సాక్షి, కడప : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో 15 రోజులుగా ఉద్యమం సాగుతోంది. సమైక్య సమ్మెలో సకల జనులు చేయి కలుపుతూ ఉద్యమాన్ని రోజురోజుకు పతాక స్థాయికి చేరుస్తున్నారు. ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో ఉద్యమానికి మరింత ఊపొచ్చింది. జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, మానవహారం, ధర్నాలు, విచిత్ర వేషధారణలతో ఎక్కడికక్కడ పల్లెజనాలు జాతీయ రహదారులపై కంచె వేసి వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు.
వినూత్నరీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో రవాణా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. మొత్తం మీద జిల్లాలో ఉద్యమ నిరసన కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు ర్యాలీలతో తరలి వస్తుండడంతో కలెక్టరేట్ పరిసరాలు జన సంద్రమవుతున్నాయి. కలెక్టరేట్ వద్ద జేఏసీ, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు రోడ్లపైనే యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నేత నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో వంటా వార్పు చేపట్టారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్, ది కడప కిరాణా మర్చంట్ అసోసియేషన్, కడప ఫుడ్‌గ్రేయిన్ మర్చంట్ అసోసియేసన్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం, ఏపీ రాష్ట్ర పోలీసు మినిస్ట్రీరియల్ స్టాఫ్, దేవునికడప ప్రజలు, శాలివాహనసంఘం, వైఎస్సార్ సీపీ మైనార్టీసెల్, ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు అసోసియేషన్, విద్యామందిర్, సిద్దార్థ ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఐకాస, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి
. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షలు బుధవారంతో మూడవ రోజు ముగిశాయి. దీక్షల్లో ఉన్న వారికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు.
జమ్మలమడుగులో జై సమైక్యాంధ్ర అంటూ పాత బస్టాండు సమీపంలోని మూడంతస్తుల భవనం పైనుంచి బయపురెడ్డి అనే వ్యక్తి దూకాడు. దూదేకుల సంఘం, ఆర్‌ఆర్ సోషియో కల్చరల్ అసోసియేషన్, సెయింట్ మెరీస్ ఇంగ్లీషు మీడియం స్కూలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు రోడ్డుపైనే యోగాచేశారు. ఎర్రగుంట్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్లపై నిరసన తెలియజేసి రిలే దీక్షలు ప్రారంభించారు. అన్ని చర్చిల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
పులివెందుల జేఏసీ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో, ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఫుట్‌వేర్, పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు,. పూల అంగళ్ల వద్ద మానవహారాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఈసీ గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిలు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. వేముల ప్రాథమిక పాఠశాలకు చెందిన 370 మంది విద్యార్థులకు రోడ్డుపైనే యూనిట్ పరీక్షలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
కమలాపురంలో ఉద్యోగులు, అధ్యాపకులతోపాటు పడమటివీధి, పాత చర్చి, స్టాలిన్ వీధి యువజనులు భారీ ర్యాలీని నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
మైదుకూరులో ముస్లింల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్‌లు తమ సంఘీభావాన్ని తెలిపారు.
రైల్వేకోడూరులో అన్ని రకాల వ్యాపారులు, దుకాణాల యజమానులు భారీ ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.
రాజంపేటలో జేఏసీ ఆద్వర్యంలో కొత్తబస్టాండు నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
బద్వేలులో బంద్ విజయవంతమైంది. పోరుమామిళ్లలో ఆర్యవైశ్యులు అన్ని దుకాణాలను మూసివేసి ర్యాలీ చేపట్టారు.
ప్రొద్దుటూరు పట్టణంలో వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర చేసి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రజకులు ర్యాలీ, మానవహారాన్ని నిర్మించారు. వినూత్నరీతిలో సోనియా, కేసీఆర్‌ల మాస్క్‌లను రెండు గాడిదలకు తగిలించి ఊరేగించారు.
రాయచోటిలో జేఏసీ, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులకు రోడ్డుపైనే యూనిట్‌పరీక్షలు నిర్వహించారు.
అదే హోరు
Published Thu, Aug 15 2013 5:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement