంటివి.
ఆసక్తి ఇందుకే
ఇప్పటి వరకు, రష్యా, అమెరికా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్, చైనా దేశాలు మాత్రమే అంగారక ప్రయోగాలను నిర్వహించాయి. ఈ క్రమంలో నిర్వహించిన 51 ప్రయోగాల్లో 21 ప్రయోగాలు మాత్రమే విజయవంతమయ్యాయి. వీటిలో అత్యధిక విజయాలు అమెరికా సొంతం. ఇంత స్థాయిలో అంగారక ఉపగ్రహంపై మానవ ఆసక్తికి ప్రధాన కారణం.. భవిష్యత్తులో అంగారకుడిపై మానవ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా అంగారక గ్రహాన్ని జీవులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం. ఇందుకోసం అంతరిక్ష శాస్త్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నారు.
పాన్‌స్పెర్మియా సిద్ధాంతం
భూమిపై జీవ ఆవిర్భావాన్ని కూడా ఇదే తరహాలో వివరించే సిద్ధాంతం ఒకటి ప్రచారంలో ఉంది. ఇది పాన్‌స్పెర్మియా సిద్ధాంతం. దీని ప్రకారం భూమిపై జీవం ఆవిర్భవించ లేదు. భూమి ఆవల నుంచి గ్రహ శకలాల ద్వారా గాని, గ్రహాంతర వాసుల ద్వారా గానీ భూమిపైకి జీవులు చేరి భూమిపై జీవ పరిణామం చెందిందని ఈ సిద్ధాంతం సారాంశం. 3.5 బిలియన్ ఏళ్ల క్రితం నాటి భూమికి, ఇప్పటి భూమికి చాలా తేడా ఉంది. అప్పటి పూర్తి ప్రతికూల నిర్జీవ పరిస్థితుల్లో జీవం ఆవిర్భవించి పరిణామం చెందిన క్రమాన్ని కొద్దిపాటి నిదర్శనాలతో ఏఐ ఒపారిన్, జెబీఎస్ హాల్డేన్ అనే శాస్త్త్రవేత్తలు వివరించారు. ఇలాంటి విషయాలపైనే అంతరిక్ష శాస్త్త్రవేత్తలు ప్రస్తుతం పూర్తిస్థాయి అధ్యయనాన్ని నిర్వహిస్తున్నారు.
టెర్రాఫార్మింగ్
అంగారకునిపై పూర్వం జీవులకు అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల, భవిష్యత్తులో కొన్ని మార్పులతో జీవ మనుగడ పరిస్థితులను పునరిద్ధరించవచ్చునని శాస్త్త్రవేత్తల భావన. దీన్నే టెర్రాఫార్మింగ్ అంటారు. ఇందులో భాగంగా తొలుత అంగారకునిపై కార్బన్ డై ఆక్సైడ్‌ను ఏర్పర్చి, ఆ తర్వాత దాన్ని వినియోగించి కిరణజన్య సంయోగక్రియను నిర్వహించే లెకైన్, బ్యాక్టీరియా, కొన్ని శైవలాలను ప్రవేశపెడతారు. ఇలా కొన్ని వందల ఏళ్ల తర్వాత మొక్కలను కూడా ప్రవేశపెట్టి, అడవులను నిర్మించగలిగితే క్రమంగా ఆక్సిజన్ శాతం పెరిగి ఇతర జీవులు మనుగడకు సాధ్యమయ్యే విధంగా అంగారకుడిని మార్చడానికి వీలుంటుంది.
మంగళయాన్‌కు ముందు అంగారక గ్రహ అన్వేషణ కోసం జరిగిన ప్రయోగాలు:
1964: అమెరికా మరైనర్-4 అనే ఆర్బిటర్‌ను ప్రయోగించింది. అది అంగారకుడిని 1965లో చేరి స్వల్పస్థాయిలో చిత్రీకరణ, దానిపై క్రేటర్‌లను కూడా గుర్తించింది.
1971: సోవియట్ యూనియన్ మార్‌స-3 అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా మార్‌సపై ల్యాండ్ చేసింది. అంగారక ఉపరితలాన్ని చేరిన మొదటి మానవ నిర్మిత పరికరమైనప్పటికీ.. చేరిన 15 నిమిషాలు మాత్రమే దాని నుంచి భూమికి సిగ్నళ్లు అందాయి. తర్వాత దాని నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఇదే ఏడాది అమెరికా మరైనర్-9 అనే ఆర్బిటర్‌ను ప్రయోగించింది. అంగారక కక్ష్యలోకి ప్రవేశించినపుడు ఇది ధూళి తుపాను, ఒక భారీ అగ్ని పర్వతాన్ని గుర్తించింది (ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే మూడు రెట్లు పొడవైనది. దీనికి ఒలంపస్ మాన్స్ అని పేరు పెట్టారు).
1975: అమెరికాకు చెందిన నాసా 1975 ఆగస్టు 20న వైకింగ్-1, సెప్టెంబర్ 9న వైకింగ్-2లను ప్రయోగించింది. ఇవి 1976లో అంగారక ఉపరితలంపై ల్యాండ్ అయ్యాయి. అమెరికా అంతరిక్ష చరిత్రలో అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన మొదటి స్పేస్ క్రాఫ్ట్స్‌గా ఇవి గుర్తింపు పొందాయి.
1988: సోవియట్ యూనియన్ ఫోబోస్-1,2 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ రెండు విఫలమయ్యాయి.
1992: అమెరికా ప్రయోగించిన మార్‌స అబ్జర్వర్ విఫలమైంది.
1996: అమెరికా ప్రయోగించిన మార్‌స గ్లోబల్ సర్వేయర్ విజయవంతమైంది. 9 ఏళ్ల 52 రోజులపాటు అంగారకుని అధ్యయనం చేసింది. అత్యధిక కాలంపాటు అంగారకున్ని అధ్యయనం చేసిన ఘనత దీనికుంది. అదే ఏడాది మార్‌స పాత్‌ఫైండర్‌ను అమెరికా ప్రయోగించింది. దీనిలోని సొజోర్నర్ అనే రోబోటిక్ రోవర్ అమూల్యమైన సమాచారాన్ని సేకరించింది. రష్యా అదే ఏడాది ప్రయోగించిన ఉపగ్రహం విఫలమైంది.
1998: జపాన్ ప్రయోగించిన నొజొమి ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది.
1999: అమెరికా ప్రయోగం విఫలమైంది. ల్యాండ్ అవుతున్న సమయంలో మార్‌స వాతావరణం ఆర్బిటర్‌తో సంబంధం తెగిపోగా, మార్‌స పోలార్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే సమయంలో అంగారకునిపై కూలిపోయింది.
2001: అమెరికా మార్‌స ఒడిస్సే ఆర్బిటర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది ఇప్పటికీ సేవలను అందిస్త్తోంది.
2003: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్‌స ఎక్స్‌ప్రెస్‌ను విజయవంతంగా ప్రయోగించినప్పటికీ దాని ల్యాండర్ బీగిల్-2 అంగారకుని ఉపరితలంపైన కూలిపోయింది. మార్‌స ఎక్స్‌ప్లోరర్ ఇప్పటికీ అంగారక గ్రహ సమాచారాన్ని అందిస్తూనే ఉంది.
2004: స్పిరిట్, ఆపర్చునిటీ అనే రెండు రోవర్లను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. ఎనిమిది ఏళ్లపాటు స్పిరిట్ ఎన్నో పరిశోధనలు చేసింది. ఆపర్చునిటీ ఇప్పటికీ పని చేస్తూనే ఉంది.
2005: అమెరికా ప్రయోగించిన ఆర్బిటర్ ఇప్పటికీ పని చేస్తూనే ఉంది.
2008: అమెరికా మార్‌సఫీనిక్స్.. అంగారక ఉత్తర ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది.
2011: రష్యా ప్రయోగించిన ఫోబోస్- గ్రంట్ మిషన్ విఫలమైంది. అంగారక ఉపగ్రహం ఫోబోస్ నుంచి నేల నమూనాలను సేకరించి తిరిగి ఒక క్యాప్సూల్ ద్వారా భూమికి వచ్చే లక్ష్యంతో ఈ మిషన్‌ను రష్యా రూపొందించింది. ఇందులో గ్రంట్ అనే చైనా పరికరం కూడా ఒకటి ఉంది. అదేఏడాది అమెరికా మార్‌ససైన్‌సలో లేబొరేటరీ, దానిలోని క్యూరియాసిటీ రోవర్‌ను విజయవంతంగా అంగారకునిపైకి ప్రయోగించింది.
అరుణగ్రహం దిశగా భారత్ ప్రయాణం ప్రారంభం
Published Thu, Nov 14 2013 4:36 PM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement